Search for a command to run...
15 Oct 2007
సంగమయుగ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోవడానికి అన్ని భారాలను మరియు బంధనాలను తండ్రికి ఇచ్చేసి డబల్ లైట్‌గా కండి
15 October 2007 · తెలుగు
ఈరోజు విశ్వ రచయిత అయిన బాప్‌దాదా తమ మొదటి రచన అయిన అతి లవ్లీ మరియు లక్కీ పిల్లలతో మిలనము జరుపుకుంటున్నారు. కొంతమంది పిల్లలు సమ్ముఖంలో ఉన్నారు, నయనాలతో చూస్తున్నాము మరియు నలు వైపుల ఉన్న పిల్లలు హృదయంలో ఇమిడి ఉన్నారు. బాప్‌దాదా పిల్లలందరి మస్తకంపై భాగ్యము యొక్క మూడు మెరిసే నక్షత్రాలను చూస్తున్నారు. మొదటి భాగ్యము - బాప్‌దాదా యొక్క శ్రేష్ఠ పాలన, రెండవది శిక్షకుని ద్వారా చదువు మరియు మూడవది సద్గురువు ద్వారా సర్వ వరదానాల మెరిసే నక్షత్రము. మరి మీరందరూ కూడా తమ మస్తకంపై మెరుస్తున్న నక్షత్రాలను అనుభవం చేసుకుంటున్నారు కదా! సర్వ సంబంధాలు బాప్దాదాతోటే ఉన్నాయి అయినప్పటికీ జీవితంలో ఈ మూడు సంబంధాలు ఆవశ్యకము. ఇవి ప్రియమైన, గారాల పిల్లలైన మీకు అతి సహజంగా ప్రాప్తించాయి. ప్రాప్తించాయి కదా! నషా ఉంది కదా! హృదయంలో వాహ్ బాబా వాహ్! వాహ్ శిక్షకుడు వాహ్! వాహ్ సద్గురువు వాహ్! అని పాట పాడుతున్నారు కదా! ప్రపంచంవారు ఏ గురువునైతే మహాన్ ఆత్మ అని అంటారో వారి నుండి ఒక్క వరదానమును పొందడానికి కూడా ఎంతో ప్రయత్నిస్తారు. మీరు జన్మించగానే బాబా మిమ్మల్ని సహజంగా వరదానలతో సంపన్నం చేసేసారు. భగవంతుడు, తండ్రి మాపై ఇంతగా బలిహారమవుతారని మీ శ్రేష్ఠ భాగ్యాన్ని స్వప్నంలోనైనా ఊహించారా! భక్తులు భగవంతుని పాటలు పాడుతారు, మరి భగవంతుడు ఎవరి పాటలు పాడుతారు? లక్కీ పిల్లలైన మీ పాటలు పాడుతారు.
ఇప్పుడు కూడా మీరందరూ భిన్న-భిన్న దేశాల నుండి ఏ విమానంలో వచ్చారు? స్థూల విమానాలలో వచ్చారా లేక పరమాత్మ ప్రేమ అనే విమానంలో అన్ని వైపుల నుండి చేరుకున్నారా! పరమాత్మ విమానము ఎంత సహజంగా తీసుకువస్తుంది, ఏ కష్టమూ ఉండదు. మరి అందరూ పరమాత్మ ప్రేమ అనే విమానంలో చేరుకున్నందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాప్‌దాదా పిల్లలందరినీ చూసి, మొదటిసారి వచ్చినవారైనా కావచ్చు, బహుకాలము నుండి వస్తున్నవారైనా కావచ్చు, బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిలోని విశేషతల గురించి తెలుసు. బాప్‌దాదాకు ఏ పిల్లవాడైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, మహారథులైనా, పురుషార్థీలైనా, అందరూ ప్రియమైనవారే, ఎందుకని? మీరైతే బాబాను వెతికారు, కానీ లభించలేదు. కానీ బాప్‌దాదా ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రేమతో, మనసుతో, స్నేహంతో మూల మూలల నుండి వెతికారు. మరి మీరు ప్రియమైనవారు కాబట్టే వెతికారు కదా! ఎందుకంటే ఎటువంటి విశేషతలు లేకుండా అయితే బాబా పిల్లలెవ్వరూ లేరు అని బాబాకు తెలుసు. కనీసం గుప్త రూపంలో వచ్చిన బాబాని అయితే గుర్తించారు కదా. నా బాబా అన్నారు, అందరూ అంటారు కదా, నా బాబా అని. నీ బాబా కాదు, నీ బాబా అని అనేవారు ఎవరైనా ఉన్నారా? అందరూ నా బాబా అనే అంటారు. మరి విశేషమైనవారే కదా. పెద్ద పెద్ద వైజ్ఞానికులు, పెద్ద పెద్ద వి.ఐ.పీలు గుర్తించలేకపోయారు, కానీ మీరందరూ అయితే గుర్తించారు కదా. మీ వారిగా చేసుకున్నారు. మరి బాబా కూడా మిమ్మల్ని తమవారిగా చేసేసుకున్నారు. ఈ సంతోషంలో పాలింపబడుతూ ఎగురుతూ ఉన్నారు కదా! ఎగురుతున్నారు, నడవడం లేదు, ఎగురుతున్నారు ఎందుకంటే నడిచేవారు తండ్రితో పాటు ఇంటికి వెళ్ళలేరు. ఎందుకంటే బాబా అయితే ఎగిరేవారు, మరి నడిచేవారు ఎలా కలిసి చేరుకోగలరు! అందుకని బాబా పిల్లలందరికీ ఏ వరదానమును ఇస్తారు? ఫరిశ్తా స్వరూప భవ. ఫరిశ్తా ఎగురుతుంది, నడువదు, ఎగురుతుంది. మరి మీరందరూ కూడా ఎగిరే కళలోని వారే కదా! అవునా? ఎగిరే కళలోని వారము అనేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడూ నడిచే కళ, అప్పుడప్పుడూ ఎగిరే కళ అని అంటారా? అలా లేదు కదా? సదా ఎగిరే వారు, డబల్ లైట్‌గా ఉన్నారు కదా. ఎందుకని? ఆలోచించండి, బాబా మీ అందరి నుండి గ్యారంటీ తీసుకున్నారు - ఏ విధమైన భారము మనసులో కానీ, బుద్ధిలో కానీ ఉన్నట్లయితే బాబాకు ఇచ్చేయండి, తీసుకోవడానికే బాబా వచ్చారు. మరి బాబాకు భారాన్ని ఇచ్చేసారా లేక కొద్ది కొద్దిగా జాగ్రత్తగా భద్రపరుచుకున్నారా? తీసుకునేవారు తీసుకుంటున్నప్పుడు భారాన్ని ఇవ్వడానికి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందా? భారాన్ని మోసే అలవాటు 63 జన్మల నుండి ఉంది అని అంటారా? అనుకోవడం లేదు కానీ అలవాటుకు బలహీనమయ్యాము అని కొంతమంది పిల్లలు అంటారు. ఇప్పుడైతే బలహీనంగా లేరు కదా! శక్తిశాలిగా ఉన్నారా లేక బలహీనంగా ఉన్నారా? బలహీనంగా ఎప్పుడూ అవ్వకండి. శక్తిశాలిగా ఉండండి. శక్తులు శక్తిశాలిగా ఉన్నారా లేక బలహీనంగా ఉన్నారా? శక్తిశాలిగా ఉన్నారు కదా? ముందు కూర్చున్నవారు ఎలా ఉన్నారు? శక్తిశాలిగా ఉన్నారు కదా! భారాన్ని పెట్టుకోవడం మంచిగా అనిపిస్తుందా? భారము అంటే ఇష్టమా? వదలండి, వదిలితే విడుదలవుతారు. వదలకపోతే విడుదల కారు. వదిలేందుకు సాధనము - దృఢ సంకల్పము. కొంత మంది పిల్లలు ఏమని అంటారంటే దృఢ సంకల్పమైతే చేస్తున్నాము కానీ, కానీ... కారణము ఏమిటి? దృఢ సంకల్పము చేస్తున్నారు కానీ చేసిన దృఢ సంకల్పాన్ని రివైజ్ చెయ్యరు. భారము ఏమిటి మరియు డబల్ లైట్ యొక్క అనుభవం ఏమిటి అని పదేపదే మనసులో రివైజ్ చేసుకోండి మరియు రియలైజ్ కండి. రియలైజేషన్ కోర్సును ఇప్పుడు కొంచెం ఎక్కువగా అండర్లైన్ చేయండి. చెప్పడము మరియు ఆలోచించడము చేస్తారు, కానీ భారము ఏమిటి మరియు డబల్ లైట్ ఏమిటి అని మనస్ఫూర్తిగా రియలైజ్ కండి. తేడాను ఎదురుగా పెట్టుకోండి ఎందుకంటే బాప్‌దాదా సమయము యొక్క సమీపత అనుసారంగా ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏమి చూడాలని ఆశిస్తున్నారు? ఏదైతే చెబుతున్నారో అది చేసి చూపించండి. ఏదైతే ఆలోచిస్తారో దానిని స్వరూపంలోకి తీసుకురావాలి ఎందుకంటే బాబా యొక్క వారసత్వము, జన్మ సిద్ధ అధికారము - ముక్తి మరియు జీవన్ముక్తి. అందరూ వచ్చి ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని పొందండి అనే అందరికీ ఆహ్వానమును ఇస్తారు కదా. స్వయాన్ని ప్రశ్నించుకోండి - ముక్తిధామంలో ముక్తిని అనుభవం చెయ్యాలా, సత్యయుగంలో జీవన్ముక్తిని అనుభవం చెయ్యాలా లేక ఇప్పుడు సంగమయుగంలో ముక్తి, జీవన్ముక్తి యొక్క సంస్కారాలను తయారు చేసుకోవాలా? ఎందుకంటే మేము మా యొక్క ఈశ్వరీయ సంస్కారాలతో దైవీ ప్రపంచాన్ని తయారు చేస్తున్నాము అని అంటారు కదా. మీ సంస్కారాలతో క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. మరి ఇప్పుడు సంగమంలోనే ముక్తి జీవన్ముక్తి యొక్క సంస్కారాలు ఇమర్జ్ కావాలి కదా! మరి అన్ని బంధనాల నుండి మనసు మరియు బుద్ధి ముక్తి అయి ఉన్నాయా అని పరిశీలించుకోండి. బ్రాహ్మణ జీవితంలో అనేక విషయాల నుండి, గడిచిన జీవితం యొక్క బంధనాల నుండి ముక్తులయ్యారా? సర్వ బంధనాల నుండి ముక్తులయ్యారా లేక ఇప్పుడు కూడా తమ బంధనంలో బంధిస్తున్నాయా? ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తి జీవన్ముక్తిని అనుభవం చెయ్యడమే బ్రాహ్మణ జీవితము యొక్క శ్రేష్ఠత ఎందుకంటే సత్యయుగంలో జీవన్ముక్తి, జీవనబంధనము రెండింటి అనుభవమూ ఉండదు. జీవన బంధనము అంటే ఏమిటి, జీవన ముక్తి అంటే ఏమిటి అని ఇప్పుడు అనుభవం చేసుకోవచ్చు. ఎందుకంటే మీ అందరి ప్రతిజ్ఞ ఉంది, అందరి ప్రతిజ్ఞ ఉంది. అనేక సార్లు ప్రతిజ్ఞ చేసారు. ఏమని ప్రతిజ్ఞ చేసారు, గుర్తుందా? మీ ఈ బ్రాహ్మణ జీవిత లక్ష్యము ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఏమని జవాబు ఇస్తారు? బాబా సమానంగా కావాలి. పక్కా కదా. బాబా సమానంగా కావాలి కదా? లేక కొంచెం కొంచెం అవుతారా? సమానంగా కావాలి కదా! సమానంగా అవుతారా? లేక కొంచెం అయినా సరిపోతుందా! సరిపోతుందా? దానిని సమానము అని అనరు కదా. మరి బాబా ముక్తుడా లేక బంధనం ఉందా? ఒకవేళ ఏ విధమైన దేహము యొక్క, దేహ సంబంధాల యొక్క - తల్లి తండ్రి బంధువు సఖుడు - వీరి బంధనము, దేహముతో కర్మేంద్రియాలకు ఉన్న సంబంధము, ఈ కర్మేంద్రియాల సంబంధాల బంధనము, అలవాటు అనే బంధనము, స్వభావము అనే బంధనము, పాత సంస్కారాల బంధనము ఉంటే మరి బాబా సమానముగా ఎలా అయినట్లు? మరి రోజూ బాబా సమానముగా కావాలి అని ప్రతిజ్ఞ చేస్తారు. చేతులు ఎత్తమని అంటే అందరూ ఏమని అంటారు? లక్ష్మీ నారాయణులు కావాలి. బాప్‌దాదాకు సంతోషంగా ఉంటుంది, ఎంతో మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు కానీ ప్రతిజ్ఞలోని లాభాన్ని పొందలేకపోతున్నారు. ప్రతిజ్ఞ మరియు లాభము యొక్క బ్యాలెన్సు గురించి తెలియదు. ప్రతిజ్ఞల ఫైళ్ళు బాప్‌దాదా వద్ద చాలా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. అందరి ఫైళ్ళు ఉన్నాయి. అలాగే లాభాల ఫైళ్ళు ఉండాలి, బ్యాలెన్సు ఉండాలి, అప్పుడు ఎంత మంచిగా ఉంటుంది.
వీరు సెంటరు టీచర్లు కూర్చుని ఉన్నారు కదా. వీరు కూడా సెంటరు నివాసులు కదా. మరి సమానంగా అయ్యేవారు కదా. సెంటరు నివాసులు, నిమిత్తమైనవారు సమానంగా ఉండాలి కదా! ఉన్నారు కానీ అప్పుడప్పుడూ కొంచెం అల్లరి చేస్తుంటారు. బాప్‌దాదా అయితే పిల్లల రోజంతటి స్థితి మరియు నడవడిక రెండిటినీ చూస్తూ ఉంటారు. మీ దాదీ కూడా వతనంలో ఉన్నారు కదా, దాదీ కూడా చూసి ఏమనేవారో తెలుసా? తెలుసా? బాబా, ఇలా కూడా ఉందా? ఇలా ఉంటుందా, ఇలా చేస్తారా, మీరు చూస్తూ ఉంటారా? విన్నారా, మీ దాదీ ఏమి చూసారో? ఇప్పుడు బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారంటే పిల్లలు ప్రతి ఒక్కరూ ముక్తి జీవన్ముక్తుల వారసత్వానికి అధికారులుగా కావాలి అని. ఎందుకంటే వారసత్వము ఇప్పుడే లభిస్తుంది. సత్యయుగంలో అయితే నేచురల్ జీవితము ఉంటుంది. ఇప్పటి నేచురల్ జీవితము యొక్క అభ్యాసము. వారసత్వము యొక్క అధికారము ఇప్పుడు సంగమంలోనే ఉంటుంది. కావున బాప్‌దాదా ఏమని ఆశిస్తున్నారంటే స్వయాన్ని ఏమైనా బంధనాలు లాగుతున్నాయా, అయితే అందుకు కారణము ఏమిటి అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి. కారణమును ఆలోచించండి, కారణముతో పాటు నివారణను కూడా ఆలోచించండి. నివారణ అయితే బాప్‌దాదా అనేక సార్లు భిన్న-భిన్న రూపాలలో ఇచ్చేసారు. సర్వ శక్తుల వరదానమును ఇచ్చారు, సర్వ గుణాల ఖజానాను ఇచ్చారు, ఖజానాలను ఉపయోగిస్తే ఖజానా పెరుగుతుంది. ఖజానా ఉంది, అందరి దగ్గర ఉంది, బాప్‌దాదా చూసారు. ప్రతి ఒక్కరి స్టాక్‌ను కూడా చూసారు. బుద్ధియే స్టాక్ రూమ్. మరి బాప్‌దాదా అందరిదీ చూసారు. ఉంది, స్టాక్ ఉంది కానీ ఖజానాను సమయానికి ఉపయోగించడం లేదు. కేవలం పాయింట్ రూపంలో ఆలోచిస్తున్నారు - అవును, ఇలా చెయ్యకూడదు, ఇది చెయ్యాలి - పాయింట్ల రూపంలో ఉపయోగిస్తున్నారు, ఆలోచిస్తున్నారు కానీ పాయింటుగా అయి పాయింటును ఉపయోగించడం లేదు. అందుకే పాయింటు ఉండిపోతుంది. పాయింటుగా అయి ఉపయోగిస్తే నివారణ వస్తుంది. ఇలా చెయ్యకూడదు అని అంటారు కూడా, కానీ మర్చిపోతారు. చెప్పడంతో పాటు మర్చిపోతున్నారు కూడా. ఎంతటి సహజమైన విధిని వినిపించాము, సంగమయుగంలో ఉన్నదంతా కేవలం బిందువు యొక్క అద్భుతము. కేవలం బిందువును ఉపయోగించండి, మరే విషయమూ అవసరం లేదు. మూడు బిందువులను ఉపయోగించండి. ఆత్మ బిందువు, తండ్రి బిందువు మరియు డ్రామా బిందువు. మూడు బిందువులను ఉపయోగించినప్పుడు బాబా సమానంగా కావడము కష్టము కాదు. బిందువు పెట్టాలనుకుంటారు కానీ పెట్టేటప్పుడు చేయి కదిలిపోతుంది, అది ప్రశ్న చిహ్నంగా లేక ఆశ్చర్య రేఖగా మారిపోతుంది. అక్కడ చేయి కదులుతుంది, ఇక్కడ బుద్ధి కదులుతుంది. లేకపోతే మూడు బిందువులను స్మృతిలో పెట్టుకోవడము ఏమంత కష్టము? కష్టమా? బాప్‌దాదా అయితే మరో సహజమైన యుక్తిని కూడా చెప్పారు, అది ఏమిటి? ఆశీర్వాదాలు తీసుకోండి మరియు ఆశీర్వాదాలు ఇవ్వండి. సరే, యోగము శక్తిశాలిగా కుదరడం లేదు, ధారణలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి, భాషణ ఇచ్చే ధైర్యము లేదు, కానీ ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ ఒక్క విషయాన్ని చెయ్యండి, మిగతా అన్నీ వదిలి పెట్టండి. ఒక్క విషయము చెయ్యండి - ఆశీర్వాదాలు తీసుకోవాలి మరియు ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఏమి జరిగినా కానీ, ఎవరు ఏమి ఇచ్చినా కానీ నేను ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి, ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ ఆశీర్వాదాలు ఇస్తూ మరియు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే ఇందులో శక్తులు మరియు గుణాలు రావా? ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఈ ఒక్క లక్ష్యాన్ని పెట్టుకోండి, చేసి చూడండి, ఒకరోజు అభ్యాసం చేసి చూడండి, తర్వాత ఏడు రోజులు చేసి చూడండి. మిగతా విషయాలు బుద్ధిలో లేకపోయినా ఒక్కటైతే వస్తుంది. ఏమి జరిగినా కానీ ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇదైతే చెయ్యగలరా లేక చెయ్యలేరా? చెయ్యగలరా? అచ్ఛా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ట్రయల్ వేసి చూడండి. దీనితో అందరూ యోగయుక్తంగా సహజంగా అయిపోతారు. ఎందుకంటే వ్యర్థ కర్మలు జరగనప్పుడు యోగయుక్తంగా అయిపోతారు కదా. కానీ ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎవరు ఏమి ఇచ్చినా కానీ, శాపము కూడా ఇస్తారు, క్రోధము యొక్క విషయాలు కూడా వస్తాయి, ఎందుకంటే ప్రతిజ్ఞ చేస్తారు కదా, అప్పుడు మాయ కూడా వీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు అని వింటుంది. అది కూడా దాని పని చేస్తుంది కదా. మాయాజీతులుగా అయిపోతే అప్పుడు ఏమీ చెయ్యదు, ఇప్పుడైతే మాయాజీతులుగా అవుతున్నారు, మరి అది దాని పని చేస్తుంది కానీ నేను అయితే ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. వీలవుతుందా? వీలవుతుందా? వీలవుతుంది అనేవారు చేతులెత్తండి. అచ్ఛా, శక్తులు చేతులు ఎత్తండి. అవును, వీలవుతుంది. అన్ని వైపుల నుండి టీచర్లు వచ్చారు కదా. మీరు మీ దేశాలకు వెళ్ళినప్పుడు ముందుగా అందరూ ఒక వారం రోజుల హోమ్‌వర్కును చేసి రిజల్టును పంపాలి, క్లాసు సభ్యులు ఎంత మంది, ఎంత మంది ఓ.కే మరియు ఎంతమంది కొంచెము కచ్చాగా కొంచెము పక్కాగా ఉన్నారు అంటే ఓ.కే మధ్యలో గీతను పెట్టండి. (ఓ.కే.) కేవలం ఇలా తమ సమాచారాన్ని పంపండి. ఇంతమంది ఓ.కే, ఇంతమందికి ఓ.కే మధ్యలో గీత ఉంది. చూడండి, ఇందులో డబల్ విదేశీయులు వచ్చారు కాబట్టి డబల్ కార్యమును చేస్తారు కదా. ఒక్క వారం రోజుల రిజల్టును పంపండి. అప్పుడు బాప్‌దాదా చూస్తారు, సహజమే కదా, కష్టంగా లేదు కదా. మాయ వస్తుంది. బాబా, నాకైతే ముందెప్పుడూ రాలేదు, ఇప్పుడు వచ్చింది, ఇలా జరిగింది - కానీ దృఢ సంకల్పము ఉన్నవారికి విజయము నిశ్చితంగా ఉంటుంది. దృఢత్వానికి ఫలితము సఫలత. సఫలత లేకపోవడానికి కారణము దృఢత్వములో లోపము. కావున దృఢత్వము నిండిన సఫలతను ప్రాప్తి చేసుకోవలసిందే.
డబల్ విదేశీయులు నంబర్ వన్ అయిపోండి. డబల్ కదా, డబల్ విదేశీయులు కదా, మరి అద్భుతము చేసి చూపండి. ఎంత మంది విదేశాల నుండి వచ్చారు? (90 దేశాల నుండి 300 సెంటర్లవారు వచ్చారు) మరి 90 అద్భుతాలు చేస్తారు కదా? 90 దేశాల నుండి డబల్ విదేశీయులు ఉన్నారు, మరో 10 జత చేరితే 100 అయిపోతాయి. మరి చేస్తారా? ఎవరైతే వచ్చారో, ఏమి జరిగినా కానీ, చేసి చూపించాల్సిందే. ఇంతటి దృఢత్వము ఉందా లేక చూస్తాము, ప్రయత్నిస్తాము... అని అనుకుంటారా? ప్రయత్నిస్తాము అని అనేవారు ఎవరైనా ఉన్నారా? ప్రయత్నంవారు చేతులెత్తండి. ఎవ్వరూ లేరు. అయితే ఇందుకు అభినందనలు, చప్పట్లు కొట్టండి. దాదీలు ఎక్కడ ఉన్నారు? పక్కాగా ఉందా? అచ్ఛా. ఎందుకంటే డబల్ విదేశీయుల నేచర్ మరియు సంస్కారము గురించి ఉన్న గాయనము ఏమిటంటే ఏదైతే ఆలోచిస్తారో ఇది చెయ్యాలి అని అది చేసే వదులుతారు. డబల్ విదేశీయుల నేచర్ గురించి ఇటువంటి గాయనము ఉంది. ఇప్పుడు ఈ నేచర్‌ను ఈ కార్యములో పెట్టండి. సరేనా! చేసి చూపించాల్సిందే. ఏమి జరిగినా కానీ! సహనశక్తి యొక్క వరదానమును విశేషంగా తీసుకు వెళ్ళండి. కానీ బాప్‌దాదా ఎప్పటికప్పుడు పిల్లల ఒక దృశ్యమును చూసారు. పిల్లల దృశ్యాలను బాబా చూస్తూ ఉంటారు కదా, మరి ఏమి చూసారు? పిల్లలు ఎంతో బాగా సహనం చేసారు, బాప్‌దాదా వాహ్! వాహ్! చేసారు. చాలా బాగుంది, చాలా బాగుంది అంటూ చూస్తున్నారు, కానీ తర్వాత ఏమి జరిగింది, సహనం చేసారు, పాస్ అయ్యారు కానీ చివర్లో ఇముడ్చుకునే శక్తి లేని కారణంగా, ఇముడ్చుకోలేకపోయారు కదా, అప్పుడు ఇక్కడ అక్కడ వర్ణిస్తారు, ఇముడ్చుకునే శక్తి లేదు, సహనం చేసే శక్తి ఉంది, మంచి పాత్రను వహించారు, కానీ ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉన్న కారణంగా ఇలా జరిగింది, ఇలా జరిగింది అని వర్ణించిన కారణంగా పోగొట్టుకున్నారు కదా. కావున ఇలా చెయ్యకండి. బాప్‌దాదా పిల్లల ఎన్నో దృశ్యాలను చూస్తారు, ముందు చప్పట్లు కొడ్తారు తర్వాత మౌనంగా ఉండిపోతారు, ఇలా చెయ్యకండి. సహనశక్తి, ఇముడ్చుకునే శక్తి, సర్వ శక్తులు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. అందుకే బాబాను సర్వశక్తిమంతుడు అని అంటారు, శక్తిమంతుడు అని అనరు. మీ టైటిల్ కూడా మాస్టర్ సర్వశక్తిమంతులు అనే కదా ఉన్నది, మాస్టర్ శక్తిమంతులు అని కాదు కదా? సర్వశక్తిమంతులు కదా? సర్వశక్తులకు ఒకదానితో మరొక దానికి కనెక్షన్ ఉంది కావున ఈ అటెన్షన్‌ను ఉంచండి. అచ్ఛా.
డబల్ విదేశీయులు తమ తమ స్థానాలలో వృద్ధి చేస్తున్నందుకు బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. ప్రాక్టికల్‌గా దయా హృదయము, మర్సీఫుల్ పాత్రను బాగా నిర్వహిస్తున్నారు. బాప్‌దాదా వద్దకు సమాచారము అయితే వస్తూ ఉంటుంది. బాప్‌దాదా ఇప్పుడు కూడా విన్నారు, ఆఫ్రికా మరియు రష్యాలో మిగిలి ఉన్న స్థానాలలో సందేశాన్ని ఇస్తున్నారు. భారతదేశంలో ప్రతివర్గంవారు మంచి ధైర్యము మరియు ఉల్లాసంతో తమ తమ వర్గం తరఫున మర్సీఫుల్గా అయి ఆత్మలకు సందేశమును ఇచ్చే, పరిచయమును ఇచ్చి సంబంధంలోకి తీసుకువచ్చే కార్యమును మంచి ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. ఇందుకు కూడా బాప్‌దాదా అభినందనలు ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి, ఫర్వాలేదు. ఇందుకు చప్పట్లు కొట్టినట్లుగా ఇప్పుడు 6 నెలలు బాప్‌దాదా ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ ప్రారంభం అయ్యేదే ఉంది. మరి 6 నెలలు, ఎక్కువ సమయము ఇస్తున్నాము. ఎలా అయితే సేవను ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారో అలాగే స్వయానికి కూడా స్వయం పట్ల సేవ, స్వ సేవ మరియు విశ్వ సేవ. స్వ సేవ అనగా స్వయాన్ని పరిశీలించుకుని స్వయాన్ని బాబా సమానంగా చేసుకోవడము. ఎటువంటి లోపము, బలహీనతనైనా బాబాకు ఇచ్చేయండి, ఎందుకు పెట్టుకుంటున్నారు, బాబాకు మంచిగా అనిపించడం లేదు. ఎందుకని బలహీనతను పెట్టుకుంటున్నారు? ఇచ్చేయండి. ఇచ్చే సమయంలో చిన్న పిల్లలుగా అయిపోండి. ఎలా అయితే చిన్న పిల్లలు ఏదైనా వస్తువును సంభాళించడం రాకపోయినా, ఏ వస్తువు అయినా నచ్చకపోయినా ఏమి చేస్తారు? మమ్మీ, నాన్న ఇదుగో తీసుకోండి అంటారు. అలాగే ఏ విధమైన భారము, బంధనము మీకు నచ్చనివి ఇచ్చేయండి. ఎందుకంటే బాప్‌దాదా చూసారు, మంచిది కాదు, ఇది సరి కాదు అని ఒక వైపు అనుకుంటూనే మరో వైపు దానిని సంభాళించి పెట్టుకుంటున్నారు. మరి దీనిని ఏమని అనాలి? మంచిదా? మంచిది కాదు కదా? మరి మీరు ఎలా కావాలి? ఎంతో మంచిగా కావాలి కదా! మంచిగా కూడా కాదు, ఎంతో మంచిగా కావాలి. మరి ఇటువంటి విషయము ఏమున్నా కానీ, బాప్‌దాదా హజూర్ హాజర్ ఉన్నారు. వారికి ఇచ్చేయండి. ఒకవేళ తిరిగి మీ వద్దకు వస్తే తండ్రి ఆస్తిగా భావించి మళ్ళీ ఇచ్చేయండి. తండ్రి ఆస్తిలో కల్తీ చెయ్యకూడదు. ఎందుకంటే మీరైతే ఇచ్చేసారు, మరి అది బాబా వస్తువు అయిపోయింది. బాబా వస్తువు లేక ఇతరుల వస్తువు మీవద్దకు పొరపాటున వస్తే మీరు అల్మారీలో పెట్టుకుంటారా? పెట్టుకుంటారా? తీసేస్తారు కదా. ఎలా అయినా చేసి ఇచ్చేస్తారు, మీ వద్ద పెట్టుకోరు. సంభాళించి పెట్టుకోరు కదా. మరి ఇచ్చేయండి. బాబా తీసుకోవడానికి వచ్చారు. మీ దగ్గర ఇవ్వడానికి మరింకేమీ లేదు. కానీ ఇదైతే ఇవ్వగలరు కదా. జిల్లేడు పువ్వులు ఉన్నాయి, అవి ఇచ్చేయండి. సంభాళించి పెట్టుకోవడం మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు ఎలా అయితే ఉల్లాసంతో సేవ చేస్తున్నారో, రష్యా సమాచారము విన్నాము, ఆఫ్రికా సమాచారమునూ విన్నాము, ఇతరుల సమాచారమునూ వింటూ ఉంటాము. ఇప్పుడు స్వసేవ పట్ల విశేషంగా సమయాన్ని ఇవ్వండి. ఇప్పుడు చూసారు కదా, బాప్‌దాదా ఎంత సమయము నుండి రెండు మాటలు మాటిమాటికీ రివైజ్ చేయిస్తున్నారు, ఆ రెండు మాటలు ఏమిటి? అకస్మాత్తు మరియు ఎవరెడీ. గుర్తుంది కదా. గుర్తుందా? మీ అతి మంచి చంద్రమణి దాదీ అకస్మాత్తుగా వెళ్ళారు కదా, గుర్తుందా? అప్పటినుండి, ఎంత సమయము అయింది (10 సంవత్సరాలు). ఆ తర్వాత ఎంతమంది అకస్మాత్తుగా వెళ్ళారు? మీ దాదీ ఎలా వెళ్ళారు? అకస్మాత్తుగా వెళ్ళారు కదా. అచ్ఛా, దాదీపై ప్రేమ ఉంది, మరి ఈ అకస్మాత్తు అనే పాఠాన్ని దాదీను గుర్తు చేసుకుని గుర్తు పెట్టుకోండి. ఎలా అయితే దాదీ తమ లక్ష్యాన్ని పూర్తి చేసి వెళ్ళారో, అలాగే వెళ్ళిపోలేదు. వారికి సర్టిఫికేటు లభించింది, కర్మాతీతము, కర్మేంద్రియాలు తమ ఆకర్షణలో బంధించలేదు, సాక్షిగా అయి కర్మేంద్రియాలు శీతలంగా అవుతూ వచ్చాయి, అవుతూ వచ్చాయి. ఆకర్షణ లాగలేదు, కర్మేంద్రియాలు లాగలేదు, ఏ ఆత్మ యొక్క మోహము లాగలేదు. నిర్మోహి, నష్టోమోహి, లేకపోతే కొంతమంది వెళుతూ వెళుతూ గుర్తు చేసుకుంటారు, ఫలానా, ఫలానా, ఫలానా... కానీ దాదీ నష్టోమోహ స్మృతి స్వరూపంలో వెళ్ళారు, కర్మేంద్రియజీత్గా అయి వెళ్ళారు. ఏ కర్మేంద్రియము దుఃఖము యొక్క అలతో లాగలేదు. మరి దాదీ అని అంటారు కదా, గుర్తు వస్తున్నారు కదా, రావాల్సిందే ఎందుకంటే నంబర్ వన్ కదా. మరి వన్ నంబర్ విన్ అయ్యారు కదా. కానీ ఎప్పుడు దాదీ గుర్తుకు వచ్చినా కేవలం చిత్రం చూడడం కాదు నేను ఎవరెడీగా ఉన్నానా అని గుర్తు తెచ్చుకోండి. నాకు కూడా అకస్మాత్తు అనే పాఠము గుర్తుకు ఉందా? ఇప్పుడిప్పుడే నేను కూడా అకస్మాత్తుగా వెళ్ళిపోతే నష్టోమోహ, ప్రకృతిజీత్గా ఉన్నానా? దాదీ యొక్క ఈ బహుమతిని అందరూ దగ్గర పెట్టుకోండి. అర్థమయిందా. అచ్ఛా.
నలు వైపుల నుండి వచ్చిన ఉత్తరాలు, సందేశాలు, ఈ-మెయిళ్ళు బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. అందరూ తమ ప్రియస్మృతులను, స్వయం రాలేకపోయినా ఉత్తరాల ద్వారా, ఈ-మెయిల్ ద్వారా పంపారు. బాప్‌దాదా హృదయపూర్వక ప్రేమ నిండిన ఒక్కొక్క ఉత్తరాన్ని, సందేశాన్ని, బహుమతులను స్వీకరించారు మరియు ప్రతి ఒక్కరినీ బాప్‌దాదా తమ నయనాలలో ఇమర్జ్ చేసుకుని, ప్రేమకు రెస్పాన్సును ప్రియస్మృతుల రూపంలో ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ పురుషార్థంలో ఎంతో సహయోగమును ఇస్తుంది. మరి ప్రతి ఒక్కరూ ప్రియమైనవారు, ప్రియమైనవారిగా ఉంటారు మరియు ప్రేమ అనే ఊయలలో ఊగుతూ బాప్‌దాదాతో పాటు తమ ఇంటికి వెళ్తారు. అందరూ కలిసి వెళ్ళే ఆ సమయము కూడా వస్తుంది. తోడుగా వచ్చేవారేకదా. వెనుక వెనుక రావద్దు. మజా ఉండదు. చేతిలో చెయ్యి, తోడులో తోడు - ఇందులోనే మజా ఉంది. చేయి శ్రీమతము. శ్రీమతము బుద్ధిలో ఉంటుంది, ఆత్మ పరమాత్మతో ఉంటుంది మరియు ఇంటికి వెళ్తాము. అందరూ వస్తారు కదా, ఉండిపోకండి. ఇప్పుడు కూడా తోడుగా ఉన్నారు, ఏ మూలన ఉన్నా కానీ తండ్రి తోడుగా ఉన్నారు, తోడుగా వస్తారు మరియు బ్రహ్మాబాబాతో పాటు రాజ్యం చేస్తారు. పక్కాగా ప్రతిజ్ఞ చేసారు కదా. మధ్యలో ఉండిపోకండి. కస్టమ్స్ వస్తువు ఏదైనా ఉంటే ఆగిపోవాల్సి వస్తుంది. రావణుడి వస్తువు కస్టమ్స్ అయిపోయింది కదా. ఎటువంటి రావణుని సంస్కారము, స్వభావము అయినా ధర్మరాజపురి కస్టమ్స్‌లో ఇరికిస్తుంది. అందరూ బాబాతో వెళ్ళిపోతారు, కానీ ఒకవేళ ఎవరి వద్ద అయినా ఏమైనా ఉంటే కస్టమ్స్ దగ్గర ఆగాల్సి ఉంటుంది, మంచిగా అనిపిస్తుందా? బాగుండదు కదా? బాబాకు కూడా మంచిగా అనిపించదు. తోడుగా ఉంటాము అన్న ప్రతిజ్ఞ ఉన్నప్పుడు, మరి సదా తోడుగా ఉండాలి. వెనుక ఉన్నవారు పక్కాగా ప్రతిజ్ఞ చేసారు కదా. వెనుక ఉన్నవారు చేతులెత్తండి. పక్కాగా ప్రతిజ్ఞ చేసారా? అచ్ఛా, మంచిది. ఎవరు వచ్చినా, ఎక్కడ నుండి వచ్చినా, ఎప్పుడూ తోడును వదలకండి. ప్రతి సమయము తండ్రి మరియు మీరు, ఎంత మజా వస్తుంది. బాబా మరియు మీరు, మజాగా ఉంది కదా. టీచర్లు, ఇందులో మజా ఉంది కదా. లేక అప్పుడప్పుడూ వేరువేరుగా ఉంటే మంచిగా ఉంటుందా? బాగుంటుందా? తండ్రి తోడును వదిలేస్తారా? వదలకండి, పక్కానా? ఒక్క క్షణము కూడా వదలద్దు. దీనినే సత్యమైన ప్రేమ అని అంటారు. సరేనా? పక్కా, పక్కా, పక్కా. మీ ఫోటో తీస్తున్నారు, వతనంలో మీ ఫోటో వస్తుంది. ఈ కెమరాలో అయితే రాదు, వతనంలో వస్తుంది, చాలా మంచిది.
నలువైపుల బాప్‌దాదా హృదయమునకు నచ్చిన పిల్లలందరికీ, హృదయాభిరాముడు కదా, మరి హృదయాభిరాముడి హృదయమునకు నచ్చిన పిల్లలు, ప్రేమ యొక్క అనుభవాలలో సదా ఊగుతూ ఉండే పిల్లలు, ఒక్క బాబా మరెవ్వరూ లేరు, స్వప్నంలో కూడా మరెవ్వరూ లేరు, బాప్‌దాదాకు అతి ప్రియమైన పిల్లలు, అతి దేహభానము నుండి అతీతులు, ముద్దుల పిల్లలు, పదమాపదమ భాగ్యశాలి పిల్లలకు హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు పదమ - పదమారెట్లు ఆశీర్వాదాలు. దీనితోపాటు బాలకులు సో యజమానులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క నమస్తే.
ఆఫ్రికాలోని 28 దేశాల నుండి మొదటిసారి వచ్చిన సోదర సోదరీలతో:- చాలా బాగుంది. ఆఫ్రికాకు నిమిత్తమైనవారు ఎక్కడ ఉన్నారు! చూడండి, మీరు ఎంత భాగ్యశాలురో, స్వయంగా భగవంతుడు మిమ్మల్ని గుర్తు చేసారు మరియు ఎవరో ఒకరితో సందేశాన్ని పంపించారు. మరి తమ భాగ్యమును చూసి సంతోషపడుతున్నారు కదా! మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తున్నారు, ఎందుకంటే బ్రాహ్మణ పరివారంలో వృద్ధి జరిగింది కదా. పరివారంలో సంఖ్య పెరిగితే సంతోషం ఉంటుంది కదా. మరి అందరూ చూడండి మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు.
ఇతర దేశాల నుండి మొదటిసారి వచ్చినవారు లేవండి:- అభినందనలు, అభినందనలు, అభినందనలు.
దాదీలతో:- ప్రియమైన దాదీలు కదా. దాదీలైనా లేక తోడుగా ఉండేవారైనా కానీ ప్రియమైనవారు. (దాదీ జానకితో) కూర్చోండి. ఇప్పుడైతే సీట్‌పై సెట్ అయ్యారు కదా. బాప్‌దాదా నిమిత్తం చేసారు. ఈ బిడ్డను (గుల్జార్ దాదీకు) కూడా నిమిత్తం చెయ్యడం జరిగింది, ఇద్దరూ ముగ్గురూ కలిసి ఎంతో చక్కగా స్వ పురుషార్థము మరియు విశ్వ సేవలో మరింతగా విధితో సిద్ధిని ప్రాప్తించజేసేందుకు నిమిత్తమవుతారు. వారి రిద్ధి సిద్ధి అయితే అల్పకాలికమైనది, మీది అయితే విధితో సిద్ధి. విధితో సిద్ధి అని అనడానికి బదులు వారు రిద్ధి సిద్ధి అనేసారు. (బాప్‌దాదా దాదీ జానకి తలపై చెయ్యి పెట్టారు) సరేనా. అందరూ కలిసి చేస్తారు, అందరూ కలిసి సంగఠనను ఉల్లాస ఉత్సాహములోకి తీసుకు వస్తారు. వీరు నిమిత్తములో మొదటి నంబరు, వీరు రెండవ నంబరు, వీరు మూడవ నంబరు అని చెప్పడం జరుగుతుంది కానీ అందరూ సేవా సహచరులు. ఒకరికొకరు ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చుకుని ముందుకు వెళ్తారు. దాదీ సంకల్పము ఏదైతే ఉందో తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అని, దాదీ కూడా బటన్ చేతిలో తీసుకున్నారు కానీ దానిని ఆన్ చేసేది మీరే కదా. మీరే ఆన్ చేస్తారు కదా. మరి అందరూ కలిసి, ఎవరైతే నిమిత్తమయ్యారో, అందరూ కలిసి పరస్పరం సలహా తీసుకుని, ఎందుకంటే సంగఠన శక్తి ఎంతో త్వరగా సహజంగా కార్యమును పూర్తి చేస్తుంది. హా జీ, హా జీ అంటూ విశ్వాన్ని తమ చరణాల వద్ద హా జీ చేసుకోండి. సంగఠన అయితే మంచిగా ఉంది కదా. ప్రతి ఒక్కరి విశేషత ఉంది, విశేషతలను మీరు పరస్పరం వర్ణన కూడా చేస్తారు. క్లాస్ చేస్తారు కదా విశేషతల గురించి. విశేషమైనవారు, విశేషతలు చూడండి, విశేషతలు ఇవ్వండి. విశేష కార్యమును చెయ్యడానికి విశేషతలను చూడండి, విశేషతలతో ఒకరికొకరు సహయోగం చేసుకోండి. అచ్ఛా, (దాదీ జానకితో) భారీగా లేరు కదా. భారీగా లేరు కదా! (భారీగా ఉండే తెలివే లేదు) తెలివి లేదు, ఇదే మంచిది. ఈ బిడ్డ (గుల్జార్ దాదీ) కూడా మీకు తోడుగా ఉంటారు, వీరందరూ మీకు తోడుగా ఉంటారు. (పర్దాదీ కూడా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుంది) అచ్ఛా, సంతోషంగా ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. (బాగా పాటలు పాడుతారు) దాదీ కూడా పాటలు పాడేవారు కదా. చిన్ననాటి స్నేహితులు కదా. (మనోహర్ దాదీతో) బాగున్నారా. వీరి విశేషత ఏమిటంటే సాకార బాబా సమయంలో అన్ని వైపుల తిరిగి సేవ చెయ్యడంలో నంబర్ వన్ వీరు. తిరిగి రండి, తిరిగి రండి అని బాప్‌దాదా చెబితే వీరు నంబర్ వన్‌గా తయారయ్యేవారు. ఇప్పుడు కూడా నంబర్ వన్, క్లాస్ చేయించడంలో నంబర్ వన్, సంగఠనలో చేరుకోవడంలో, ప్రతి కార్యంలో నంబర్ వన్. (ఇప్పుడు ఎక్కువగా శాంతిగా ఉంటున్నారు) ఇప్పుడు బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి, అనారోగ్యాన్ని కాదు, బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి. (కిడ్నీలో స్టోన్ వచ్చింది) ఈరోజుల్లో ఈ రోగాలు సాధారణమైపోయాయి, కూర్చుని కూర్చుని కూడా వస్తున్నాయి. నిద్రపోతూ, కూర్చుంటూ కూడా వస్తున్నాయి. నిద్రపోవద్దు, కూర్చోవద్దు, తిరుగుతూ ఉండండి.
విదేశాల ముఖ్యమైన పెద్దక్కయ్యలతో:- మంచి ఫారెన్ గ్రూపు వచ్చింది. ఫారెన్‌లో కూడా ఇండియా సోదరీలు నిమిత్తమైనందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఇండియా ఫారెన్‌కు అందమును తీసుకువచ్చింది. కానీ ఇండియావారిమి అని కాక విశ్వానికి చెందినవారిమి అని అనుకుంటారు కాబట్టే సేవ అవుతుంది. ఒకవేళ ఇండియా యొక్క భానము ఉన్నట్లయితే సేవ జరిగుండేది కాదు, కానీ ఫారెన్‌కు వెళ్ళగానే విశ్వ సేవ యొక్క లక్ష్యాన్ని పెట్టుకుని మంచిగా చేసారు. అనంతంలోకి వెళ్ళారు, హద్దులోకి కాదు. అందుకే బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. అక్కడవారిని కూడా తీసుకుని ముందుకు వెళ్తారు కాబట్టి వారు కూడా స్వయాన్ని ముందు ఉన్నట్లుగా భావిస్తారు. మరి సంగఠన కూడా బాగుంది, పరస్పరం ఇచ్చుపుచ్చుకోవడం కూడా బాగా చేస్తారు, బాగుంది, బాప్‌దాదాకు నచ్చింది. సర్టిఫికేటు బాగుంది. పూర్తి విశ్వము ఎంతగా గుర్తు చేస్తుంది. ఇతర స్థానాల వైపు వెళ్ళాలి అన్న లక్ష్యము బాగుంది. ఒక దేశం నుండి మరో దేశానికి, మధ్యమధ్యలో వెళ్తూ ఉంటారు, ఈ రిఫ్రెష్మెంట్ చాలా అవసరము. చిన్న అక్కయ్య అయినా కానీ వారు దూరం నుండి వచ్చి క్లాస్ చేస్తే ఛేంజ్ ఉంటుంది కాబట్టి అందరికీ మంచిగా అనిపిస్తుంది. పెద్దవారు ఉన్నప్పటికీ చిన్నవారు అప్పుడప్పుడూ క్లాస్ చేయిస్తే అందంగా ఉంటుంది. అందుకే ఇతర స్థానాలకు వెళ్ళాలి అనే సిస్టమ్ బాగుంది. మరి మంచిగా జరుగుతుంది కదా. బాగుంది (ఈసారి మరింకేదైనా నవీనత రావాలి) (జర్మనీలో బుక్ ఫెయిర్ చాలా బాగా జరిగింది) రోజురోజుకీ అనుభవీగా అవుతున్నారు కదా, అనుభవం కూడా ఉపయోగపడుతుంది. మంచిది. మంచిగా నడిపిస్తున్నారు. అచ్ఛా.
ఓంశాంతి