Search for a command to run...
15 Nov 2005
సత్యమైన హృదయముతో తండ్రికి మరియు పరివారానికి స్నేహీలుగా అయ్యి శ్రమ నుండి ముక్తులుగా అయ్యే ప్రతిజ్ఞను చెయ్యండి మరియు లాభాన్ని పొందండి
15 November 2005 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా తమ నలువైపుల ఉన్నటువంటి శ్రేష్ఠ స్వరాజ్యాధికారీ, స్వమానధారీ పిల్లలను చూస్తున్నారు. తండ్రి పిల్లలకు తమ కంటే కూడా ఉన్నతమైన స్వమానాన్ని ఇచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరినీ చరణాలపై పడటము నుండి విడిపించి శిరో కిరీటముగా చేసారు. స్వయాన్ని ఎల్లప్పుడూ ప్రియమైన పిల్లలకు సేవాధారిగానే పిలిపించుకున్నారు. ఇంత పెద్ద అథారిటీ కల స్వమానాన్ని పిల్లలకు ఇచ్చారు. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఇంతటి స్వమానధారులుగా భావిస్తున్నారా? స్వమానధారుల విశేష లక్షణము ఏముంటుంది? ఎవరు ఎంత స్వమానధారులుగా ఉంటారో, అంతగానే వారు సర్వులకు గౌరవాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. ఎంతటి స్వమానధారులో, అంతే నిర్మానచిత్తులుగా, సర్వులకు స్నేహీలుగా ఉంటారు. స్వమానధారులకు గుర్తు - తండ్రికి ప్రియమైనవారిగా ఉండటముతోపాటు సర్వులకు ప్రియమైనవారిగా ఉంటారు. హద్దులోని ప్రియమైనవారిగా ఉండటము కాదు, అనంతమైన ప్రియమైనవారిగా ఉండటము. ఏ విధంగా తండ్రి సర్వులకు ప్రియమైనవారో, అది ఒక నెల బిడ్డ కావచ్చు, ఆది రత్నాలు కూడా కావచ్చు, ప్రతి ఒక్కరూ - నేను బాబాకు చెందినవాడిని, బాబా నా వారు అని భావిస్తారు. అందరికీ ప్రియమైనవారు అన్నదానికి, శ్రేష్ఠ స్వమానములో ఉన్నారు అన్నదానికి ఇది గుర్తు, ఎందుకంటే ఇటువంటి పిల్లలు తండ్రిని ఫాలో చేసేవారిగా ఉంటారు. చూడండి, తండ్రి ప్రతి వర్గములోని పిల్లలకు, చిన్న పిల్లల నుండి, వృద్ధుల సమానమైన పిల్లల వరకు అందరికీ స్వమానాన్ని ఇచ్చారు. యువతకు వినాశకారులు అన్నదానికి బదులుగా విశ్వ కళ్యాణకారులు అన్న స్వమానాన్ని ఇచ్చారు, వారిని మహానులుగా చేసారు. ప్రవృత్తిలో ఉండేవారిని మహాత్ములు మరియు పెద్ద-పెద్ద జగద్గురువులు కంటే కూడా ఉన్నతమైనవారిగా చేసారు, ప్రవృత్తిలో ఉంటున్నా కూడా పర-వృత్తిలో ఉండే మహాత్ములు కూడా తల వంచే విధంగా వీరిని తయారుచేసారు. కన్యలకు శివ శక్తి స్వరూపులు అన్న స్వమానాన్ని గుర్తు తెప్పించారు, వారిని అలా తయారుచేసారు. వృద్ధులైన పిల్లలకు బ్రహ్మా బాబాకు తోటివారు, అనుభవజ్ఞులు అన్న స్వమానాన్ని ఇచ్చారు. అలా, స్వమానధారీ పిల్లలు కూడా ప్రతి ఆత్మను ఈ విధంగా స్వమానముతో చూస్తారు. కేవలం అలా చూడటమే కాదు, సంబంధ-సంపర్కములోకి కూడా ఆ విధంగానే వస్తారు, ఎందుకంటే స్వమానము దేహ-అభిమానాన్ని తొలగించేటటువంటిది. ఎక్కడైతే స్వమానము ఉంటుందో, అక్కడ దేహము యొక్క అభిమానము ఉండదు. దేహ-అభిమానాన్ని తొలగించేందుకు చాలా సహజ సాధనము ఏమిటంటే - సదా స్వమానములో ఉండటము, సదా ప్రతి ఒక్కరినీ స్వమానముతో చూడటము. పాదచారులు కావచ్చు, 16 వేల మాలలోని చివరి నంబరువారైనా కావచ్చు, కానీ చివరి నంబరులోని వారిలో కూడా డ్రామానుసారముగా తండ్రి ద్వారా ఏదో ఒక విశేషత ఉంటుంది. స్వమానధారులు ఆ విశేషతను చూసి స్వమానాన్ని ఇస్తారు. వారి దృష్టిలో, వృత్తిలో, కృతిలో, ప్రతి ఒక్కరి విశేషత ఇమిడి ఉంటుంది. ఎవరెవరైతే తండ్రికి చెందినవారిగా అయ్యారో, వారు విశేష ఆత్మ. వారు నంబరువారీగా ఉండి ఉండవచ్చు, కానీ ప్రపంచములోని కోట్లాదిమందిలో వారు కొందరే. ఈ విధంగా అందరూ స్వయాన్ని విశేష ఆత్మగా భావిస్తున్నారా? స్వమానములో స్థితులై ఉండాలి. దేహ-అభిమానములో కాదు, స్వమానములో ఉండాలి.
తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ఎందుకని ప్రేమ ఉంది? ఎందుకంటే - నన్ను గుర్తించి, నా వారిగా అయ్యారు కదా అని తండ్రికి తెలుసు. ఈరోజు ఈ మేళాలో కూడా మొదటిసారి వచ్చినవారు కావచ్చు, అయినా ‘బాబా’ అని అన్నారు కావున వారు తండ్రి ప్రేమకు పాత్రులు. బాప్‌దాదాకు నలువైపులా ఉన్న పిల్లలందరూ అందరూ అందరికంటే ప్రియమైనవారు. ఇలానే తండ్రిని ఫాలో చేయండి. ఎవ్వరూ ప్రియమైనవారిగా లేకుండా లేరు, అందరూ ప్రియమైనవారే. చూడండి, ఏయే పిల్లలైతే ‘నా బాబా’ అని అంటారో, అక్కడ ‘నా’ అన్న భావనను తీసుకువచ్చింది ఏమిటి? స్నేహము. ఎవరెవరైతే ఇక్కడ కూర్చున్నారో, వారు, స్నేహమే బాబాకు చెందినవారిగా చేసింది అని భావిస్తారు. బాబా స్నేహము అయస్కాంతము వంటిది, స్నేహమనే అయస్కాంతము ద్వారా బాబాకు చెందినవారిగా అయ్యారు. అది హృదయపూర్వకమైన స్నేహము, నామమాత్రమైన స్నేహము కాదు. హృదయపూర్వకమైన స్నేహము ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది. కలుసుకునేందుకు ఎందుకు వస్తారు? స్నేహమే తీసుకువచ్చింది కదా! మీరంతా ఎవరైతే కూర్చుని ఉన్నారో, ఎవరైతే వచ్చారో, మీరు ఎందుకు వచ్చారు? స్నేహము ఆకర్షించింది కదా. స్నేహము కూడా ఎంత ఉంది? 100 శాతము ఉందా లేక తక్కువగా ఉందా? స్నేహములో మేము 100 శాతము ఉన్నాము అని ఎవరైతే భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. స్నేహములో 100 శాతము. కొంచెము కూడా తక్కువ కాదా? మంచిది. మరి ఇంతటి స్నేహమే పరస్పరం బ్రాహ్మణుల మధ్యన ఉందా? ఇందులో చేతులెత్తించమంటారా? ఇందులో పర్సెంటేజ్ ఉంది. ఏ విధంగా బాబాకు అందరి పట్ల స్నేహము ఉందో, అదే విధంగా పిల్లలకు కూడా సర్వుల పట్ల స్నేహము ఉండాలి, సర్వుల స్నేహీలుగా ఉండాలి. ఇతరులలోని బలహీనతలను చూడకండి. ఒకవేళ ఎవరైనా సంస్కారానికి వశీభూతులై ఉంటే, అప్పుడు ఎవరిని ఫాలో చేయాలి? వశీభూతులై ఉన్నవారినా? వాస్తవానికి మీరే వశీకరణ మంత్రాన్ని ఇచ్చేవారు, వశీభూతమవ్వడము నుండి విడిపించే మంత్రాన్ని ఇచ్చేవారు, మీరు విడిపించేవారే కదా! లేక బలహీనతను చూసేవారా? లేక వారి బలహీనత కనిపించేస్తుందా? ఒకవేళ ఏదైనా చెడు వస్తువు కనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చూస్తూ ఉంటారా లేక పక్కకు తప్పుకుంటారా? ఎందుకంటే బాప్‌దాదా ఏం చూసారంటే, ఎవరైతే హృదయపూర్వకమైన స్నేహము కలవారిగా ఉంటారో, తండ్రి పట్ల హృదయపూర్వకమైన స్నేహము కలిగి ఉంటారో, వారి పట్ల సర్వులకు తప్పకుండా స్నేహము ఉంటుంది. సంపన్నముగా మరియు సంపూర్ణముగా అయ్యేందుకు చాలా సహజమైన విధి – హృదయపూర్వకమైన స్నేహము. ఎవరు ఎంత జ్ఞానవంతులైనా కావచ్చు, కానీ ఒకవేళ హృదయపూర్వకమైన స్నేహము లేకపోతే బ్రాహ్మణ జీవితము రమణీకమైన జీవితములా ఉండదు. నిస్సారమైన జీవితములా ఉంటుంది, ఎందుకంటే జ్ఞానములో, ఒకవేళ స్నేహము లేకుండా జ్ఞానము ఉంటే, అప్పుడు జ్ఞానములో ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి! కానీ స్నేహము అనేది జ్ఞాన సహితముగా ఉన్నట్లయితే, స్నేహీలు సదా స్నేహములో లవలీనులై ఉంటారు. స్నేహము ఉన్నవారు స్మృతి చేయటానికి శ్రమ చేయవలసిన అవసరముండదు. కేవలం జ్ఞానీలుగా ఉంటే, స్నేహము లేకపోతే, శ్రమించాల్సి వస్తుంది. వారు శ్రమ యొక్క ఫలం తింటారు, వీరు ప్రేమ యొక్క ఫలం తింటారు. జ్ఞానము బీజము, కానీ స్నేహము నీరు వంటిది. ఒకవేళ బీజానికి స్నేహమనే నీరు లభించకపోతే ఫలం రాదు.
ఈరోజు బాప్‌దాదా పిల్లలందరి హృదయములో ఉన్న స్నేహాన్ని చెక్ చేసారు. తండ్రి పట్ల ఉన్న స్నేహము మరియు సర్వుల పట్ల ఉన్న స్నేహము. మరి మీరందరూ స్వయాన్ని ఎలా ఉన్నట్లు భావిస్తున్నారు? స్నేహీలేనా? స్నేహము కలవారేనా? హృదయపూర్వకమైన స్నేహము కలవారము అని ఎవరైతే భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. (మెజారిటీ అందరూ చేతులెత్తారు) అచ్ఛా - సర్వుల పట్ల స్నేహము కలవారేనా? తండ్రి పట్లనైతే హృదయపూర్వకమైన స్నేహము కలవారిగా ఉన్నారు, మరి సర్వుల పట్ల స్నేహము కలవారిగా ఉన్నారా? సర్వుల పట్లనా? వీరు నా సోదరుడు లేక సోదరి అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? వీరు నా వారు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? భావిస్తున్నారా? లేక కొందరు మాత్రమే అలా భావిస్తున్నారా? ఏ విధంగా బాబా పట్ల స్నేహము ఉంది అన్న విషయములో అందరూ చేతులెత్తుతారు, అవును, బాబాపై స్నేహముంది, మరి అదే విధంగా, అవును, సర్వులపై స్నేహముంది అని మీరు ప్రతి ఒక్కరి కోసం చేతులెత్తుతారా? ఈ సర్టిఫికేట్ లభిస్తుందా? ఎందుకంటే బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు, కేవలం తండ్రి నుండి మాత్రమే సర్టిఫికేట్ తీసుకోవటం కాదు, బ్రాహ్మణ పరివారము నుండి కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఈ సమయములో బాబా ధర్మము మరియు రాజ్యము, ఈ రెండింటినీ కలిపి స్థాపన చేస్తున్నారు. రాజ్యములో కేవలం తండ్రి మాత్రమే ఉండరు, పరివారము కూడా ఉంటుంది. బాబాకు కూడా ప్రియమైనవారిగా ఉండాలి, పరివారానికి కూడా ప్రియమైనవారిగా ఉండాలి.
జ్ఞానీలుగా అయ్యారు, కానీ దానితోపాటు స్నేహీలుగా అవ్వటము కూడా తప్పనిసరి. స్వమానములో ఉండటము మరియు గౌరవాన్ని ఇవ్వటము, ఈ రెండూ తప్పనిసరి. బ్రాహ్మణ జన్మ తీసుకోవటంతోనే పిల్లలు ప్రతి ఒక్కరికీ బాబా గౌరవాన్ని ఇచ్చారు, అందుకే కదా ఉన్నతముగా అయ్యారు. ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇవ్వాలి మరియు మొత్తము కల్పమంతా దాని ప్రారబ్ధముగా గౌరవము ప్రాప్తిస్తుంది. అర్థకల్పము రాజ్యాధికారిగా ఉన్న గౌరవము లభిస్తుంది, అర్థకల్పము భక్తిలో భక్తుల ద్వారా గౌరవము లభిస్తుంది. కానీ దీనికి ఆధారము, మొత్తము కల్పానికి ఆధారము ఏమిటంటే - ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇవ్వటము, గౌరవాన్ని తీసుకోవటము.
చూడండి, ఈరోజు ఈ సీజన్‌కు మొదటి మిలనము. నలువైపుల ఉన్న పిల్లలందరూ స్నేహముతో ఒక చోటుకు చేరారు. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. మొదటి ఛాన్స్‌ను తీసుకున్నారు, మరి మొదటి ఛాన్స్‌ను తీసుకున్నవారికి అభినందనలు. అందరికీ తమ పరివారం యొక్క వృద్ధిని చూసి సంతోషం కలుగుతుంది కదా! వాహ్ మా సోదరులు! వాహ్ మా సోదరీలు చేరుకున్నారు! బాప్‌దాదాకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. తప్పిపోయిన పిల్లలు తిరిగి తమ అధికారాన్ని తీసుకోవడానికి చేరుకున్నారు. మరి అందరూ సంతోషంగా ఉన్నారా లేక చాలా-చాలా-చాలా సంతోషంగా ఉన్నారా? చాలా-చాలా సంతోషం.
అచ్ఛా- డబల్ విదేశీయులు కూడా వచ్చారు. డబల్ విదేశీయులు తెలివైనవారు. ఏ టర్న్‌ను కూడా విడిచిపెట్టరు. బాగుంది. ఛాన్స్‌ను తీసుకునేవారిని ఛాన్సలర్ అంటాము. మరి ఛాన్స్‌ను తీసుకోవడంలో తెలివైనవారు. డబల్ విదేశీయులకు విశేషంగా బాప్‌దాదా ఒక విషయంలో విశేషంగా అభినందనలు ఇస్తున్నారు. దేనికి? ఎక్కడెక్కడో చెల్లాచెదరుగా ఉన్నవారు, దేశం కూడా మారిపోయింది, కొందరి ధర్మం కూడా మారింది, కల్చర్ కూడా మారింది కానీ ఇంత మారుతున్నా గుర్తించే నేత్రం మాత్రం చాలా తీక్షణంగా ఉంది, భిన్నంగా ఉన్నప్పటికీ గుర్తించడంలో తెలివైనవారిగా అయ్యారు. గుర్తించారు, బాబాను తమవారిగా చేసుకున్నారు. పరివారాన్ని తమవారిగా చేసుకున్నారు. బ్రాహ్మణ కల్చర్‌ను తమ కల్చర్‌గా చేసుకున్నారు. మరి తెలివైనవారే కదా! బాప్‌దాదా సదా ఈ విశేషత చూస్తారు – బాబాపై కూడా ప్రేమ ఉంది కానీ సేవపై కూడా ప్రేమ ఉంది. సేవపై ప్రేమ ఉన్న కారణంగా చాలా బిజీగా ఉంటారు కదా! డబల్ సేవ చేస్తారు. డబల్ కూడా కాదు, మూడు సేవలు చేస్తారు, ఒకటి లౌకిక ఉద్యోగం, ఒకటి జ్ఞాన సేవ, వీటితోపాటు బాప్‌దాదా ఏమి చూసారంటే మెజారిటీ వారు సెంటరులో కర్మణ సేవలో సహయోగిగా అవుతారు. మూడు రకాల సేవలలో పిల్లలు బిజీగా ఉండటాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తారు మరియు మనస్ఫూర్తిగా మనసులోనే అభినందనలు కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే కూడా బాప్‌దాదా చూస్తున్నారు - నలువైపులా విదేశాలలో కొందరు రాత్రిలో, కొందరు పగలులో మిలనము జరుపుకుంటున్నారు. మంచిగా పురుషార్థపు గతిని పెంచుకునేందుకు మీకు దాదీ కూడా (జానకి దాదీ) మంచిగా లభించారు. అవును కదా? ఏ మాత్రం ఏదైనా లోపము చూసారంటే, వెంటనే క్లాస్ మీద క్లాస్ చేయిస్తారు. పిల్లలు ఎవరికైనా, అది దేశమువారు కావచ్చు, విదేశాలవారు కావచ్చు, ఏ సబ్జెక్టులోనైనా కష్టమనిపిస్తుందంటే, దానికి ముఖ్యమైన కారణము - హృదయపూర్వకమైన స్నేహములో లోపము. స్నేహము అనగా లవలీనము. స్మృతి చేయవలసిన అవసరము ఉండదు, కానీ స్మృతిని మర్చిపోవటము కష్టమవుతుంది. ఒకవేళ శ్రమ చేయవలసి వస్తుందంటే, ఎక్కడైనా లీకేజ్ ఉందా అని మీ హృదయపూర్వకమైన స్నేహాన్ని చెక్ చేసుకోండి. మోహము అనేది ఎవరి పట్ల ఉన్నా సరే, వ్యక్తి పట్ల కావచ్చు, వ్యక్తి యొక్క విశేషత పట్ల కావచ్చు, ఏదైనా సాధనము పట్ల కావచ్చు, సౌకర్యము పట్ల కావచ్చు, అదనపు సౌకర్యము పట్ల కావచ్చు, నియమానుసారముగా లభించే సౌకర్యాలు సరే కానీ అదనపు సౌకర్యాల పట్ల కూడా ప్రేమ ఉంటుంది, మోహము ఉంటుంది, అప్పుడు ఆ సౌకర్యమే గుర్తుకొస్తూ ఉంటుంది. దానికి గుర్తు ఏమిటంటే - ఎక్కడ లీకేజ్ ఉన్నా సరే, సదా జీవితములో ఏదో ఒక కారణము వలన సంతుష్టత యొక్క అనుభూతి ఉండదు. ఏదో ఒక కారణము అసంతుష్టతను అనుభవము చేయిస్తుంది. మరియు ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో, దానికి గుర్తు ఏమిటంటే - సదా ప్రసన్నత ఉంటుంది. వారు సదా ఆత్మిక గులాబి వలె చిరునవ్వుతో ఉంటారు, వికసించి ఉంటారు. మూడ్ ఆఫ్ అవ్వరు, సదా డబల్ లైట్‌గా ఉంటారు. మరి అర్థమైందా, ఇప్పుడిక శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. బాప్‌దాదాకు పిల్లల శ్రమ మంచిగా అనిపించదు. అర్థకల్పము శ్రమ చేసారు, ఇప్పుడు ఇక ఆనందముగా ఉండండి, ప్రేమలో లవలీనులై ఉండండి, జ్ఞాన సాగరుని లోతుల్లో అనుభవాలనే ముత్యాలను అనుభవము చెయ్యండి. కేవలం మునకలు వేసి సాగరము నుండి బయటకు వచ్చేయకండి, లవలీనులై ఉండండి.
కలిసే ఉంటాము, కలిసే వెళ్తాము అని అందరూ ప్రతిజ్ఞనైతే చేసారు కదా? ప్రతిజ్ఞ చేసారా? కలిసే వస్తారా లేక వెనక-వెనక వస్తారా? ఎవరైతే కలిసి వెళ్ళేందుకు సిద్ధముగా ఉన్నారో, వారు చేతులెత్తండి. సిద్ధముగా ఉన్నారా, ఆలోచించి చేతులెత్తండి, సిద్ధముగా ఉన్నారు అంటే అర్థము బాబా సమానముగా ఉండటము. ఎవరు కలిసి వస్తారు? సమానముగా ఉన్నవారే కలిసి వెళ్తారు కదా! మరి వెళ్తారా? ఎవరెడీనా? మొదటి లైన్లో ఉన్నవారు ఎవరెడీనా? రేపే వెళ్ళాలి అని ఆర్డర్ చేస్తే, వస్తారా? అచ్ఛా, ప్రవృత్తిలోని వారు వస్తారా? పిల్లలు గుర్తుకు రారా? మాతలు వస్తారా? మాతలు సిద్ధముగా ఉన్నారా? ఏదీ గుర్తుకు రాదా? టీచర్లకు సెంటర్ గుర్తుకు వస్తుందా, జిజ్ఞాసువులు గుర్తుకు వస్తారా? గుర్తుకు రారా? అచ్ఛా. అందరూ నిర్మోహులుగా అయిపోయారా? అలా అయితే చాలా మంచిది. అప్పుడిక శ్రమ చేయవలసిన అవసరముండదు కదా.
ఈరోజు బాప్‌దాదా అందరినీ, సమ్ముఖముగా కూర్చున్నవారు కావచ్చు లేక దూరంగా కూర్చుని ఉన్నా కానీ తండ్రి హృదయములో కూర్చున్న వారు కావచ్చు, అందరినీ ఈ రోజు శ్రమ నుండి ముక్తులుగా చెయ్యాలనుకుంటున్నారు. మరి అవుతారా? చప్పట్లు అయితే కొట్టారు, మరి అలా అవుతారా? రేపటి నుండి ఎవ్వరూ దాదీల వద్దకు వెళ్ళరు. వారికి శ్రమ కలిగించరు కదా? వారిని ఆనందముగా కలుస్తారు. జోన్ హెడ్ వద్దకు వెళ్ళరు, కంప్లెయింట్లు (ఫిర్యాదులు) చెయ్యరు, కంప్లీట్ (సంపూర్ణము). సరేనా? ఇప్పుడు చేతులెత్తండి. చూడండి, ఆలోచించి చేతులెత్తండి, ఊరికే అలా ఎత్తడం కాదు. ఎటువంటి కంప్లెయింట్ ఉండకూడదు, నాది-నాది అనేది ఉండకూడదు, ఎవ్వరూ నా వారు కారు. నేను అనేది ఉండకూడదు, నాది అనేది ఉండకూడదు, సమాప్తము. చూడండి, ప్రతిజ్ఞనైతే చేసారు, మంచిది, అభినందనలు, కానీ విషయమేమిటంటే, ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని పొందటము లేదు. ప్రతిజ్ఞను చాలా త్వరగా చేస్తారు, కానీ లాభాన్ని పొందేందుకు ప్రతిరోజూ - ఒకటేమో రియలైజేషన్ అవ్వండి, రెండవది రివైజ్ చేసుకోండి. ఏం ప్రతిజ్ఞ చేసాము అని ఆ ప్రతిజ్ఞను రోజూ రివైజ్ చేసుకోండి. అమృతవేళ మిలనము తర్వాత ‘ప్రతిజ్ఞ’ మరియు దాని ‘లాభము’, ఈ రెండింటి బ్యాలెన్స్ యొక్క చార్టును తయారు చేసుకోండి. ఏం ప్రతిజ్ఞ చేసాము? మరియు లాభము ఎంత పొందుతున్నాము? రియలైజ్ అవ్వండి, రివైజ్ చేసుకోండి, బ్యాలెన్స్ ఉంటే మంచిగా అయిపోతుంది. మీటింగ్ వారు ప్రతిజ్ఞ చేసారు అన్నది బాప్‌దాదాకు తెలుసు.
మీటింగ్ వారు లేవండి. అచ్ఛా, పక్కా ప్రతిజ్ఞను చేసారా? లేక ఫైల్ కోసం ప్రతిజ్ఞ చేసారా? ఫైల్ కోసం చేసారా లేక ఫైనల్ చేసారా? ఫైనల్ చేసారా? చప్పట్లు కొట్టండి. బాగా చప్పట్లు కొట్టండి. చాలా బాగా చేసారు, కూర్చోండి. చూడండి, ఇన్ని ఫైనల్ అయిపోతే చివరి నంబర్ అయితే తప్పకుండా ఫైనల్ అయిపోతుంది ఎందుకంటే మీరు విశేషంగా సేవకు ఆధారమూర్తులైన నిమిత్తులు. సేవ యొక్క సఫలత స్వ సేవతోటే జరుగుతుంది. స్వ సేవ విశ్వ సేవకు ఆధారము. మరి ఇన్ని ప్రతిజ్ఞలను మరియు లాభాలను పొందేవారు మీరు. మీ నిమిత్త భావము ఇతరులకు కూడా సహయోగాన్ని ఇస్తుంది. పదే-పదే రియలైజ్ అవ్వండి. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్నది మనసుతో రియలైజ్ అవ్వండి. ‘నా (లేదు, కాదు)’ అన్న పదాన్ని 21 జన్మల కోసం ఆల్మైటీ ప్రభుత్వం సీల్ వేసేసింది. హాజీ , హాజీ అంటూ ఉండండి. మాస్టర్ సర్వశక్తిమంతులు, ఏది కావాలంటే అది చేయగలరు, ఇంతటి అథారిటీ బాబా ద్వారా లభించింది. ఏదైనా సంకల్పం, మాట, కర్మ చేసేకన్నా ముందు ఇది బాబా సమానంగా ఉన్నదా లేదా అని చెక్ చేసుకుని తర్వాత ప్రాక్టికల్లోకి తీసుకురండి. మీ వివేకము హాజీ అంటే అప్పుడే దానిని ప్రాక్టికల్లోకి తీసుకురండి. సమానంగా అవ్వాలంటే సమానంగా చేయాలి కూడా, నడుచుకోవాలి కూడా. బాప్‌దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరినీ చాలా-చాలా పెద్ద పెద్ద ఆశలతో చూస్తారు – వీరే అవుతారు, అయ్యారు మరియు తప్పకుండా అవ్వవలసిందే. కేవలం రెండు పదాలను గుర్తుంచుకోండి – నిమిత్తము మరియు నిర్మానము. ఇందులో నేను, నాది రెండూ సమాప్తమైపోతాయి. నిమిత్తంగా ఉన్నాను మరియు నిర్మానంగా అవ్వవలసిందే.
మీరు ఏదైతే 70వ సంవత్సరాన్ని జరుపుకోబోతున్నారో, ఆ సమాచారాన్ని కూడా విన్నాము. విదేశాలు కూడా తయారీలు చేస్తున్నారు మరియు దేశం వారు కూడా చేస్తున్నారు. దీని గురించే మీటింగ్ చేసుకున్నారు కదా! మరి బాప్‌దాదా 70వ సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలని ఆశిస్తున్నారు? అందరికీ జరుపుకోవాలన్న ఉల్లాసం ఉంది కదా? ఉల్లాసం ఉందా? మాతలకు ఉందా? డబల్ విదేశీయులకు ఉందా? జరుపుకోవాలా? సేవా ప్రోగ్రామ్ అయితే మీరు తయారు చేసారు, తయారు చేస్తారు కూడా, ఇందులో తెలివైనవారు మీరు. ప్లాన్లు చాలా మంచి-మంచివి తయారుచేస్తారు అన్నది బాప్‌దాదా చూసారు, బాప్‌దాదాకు అవి ఇష్టము. బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారు? బాప్‌దాదా కేవలం ఒక్క మాటను కోరుకుంటున్నారు. ఆ ఒక్క మాట ఏమిటంటే - సఫలము చేయండి, సఫలురుగా అవ్వండి. ఖజానాలు, శక్తులు, సంకల్పాలు, మాటలు ఏవేవైతే ఉన్నాయో, కర్మ కూడా శక్తియే, ఈ సమయము కూడా శక్తియే, ఖజానాయే. అన్నింటినీ సఫలము చేయాలి. స్థూల ధనము కావచ్చు, అలౌకిక ఖజానాలు కావచ్చు, అన్నింటినీ సఫలము చేయాలి. సఫలతామూర్తి అన్న సర్టిఫికేట్‌ను తీసుకోవాల్సిందే. సఫలము చెయ్యండి మరియు సఫలము చేయించండి. ఒకవేళ ఎవరైనా అసఫలము చేస్తుంటే, వారికి మాటల ద్వారా శిక్షణ ద్వారా కాదు, మీ శుభ భావన, శుభ కామన మరియు సదా శుభమైన గౌరవాన్ని ఇవ్వటం ద్వారా వారి చేత సఫలము చేయించండి. కేవలం శిక్షణ మాత్రమే ఇవ్వకండి, ఒకవేళ శిక్షణ ఇవ్వవలసి వచ్చినా కూడా, క్షమ మరియు శిక్షణ, క్షమా రూపులుగా అయి శిక్షణను ఇవ్వండి. దయార్ద్ర హృదయులుగా అవ్వండి, కరుణా హృదయులుగా అవ్వండి. మీ దయా రూపము తప్పకుండా ఆ శిక్షణకు రిజల్ట్ చూపిస్తుంది. చూడండి, ఈ రోజుల్లో సైన్స్ డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసేటప్పుడు, ముందు ఏం చేస్తారు? మొదట మత్తు ఇచ్చి పడుకోబెడతారు, ఆ తర్వాత కోస్తారు, ముందే కొయ్యరు. టించరు వేసేటప్పుడు కూడా ముందు ఊదుతారు, ఆ తర్వాత టించరు వేస్తారు. మరి మీరు కూడా మొదట దయార్ద్ర హృదయులుగా అవ్వండి, ఆ తర్వాత శిక్షణ ఇవ్వండి, అప్పుడు ప్రభావము పడుతుంది, లేదంటే ఏం జరుగుతుంది, మీరు శిక్షణ ఇవ్వటం మొదలుపెడతారు, కానీ వారు ముందే మీ కంటే పెద్ద శిక్షకులు. కనుక శిక్షకుడు, శిక్షకుని శిక్షణను స్వీకరించరు. ఇలా చెయ్యకండి, ఇలా చెయ్యండి అని మీరు ఏవైతే పాయింట్లు చెప్తారో, వాటిని ఖండించటానికి వారి వద్ద 10 పాయింట్లు ఉంటాయి, అందుకే క్షమ మరియు శిక్షణ కలిసి ఉండాలి, మరి ఈ 70వ సంవత్సరము యొక్క థీమ్ఏమిటంటే - సఫలము చెయ్యండి, సఫలము చేయించండి. సఫలతామూర్తులుగా అవ్వండి, అన్నింటినీ సఫలము చెయ్యండి. డబల్ లైట్‌గా అవ్వాలి కదా, మరి సఫలము చెయ్యండి. సంస్కారాన్ని కూడా సఫలము చెయ్యండి. ఆత్మలైన మీ అసలైన ఆది సంస్కారాలు, దేవతా సంస్కారాలు, అనాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఇమర్జ్ చేయండి. తప్పుడు సంస్కారాలకు అంతిమ సంస్కారము చేయండి. ఆది, అనాది సంస్కారాలను ఇమర్జ్ చేయండి. ఇప్పుడు అందరిదీ విశేషముగా ఒకే ఒక ఫిర్యాదు మిగిలిపోయింది, అది ఏమిటంటే - సంస్కారాలు మారటం లేదు, సంస్కారాలు మారటం లేదు. మరి 70వ సంవత్సరంలో ఏదైనా అద్భుతాన్ని చేయాలి కదా. మరి పరివర్తన యొక్క విశేషతను చూపించండి. సరేనా! 70వ సంవత్సరంలో చేయాలి కదా? చేయాలి, చేస్తారా? చేస్తారా లేక జరిగే ఉందా? కేవలం నిమిత్తంగా అవ్వాలి. అచ్ఛా.
బాప్‌దాదా పిల్లలందరినీ చూసి పాట పాడుతున్నారు – వాహ్! పిల్లలూ వాహ్! అచ్ఛా, ఇప్పుడు ఏమి చేయాలి?
సేవ టర్న్ ఇండోర్ జోన్ వారిది:- చాలామంది సేవాధారులు వచ్చారు. సంగఠన బాగుంది. ఏదైతే సేవ చేసారో, మనస్ఫూర్తిగా సేవను చేసారు, దానికి ప్రత్యక్ష ఫలమైన సంతోషాన్ని అనుభవం చేసారా? సంతోషం లభించిందా? సేవ యొక్క ఫలము, ప్రత్యక్ష ఫలంగా సంతోషం లభించింది, భవిష్యత్తు కోసం సేవా ఫలంగా పుణ్యం జమ అయింది. పుణ్య ఖాతా పెరిగింది. అంటే వర్తమానం కూడా ఫలం లభించింది మరియు భవిష్యత్తు కోసం కూడా జమ అయింది. బాగుంది, ప్రతి జోన్‌కు ఛాన్స్ లభిస్తుంది, విశేషంగా ఛాన్స్ లభించడం ద్వారా వాయుమండలం యొక్క లాభము, యజ్ఞ సేవ యొక్క పుణ్య ఖాతా మరియు సేవ ద్వారా సర్వ బ్రాహ్మణులతో సంబంధ సంపర్కం ద్వారా ఈశ్వరీయ ప్రేమ బంధం పెరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు, రేపటి నుండైతే తిరిగి వెళ్ళడం కూడా ప్రారంభమవుతుంది. చాలా బాగా చేసారు, సేవా బలాన్ని సదా కోసం నింపుకుని వెళ్ళండి. మంచిది. మాతలు కూడా ఉన్నారు, కుమారీలు కూడా ఉన్నారు, అందరూ సేవాధారులు. పాండవులైతే ఉండనే ఉన్నారు. సేవా అవకాశాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ చేసి వెళ్తున్నారో, దాని లాభాన్ని విశేషంగా సేవకు రిటర్న్‌గా ఇస్తూ ఉండండి. ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని పొందండి. కేవలం ప్రతిజ్ఞ కాదు, లాభము.
ఇండోర్-నడియాద్ హాస్టల్ కుమారీలు కూడా ఉన్నారు:- నడియాద్ నుండి కొంతమందే ఉన్నారు. నడియాద్ కుమారీలు మంచిగా ఉన్నారా! స్వ ఉన్నతి, సేవ యొక్క ఉన్నతి – రెండూ జరుగుతున్నాయా? బాగుంది, కుమారీలు ట్రైనింగ్ చేస్తారు, ట్రైనింగ్ కుమారీలు ఇంకా కూడా వచ్చారు కదా! నడియాద్ సోదరి కూడా ముందుకు రండి. అచ్ఛా – ఈ కుమారీలందరూ, నడియాద్లోని వారు కావచ్చు, మధుబన్‌లోని వారు కావచ్చు, ఇప్పుడైతే మధుబన్ వారే కదా. మరి అందరూ లక్ష్యాన్ని పూర్తిగా పెట్టుకున్నారా? లక్ష్యము ఏమి పెట్టుకున్నారు? సఫలతామూర్తిగా అవ్వాలి. సమస్యగా అవ్వకూడదు, సమాధానమూర్తులుగా అవ్వాలి. వాయుమండలం యొక్క ప్రభావంలోకి రాకూడదు, మీ వాయుమండలం యొక్క ప్రభావాన్ని వేయాలి, ఇంతటి శక్తిని నింపుకున్నారా? మీకు వాయుమండలం యొక్క సహాయం లభించకపోతే ఏమి చేస్తారు? మీ వాయుమండలాన్ని చూపిస్తారా? ఇంత శక్తి ఉందా? అయితే చప్పట్లు కొట్టండి, అభినందనలు. చాలా బాగుంది, చూడండి, మీ చిత్రమైతే ఇందులో (వీడియోలో) వస్తుంది, ఫోటో తీస్తున్నారు. బాప్‌దాదా ప్రతి నెల మీకు నిమిత్తమైన వారి నుండి రిపోర్ట్‌ను తీసుకుంటారు. అభినందనలు కూడా ఇస్తాము ఎందుకంటే సఫలతామూర్తులు, సఫలతకు అధికారులు మీరు. మరి సఫలతకు అధికారులుగా అవ్వాలి కదా. బాగుంది, ఇప్పుడు ఒక్క విషయానికి అభినందనలు ఇవ్వాలి, ధైర్యంతో వచ్చినందుకు అభినందనలు. మరి మీ ధైర్యము యొక్క అడుగుకు బాప్‌దాదా నుండి పదమారెట్ల సహాయం ఉండనే ఉంటుంది. నిరాశ చెందకండి, దిల్ఖుష్. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే, ఆ సమయంలోనే బాబా ముందు పెట్టండి, మీ మనసులో పెట్టుకోకండి. బాబా మీరు తీసుకోండి, మేమైతే సమాధాన స్వరూపులము. సరేనా? మంచి ధైర్యము ఉన్నవారు, ధైర్యమును సదా పెట్టుకోండి. అచ్ఛా.
కటక్‌లో చాలా బాగా మెగా ప్రోగ్రామ్ జరిగింది, పూరీలో కూడా చాలా బాగా ప్రోగ్రామ్ జరిగింది:- ప్రోగ్రామ్ అయితే అందరూ బాగా చేస్తున్నారు, సందేశం ఇచ్చే కార్యం ఏదైతే చెయ్యాలో, ఆ సందేశమైతే అందరికీ చేరుతుంది. వీరు బ్రహ్మా కుమారీలు, బ్రహ్మా కుమారీలు ఈ కార్యాన్ని చేయాలనుకుంటున్నారు అన్న విషయం అందరికీ తెలుస్తూ ఉంటుంది. కానీ బాప్‌దాదా పాత-పాత పెద్ద-పెద్ద సెంటర్లు ఏవైతే నడుస్తున్నాయో, వాటి పట్ల ఉన్న శుభమైన ఆశను ఇప్పటివరకు పూర్తి చేయలేదు. ఇది బాప్‌దాదా చేస్తున్న ఫిర్యాదు. వారస క్వాలిటీ మరియు సేవతో కూడా పురుషార్థంలో తీవ్ర క్వాలిటీ, వారు బాప్‌దాదా ఎదుటకు మరింత మంది రావాలి. వి.ఐ.పిలు కూడా వస్తారు కానీ వి.ఐ.పి కూడా వి.వి.ఐ.పీలు అవ్వాలి, వి.ఐ.పిగా ఉండిపోకూడదు. ఐ.పి., ఐ.పీలుగా ఉండిపోకూడదు, బ్రాహ్మణ జీవితాన్ని అనుభవం చేసుకోవాలి. క్వాంటిటీ అయితే వస్తుంది, ఇప్పుడు క్వాలిటీ యొక్క పుష్పగుచ్ఛం ప్రతి జోన్లో తయారవ్వాలి. ప్రతి జోన్ వారు నలువైపుల ఉన్న ఇటువంటి ఆశావహ ఆత్మలకు విశేష పాలనను ఇచ్చి సమీప సంబంధంలోకి తీసుకురావాలి. ప్లాన్ అయితే తయారు చేస్తారు, ఇప్పుడు ఈ ప్లాన్‌కు తీవ్ర గతిని ఇవ్వండి. ఎందుకంటే కనీసం మీ రాజ్యంలోకి మొదటి జన్మలో వచ్చే శక్తిశాలి సంఖ్య, అప్పుడప్పుడూ వచ్చేవారు కాదు, అప్పుడప్పుడూ నియమాలు పాటించేవారు కాదు, పక్కాగా విన్ అయ్యి వన్ తారీఖున, వన్ జన్మలో వచ్చేవారు, ఇటువంటి పుష్పగుచ్ఛాన్ని తయారు చేయండి. ప్రజలుగా అయినాగానీ ఆ ప్రజలు విశేషమైనవారిగా ఉంటారు. ప్రజలు కూడా యజమాని యొక్క అధికారాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే మొదటి జన్మ యొక్క శోభ, మొదటి జన్మ యొక్క ప్రభావం వేరుగానే ఉంటుంది. మరి ప్రతి జోన్ వారు తమ రిజల్ట్‌ను తయారు చేయండి, ప్రోగ్రామ్ అయితే చాలా చేసారు, అందుకు అభినందనలు. బాప్‌దాదా దీనిని మంచిగా భావిస్తారు, సఫలం చేస్తున్నారు, ఉల్లాస-ఉత్సాహాలలోకి వస్తారు, పెద్ద-పెద్దవారి సంబంధ -సంపర్కంలోకి వస్తారు, ఇది బాగా చేస్తున్నారు కానీ రిజల్ట్‌ను తీయండి. కనీసం లక్షన్నర, లక్షమంది వస్తే అందులో కనీసం కొద్దిమందైనా విన్ అయ్యేవారు ఉండాలి. ఇటువంటి ప్రోగ్రామ్‌ను తయారు చేయండి. పాత సెంటర్ వారు క్రొత్త-క్రొత్త వారస క్వాలిటీ వారిని తయారు చేయండి, పాతవారికైతే ఎలాగూ అభినందనలు లభిస్తాయి. క్రొత్త-క్రొత్త వారస క్వాలిటీ వారిని తయారు చేయండి. రాయల్ ఫ్యామిలీ, రాయల్ సంబంధ సంపర్కం వారు కూడా కావాలి కదా. అచ్ఛా.
అందరూ శ్రమ నుండి ముక్తులుగా అవుతాము అని ప్రతిజ్ఞనైతే చేసారు కదా! (అందరూ చేతులెత్తారు). అచ్ఛా - వీరి ఫోటో తీయండి. ఇప్పుడు ఒక్క నిమిషము కొరకు మీ హృదయపూర్వకముగా ఈ ప్రతిజ్ఞకు దృఢతతో అండర్లైన్ చెయ్యండి. మీ మనసులో పక్కా చేసుకోండి (డ్రిల్). అచ్ఛా.
నలువైపులా ఉన్న స్వమానధారీ పిల్లలందరికీ, సదా తండ్రి పట్ల హృదయపూర్వకమైన స్నేహము కలవారికి, సర్వుల పట్ల స్నేహము కల శ్రేష్ఠ ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా ఉంటూ జీవన్ముక్తిని అనుభవము చేసే తీవ్ర పురుషార్థీ పిల్లలకు, సదా ప్రతిజ్ఞ చేసేవారికి మరియు ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని పొందేవారికి, బ్యాలెన్స్ పెట్టుకునే ఆనంద స్వరూపులైన పిల్లలకు, సదా ఆనందములో ఉండేవారికి, ఇతరులను కూడా ఆనందములో ఉండేలా చేసేవారికి, ఇటువంటి సంగమయుగ శ్రేష్ఠ భాగ్యము యొక్క అధికారీ పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు హృదయాభిరాముని హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి. ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- బాగున్నారు కదా! అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. తండ్రి మరియు పిల్లలు, ఇరువురినీ చూసి సంతోషిస్తారు. ఇరువురూ సమానము. మీరు అందరికీ ప్రియమైన ఆత్మిక పిల్లలు. అందరికీ దాదీలంటే విశేషమైన ప్రేమ ఉంది కదా! చాలా ప్రేమ ఉంది, ఎందుకంటే ఎవరైతే నిమిత్తులుగా అవుతారో, ఆ నిమిత్తులుగా అయినవారిపై బాధ్యత కూడా ఉంటుంది, అలాగే స్నేహము కూడా అంతగానే ఉంటుంది, ఎందుకంటే అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాల వలన వారికి జీవితములో లిఫ్ట్ లభిస్తుంది. మీలో కూడా ఎవరైతే నిమిత్తముగా అవుతారో, వారికి కూడా లిఫ్ట్ లభిస్తుంది కానీ ఆ లిఫ్ట్ అనే గిఫ్ట్‌ను నిలుపుకున్నట్లయితే చాలా లాభము పొందగలరు. ఈ అదనపు వరదానము లభిస్తుంది. ఏ కార్యములోనైనా, ఈశ్వరీయ కార్యములోనైనా లేక యజ్ఞ సేవలోనైనా, ఎవరైతే విశేషముగా నిమిత్తము అవుతారో, వారికి ఆశీర్వాదాలు మరియు ప్రేమ, ఈ రెండింటి యొక్క లిఫ్ట్ లభిస్తుంది. ప్రేమ ఎటువంటిదంటే అది ఎలా ఉన్నవారిని ఎలా తయారుచేస్తుంది. ఈరోజు ప్రపంచములో కూడా, ఏం కావాలి అని ఎవరినైనా అడిగితే, ప్రేమ కావాలి అని అంటారు, శాంతి కావాలి అని అంటారు, అది కూడా ప్రేమతోనే లభిస్తుంది. కనుక ప్రేమ, ఆత్మిక ప్రేమ అన్నింటికంటే శ్రేష్ఠమైనది. అచ్ఛా.
ఫ్రాన్స్‌వారు చాలా స్మృతిని అందించారు:- బాప్‌దాదా కూడా విశేషంగా సేవలో పరివర్తన తీసుకు వచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నారు. (మార్క్ చాలా కష్టపడ్డారు) ప్రత్యేకమైన అభినందనలు, చప్పట్లు కొట్టండి. చూడండి, ఏదైతే పాత ప్రభుత్వం యొక్క రికార్డ్ ఉందో, కల్ట్ ఉండిందో, అది అన్ని చోట్ల తొలగిపోతుంది. మంచి ధైర్యాన్ని ఉంచారు. ధైర్యానికి సహాయం లభిస్తుంది. మనస్ఫూర్తిగా యోగం చేసారు కదా. మరి యోగానికి ఫలం లభించింది, బలం లభించింది. బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు, పరివారం కూడా సంతోషిస్తుంది అందుకే చప్పట్లు కొట్టారు కదా.
దాదీజీని బాబా అడుగుతున్నారు:- ఆరోగ్యం బాగుందా! జ్వరం ఉందా? వీరు ధైర్యవంతులు, చూడండి, వేడిగా ఉందా లేక చలిగా ఉందా? ఆట చూపిస్తుంది. ఆరోగ్యంలో బలహీనత వస్తుంది. ఇప్పుడైతే శక్తి వస్తుంది. నేను బాగున్నాను అని అందరికీ చెప్పండి. చెప్పండి, బాగున్నాను. (నేను చాలా బాగా ఉన్నాను) అందరి ప్రేమ ఉంది కదా, చూడండి, సాకారుడు అవ్యక్తమై వ్యక్తంలో నిమిత్తం చేసారు. ఇటువంటి సమయంలో నిమిత్తంగా అవ్వడం, ఇది ఎంతటి ధైర్యంతో కూడుకున్న విషయము. ఇటువంటి సమయంలో ధైర్యాన్ని చూపించేవారికి పూర్తి ఆయుష్షు సహాయం లభిస్తూ ఉంటుంది. అచ్ఛా!
ఓంశాంతి