Search for a command to run...
31 Oct 2007
తమ శ్రేష్ఠ స్వమానపు నషాలో ఉండి అసంభవమును సంభవము చేస్తూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి
31 October 2007 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న తమ శ్రేష్ఠ స్వమానధారీ విశేష పిల్లలను చూస్తున్నారు. పిల్లలైన ప్రతి ఒక్కరి స్వమానము ఎంత విశేషమైనదంటే అటువంటి విశేషత విశ్వములోని ఏ ఆత్మకూ లేదు. మీరందరూ విశ్వ ఆత్మలకు పూర్వజులు మరియు పూజ్యులు కూడా. మొత్తము సృష్టిరూపి వృక్ష పునాదికి మీరు ఆధారమూర్తులు. విశ్వమంతటికీ పూర్వజులు, మొదటి రచన. చిన్న పిల్లవాడైనా, వృద్ధ మాత అయినా, ప్రవృత్తి వారైనా కానీ పిల్లల ప్రతి ఒక్కరి విశేషతను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరికి వారి-వారి విశేషతలు ఉన్నాయి. ఈరోజుల్లో ఎంత పెద్ద సైన్సు వారైనా, ప్రపంచపు లెక్కలో విశేషమైన వారైనా, ప్రకృతిజీతులుగా అయితే అయ్యారు కదా. చంద్రుని వరకు కూడా చేరుకున్నారు కానీ ఇంత చిన్నని జ్యోతి స్వరూప ఆత్మను గురించి తెలుసుకోలేకపోయారు. మరి ఇక్కడైతే చిన్న పిల్లవాడు కూడా నేను ఆత్మను, జ్యోతి బిందువును అని తెలుసుకుంటాడు. నేను ఆత్మను అని నషాతో అంటాడు. ఎంత పెద్ద మహాత్మలైనాగానీ ఏమంటారు? బ్రాహ్మణ మాతలేమో, మేము పరమాత్ముని పొందామని గర్వముతో అంటారు. పొందారు కదా! మరి మహాత్మలు ఏమంటారు? పరమాత్ముని పొందటము చాలా కష్టమని అంటారు. మేము ప్రవృత్తిలో ఉంటూ, కలసి ఉంటూ పవిత్రంగా ఉంటాము ఎందుకంటే మా మధ్య తండ్రి ఉన్నారు అని ప్రవృత్తిలో ఉన్నవారు ఛాలెంజ్ చేస్తారు. కావుననే ఇద్దరూ కలసి ఉంటూ కూడా పవిత్రంగా ఉండగలుగుతున్నారు ఎందుకంటే పవిత్రత మన స్వధర్మము. పర ధర్మము కష్టమనిపిస్తుంది, స్వ ధర్మము సహజమవుతుంది. లోకులు ఏమంటారు? నిప్పు మరియు దూది కలసి ఉండలేవు, చాలా కష్టము అని అంటారు. కానీ మీరందరూ ఏమంటారు? చాలా సహజము అంటారు. మొదట్లో మీ అందరిది ఒక గీతము ఉండేది - ఎంత పెద్ద ధనవంతులైనాగానీ, యజమానులైనాగానీ ఒక్క శివబాబాను తెలుసుకోలేదు. చిన్ని బిందువైన ఆత్మను గురించి తెలుసుకోలేదు కానీ పిల్లలైన మీరందరూ తెలుసుకున్నారు, పొందారు. అసంభవము సంభవమైందని ఎంతో నిశ్చయము మరియు గర్వముతో అంటారు. బాప్‌దాదా కూడా విజయి రత్నాలైన పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి సంతోషిస్తారు ఎందుకంటే ధైర్యము పిల్లలది, సహాయము తండ్రిది. కనుకనే ప్రపంచము వారికి అసంభవమైన విషయము మీకొరకు సహజము మరియు సంభవమైపోయింది. మేము పరమాత్మునికి డైరెక్టు పిల్లలము అని ఫఖుర్ (శుద్ధమైన గర్వము) ఉంటుంది. ఈ నషా కారణంగా, నిశ్చయము కారణంగా, పరమాత్ముని పిల్లలైన కారణంగా మాయనుంచి కూడా రక్షింపబడ్డారు. పిల్లలుగా కావటము అనగా సహజంగానే రక్షింపబడటము. మీరు పిల్లలు కావున అన్ని విఘ్నాలనుండి, సమస్యలనుండి రక్షింపబడ్డారు.
మరి మీ యొక్క, ఇంతటి శ్రేష్ఠ స్వమానమును తెలుసుకున్నారు కదా! ఎందుకని సహజము? ఎందుకంటే మీరు సైలెన్సు శక్తి ద్వారా పరివర్తన శక్తిని కార్యములో వినియోగిస్తారు. నెగిటివ్‌ను పాజిటివ్‌లోకి పరివర్తన చేసేస్తారు. మాయ ఎంత పెద్ద సమస్య రూపంలో వచ్చినా కానీ మీరు పరివర్తన శక్తి ద్వారా, సైలెన్సు శక్తి ద్వారా సమస్యను సమాధాన స్వరూపముగా చేసేస్తారు. కారణమును నివారణ రూపంలోకి మార్చేస్తారు. ఇంత శక్తి ఉంది కదా, కోర్సు కూడా చేయిస్తారు కదా! నెగిటివ్‌ను పాజిటివ్‌గా చేసే విధిని నేర్పిస్తారు. ఈ పరివర్తన శక్తి తండ్రి ద్వారా వారసత్వముగా లభించింది. ఒక్క శక్తి కాదు, సర్వ శక్తులూ పరమాత్మ వారసత్వంగా లభించాయి, అందుకనే బాప్‌దాదా అంటారు, ప్రతిరోజూ మురళిని వింటారు కదా! మరి ప్రతిరోజూ బాప్‌దాదా ఇదే అంటారు - తండ్రిని స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. తండ్రి స్మృతి కూడా ఎందుకని సహజంగానే వస్తుంది? వారసత్వ ప్రాప్తిని గుర్తు చేసుకున్నప్పుడు ప్రాప్తి కారణంగా తండ్రి స్మృతి సహజంగా వచ్చేస్తుంది. పిల్లలైన ప్రతి ఒక్కరికీ ఈ ఆత్మిక ఫఖుర్ ఉంటుంది, మనస్సులో పాటను పాడుతారు - పొందాల్సింది పొందేసాము. ప్రతి ఒక్కరి హృదయములో ఈ పాట స్వతహాగానే మ్రోగుతుంది కదా! ఫఖుర్ ఉంది కదా! ఎంతగా ఈ ఫఖుర్లో ఉంటారో, ఫఖుర్కు గుర్తు - బేఫికర్‌గా (నిశ్చింతగా) ఉండటము. ఒకవేళ సంకల్పములోగానీ, మాటలోగానీ లేక సంబంధ-సంపర్కములోగానీ ఏవిధమైనటువంటి ఫికర్ (చింత) ఉన్నా ఫఖుర్ (శుద్ధమైన గర్వము) ఉండదు. బాప్‌దాదా అయితే నిశ్చింత చక్రవర్తులుగా చేసారు. చెప్పండి, నిశ్చింత చక్రవర్తులేనా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులో వారు చేతులెత్తండి. నిశ్చింతులకు అప్పుడప్పుడు చింత వస్తుందా? మంచిది. తండ్రి నిశ్చింతులైనప్పుడు, పిల్లలకు ఏ చింత ఉంటుంది!
అన్ని చింతలను మరియు అన్ని రకాల భారాలను బాప్‌దాదాకు ఇచ్చేయమని బాప్‌దాదా అయితే చెప్పి ఉన్నారు. తండ్రి సాగరుడు కదా! కాబట్టి భారము అంతా ఇమిడిపోతుంది. బాప్‌దాదా అప్పుడప్పుడు పిల్లల ఒక గీతాన్ని విని చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఏ పాటనో తెలుసా? ఏమి చేయాలి, ఎలా చేయాలి... అప్పుడప్పుడు పాడుతుంటారు. బాప్‌దాదా వింటూ ఉంటారు. కానీ బాప్‌దాదా పిల్లలందరికీ ఇదే చెప్తారు - ఓ నా మధురమైన పిల్లలూ, ముద్దు బిడ్డలూ - సాక్షీ దృష్ట స్థితి అనే సీటుపై సెట్ అవ్వండి, సీటుపై సెట్ అయ్యి ఆటను చూడండి, చాలా మజా వస్తుంది, వాహ్! త్రికాలదర్శి స్థితిలో స్థితి అవ్వండి. సీటునుంచి క్రిందకు వస్తారు కనుకనే అప్సెట్ అవుతారు. సెట్ అయినట్లయితే అప్సెట్ కారు. ఈ మూడు విషయాలు పిల్లలను వ్యాకులపరుస్తాయి. ఏ మూడు విషయాలు? - చంచలమైన మనస్సు, భ్రమిస్తున్న బుద్ధి మరియు పాత సంస్కారాలు. పిల్లల ఒక విషయాన్ని వింటుంటే బాప్‌దాదాకు నవ్వు వస్తుంటుంది, అది ఏ విషయమో తెలుసా? పిల్లలు ఇలా అంటుంటారు - ఏం చెయ్యాలి బాబా, ఇది నా పాత సంస్కారం కదా! బాప్‌దాదా నవ్వుతారు. నా సంస్కారము అని చెప్తూనే ఉన్నారు, మరి నాదిగా చేసుకున్నారా? ఎప్పుడైతే పాత సంస్కారాన్ని నాదిగా చేసుకున్నారో, మరి నాది అన్నది చోటు చేసుకుంది కదా. నా సంస్కారము అని బ్రాహ్మణ ఆత్మ అనగలదా? నాది-నాది అని అన్నట్లయితే నాది అనేది తన చోటును ఏర్పరుచుకుంటుంది. బ్రాహ్మణులైన మీరు నాది అని అనజాలరు. ఇది గత జీవితపు సంస్కారము. శూద్ర జీవిత సంస్కారము. బ్రాహ్మణ జీవితముది కాదు. కావున నాది-నాది అన్నట్లయితే అది కూడా నా అధికారము అని కూర్చుంటుంది. బ్రాహ్మణ జీవితపు శ్రేష్ఠ సంస్కారము గురించి తెలుసుకదా! మీరు దేనినైతే పాతది అని అంటున్నారో ఆ సంస్కారము కూడా పాతది కాదు, శ్రేష్ఠ ఆత్మలైన మీ అతి పాతదైన సంస్కారము అనాది మరియు ఆది సంస్కారము. ఇదైతే మధ్యలోని, ద్వాపరములోని సంస్కారము. కావున మధ్యలోని సంస్కారమును సమాప్తము చేసెయ్యాలి, తండ్రి సహాయము కారణంగా ఎటువంటి కష్టమూ ఉండదు. కానీ ఏం జరుగుతుంది? బాబా కంబైండ్‌గా ఉన్నారు, కంబైండ్ అన్నదానికి అర్థమే అవసరమైన సమయంలో సహయోగి కానీ సరైన సమయంలో సహయోగము తీసుకోని కారణంగా మధ్యలో వచ్చిన సంస్కారము పెద్దదిగా అయిపోతుంది.
పిల్లలందరూ తండ్రి ప్రేమకు పాత్రులు, అధికారులు అని బాప్‌దాదాకు తెలుసు. ప్రేమ కారణంగానే అందరూ చేరుకున్నారని బాబాకు తెలుసు. విదేశమునుంచి వచ్చినాగానీ, దేశమునుంచి వచ్చినాగానీ, అందరూ పరమాత్ముని ప్రేమ యొక్క ఆకర్షణతో తమ ఇంటికి చేరుకున్నారు. ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారని బాప్‌దాదాకు తెలుసు. విదేశమునుంచి ప్రేమ అనే విమానంలో చేరుకున్నారు. చెప్పండి, అందరూ ప్రేమ అనే దారంలో బంధింపబడి ఇక్కడకు చేరుకున్నారు కదా! ఈ పరమాత్ముని ప్రేమ మనసుకు ప్రశాంతతను ఇచ్చేటువంటిది. అచ్ఛా - ఎవరైతే మొదటిసారి ఇక్కడకు వచ్చారో వారు చేతులెత్తండి. చేతులు ఊపండి. వచ్చారు, మంచిది.
బాప్‌దాదా హోమ్‌వర్కును ఇచ్చారు, హోమ్‌వర్కు గుర్తుందా? గుర్తుందా? చాలావైపులనుంచి బాప్‌దాదా వద్దకు రిజల్టు వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? అందరి రిజల్టు అయితే రాలేదు. కొందరిది కొంత శాతంలో కూడా వచ్చింది. బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారు? బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - అందరూ పూజ్యనీయ ఆత్మలు. పూజ్యనీయ ఆత్మల విశేషమైన లక్షణము ఆశీర్వాదములను ఇవ్వటమే. మీరందరూ పూజ్యనీయ ఆత్మలని మీకందరికీ తెలుసు, కావున ఆశీర్వాదములను ఇవ్వటము, ఆశీర్వాదములను ఇవ్వటము అనగా ఆశీర్వాదములను తీసుకోవటమని అర్థమైపోతుంది. ఎవరైతే ఆశీర్వాదములను ఇస్తారో, ఎవరికైతే ఇస్తారో వారి మనసునుంచి మాటిమాటికీ ఇచ్చేవారి కొరకు ఆశీర్వాదము వెలువడుతూ ఉంటుంది. కావున పూజ్య ఆత్మలైన మీ నిజ సంస్కారము - ఆశీర్వాదములను ఇవ్వటము. ఆశీర్వాదములను ఇవ్వటము అనాది సంస్కారము. మీ జడమైన చిత్రాలే ఆశీర్వాదములను ఇస్తున్నప్పుడు చైతన్య పూజ్య ఆత్మలు ఆశీర్వాదములను ఇవ్వటము, ఇదైతే సహజ సంస్కారము. ఇటువంటి సంస్కారమును నా సంస్కారము అని అనండి. మధ్యలో ద్వాపరములోని సంస్కారము సహజమైపోయింది. నేచర్ అయిపోయింది. వాస్తవానికి ఈ సంస్కారము ఆశీర్వాదములను ఇచ్చే నేచురల్ నేచర్. ఎవరికైనా ఆశీర్వాదములను ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎంతగా సంతోషిస్తుంది, ఆ సంతోషపు వాయుమండలము ఎంత సుఖదాయిగా ఉంటుంది! కావున ఎవరైతే చేసారో వారందరికీ, వారు ఇక్కడకు వచ్చినా, రాకపోయినా కానీ, వారందరూ బాప్‌దాదా ఎదురుగా ఉన్నారు. మరి వారందరికీ బాప్‌దాదా అభినందనలను ఇస్తున్నారు. చేసారు, మరియు తమ నేచురల్ నేచర్‌ను తయారుచేసుకుంటూ ఇకముందు కూడా చేస్తూ, చేయిస్తూ ఉండండి. మరి ఎవరైతే కొద్దిగా చేసినా కూడా, చెయ్యకపోయినా వారు సదా తమను - నేను పూజ్య ఆత్మను, నేను తండ్రి శ్రీమతంపై నడిచే విశేష ఆత్మను అని భావించండి, ఈ స్మృతిని మాటిమాటికీ మీ స్మృతి మరియు స్వరూపములోకి తీసుకురండి ఎందుకంటే ప్రతి ఒక్కరినీ నువ్వు ఏమి అవుతావు అని అడిగినప్పుడు నేను లక్ష్మీ నారాయణునిగా అవుతానని అంటారు. సీతారాముల విషయంలో ఎవ్వరూ చేతులెత్తరు. 16 కళలు కలిగినవారిగా అవ్వాలనే లక్ష్యమున్నప్పుడు, 16 కళలు అనగా పరమ పూజ్యులు, పూజ్య ఆత్మల కర్తవ్యమే ఆశీర్వాదములను ఇవ్వటము. ఈ సంస్కారాన్ని నడుస్తూ, తిరుగుతూ సహజంగా మరియు సదాకాలము కొరకు తయారుచేసుకోండి. ఉన్నదే పూజ్యులుగా, 16 కళలవారిగా. లక్ష్యమైతే ఇదే కదా!
ఎవరైతే చేసారో, వారు వారి మస్తకముపై తండ్రి ద్వారా విజయ తిలకాన్ని దిద్దుకున్నారని బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అలాగే సేవా సమాచారము కూడా అన్ని వైపులనుంచి, వర్గాలనుంచి, సెంటర్లనుంచి చాలా మంచి రిజల్టుతో బాప్‌దాదా వద్దకు చేరుకుంది. కావున హోమ్‌వర్కు చేసినందుకు అభినందనలు మరియు దీనితోపాటు సేవను గురించి కూడా అభినందనలు. పదమ-పదమగుణ అభినందనలు. గ్రామ-గ్రామాలలో సందేశాన్ని ఇచ్చే సేవ చాలా మంచి రీతిలో చాలా ఎక్కువ చోట్ల జరగటం బాబా చూసారు, కావున ఈ సేవ కూడా దయాహృదయులై, సేవలో ఉల్లాస-ఉత్సాహాలలో ఫలితం కూడా మంచిగా కనిపిస్తుంది. ఎవరైతే కష్టమనుకోకుండా, తండ్రిపై ప్రేమ అంటే సందేశమును ఇవ్వటముపై ప్రేమ, మరి ప్రేమగా సేవ చేసారు కావున బాబానుంచి కూడా పదమా పదమగుణ ప్రేమ రిటర్నుగా సేవాధారులందరికీ స్వతహాగానే ప్రాప్తించింది. దీనితో పాటు అందరూ తమ ప్రియమైన దాదీని చాలా స్నేహముతో గుర్తు చేస్తూ, దాదీకి ప్రేమకు రిటర్నును ఇస్తున్నారు, ఈ ప్రేమ సుగంధము బాప్‌దాదా వద్దకు చాలా మంచిరీతిలో చేరుకుంది. మధువనములో ఇప్పుడు కూడా ఏదైతే కార్యము జరుగుతూ ఉందో, అది విదేశీయులదైనా, భారతదేశముదైనా ఆ అన్ని కార్యములూ పరస్పర సహయోగము, గౌరవముల ఆధారంతో చాలా మంచిగా సఫలమయ్యాయి మరియు ముందు జరిగే కార్యాలు కూడా సఫలమయ్యేదే ఉంది ఎందుకంటే సఫలత మీ మెడలోని హారము. బాబా మెడలోని హారం కూడా, మీరు ఎప్పుడూ హార్ కావద్దు (ఓడిపోవద్దు), ఎందుకంటే మీరు బాబా మెడలోని హారము అని బాబా గుర్తు తెప్పిస్తారు. కావున మెడలోని హారము ఎప్పుడూ హార్ (ఓడిపోదు) కాజాలదు. మరి హారంగా అవ్వాలా లేక హార్ (ఓడిపోవాలా)గా అవ్వాలా? ఓడిపోకూడదు కదా! హారముగా అవ్వటము మంచిది కదా! కావున ఎప్పుడూ హార్ కావద్దు. ఓడిపోయేవారు అయితే అనేక కోట్ల ఆత్మలు ఉన్నాయి, కానీ మీరు హారంగా అయ్యి మెడలోకి వచ్చేవారు. అటువంటివారే కదా! కావున సంకల్పము చెయ్యండి, తండ్రి ప్రేమలో, ఎంత పెద్ద తుఫానును మాయ ఎదురుగా తీసుకువచ్చినా కానీ మాస్టర్ సర్వశక్తిమంతులైన ఆత్మల ముందు తుఫాను కూడా తోఫాగా (కానుక) అయిపోతుంది. ఎంత పెద్ద పర్వతమైనా కానీ, పర్వతము మారిపోయి దూదిలా అయిపోతుంది. ఇప్పుడు సమయ సమీపత ప్రమాణంగా వరదానాలను ప్రతి సమయము అనుభవములోకి తీసుకురండి. అనుభవము యొక్క అథారిటీలుగా అవ్వండి.
ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరులుగా అయ్యే, ఫరిశ్తా స్వరూపులుగా అయ్యే ఎక్సర్‌సైజును చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, ఇప్పుడిప్పుడే ఫరిశ్తాలు, ఇప్పుడిప్పుడే అశరీరులు, నడుస్తూ తిరుగుతూ, కార్య వ్యవహారములు చేసుకుంటూ కూడా ఒక్క నిమిషము, రెండు నిమిషాలను కేటాయిస్తూ అభ్యాసము చెయ్యండి. ఏ సంకల్పమునైతే చేస్తున్నానో ఆ స్వరూపమును అనుభవము చేసుకుంటున్నానా అని పరిశీలించుకోండి. అచ్ఛా!
నలువైపుల కల సదా శ్రేష్ఠ స్వమానధారులు, సదా స్వయమును పరమపూజ్య మరియు పూర్వజులుగా అనుభవము చేసేవారు, సదా తమను ప్రతి సబ్జెక్టులో అనుభవి స్వరూపులుగా తయారుచేసుకునేవారు, సదా తండ్రి హృదయ సింహాసనాధికారులు, భృకుటి సింహాసనాధికారులు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవములో స్థితి అయ్యేవారు, నలువైపుల గల పిల్లలందరికీ ప్రియస్మృతులు మరియు నమస్తే.
అన్నివైపులనుంచి అందరి ఉత్తరాలు, ఈ-మెయిల్స్, సమాచారములన్నీ బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి, సేవ యొక్క ఫలము మరియు బలము సేవాధారులందరికీ లభించింది మరియు లభిస్తూ ఉంటుంది. ప్రేమ పత్రాలుకూడా చాలా వస్తాయి, పరివర్తన పత్రాలుకూడా చాలా వస్తాయి. పరివర్తన శక్తి కలిగినవారికి బాప్‌దాదా అమరభవ వరదానమును ఇస్తున్నారు. సేవాధారులకు ఎవరైతే శ్రీమతాన్ని బాగా ఫాలో చేసారో, అలా ఫాలో చేసే పిల్లలకు బాప్‌దాదా సదా ఆజ్ఞాకారి పిల్లలు, వాహ్! అనే వరదానమును ఇస్తున్నారు మరియు ప్రేమ కలిగిన పిల్లలకు చాలా-చాలా ప్రేమతో హృదయములో ఇమిడిపోయే అతి ప్రియమైనవారు మరియు మాయ విఘ్నాలనుంచి అతి అతీతంగా ఉండేవారు, ఇటువంటి వరదానమును ఇస్తున్నారు. అచ్ఛా!
సేవ టర్ను - కర్ణాటక జోన్ వారిది:- (అందరి చేతులలో చిన్న చిన్న జెండాలు ఉన్నాయి) అందరూ జెండాలను చాలా బాగా ఊపుతున్నారు, మంచిది. కర్ణాటక వారు స్వర్ణిమ కర్ణాటక లాంటి చాలా మంచి ప్రోగ్రామును చేసారు కదా. భిన్న-భిన్న స్థానాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని బాప్‌దాదా కూడా చూసారు, విన్నారు కూడా మరియు మెజారిటీ వారు చాలా మంచి ఉల్లాస-ఉత్సాహాలతో ప్రతి గ్రామానికి బాప్‌దాదా సందేశమును చేర్చారు. అందుకని బాప్‌దాదా కర్ణాటక సేవాధారులకు సేవ కొరకు మరియు శ్రీమతాన్ని పాలన చేసినందుకు చాలా-చాలా అభినందనలను ఇస్తున్నారు, అభినందనలు, అభినందనలు. మంచిది, ఎవరైతే సేవ అవకాశాన్ని తీసుకున్నారో వారు కూడా సంతుష్టులయ్యారు మరియు ఇతరులనూ సంతుష్టంగా చేసారు, దీనిమూలంగా తమ జమ ఖాతాను చాలా మంచిగా జమ చేసుకున్నారు. కర్ణాటక వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు, సంఖ్య ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఏవిధంగా అయితే అందరూ సంగఠిత రూపంలో కలిసి నిర్విఘ్న సేవ యొక్క రికార్డును చూపించారో, అలాగే ఇకముందు కూడా కర్ణాటక సంగఠిత రూపంలో చాలా అద్భుతాన్ని చెయ్యగలదు. బాప్‌దాదా వద్ద మ్యాప్ ఉంది, అద్భుతాన్ని చెయ్యగలరు. కావున సంగఠిత రూపములోని సత్తాను చూపించాలి. ఇప్పుడు బాగా చేసారు. పరివారమంతా కర్ణాటకను చూసి సంతోషిస్తుంది. అచ్ఛా - బాప్‌దాదా కర్ణాటక వారికి పని ఇచ్చారు, గుర్తుందా. ఏం పని ఇచ్చారు! వారస క్వాలిటీ వారిని వెలికితీసే పని, గుర్తుందా? సేవలో అయితే నంబరును తీసుకున్నారు, మంచిది, నంబరు వన్‌లోకి వచ్చేంతగా వారసులను వెలికితీయండి. నిమిత్తులైన వారైతే ఉన్నారు, క్రొత్త క్రొత్త వారిని వెలికితీయండి. బాప్‌దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. మీకు కూడా సంతోషము, తండ్రికి కూడా సంతోషము. తండ్రిని చూసి మీరు ఎంతగా సంతోషిస్తారో, అంతకన్నా ఎక్కువగా పిల్లలను చూసి తండ్రి సంతోషిస్తారు. (కర్ణాటక వారు మొదటనుంచీ మంచి మంచి వారసులను వెలికితీసారు) ఇప్పుడు ఇంకా వెలికితీయండి. వారు మంచి మంచి వారసులను వెలికితీసారు. కానీ నంబర్‌వన్ వారసుని తీసుకురావటంలో ఇప్పుడు నంబర్‌వన్‌గా అవ్వండి. మొదటివారు అయితే ఉండనే ఉన్నారు, ధైర్యము ఉందా? టీచర్లకు ధైర్యము ఉందా? చేయి ఎత్తండి, ధైర్యము ఉందా? అందరిలో ధైర్యము ఉంది, చాలా ధైర్యము ఉంది. కావున తండ్రిది కూడా చాలా-చాలా సహాయము ఉంటుంది. మంచిది. సేవ కూడా మంచిగా చేసారు, మొదటి టర్న్ లభించింది. ఫస్ట్ టర్నులో అన్ని విషయాలలో ఫాస్ట్ (వేగము), తీవ్ర పురుషార్థులు. అచ్ఛా - అందరూ చాలా ప్రేమతో సేవ చేసారు. అలసట అయితే లేదు కదా? అలసిపోలేదు కదా? అలసిపోనివారిగా అయ్యి సేవ చేసారు. అచ్ఛా.
డబల్ విదేశీయులు, 60 దేశాలనుంచి 600 మంది వచ్చారు:- విదేశాలలో కూడా సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు ఎక్కువవుతూ ఉన్నాయని బాప్‌దాదా చూసారు. విదేశాలలో స్టూడెంటును తయారుచేయటం చాలా కష్టమైనదని మొదట అనేవారు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కష్టమా లేక సహజమా? సహజమా? వారు పరస్పరము కలుసుకుని నిర్విఘ్నంగా అయ్యేందుకు ప్లానును తయారు చేసారు మరియు నిర్విఘ్నంగా అయ్యే ప్లానును చాలా బాగా విధి పూర్వకంగా నిర్విఘ్నంగా తయారు చేసినందుకు బాప్‌దాదాకు చాలా మంచిగా అనిపించింది. ఇందుకు చాలా-చాలా అభినందనలు, పదమగుణ అభినందనలు. ఏ ఏ ప్రోగ్రాములనైతే చేసారో అవి బాగా సఫలమవుతున్నాయి. కావున సదా సఫలత యొక్క అభినందనలు మరియు సదా అభినందనకు పాత్రులుగా ఉంటారు. సేవ యొక్క ప్రత్యక్ష ఫలమును చూసి బాప్‌దాదాకు సంతోషము కలుగుతుంది. వీరు సమయము యొక్క పిలుపుతో వచ్చారు కదా! ఎవరైతే సమయము యొక్క పిలుపులో వచ్చారో వారు చేతులెత్తండి. అచ్ఛా. చాలా మంచి పని చేసారు. చాలా చతురులు, మొదటనే చేరుకున్నారు. బాగా చేసారు. తండ్రికి కూడా చాలా ప్రియమైనవారు. మీకు కూడా తండ్రిపై చాలా ప్రేమ ఉంది కనుకనే చేరుకున్నారు. అందుకొరకు బ్రాహ్మణ పరివారము వైపునుంచి, బాబా వైపునుంచి కూడా మీకు ఒక్కొక్కరికీ పదమాగుణ అభినందనలు, అభినందనలు, అభినందనలు. మంచిది, వీరందరూ ఫారెన్ సేవ కొరకు మైకులుగా మరియు పిల్లలుగా రెండు పాత్రలనూ పోషిస్తారు. పిల్లల పాత్రను కూడా పోషిస్తారు, మైకు మరియు లైటుగా అయ్యి సేవలో ఇంకా వృద్ధిని ప్రాప్తింపచేస్తారు. కావున బ్రాహ్మణులందరి తరఫునుంచి, తండ్రి తరఫునుంచి మీ అందరికీ అభినందనలు. మంచిది. ఈ ఈశ్వరీయ జ్ఞాన ప్రచారం ఇప్పుడు విదేశములో కూడా నిమిత్తులుగా అయ్యి చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఈ ధ్వని వ్యాపిస్తుంది, మంచి రీతిలో వ్యాపిస్తుంది మరియు డ్రామానుసారంగా ఇప్పుడు మీ అందరి మరియు బాబాకు ప్రియమైన దాదీ నిమిత్తంగా కూడా నలువైపుల బ్రాహ్మణ పరివారపు తండ్రి పేరు బాగా ప్రత్యక్షమైపోయింది. దాదీ పేరును ప్రత్యక్షము చేసారు. రెండు విషయాలు ఉంటాయి -పేరు మరియు పని. దాదీ పేరును చాలా బాగా వ్యాపింపచేసారు, ఆ ఆత్మలను ఇప్పుడు తమవారిగా చేసుకొనే పని మీది. ప్రతి సంవత్సరమూ వృద్ధిని చేస్తూ బాబా ముందుకు తీసుకురావటాన్ని బాప్‌దాదా అయితే చూసారు, ఇలా ఇకముందు కూడా బాగా వృద్ధి చేస్తూ ఉంటారు. తండ్రి మరియు తమ ప్రత్యక్షతను చేస్తూ ఉంటారు. మంచి గ్రూపు. అందరూ నిశ్చయ బుద్ధితో, ఈశ్వరీయ నషాలో ఉండేవారు, ఎగిరేవారు. నడిచేవారిగా అవ్వవద్దు, ఎగిరేవారు. నడిచేవారు సమయానికి చేరుకోలేరు, ఎగిరేవారిగా అవ్వండి. డబల్ లైట్. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఏదైతే చేసారో అది సఫలమైంది. మరి మీరందరూ ఎవరు? సఫలతా సితారలు. మంచిది. చాలా మంచిది.
పొలిటీషియన్లు, మహిళ మరియు సెక్యూరిటీ-మూడు వర్గాలు వచ్చాయి:- అందరూ ఎంత ఉల్లాస-ఉత్సాహాలతో వర్గ సేవను చేస్తున్నారో చూడండి. మూడు వర్గాల రిజల్టు బాగుంది. గవర్నమెంటులో కూడా ధ్వని మంచిగా వ్యాపిస్తుంది. సేవ చేసారు కనుకనే ధ్వని వ్యాపిస్తూ ఉంది. కావున మీ వర్గాలు మంచి ప్లానును తయారుచేసి తండ్రి ప్రత్యక్షత జెండాను బాగా వ్యాపింపచేస్తున్నారు. మొదట్లో అయితే చాలా కష్టం మీద వచ్చేవారు ఇప్పుడైతే మేము కూడా రావాలనుకుంటున్నామని వారే స్వయంగా అంటున్నారు. తేడా ఉంది కదా. మీ ఈ కార్యము చాలా బాగా సఫలమవుతుందని ఇప్పుడు వారే స్వయంగా అంటున్నారు. కావున ఇప్పుడు కళ్ళు తెరుచుకోవటం మొదలైంది. నెమ్మది-నెమ్మదిగా కళ్ళు తెరుచుకుంటాయి. అన్ని వర్గాలయితే తమ తమ వర్గాలలో సేవను చాలా మంచిగా చేస్తున్నారు. మహిళా వర్గము వారు కూడా చేస్తున్నారు, సెక్యూరిటీ వర్గము వారు కూడా చేస్తున్నారు, పొలిటీషియన్ల వర్గము వారు కూడా చేస్తున్నారు. రోజురోజుకూ వర్గ ప్రమాణంగా సేవ చేసే ఉల్లాస-ఉత్సాహాలు ఎక్కువవటము బాప్‌దాదా చూసారు. రావద్దని జనాలను ఆపాల్సి వస్తుంది. మొదట్లో అయితే తీసుకు వచ్చేందుకు కష్టపడాల్సి వచ్చేది, ఇప్పుడైతే ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. క్వాంటిటీ మరియు క్వాలిటీ రెండు రకాలవారు వస్తున్నారు. క్వాలిటీ వారు కూడా రావటము మొదలైంది, ఇందుకొరకు మూడు వర్గాల సేవాధారులకు బాప్‌దాదా వైపునుంచి మరియు బ్రాహ్మణ పరివారము వైపునుంచి అభినందనలు, అభినందనలు, అభినందనలు. మీ దాదీ అయితే అన్ని వర్గాల సేవ వృద్ధి కొరకు అంటు కట్టి ఉన్నారు. దాదీ కూడా మీ అందరికీ చాలా స్మృతిని ఇస్తున్నారు. వారి మనస్సు సంగమములో, తనువు అడ్వాన్సు పార్టీవైపు ఉంది. అచ్ఛా!
ట్రైనింగు టీచర్లు మరియు ఇండోర్, నడియాద్ హాస్టల్ కుమారీలు:- (బాబానే మా ప్రపంచము అన్న బ్యానర్‌ను చూపిస్తున్నారు) మంచిది, స్లోగన్‌ను అయితే చాలా బాగా వ్రాసారు, అలాగే ప్రతిరోజూ అమృతవేళ ఈ స్లోగన్‌ను గుర్తు తెచ్చుకోండి, కుమారీలందరూ, ఇండోర్ వారైనా, మధువనములోని ట్రైనింగు వారైనా, నడియాద్ వారైనా కానీ కుమారీలందరూ అమృతవేళ ఈ స్లోగన్‌ను గుర్తు చేసుకోవాలి ఎందుకంటే బాబానే మన ప్రపంచము అన్నప్పుడు ఆకర్షణలన్నీ, మనసులోని ప్రేమంతా ఎక్కడకు వెళ్తుంది? బాబాలోకి. నయనాలలో సదా ఎవరు కనిపిస్తారు? బాబా. నోటినుంచి సదా ఏం వెలువడుతుంది? బాబా. ముఖములో సదా బాబా నషా కనిపిస్తుంటుంది. సంబంధ-సంపర్కాలలో సదా బాబాతోటి సర్వ సంబంధాలు జోడింపబడి ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? నో ప్రాబ్లమ్ (సమస్య లేదు). దాదీ యొక్క రెండు మాటలు గుర్తున్నాయా? నిర్విఘ్నము మరియు నిర్వికల్పము అని దాదీ మాటిమాటికీ చెప్తుండేవారు. మరి దాదీ అంటే ప్రేమ ఉంది కదా, కుమారీలందరికీ దాదీపై ప్రేమ ఉంది. చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉంటుంది కాబట్టి వారి మాటలు, వారి శబ్దములు సదా చెవులలో మ్రోగుతూ ఉంటాయి. కావున సదా బుద్ధిలో, చెవులలో నిర్విఘ్నంగా మరియు నిర్వికల్పంగా అవ్వాల్సిందే అన్న శబ్దము వస్తూ ఉండాలి. అలా తయారవుతారు కదా. అవుతారు, అవుతారు, తప్పక అవుతారు. ఎందుకంటే బాప్‌దాదాకు కుమారీల వైపు చాలా అటెన్షన్ ఉంటుంది మరియు కుమారీలు చాలా అదృష్టవంతులు కూడా. కుమారీలు చాలా త్వరగా దాదీలుగా అయిపోతారని సోదరులు, పాండవ సైన్యం ఎవరైతే ఉన్నారో వారు నవ్వుతూ అంటుంటారు. పాండవులనైతే దాదా అని అనరు. సోదరుడు అని అంటారు. మరి చూడండి, మీ అదృష్టము ఎంత శ్రేష్ఠమైనదో. రావటంతోనే అదృష్టము లభించేస్తుంది. బాప్‌దాదా యొక్క, గురువు యొక్క సింహాసనము లభించేస్తుంది. ఈ మురళి సింహాసనము గురువు సింహాసనము. కనుకనే బాప్‌దాదా టీచర్లను గురుభాయి (సహపాఠి) అని అంటారు. మరి గురుభాయిలని గుర్తుంచుకోండి. గురువు సింహాసనము లభించింది. మంచిది. ఈ ట్రైనింగు అనే పద్ధతిని ఏదైతే పెట్టారో దానిద్వారా మంచి రిజల్టు వెలువడుతుంది. కానీ మీరందరూ మీ చార్టును మీరే మధువనమునకు పంపుతూ ఉండండి. కేవలం ఓ.కే. అని వ్రాయండి, చాలు. ఎక్కువ వ్రాయవద్దు. ఒకవేళ మరేదైనా కారణమున్నా లేక ఏదో ఒక బలహీనత ఉన్నా ఓ.కే మధ్యలో గీత గీయండి. పెద్ద ఉత్తరాన్ని వ్రాయవద్దు, ఈమాత్రం చాలు. మంచిది. టీచర్లు కూడా మంచి శ్రమను చేస్తున్నారు. శ్రమను అందరూ చేస్తున్నారు. స్థూలమైన సేవ చేసేవారు కూడా చాలా శ్రమ చేస్తున్నారు. ఇప్పుడు ఒక విషయము యొక్క ఆవశ్యకత ఉంది, వినిపించమంటారా? సేవలో, కార్యములో ప్రతి డిపార్టుమెంటు, ప్రతి వర్గము, ప్రతి సెంటరు, ప్రతి జోనులో సేవ పెరుగుతూ ఉంది. కానీ ఏకత మరియు ఎకానమీల ఆవశ్యకత ఇప్పుడు ఉంది. ఈ రెండు విషయాలు- గౌరవాన్ని ఇవ్వటము మరియు గౌరవాన్ని తీసుకోవటము. కావున ఏకత, ప్రతి ఒక్కరి సహయోగమనే వ్రేలు అయితే ఉండనే ఉంది. మహారథులదైనాగానీ, తక్కువ పురుషార్థీలదైనాగానీ ప్రతి ఒక్కరి సహయోగమైతే ఉంది. ఒకవేళ కర్మణా సేవ చేసేవారి సహయోగము లభించనట్లయితే మీరు సేవ ఎలా చేస్తారు, సమయానికి ఎలా బయలుదేర్తారు, సమయానికి సేవ ఎలా చేస్తారు, అంతే కదా. ప్రతి ఒక్కరూ విశేషమైనవారు. గౌరవమునకు అధికారులు కావున చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరికీ గౌరవమును ఇవ్వండి మరియు గౌరవమును తీసుకోండి. రెండు మాటలను గుర్తుంచుకోండి - ఏకత మరియు ఎకానమీ. మిగిలినదంతా బాగుంది (ట్రైనింగు చేయించే టీచర్లతో) చాలా మంచిది. ఉల్లాస-ఉత్సాహములో తీసుకువచ్చారు. అందుకు అభినందనలు. అచ్ఛా. ప్రతి ఒక్కరినీ చూస్తూ, ఒక్కొక్కరి విశేషతలను చూస్తూ బాప్‌దాదా చాలా సంతోషిస్తున్నారు.
కర్ణాటక మాతలు:- మాతలు బాగున్నారా? మాతలు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. కర్ణాటక మాతలు లేవండి. మంచిది. మాతల సంఖ్య అయితే బాగుంది. ఇప్పుడు కర్ణాటక మాతలు ఏ అద్భుతాన్ని చూపిస్తారు? ఏదైనా క్రొత్త అద్భుతాన్ని చూపించండి. సేవనైతే చేస్తున్నారు కానీ ఇప్పుడు ఎవరైనా క్రొత్త మాతలు తమ నడవడికను చూపించాలి, మాతలకు బాప్‌దాదా వరదానము ఉంది - ఏ సెంటరులో అయితే మాతలు ఎక్కువగా ఉంటారో, సెంటరులో సేవ చేస్తుంటారో, అక్కడి భండారా (వంట ఇల్లు) మరియు భండారీ (ఖజానా) రెండూ నిండుగా ఉంటాయి. సంపాదించకపోయినా మనసు అయితే పెద్దది. మాతల మహిమనైతే బాప్‌దాదా కూడా చేస్తారు, మొట్టమొదటినుంచి కూడా, సేవాకేంద్రాలను తెరిచినప్పటినుంచి కూడా మాతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎప్పుడు కూడా భండారా ఖాళీ అవ్వదు, భండారీ ఖాళీ అవ్వదు. మాతలు పాలనను చేసేవారు కదా! కావున కొత్త కొత్త ఆత్మల పాలన చాలా మంచిగా ఉంటుంది. అచ్ఛా.
కర్ణాటక పాండవులు:- అచ్ఛా, ప్రతి సెంటరులో పాండవుల ఆవశ్యకత కూడా ఉంది ఎందుకంటే పాండవులు ఆల్‌రౌండ్ సేవలో సహాయకులుగా అవుతారు. కష్టమైన పనిలో అయినా గానీ, లోపల బయట సందేశమును వ్యాపింపచేయటంలో అయినాగానీ పాండవులు మంచి సహాయకులుగా అవుతారు మరియు పాండవులు సెంటరును నడిపించటము మరియు దానిని వృద్ధి చేయటంలో కూడా నిమిత్తులుగా అవుతారు. పాండవులు కూడా తక్కువేమీ కాదు. అందుకని మీకు గుర్తు ఉంది, పాండవులు మరియు శక్తుల ఇద్దరి ఆవశ్యకత ఉంది, దీనికి చతుర్భుజుడిని చూపించటం జరిగింది. చతుర్భుజుని రూపంలో ఒక్కరు లేరు, ఇద్దరూ కలిసి ఉన్నారు. మాతలు పాండవులకంటే ముందు ఉన్నారు మరియు పాండవులు మాతలకంటే ముందు ఉన్నారు. కర్ణాటకలో పాండవలు కూడా తక్కువ లేరు, మాతలు కూడా తక్కువగా లేరు, మంచిది కదా. జానకి బిడ్డ చెప్పారు కదా, కర్ణాటకలో మొదట్లో చాలా మంది వారసులు వెలువడ్డారు, ఇది రైటు. ఇప్పుడు వారు అటువంటి వారసులను తయారుచెయ్యాలి, సరేనా. ఉల్లాసము ఉంది కదా. మరి ఎంతమంది వారసులు వెలువడ్డారన్నది వచ్చే సంవత్సరము రిజల్టు చెప్తారు కదా, రిజల్టు చెప్పాలి తరువాత బాప్‌దాదా పిలుస్తారు. మొదట రిజల్టును చూస్తారు. వర్గం వారు కూడా మొదట లిస్టును తీయండి, ఫారెన్వారు కూడా అలాగే, క్రొత్త క్రొత్త వారసులను వెలికితీయండి, దాని లిస్టును వచ్చే సంవత్సరము తీసుకురండి, అప్పుడు బాప్‌దాదా పిలుస్తారు, టీచర్లూ, సరేనా.
టీచర్లందరూ లేచి నిలబడండి:- టీచర్లు కూడా తక్కువగా లేరు. బాప్‌దాదా టీచర్లందరినీ గురుభాయిగా (సహపాఠిగా) చూస్తారు. గురుభాయి అనగా బాబా సమానము. కావున విశేషంగా టీచర్లు ప్రతి కర్మనూ తండ్రి సమానంగా చేయాల్సిందే. చేస్తాము కాదు, చేయాల్సిందే ఎందుకంటే టీచర్లు తండ్రివైపునుంచి స్టూడెంట్ల ముందు ఒక నిమిత్త సాకార రూపంలో తండ్రి సమానులు. టీచర్ల ప్రతి కర్మ స్టూడెంట్ల ముందు బాబా సమానంగా కనిపించాలి. వీరైతే తండ్రిని అనుసరిస్తూ బాబా సమానంగా అయ్యారు అని ప్రతి ఒక్కరి నోటినుంచి వెలువడాలి. మరి అటువంటి లక్ష్యము ఉంది కదా. ఇదే లక్ష్యము కదా. తల ఊపండి. టీచర్లు నిమిత్తులు, మరి టీచర్లపైన బాధ్యత కూడా ఉంటుంది కదా. చేస్తున్నారు కానీ ఇంకా ముందుకు చెయ్యాలి. లక్ష్యము చాలా మంచిది. తండ్రి సమానంగా అవ్వవలసిందే అన్న శుభ భావనను తండ్రి ప్రతి టీచరుపైనా ఉంచుతారు. మరింకేమి చేస్తారు? తండ్రి సమానంగా అయ్యేందుకు ఇంకేదన్నా దారి ఉందా, మరింకే దారీ లేదు. అందుకనే చూడండి, బాబాయే ప్రపంచమని వీరు స్లోగన్‌ను తయారు చేసారు కదా. బాగా తయారు చేసారు. కానీ వస్త్రముపై కాదు, మసస్సులో ఉండిపోవాలి. టీచర్లు మంచివారు. సంగఠన అయితే చాలా బాగా ఉంది, ఇప్పుడు అద్భుతమును చేసి చూపించారు కదా, అలా అద్భుతమును చేస్తారు. స్వర్ణిమ కర్ణాటక యొక్క మంచి సత్తాను చూపించారు, మంచిది. ఇలా ముందు కూడా అద్భుతాన్ని చూపిస్తారు. తండ్రి యొక్క శుభ భావన ఉంది, సరేనా. అచ్ఛా!
ఇప్పుడు అందరి హృదయాలలో ఎటువంటి ఉల్లాసము వస్తుంది? తండ్రి సమానంగా అవ్వాల్సిందే అన్న ఒకే ఉల్లాసము ఉంది. ఇటువంటి ఉల్లాసము ఉందా? పాండవులూ, చేతులెత్తండి, అవ్వాల్సిందే. అవుతాములే, లే, లే అని అనవద్దు. చూద్దాములే, అవుతాములే, ఈ లే, లే అనవద్దు... కానీ అవ్వవలసిందే. పక్కా. పక్కా? అచ్ఛా. ప్రతి ఒక్కరూ తమ ఓ.కే. కార్డును తమ టీచర్లకు చార్టు రూపంలో ఇస్తూ ఉండండి. ఎక్కువ వ్రాయవద్దు, ఒక కార్డు తీసుకోండి అందులో ఓ.కే. అని వ్రాయండి లేదా లైను గీయండి, అంతే. ఇదైతే చెయ్యగలరు కదా. పెద్ద ఉత్తరం వద్దు. అచ్ఛా.
దాదీలతో:- (జానకి దాది బాప్‌దాదాను హత్తుకున్నారు). అందరూ పరస్పరంలో చేతులు కలపండి. చాలా మంచిది. (పర్దాదీ కలకత్తా వెళ్తున్నారు) కలకత్తాలో తిరగటానికి వెళ్తున్నారు.
మీరందరూ కూడా అందరికీ ధైర్యము, ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పించేందుకు నిమిత్తులుగా అయ్యి సేవను చేస్తూ ఉన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాలు సదా స్థిరంగా ఉండాలి, దీని ఆవశ్యకత ఇప్పుడు ఉంది. మరి ఇప్పుడు అందరికీ, ఎవరు మీ ముందుకు వచ్చినా, వారికి ఒక్క సెకండులో మీ దృష్టిద్వారా ధైర్యము, ఉల్లాస-ఉత్సాహాలు లభించాలి. ఎందుకంటే మీరందరూ మాస్టర్ దాతలు. ఎవరు వచ్చినా కానీ ఎంతో కొంత తీసుకు వెళ్ళాలి. అది స్నేహమైనాగానీ, సహయోగమైనాగానీ, ధైర్యమైనాగానీ, ఉల్లాసమైనాగానీ, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే మీరు దాత పిల్లలు. అందరి పని కూడా అయితే ఇదే ఉంది, ఎప్పుడైనా ఎవరినైనా కలిసినా, ఎవరైనా కలవటానికి వచ్చినా, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. దృష్టియొక్క స్నేహాన్ని తీసుకువెళ్ళాలి, మాట్లాడే ఆవశ్యకత కూడా ఉండదు, కానీ వచ్చిన వారు ఎలా వెళ్ళాలి? ఏదో కొంత తీసుకువెళ్ళాలి. క్షణకాలపు దృష్టితో కూడా చాలా తీసుకోగలరు. దృష్టి యొక్క ఆత్మికత లేక దృష్టిద్వారా మనస్సు యొక్క స్నేహాన్ని అయితే సెకండులో కూడా తీసుకోగలరు. ఇప్పుడు బ్రాహ్మణుల పరస్పర మిలనములో ఇది ఉండాలి. అప్పుడే మీ వాయుమండలము విశ్వములో స్నేహము, సహయోగము, ధైర్యమును వ్యాపింపచేస్తుంది. ఎవరైతే తమను బ్రహ్మా కుమారీ బ్రహ్మా కుమారులుగా భావిస్తున్నారో అటువంటి బ్రాహ్మణులు అందరూ ఇటువంటి సేవలో బిజీగా ఉండాలి. సమయం లభించటం లేదని కాదు, సెకండు అయితే లభించింది కదా, నిమిషం కూడా లభించింది కదా. నజర్ సే నిహాల్ (దృష్టితో తృప్తి చెందటము) అని గాయనము ఉంది. కావున ఇటువంటి సంగఠనలో అలను వ్యాపింపచేయండి, అప్పుడు సమయాన్ని ఇచ్చే ఆవశ్యకత కూడా ఉండదు. అచ్ఛా.
డబల్ విదేశీ టీచరు అక్కయ్యలతో:- మీరందరూ పరస్పరంలో కలిసి మంచి పాత్రను పోషించారు. అన్ని ప్రోగ్రాములూ చాలామంచిగా ఉన్నాయి. ఇదేవిధంగా ఒకరికొకరు సదా గౌరవమును ఇచ్చుకుంటూ, సహయోగమును ఇచ్చుకుంటూ కార్యమును సఫలము చెయ్యగలరు. సఫలతా వరదానమైతే ఉండనే ఉంది. నిమిత్తంగా అయినవారికైతే విశేషంగా బాప్దాదానుంచి అదనపు సహయోగము లభిస్తుంది. మరి అందరూ తమ-తమ పాత్రను మంచిగా పోషించారు. బాప్‌దాదా సంతోషించారు. మీ కార్యమును పూర్తి చేసారు, ఇప్పుడు ఉంటారో వెళ్తారో, అది మీపైన ఉంది. డ్యూటీ ఉన్నవారైతే ఆగుతారు. మంచి ధైర్యము మరియు డ్రామానుసారంగా మీరే నిమిత్తులుగా అయ్యారు ఎందుకంటే మీలో కంట్రోలింగ్ శక్తి ఉంది, నడిపించగలరు. మంచిది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
ఓంశాంతి