Search for a command to run...
20 Oct 1969
బిందువు మరియు సింధువు స్మృతితో సంపూర్ణత
20 October 1969 · తెలుగు
ఈరోజు ఏ సంగఠనలోకి బాప్‌దాదా వచ్చారు? ఈనాటి ఈ సంగఠనను ఏమంటాము? ఇది జ్ఞాన సూర్యుడు మరియు సితారల సంగఠన. ప్రతి ఒక్క సితార తమ తమ ప్రకాశాన్ని చూపించేవారు. బాప్‌దాదా ప్రతి సితార యొక్క ప్రకాశాన్ని చూడటానికి వచ్చారు. మీరందరూ ఈ భట్టీకి వచ్చారు, స్వయాన్ని ఎలా తయారు చేసుకోవడానికి వచ్చారు? భట్టీనుండి ఎలా తయారై వెళ్ళాలో తెలుసా? (ఫరిశ్తా) ఫరిశ్తాగా లేరా? ఈ భట్టీ నుండి సంపూర్ణత అను ముద్రను వేయించుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఫరిశ్తాగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. కానీ సంపూర్ణతలో ఏదైతే లోపము ఉందో, ఆ లోపాన్ని ఈ భట్టీలో స్వాహా చేయడానికి వచ్చారు. అంతే కదా? లోపాలను దూరం చేసుకోవడానికి ఏ విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు? దీని వలన సంపూర్ణత యొక్క పూర్తి ముద్ర పడుతుంది. ఈరోజు బాప్‌దాదా చాలా సహజమైన విషయాన్ని వినిపిస్తారు. చాలా సహజాతి సహజమైన విషయాన్ని గుర్తుంచుకోండి, నేను బిందువును, బాబా కూడా బిందువు, కానీ బిందువుతో పాటు సింధువు. బిందువు మరియు సింధువు ఇదే తండ్రి మరియు పిల్లల పరిచయము. రెండు మాటలను గుర్తు పెట్టుకున్నాగానీ సంపూర్ణత సహజమవుతుంది. స్కూలులో చిన్న పిల్లలకు చదివించేటప్పుడు మొట్టమొదటగా ఏమి నేర్పిస్తారు? ముందు చుక్కను, బిందువును పెట్టడం నేర్పిస్తారు. ఆ తర్వాత ఒకటి నంబరును నేర్పిస్తారు. మరి మీరు కూడా ఒక బిందువు. తర్వాత ముందుకు వెళ్ళండి. ఇంకా ముందుకు వెళితే బిందువు స్మృతి మరియు ఒకటి, ఆ ఒకటిలో కూడా అన్ని విషయాలు వచ్చేస్తాయి. ఒక్కరి స్మృతి మరియు ఏకరస అవస్థ, ఒక్కరి మతము, ఒక్కరి కర్తవ్యంలో సహయోగము. ఒకవేళ ఒక్కొక్క విషయాన్ని గుర్తుంచుకుంటే స్వయాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. కేవలం బిందువు మరియు ఒకటి, ఇంతకన్నా విస్తారంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. విస్తారంలో వెళ్ళాలంటే కేవలం సేవలో మాత్రమే వెళ్ళండి. సేవ లేకపోతే కేవలం బిందువు మరియు ఒకటి. అంతకుమించి మీ బుద్ధిని నడిపించాల్సిన అవసరం లేదు. కేవలం ఈ విషయాలనే గుర్తు పెట్టుకోండి, అప్పుడు సహజంగా సంపూర్ణతను పొందగలరు. సహజమేనా లేక కష్టమా? సహజ మార్గమే కానీ సహజమును కష్టంగా చేసేది ఏమిటి? (సంస్కారాలు) ఈ సంస్కారాలు కూడా ఎందుకు ఉత్పన్నం అవుతాయి? కేవలం మీ విస్మృతి ఈ అన్ని విషయాలను ఉత్పన్నం చేస్తుంది. గత సంస్కారాలు కావచ్చు, గత కర్మ బంధనాలు కావచ్చు, వర్తమానంలో చేసిన పొరపాట్లు కావచ్చు, అన్నిటికీ మూల కారణము మీ విస్మృతి. మీ విస్మృతి కారణంగా ఈ సహజమైన విషయాలన్నీ కష్టంగా అవుతున్నాయి. స్మృతి ఉంటే ఏమి జరుగుతుంది? ఏ లక్ష్యాన్ని పెట్టుకుని వచ్చారో, స్మృతి సంపూర్ణము విస్మృతి అసంపూర్ణము. విస్మృతి ఉంటే చాలా విఘ్నాలు వస్తాయి. స్మృతి ఉంటే సహజము మరియు సంపూర్ణత ఉంటాయి. ఏ మాటలనైతే వినిపించామో వాటిని బాగా గుర్తు పెట్టుకుంటే విస్మృతి దానంతటదే పారిపోతుంది. స్మృతిని అస్సలు విడిచిపెట్టకపోతే విస్మృతి ఎలా వస్తుంది. సూర్యాస్తమయం అయినప్పుడు చీకటి వస్తుంది. సూర్యాస్తమయమే అవ్వకపోతే చీకటి ఎలా వస్తుంది? అలాగే ఒకవేళ స్మృతి అను సూర్యుడు ఎప్పటికీ ఉంటే విస్మృతి అను చీకటి రాలేదు. ఈ అలౌకిక డ్రిల్ గురించి తెలుసా? ఆ డ్రిల్ చేసేవారు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంతో పాటు శక్తిశాలిగా కూడా ఉంటారు, అలాగే ఈ అలౌకిక డ్రిల్‌ను ఎవరు ఎంతగా చేస్తారో వారు అంతగా ఆరోగ్యంగా అనగా మాయ వ్యాధి బారిన పడకుండా శక్తి స్వరూపులుగా ఉంటారు. ఎంతెంతగా ఈ అలౌకిక బుద్ధి యొక్క డ్రిల్ చేస్తూ ఉంటారో అంతగా తయారవ్వాలి అన్న లక్ష్యము ఏదైతే ఉందో, అలా అవ్వగలుగుతారు. డ్రిల్‌లో, డ్రిల్ మాస్టరు చెప్పినట్లు చేతులు కాళ్ళు కదిలిస్తారు కదా, ఇక్కడ కూడా ఒకవేళ అందరికీ, ఒక్క సెకండులో సాకారి నుండి నిరాకారిగా అవ్వండి అంటే అవ్వగలరా? ఎలా అయితే స్థూల చేతులు కాళ్ళు డైరెక్షన్ లభించగానే డ్రిల్‌లో కదిలిస్తారో, అలాగే ఒక్క సెకండులో సాకారి నుండి నిరాకారిగా అయ్యే అభ్యాసం ఉందా? సాకారి నుండి నిరాకారిగా అవ్వడంలో ఎంత సమయం పడుతుంది? అది మీ అసలైన స్వరూపమే అయినా కానీ సెకండులో ఎందుకు స్థితి కాలేకపోతున్నారు? ఇప్పటివరకు కర్మబంధనము ఉందా? ఇప్పటికీ ఇంకా కర్మ బంధనం చెప్పే మాటను వింటున్నారా? ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టేవరకు కర్మబంధనాన్ని వింటూ ఉంటారా?
ఈ క్లాసులో ప్రశ్నకు జవాబు చెప్పేవారు ఎవరున్నారు? వారైతే చాలా పేర్లు వినిపించారు, మరి ప్రశ్న -జవాబులకు అతీతంగా వెళ్ళేవారు ఎవరు? ఈ భట్టీలో పరిశీలన శక్తి వస్తుంది. మేము సంపూర్ణంగా అయ్యే వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఇలా ఇప్పుడు వీలవుతుందా? లేక అంతిమంలో అవుతుందా (వీలవుతుంది) అలాంటప్పుడు అంతిమం వరకు ఉండి లాభమేమిటి? (ప్రజలను తయారు చేసుకుంటాము) స్వయం రాజుగా, కిరీటధారిగా అయి ఇతరులను ప్రజలుగా చేస్తారా? మీ సమానంగా కూడా చేయాలి. ప్రజలను కూడా తయారు చేయాలి. ప్రజలు లేకుండా ఎవరిపై రాజ్యం చేస్తారు? మరి ఇంతమంది సితారలు సంపూర్ణంగా అయ్యే వెళ్తారు అని భావించవచ్చా? నేను సంపూర్ణంగా అవ్వాలి మరియు సర్వులను తయారుచేయాలి అన్న ఈ ఉల్లాసము మరియు నిశ్చయము ప్రతి ఒక్కరిలో తప్పకుండా ఉండాలి. ఈ ఉల్లాస ఉత్సాహాలు ఎప్పటికీ ఉండాలి అప్పుడు తప్పకుండా లక్ష్యం ప్రాప్తిస్తుంది. ఇటువంటి సంపూర్ణులే ఈ యజ్ఞ కుండము నుండి వెలువడుతారు అని బాప్‌దాదాకు నిశ్చయం ఉంది. కుండముకు స్మృతిచిహ్నము ఏమిటి? అన్ని స్థానాలు యజ్ఞమే, అయినాకానీ యజ్ఞ కుండానికి మహత్వము ఉంది. గంగ మరియు యమున రెండింటికి మహత్వము ఉంది కానీ సంగమానికి ఎక్కువ మహత్వము ఉండటాన్ని చూసి ఉంటారు. అక్కడ స్నానం చేయడం శ్రేష్ఠంగా భావిస్తారు. గంగ-యమునలు చాలా స్థానాలలో ఉన్నాయి కానీ విశేషంగా సంగమంలో స్నానం చేయడానికి ఎందుకు వెళ్తారు? దాని విశేష మహత్వము ఏమిటి? సంగమానికి ఉన్న మహత్వము గురించి బాగా తెలుసు కదా. ఎలా అయితే విశేష స్థానాలకు విశేష మహత్వము ఉంటుందో, అలాగే మధుబన భట్టీకి విశేష మహత్వము ఉంది. ఈ భట్టీ నుండి సంపూర్ణత అను బహుమతి బాబా ద్వారా లభిస్తుంది. ఈ మిలనం యొక్క అనగా సంగమం యొక్క విశేష సౌభాగ్యము పిల్లలకు లభిస్తుంది, ఈ మిలనమే సంపూర్ణత అను కానుక రూపంలో ఉంది. ఈ మిలనమే ఈ సంగమ స్మృతిచిహ్నము. ఈ మిలనమే సంపూర్ణతకు బహుమతి. భట్టీనుండైతే సంపూర్ణంగా అయిన ముద్రనైతే వేయించుకునే వెళ్తారు కానీ దానితోపాటు ఈ భట్టీలో లెక్క వేయడం కూడా బాగా నేర్చుకోండి. కొన్నిచోట్ల లెక్క పూర్తిగా వేయని కారణంగా ఎక్కడ ప్లస్ (కూడిక) అవ్వాలో అక్కడ మైనస్ (తీసివేత) అయిపోతుంది. ఎక్కడ మైనస్ చేసుకోవాలో అక్కడ ప్లస్ చేసుకుంటున్నారు, అందుకే స్థితి అలజడిలోకి వచ్చేస్తుంది. ఎక్కడ జోడించాలి, ఏ విషయాన్ని కట్ చేయాలి అన్న లెక్కను పూర్తిగా నేర్చుకోవాలి. ప్రవృత్తిలో ఉంటున్న కారణంగా ఎక్కడ జోడించకూడదో అక్కడ కూడా జోడించేస్తున్నారు, ఎక్కడ కట్ చేయకూడదో అక్కడ కూడా కట్ చేసేస్తున్నారు. ఈ చిన్న లెక్క పెద్ద సమస్యా రూపమైపోతుంది. అందుకే, ప్రవృత్తిలో ఉంటూ దేనిని తెంచాలి, దేనిని జోడించాలి అని బాగా పూర్తిగా నేర్చుకోవాలి. జోడించాలన్నా ఎంతవరకు, ఏ రూపంలో? మిమ్మల్ని భట్టీకి పిలిచాము అంటే ఏ కార్యం కోసం పిలిపించామో కూడా చెప్తాము కదా. చదువులోని ఏ ఏ సబ్జెక్టులలో పరిపక్వం కావాలి? ఒకటి అలౌకిక ఈశ్వరీయ డ్రిల్ అను సబ్జెక్టు, రెండు లెక్క వేయడంలో. ఈ రెండు విషయాలను ఈ భట్టీలో నేర్చుకోవాలి. ఒకవేళ ఈ రెండు విషయాలలో సంపూర్ణంగా అయితే ఇక ఏమి మిగిలి ఉంటుంది? సంపూర్ణంగా అయ్యే వెళ్తారు. స్వయం అయితే అవుతారు కానీ ఇతరులను తయారు చేసే కార్యం మిగిలి ఉంది. ఈ నిమిత్తంగానే ఇక్కడినుండి వెళ్ళండి. సంబంధాల కారణంగా వెళ్ళకండి. సేవా నిమిత్తంగా వెళ్ళండి. వెళ్ళాలన్నా కేవలం సేవ కోసం. ఎక్కడున్నాకానీ స్వయాన్ని ఇలా భావించి ఉన్నట్లయితే అవస్థ అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. ఎలా అయితే బాప్‌దాదా సేవ కోసం వస్తూ వెళుతూ ఉంటారు కదా, అలా మీరు కూడా కేవలం సేవ కోసం నిమిత్తమై వెళ్ళాలి మరియు సేవలో సఫలతను పొంది సమ్ముఖంలోకి రావాలి.
అవ్యక్త వతనం నుండి వర్తమాన సమయంలో బాప్‌దాదా పిల్లలందరికీ ఏ మంత్రాన్ని ఇస్తున్నారు? గో సూన్ - కమ్ సూన్ (త్వరగా వెళ్ళండి - త్వరగా రండి) సేవ కోసం వెళ్ళండి మరియు సహచరులను తీసుకుని త్వరగా రండి. మళ్ళీ వెళ్ళండి. ఇక్కడ గో సూన్, కమ్ సూన్ అయితే బుద్ధి ద్వారా కూడా త్వరగా అవుతుంది. బుద్ధితో చేసే డ్రిల్ కూడా గో సూన్ , కమ్ సూనే కదా. ఈ స్థూల మంత్రం గుర్తున్నప్పుడు ఈ స్థితి తయారవుతుంది. ఈ మంత్రంతో ఆ మంత్రానికి సంబంధం ఉంది. అందుకే కుండము యొక్క మహత్వము అని చెప్పాము కదా. ఇక్కడ బహుమతిగా లభిస్తుంది, అక్కడ పురుషార్థంతో. మరి ఇది కుండము యొక్క విశేష మహత్వము కదా. ఇక్కడ వరదానము అక్కడ శ్రమ. వరదానము లభించే అవకాశం ఉన్నప్పుడు శ్రమ ఎందుకు? ఈ యజ్ఞ కుండము నుండి భాషను కూడా నేర్చుకుని వెళ్ళండి. ఎంతటి ఉదాహరణగా అవ్వాలంటే మిమ్మల్ని చూసి ఇతరులు ఆకర్షితులై యజ్ఞ కుండానికి స్వాహా అవ్వాలి.
బాప్‌దాదా ప్రతి ఒక్కరి చిత్రములో అదృష్టాన్ని (తకదీర్) మరియు పురుషార్థాన్ని (తదబీర్) చూస్తున్నారు, ఎంతవరకు అదృష్టవంతులుగా అయ్యారు అని చూస్తున్నారు. మీరు కూడా ఎవరినైనా చూసినప్పుడు ప్రతి ఒక్కరి చిత్రములో వారి అదృష్టాన్ని, వారి పురుషార్థపు విశేష గుణాన్నే చూడండి. ప్రతి ఒక్కరి పురుషార్థంలో విశేష గుణం ఉంటుంది. ఆ గుణాన్ని చూడండి. ఒకటి ఉంటుంది గుణ్ (గుణము), గుణముతో పాటు మరొకటి ఉంటుంది ఘున్ (పురుగు, తెగులు) పదాలు ఎంత దగ్గరగా ఉన్నాయి, కానీ అది ఏమిటి, ఇది ఏమిటి! ఒకవేళ గుణాన్ని చూడకపోతే పురుగు పడ్తుంది. కనుక ప్రతి ఒక్కరి గుణాన్ని చూడండి, అప్పుడు పట్టిన తెగులు సమాప్తమైపోతాయి.
ఎవరైతే పరస్పరంలో స్నేహిగా ఉంటారో, అటువంటి స్నేహి పిల్లలతో బాప్‌దాదా కూడా అతి స్నేహిగా ఉంటారు, స్నేహమే సమీపంగా తెస్తుంది. ఎంతగా స్నేహిగా ఉంటారో అంతగా సమీపము. మరి పరస్పరంలో స్నేహిగా ఉన్నారా? ఇటువంటి స్నేహి పిల్లలే సమీపంగా కూడా రాగలరు, ఇప్పుడు కూడా మరియు భవిష్యత్తులో కూడా. విశేష స్నేహిలు, అందుకే ఈరోజు విశేషంగా డబల్ తిలకాన్ని పెడ్తున్నాము. కానీ భిన్నమైనది, లౌకిక రీతిలోని తిలకము కాదు. డబల్ తిలకము ఏమిటి? ఒకటి, నిరాకారి రెండు, అతీతతనము. ఈ డబల్ తిలకాన్ని ప్రతి ఒక్కరి మస్తకంపై అవినాశి స్థితిని తయారు చేయించడానికి అవినాశి రూపంలో పెడ్తున్నాము. మరి ఈ అవినాశి తిలకము సదా ఉంటుందా? తిలకాన్ని సౌభాగ్యానికి గుర్తుగా చెప్తారు, కనుక ఈ తిలకాన్ని ఎప్పటికీ నిలుపుకునే ప్రయత్నం చేయండి. ఎంతెంతగా పరిపక్వం అవుతారో అంతగా పదవిని పొందగలరు. నేనే నంబర్ వన్ అని ప్రతి ఒక్కరూ భావించండి. ఒకవేళ ప్రతి ఒక్కరూ నంబర్ వన్ అయితే మరి నంబరు టూలో ఎవరు వస్తారు? తండ్రి క్లాసులో ఎప్పుడూ నంబరు ఉండదు. టీచర్ కూడా నంబరు వన్, విద్యార్థి కూడా నంబరు వన్. ఒక్కొక్కరూ నంబరు వన్. మరి ఇటువంటి క్లాసు యొక్క చిత్రము మధుబనంలో ఉండాలి.
ఓంశాంతి