Search for a command to run...
31 Mar 2007
సుపుత్రులై తమ ముఖము ద్వారా బాబా ముఖమును చూపించాలి, నిర్మాణము(సేవ)తోపాటు నిర్మల వాణి, నిర్మాన స్థితి యొక్క బ్యాలెన్స్‌ను పెట్టుకోవాలి
31 March 2007 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపుల కల పిల్లల భాగ్యరేఖలను చూసి హర్షితులవుతున్నారు. పిల్లలందరి మస్తకములో మెరుస్తున్న జ్యోతి రేఖ ప్రకాశిస్తూ ఉంది. కన్నులలో ఆత్మికతకు చెందిన భాగ్య రేఖ కనిపిస్తుంది. నోటిలో శ్రేష్ఠ వాణికి చెందిన భాగ్యరేఖ కనిపిస్తుంది. పెదవులలో ఆత్మిక మందహాసము కనిపిస్తుంది. చేతులలో పరమాత్మ ఇచ్చిన సర్వ ఖజానాల రేఖ కనిపిస్తుంది. స్మృతిలో వేసే ప్రతి అడుగులో పదమాల రేఖ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి హృదయంలో బాబాపై ప్రేమలో లవలీనమయ్యే రేఖను చూస్తున్నాము. అటువంటి శ్రేష్ఠ భాగ్యమును పిల్లలు ప్రతి ఒక్కరు అనుభవము చేస్తున్నారు కదా! ఎందుకంటే ఈ భాగ్య రేఖలను స్వయంగా బాబానే ప్రతి ఒక్కరి శ్రేష్ఠ కర్మ అనే కలము ద్వారా గీసారు. అవినాశి అయిన ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము కేవలము ఈ జన్మ కొరకే కాదు, అనేక జన్మలకు అవినాశీ భాగ్య రేఖలు. అవినాశీ బాబా మరియు అవినాశీ భాగ్య రేఖలు. ఈ సమయములో శ్రేష్ఠ కర్మల ఆధారంతో సర్వ రేఖలు ప్రాప్తిస్తాయి. ఈ సమయములోని పురుషార్థము అనేక జన్మలకు ప్రాలబ్ధమును తయారుచేస్తుంది.
పిల్లలందరికీ అనేక జన్మలకు లభించనున్న ప్రాలబ్ధాన్ని బాప్‌దాదా, ఇప్పుడే, ఈ జన్మలోనే ఆ పురుషార్థము యొక్క ప్రాలబ్ధాన్ని చూడాలనుకుంటున్నారు. కేవలము భవిష్యత్తులోనే కాదు, ఇప్పుడు కూడా ఈ భాగ్యరేఖలన్నీ సదా అనుభవమవ్వాలి. ఎందుకంటే ఇప్పటి ఈ దివ్య సంస్కారమే మీ క్రొత్త ప్రపంచాన్ని తయారుచేస్తుంది. కనుక పరిశీలించుకోండి, పరిశీలించుకోవటం వస్తుంది కదా! స్వయానికి స్వయమే పరిశీలకులుగా అవ్వండి. సర్వ భాగ్యరేఖలు ఇప్పుడు కూడా అనుభవమవుతున్నాయా? ఈ ప్రాలబ్ధం అంతిమంలో కనిపిస్తుంది అని అనుకోవటం లేదు కదా? ప్రాప్తించేది ఇప్పుడే అయినప్పుడు అనుభవం కూడా ఇప్పుడే చేసుకోవాలి. భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాలు ఇప్పుడు ప్రత్యక్ష జీవితంలో అనుభవం అవ్వాలి. అయితే అందుకోసం ఏమి పరిశీలించుకోవాలి? భవిష్య ప్రపంచంలో ఒకే రాజ్యము ఉంటుంది అని భవిష్య ప్రపంచము యొక్క సంస్కారాల గాయనము చేస్తారు. ఆ ప్రపంచము గుర్తుంది కదా! ఎన్నిసార్లు ఆ ప్రపంచంలో రాజ్యం చేసారు? గుర్తుందా లేక గుర్తు తెప్పిస్తే గుర్తొస్తుందా? ఎలా ఉండేవారిమి అన్నది స్మృతిలో ఉంది కదా? కానీ ఆ సంస్కారము ఇప్పటి జీవితంలో ప్రత్యక్ష రూపంలో ఉందా? ఇలా చెక్ చేసుకోండి - ఇప్పుడు కూడా మనసులో, బుద్ధిలో, సంబంధ-సంపర్కములో, జీవితంలో ఒకే రాజ్యము ఉందా లేక అప్పుడప్పుడు ఆత్మ రాజ్యముతోపాటు మాయా రాజ్యమైతే లేదు కదా? భవిష్య ప్రాలబ్ధములో ఒకే రాజ్యము ఉంటుంది, రెండు ఉండవు. మరి ఇప్పుడు కూడా రెండు రాజ్యాలైతే లేవు కదా? భవిష్య రాజ్యములో ఒకే రాజ్యముతోపాటు ఒకే ధర్మము ఉంటుంది, ఆ ధర్మము ఏది? సంపూర్ణ పవిత్రతను ధారణ చేసే ధర్మము. కనుక పవిత్రత సంపూర్ణంగా ఉందా అన్నదానిని ఇప్పుడు చెక్ చేసుకోండి. స్వప్నములో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. పవిత్రత అనగా సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు సంబంధ-సంపర్కాలలో సంపూర్ణ పవిత్రతకు చెందిన ఒకే ధారణ ఉండటము. బ్రహ్మాచారులు. మీ చెకింగ్ చేసుకోవటం వచ్చా? ఎవరికైతే స్వయమును చెకింగ్ చేసుకోవటం వస్తుందో వారు చేతులెత్తండి. చెకింగ్ చేసుకోవటం వస్తుంది మరియు చేస్తారు కూడానా? చేస్తారు, చేస్తారా? టీచర్లకు వస్తుందా? డబల్ విదేశీయులకు వస్తుందా? ఎందుకు? ఇప్పటి పవిత్రత కారణంగానే మీ జడచిత్రాల నుండి కూడా పవిత్రతను కోరుకుంటారు. పవిత్రత అనే ఒకే ధర్మం ఇప్పుడు స్థాపన అయితేనే భవిష్యత్తులో కూడా ఒకే ధర్మం నడుస్తుంది. అలాగే భవిష్య ప్రపంచము గురించి ఇంకా ఏ గాయనము ఉంది? ఒకటే రాజ్యము, ఒకటే ధర్మము, అలాగే సదా సుఖ-శాంతులు, సంపద, అఖండ సుఖము, అఖండ శాంతి, అఖండ సంపద. అది విశ్వ రాజ్యము, ఇప్పటి మీ స్వరాజ్య జీవితంలో ఈ సమయంలో ఉన్నది స్వరాజ్యము. కనుక అవినాశి సుఖము, పరమాత్మ సుఖము, అవినాశిగా అనుభవము అవుతున్నాయా? ఏదైనా సాధనము లేక సౌకర్యం ఆధారంగా అయితే సుఖము అనుభవమవ్వటం లేదు కదా అన్నది చెక్ చేసుకోండి. ఎప్పుడూ ఏ కారణంగానైనా దుఃఖపు అల అనుభవములోకి రాకూడదు. ఏదైనా పేరు, ప్రతిష్ఠ, గౌరవముల ఆధారంపైనైతే సుఖము అనుభవమవ్వటం లేదు కదా? ఎందుకని? ఈ పేరు, ప్రతిష్ఠలు, గౌరవాలు, సాధనాలు, సౌకర్యాలు ఇవన్నీ స్వయమే వినాశీ అయినవి, అల్పకాలమునకు చెందినవి. కనుక వినాశి అయినవాటి ఆధారముతో అవినాశి సుఖము లభించదు. చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు కూడా వింటూ, చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇప్పటి సంస్కారాలు మరియు భవిష్య సంస్కారాల ప్రాలబ్ధములో ఎంత తేడా ఉంటుంది అన్నది తెలుస్తుంది! మీరందరూ జన్మించినప్పుడే బాప్‌దాదాతో ప్రమాణము చేసారు, ఆ ప్రమాణము గుర్తుందా లేక మర్చిపోయారా? మేమందరము బాబాకు సహచరులుగా అయ్యి, విశ్వ కళ్యాణకారులుగా అయ్యి నూతన సుఖ శాంతిమయ ప్రపంచమును తయారుచేసేవారిమి అని ప్రమాణము చేసారు. గుర్తుందా? మీరు చేసిన ప్రమాణము గుర్తుందా? గుర్తుంటే చేతులెత్తండి. పక్కా ప్రమాణమా లేక కాస్త గడబిడ అయిపోతుందా? నూతన ప్రపంచమును ఇప్పుడు పరమాత్మ సంస్కారాల ఆధారంతో తయారు చేసేవారు. కనుక ఇప్పుడు కేవలం పురుషార్థము చెయ్యటం కాదు కానీ పురుషార్థపు ప్రాలబ్ధమును కూడా ఇప్పుడు అనుభవము చెయ్యాలి, సుఖముతోపాటు శాంతిని కూడా చెక్ చేసుకోండి. అశాంతి పరిస్థితులు, అశాంతి వాయుమండలములో కూడా శాంతిసాగరుని పిల్లలైన మీరు సదా కమల పుష్ప సమానంగా అశాంతిని కూడా శాంతి వాయుమండలములోకి పరివర్తన చెయ్యగలరా? శాంతిగా ఉన్న వాయుమండలములో మీరు శాంతిని అనుభవము చెయ్యటము, అదేమంత పెద్ద విషయం కాదు, కానీ అశాంతిని శాంతి లోకి పరివర్తన చేసేవారము అన్నది మీ ప్రమాణము. కనుక చెక్ చేసుకోండి, చెక్ చేసుకుంటున్నారు కదా? పరివర్తకులు, పరవశులు కారు కదా? పరివర్తకులు. పరివర్తకులు ఎప్పుడూ పరవశులవ్వజాలరు. ఇదేవిధంగా సంపద, తరగని సంపద, స్వరాజ్య అధికారుల తరగని సంపద ఏది? జ్ఞానము, గుణము మరియు శక్తులు స్వరాజ్య అధికారుల సంపదలు. కనుక చెక్ చేసుకోండి. జ్ఞానము యొక్క మొత్తము విస్తారము యొక్క సారమును స్పష్టంగా తెలుసుకున్నారు కదా? కేవలము భాషణ చెయ్యటము, కోర్స్ చేయించటము, జ్ఞానమంటే అర్థం ఇదే కాదు. జ్ఞానమునకు అర్థము - వివేకము. మరి ప్రతి సంకల్పము, ప్రతి కర్మ, మాట అన్నీ జ్ఞానయుక్తంగా అనగా వివేకవంతులై, జ్ఞాన సంపన్నులై చేస్తున్నారా? సర్వ గుణాలు ప్రాక్టికల్ జీవితంలో ప్రత్యక్షమై ఉంటున్నాయా? సర్వము ఉన్నాయా లేక యథాశక్తిగా ఉన్నాయా? ఇదేవిధంగా సర్వ శక్తులు - మాస్టర్ సర్వ శక్తిమంతులు అన్నది మీ టైటిల్, కేవలం శక్తిమంతులు అని కాదు. మరి సర్వ శక్తులు సంపన్నంగా ఉన్నాయా? మరొక విషయము - సర్వ శక్తులు అవసరమైన సమయంలో కార్యము చేస్తున్నాయా? అవసరమైన సమయంలో హాజరవుతాయా లేక సమయము గడిచిపోయిన తరువాత గుర్తొస్తాయా? కనుక మూడు విషయాలు అనగా ఒకే రాజ్యము, ఒకే ధర్మము మరియు అవినాశీ సుఖశాంతులు మరియు సంపద. ఎందుకంటే ఇప్పటి స్వరాజ్య సమయంలో ఈ విషయాలను అనుభవం చేసుకోకపోతే భవిష్యత్తులో చేసుకోలేరు. ఇప్పటినుండే ఈ సంస్కారాలు ప్రత్యక్షంగా ఉంటేనే అనేక జన్మలు ప్రాలబ్ధ రూపంలో వస్తాయి. ధారణ చేస్తున్నాము, అయిపోతాము, అంతిమానికి తయారైపోతాము అని ఇలా అనుకోవటం లేదు కదా!
ఇప్పటి బహుకాలపు అభ్యాసమే బహుకాలపు ప్రాప్తికి ఆధారము అని బాప్‌దాదా ముందు కూడా సూచననిచ్చారు. అంతిమంలో అయిపోతాములే అని ఆలోచించకూడదు, అయిపోతుంది అని కాదు, అవ్వాల్సిందే. ఎందుకని? స్వరాజ్యము యొక్క అధికారము ఏదైతే ఉందో అది బహుకాలపు అభ్యాసముగా ఉండాలి. ఒకవేళ ఒక్క జన్మలోనే అధికారిగా అవ్వలేకపోతే, అధీనులుగా అయితే అనేక జన్మలు ఎలా అవుతారు! కనుకనే, ఇప్పుడు సమయ వేగము తీవ్రగతితో వెళ్తూ ఉంది కనుక పిల్లలందరికీ కేవలము పురుషార్థులుగా అవ్వవద్దు కానీ తీవ్ర పురుషార్థులుగా అయ్యి, పురుషార్థపు ప్రాలబ్ధమును ఇప్పుడు బహుకాలమునుండే అనుభవము చెయ్యాలి అని బాప్‌దాదా నలువైపుల కల పిల్లలందరికీ పదే-పదే ఈ సూచననిస్తున్నారు. తీవ్ర పురుషార్థుల లక్షణాలను బాప్‌దాదా ముందు కూడా వినిపించారు. తీవ్ర పురుషార్థి సదా మాస్టర్ దాతగా ఉంటారు, లేవతగా(తీసుకునేవారిగా) కాకుండా దేవతగా ఉంటారు, ఇచ్చేవారు. ఇది ఉంటే నా పురుషార్థం ఉంటుంది, వీరు చేస్తే నేను కూడా చేస్తాను, వీరు మారితే నేను కూడా మారుతాను అని ఇలా వీరు మారాలి, వీరు చెయ్యాలి అని అనుకోవటం దాతాతనపు గుర్తులు కావు. ఎవరు చేసినా, చెయ్యకపోయినా బాప్‌దాదా సమానంగా నేను చేస్తాను అనుకోవాలి. బ్రహ్మా బాబా సమానంగా కూడా చెయ్యాలి అని అనుకోవాలి. సాకారములో కూడా చూసారు, పిల్లలు చేస్తే నేను చేస్తాను అని వారు ఎప్పుడూ అనలేదు, నేను చేసి పిల్లల చేత చేయిస్తాను అని అనేవారు. రెండవ లక్షణము - తీవ్ర పురుషార్థమునకు చెందినది, సదా నిర్మానము, కార్యము చేస్తూ కూడా నిర్మానము. నిర్మాణము మరియు నిర్మానము రెండింటి బ్యాలెన్స్ కావాలి. ఎందుకు కావాలి? నిర్మానులుగా అయ్యి కార్యము చెయ్యటం వలన సర్వుల ద్వారా మనస్ఫూర్వకమైన స్నేహము మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి. నిర్మాణులు అనగా సేవ క్షేత్రంలో ఈరోజుల్లో పిల్లలందరూ మంచి ఉల్లాస-ఉత్సాహాలతో క్రొత్త-క్రొత్త ప్లానులను తయారుచేస్తున్నారు అన్నదానిని బాప్‌దాదా చూసారు. ఇందుకు బాప్‌దాదా నలువైపుల కల పిల్లలకు అభినందనలను ఇస్తున్నారు.
బాప్‌దాదా వద్దకు నిర్మాణమునకు చెందిన, సేవకు చెందిన చాలా మంచి-మంచి ప్లాన్లు వచ్చాయి. నిర్మాణ కార్యమైతే చాలా మంచిగా ఉంది కానీ సేవా కార్యములో ఎంత ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయో అంతగా ఒకవేళ నిర్మాన స్థితిలో బ్యాలెన్స్ ఉన్నట్లయితే నిర్మాణము అనగా సేవా కార్యంలో సఫలత ఇంకా ఎక్కువగా ప్రత్యక్ష రూపంలో కనిపించగలదు. నిర్మాన స్వభావము, నిర్మాన మాటలు మరియు నిర్మాన స్థితి ద్వారా సంబంధ-సంపర్కములలోకి రావాలి అని బాప్‌దాదా ముందు కూడా వినిపించారు. దేవతల నోటి నుండి వచ్చే మాటలు, వజ్రాలు, ముత్యాలు వంటి అమూల్యమైనవి అని దేవతల గురించి మహిమ చేస్తారు, కానీ ఇది బ్రాహ్మణుల మహిమ, నిర్మలమైన మాట, నిర్మలమైన స్వభావము ఉంది. ఇది ఈ సీజన్ యొక్క చివరి టర్న్ కదా, రిజల్టును వినిపించాలి కదా, నిర్మల వాణి, నిర్మాన స్థితి, వీటిలో ఇప్పుడు అటెన్షన్ కావాలి అన్నదానిని బాప్‌దాదా చూసారు.
ఖజానాలకు చెందిన మూడు ఖాతాలను జమ చేసుకోండి అని బాప్‌దాదా ముందు తెలిపి ఉన్నారు. మరి రిజల్టులో ఏం చూసారు? మూడు ఖాతాలు ఏవి? అవైతే గుర్తుండి ఉంటాయి కదా! అయినాగానీ మరల రివైజ్ చేస్తున్నాము - 1. మీ పురుషార్థము ద్వారా జమ ఖాతాను పెంచుకోవాలి. 2. సదా స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులను కూడా సంతుష్టం చెయ్యాలి, భిన్న-భిన్న సంస్కారాల గురించి తెలుసుకుని కూడా సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టంగా చెయ్యాలి, దీనివలన ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది. ఒకవేళ ఏ కారణంగానైనా సంతుష్టంగా చెయ్యటంలో లోపము ఉన్నట్లయితే పుణ్య ఖాతాలో జమ అవ్వదు. సంతుష్టత పుణ్యానికి తాళంచెవి వంటిది, సంతుష్టంగా ఉన్నా, సంతుష్టంగా చేసినా జమ అవుతుంది. 3. సేవలో కూడా సదా నిస్వార్థము, మైపన్(నేను అన్న భావము) ఉండకూడదు. నేను చేసాను, నాకు కావాలి, ఈ ‘నేను’ మరియు ‘నాది’ అనేవి సేవలో వస్తే అక్కడ పుణ్య ఖాతా జమ అవ్వదు. మేరాపన్(నాది అన్న భావము), రాయల్ రూపానికి చెందిన మేరాపన్లు చాలానే ఉంటాయి – ఇందులో అనుభవీలే. రాయల్ రూపములోని మేరాపన్ యొక్క జాబితా సాధారణ మేరేపన్ జాబితా కంటే పెద్దది. కనుక ఎక్కడ నేను మరియు నాది అన్న స్వార్థ భావము వస్తుందో, నిస్వార్థ భావము ఉండదో అక్కడ పుణ్య ఖాతా తక్కువగా జమ అవుతుంది. మేరాపన్ జాబితాను మరొకసారి ఎప్పుడైనా వినిపిస్తాము, అది చాలా పెద్ద జాబితా, చాలా సూక్ష్మమైనది. అందరూ తమ పురుషార్థము ద్వారా యథాశక్తి తమ తమ ఖాతాను జమ చేసుకుంటున్నారు అన్నదానిని బాప్‌దాదా చూసారు కానీ ఆశీర్వాదాల ఖాతా మరియు పుణ్య ఖాతాలను ఇప్పుడు నింపుకునే అవసరము ఉంది కనుక మూడు ఖాతాలను జమ చేసుకునే విషయంలో అటెన్షన్ పెట్టుకోవాలి. వెరైటీ సంస్కారాలు ఇప్పుడు కూడా కనిపిస్తాయి, అందరి సంస్కారాలు ఇప్పుడు సంపన్నంగా అవ్వలేదు కానీ మనపై ఇతరుల బలహీన స్వభావము, బలహీన సంస్కారాల ప్రభావము పడకూడదు. నేను మాస్టర్ సర్వ శక్తిమంతుడిని, బలహీన సంస్కారాలు కలవారు శక్తిశాలురుగా ఉండరు. మాస్టర్ సర్వ శక్తిమంతుడినైన నాపై బలహీన సంస్కారాల ప్రభావము పడకూడదు. బాప్‌దాదా ఛత్రఛాయలో ఉండటము రక్షణకు సాధనము. బాప్దాదాతోటి కంబైండ్‌గా ఉండాలి. శ్రీమతమనేది ఛత్రఛాయ.
ఇది ఈ సీజన్‌కు చివరి టర్ను. మరుసటి సీజన్ సమయానుసారంగా ప్రారంభం అవుతుంది. క్రొత్త మిలన్ సీజన్ ప్రారంభమయ్యేసరికి ఏ నవీనతను చూపిస్తారు? మీకోసం ఏదైనా క్రొత్త ప్లాను తయారు చేసుకున్నారా? సేవ కోసం క్రొత్త క్రొత్త ప్లాన్లను ఆలోచిస్తారు కదా, అలాగే స్వయం కోసం, పాత విషయాలలో ఏ నవీనతను ఆలోచించారు? ఒకవేళ ఆలోచించకపోయినా కానీ, ఇప్పుడు, స్వయము కొరకు ప్రతి ఒక్కరు సంకల్పాలు, మాటలు, సంపర్క-సంబంధాలు, కర్మలు అన్నింటిలో నవీనతను తీసుకువచ్చే ప్లాన్‌ను తయారుచెయ్యాల్సిందే అని ఈరోజు బాప్‌దాదా సూచిస్తున్నారు. ఏ నవీనతను తీసుకువచ్చారు అని బాప్‌దాదా ముందు రిజల్టును చూస్తారు. పాత సంస్కారాలను దృఢ సంకల్పముతో పరివర్తన చేసుకున్నారా అన్న ఈ రిజల్టును ముందు చూస్తారు. ఏమి ఆలోచిస్తున్నారు, ఇలా చేస్తారా? చేస్తారా? చేస్తాము, చేస్తాము అని అనేవారు చేతులెత్తండి. అచ్ఛా! చేస్తారా లేక ఇతరులను చూస్తారా? ఏం చేస్తారు? ఇతరులను చూడకూడదు, బాప్‌దాదాను చూడాలి, మీ పెద్ద దాదీని చూడాలి. ఎంతటి అతీతమైన మరియు ప్రియమైన స్థితి! ఒకవేళ ఎవరికైనా మైపవ్ మరియు మేరాపన్ల నుండి అతీతంగా ఉన్నవారిని చూడాలనిపిస్తే మీ బాప్‌దాదా యొక్క హృదయ సింహాసనమైన దాదీని చూడండి అని బాప్‌దాదా అంటారు. మొత్తము జీవితమంతా హద్దు మేరాపన్, హద్దు మైపన్ల నుండి అతీతంగా ఉన్నారు, అందుకు రిజల్టు - అనారోగ్యం ఎంత ఉన్నాగానీ దుఃఖము, బాధల భాసన నుండి అతీతంగా ఉన్నారు. ఒకటే మాట పక్కాగా ఉండేది, దాదీ, ఏదైనా బాధగా ఉందా, దాదీ, ఏమైనా అవుతుందా అని ఎవరైనా అడిగితే ఏమి సమాధానం లభించేది? ఏమీ లేదు అని అనేవారు. ఎందుకంటే నిస్వార్థము మరియు గొప్ప హృదయం. అన్నిటినీ ఇముడ్చుకునేవారు, సర్వులకు ప్రియమైనవారు అన్నదానికి ప్రాక్టికల్ గుర్తును చూస్తున్నారు. బ్రహ్మా బాబా గురించి చెప్పినప్పుడు వారిలో అయితే బాబా ఉండేవారు కదా అని అనేవారు, కానీ దాదీ అయితే మీతోపాటు ప్రభు పాలనలో ఉన్నారు, చదువులో ఉన్నారు, సేవలో సహచరిగా ఉన్నారు, ఒకరు అలా నిస్వార్థంగా తయారుకాగలిగినప్పుడు మీరందరూ అలా అవ్వలేరా? అవ్వగలరు కదా! అలా తయారయ్యేవారు మీరే అన్నది బాప్‌దాదాకు నిశ్చయముంది. ఎన్నిసార్లు అలా అయ్యారు? గుర్తుందా? అనేక కల్పాలు బాబా సమానంగా తయారయ్యారు మరియు ఇప్పుడు కూడా మీరే అలా తయారయ్యేవారు. ఈ ఉల్లాసముతో, ఉత్సాహముతో ఎగురుతూ వెళ్ళండి. బాబాకు మీపై నిశ్చయమున్నప్పుడు మీరు కూడా స్వయములో సదా నిశ్చయబుద్ధి కలిగి ఉండాలి, అవ్వాల్సిందే అన్న నిశ్చయబుద్ధితో ఎగురుతూ వెళ్ళండి. బాబాపై మీకు ప్రేమ ఉంది, ప్రేమ 100 శాతము కంటే కూడా ఎక్కువ ఉంది. ఇది నిజమే కదా? ఇక్కడ ఎవరైతే కూర్చుని ఉన్నారో లేక తమ తమ స్థానాలలో ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో వారందరు కూడా మాకు బాబాపై 100 శాతము ప్రేమ ఉంది అని భావిస్తున్నారా? వారు చేతులెత్తండి. 100 శాతము ఉందా? (అందరూ చేతులెత్తారు) అచ్ఛా! వెనుక ఉన్నవారు బాగా పైకి చేతులెత్తండి, చేతులూపండి (ఈరోజు 22000 మంది కంటే ఎక్కువ సోదర, సోదరీలు చేరుకున్నారు) ఇందులో అయితే అందరూ చేతులెత్తారు. మరి ప్రేమకు గుర్తు - సమానంగా అవ్వటము, ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారిలా మాట్లాడటము, వారిలా నడవటము, వారిలా సంబంధ-సంపర్కాలను నిర్వర్తించటము, ఇదే ప్రేమకు గుర్తు.
మరి మరుసటి సీజన్లో అందరి ముఖాలలో బాబా ముఖము కనిపించాలి. ప్రతి ఒక్కరి సంబంధ-సంపర్కాలలో బాబావంటి సంస్కారాలు కనిపించాలి. ఇదే స్నేహనికి రిటర్ను, స్వయాన్ని టర్ను చేసుకోవడము. చూడండి, మీ అందరి ఒక్క సంకల్పం యొక్క వృత్తి, యోగ శక్తి దాదీ పరివర్తనను (ఆరోగ్యం మెరుగవ్వడం) చేసింది. సైలెన్సు శక్తితో, ఏకాభిప్రాయంతో , ఒకే వృత్తితో విధి ప్రత్యక్ష ఫలాన్ని చూపించింది, ఇందుకు అందరికీ అభినందనలు. సరే, చప్పట్లు కొట్టండి. ఒక విషయంలో ప్రత్యక్ష ప్రమాణాన్ని చూసినప్పుడు, దృఢ సంకల్పం, సంగఠన యొక్క సైలెన్సు, యోగ శక్తి యొక్క ప్రమాణాన్ని చూసాము. ఒక ప్రమాణాన్ని చూసినప్పుడు ఇకముందు, స్వ పరివర్తన కోసం, స్వయాన్ని చూసుకోండి, స్వయాన్ని మార్చుకోవాలి, వంగాల్సి వస్తే వంగాలి కానీ పరివర్తన అవ్వడం నుండి దూరం కాకూడదు. ఈ విధంగా దృఢ సంకల్పం చేసి ప్రతి ఒక్కరూ రుజువును ఇవ్వాలి ఎందుకంటే అందరూ సుపుత్రులే. సుపుత్రుల పని ప్రత్యక్ష రుజువును ఇవ్వడము. అచ్ఛా!
బాప్‌దాదా 15 రోజుల కోసం హోమ్‌వర్కును ఇచ్చారు. ఒక విషయంలో హోమ్‌వర్కును ఇచ్చారు, గుర్తుందా? ఎవరైతే సంకల్పాలలో కూడా దుఃఖము ఇవ్వలేదో, దుఃఖము తీసుకోలేదో, స్వప్నంలో కూడా, సంకల్పంలో కూడా, వారు చేతులెత్తండి. లేచి నిల్చోండి. ఎవరైతే పాస్ మార్కులు తీసుకున్నారో, కొద్ది మార్కులు కాదు, పాస్ మార్కులు వారు నిల్చోండి. మొదటి లైన్ వారు తీసుకోలేదా? మొదటి లైన్ వారు ఎందుకు నిల్చోవడం లేదు! దుఃఖము ఇవ్వలేదు అనేవారు లేవండి. స్వప్నంలో కూడా, సంకల్పంలో కూడా ఇవ్వాలేదా, అయితే వీరికి చప్పట్లు కొట్టండి. డబల్ విదేశీయులు కూడా ఎత్తారు. అచ్ఛా. అమరులుగా ఉంటారు. అమరభవ అనే వరదానాన్ని గుర్తుంచుకోండి. అచ్ఛా!
సేవ టర్ను ఈస్టర్న్ జోన్ వారిది (బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం, నేపాల్, తమిళనాడు జోన్):- ఇది చాలా బాగుంది. అన్ని జోన్ల వారికి ఛాన్సు లభించే ఈ విధిని చాలా బాగా తయారు చేసారు. బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం, నేపాల్ మరియు తమిళనాడు ఎన్ని రాజధానులు అయ్యాయి? చాలా ఉన్నాయి. మరి సేవలో అద్భుతమైన సేవా ఛాన్సు. అచ్ఛా, మీరందరూ ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్ (ఆవిష్కరణ) ఆలోచించారా, సేవలో నవీనతను ఆలోచించారా? జోన్ యొక్క అన్ని వైపుల టీచర్లు విశేషంగా చేతులెత్తండి. భిన్న భిన్నస్థానాల హెడ్స్, కేవలం జోన్ హెడ్స్ కాదు, భిన్న భిన్న స్థానాల నుండి ఒక్కొక్క హెడ్ లేవండి. అచ్ఛా. మరి మీరందరూ సేవలో ఏదైనా నవీనతను తయారు చేసారా? ఏదైనా తయారు చేసారా? ముందు ఉన్న టీచర్లు తయారు చేసారా లేక తయారు చేస్తున్నారా? తయారు చేస్తున్నారు. ఎందుకంటే మీ జోన్లో చాలా విస్తారము ఉంది, ఎన్నో ఆత్మలు, ఎన్నో రాజ్యాలు, ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఫారెన్‌లోని ఆఫ్రికావారు కేవలం ప్లాన్ తయారు చేయడమే కాదు, దాని ప్రాక్టికల్‌గా చేసి మొత్తం ఏరియాను కవర్ చేయడాన్ని బాప్‌దాదా చూసారు. మీవైపు అయితే చాలా ఏరియా ఉంది, మరి ఎంతోమంది సమయం సమాప్తమయ్యేసరికి వంచితులుగా మిగిలిపోతారు కదా! కనుక, కలిసి ఏదైనా ఇటువంటి ప్లానును తయారు చేయండి. అలాగే బాప్‌దాదా వద్దకు రష్యా వారి ప్లాను కూడా వచ్చింది. ఈరోజు నుండి కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్న సమాచారమును కూడా బాప్‌దాదాకు వినిపించారు. ఈరోజు గ్రామంవారు కూడా వినిపించారు (గ్రామ వికాస విభాగము తరఫు నుండి ఈ సంవత్సరం అఖిల భారతీయ మోటర్ సైకిల్ ర్యాలీ గురించి సందేశి ద్వారా బాప్‌దాదాకు సందేశాన్ని పంపించడం జరిగింది). ఇండియాలో ప్రతి జోనులో ఉన్న గ్రామగ్రామాలలో సందేశాన్ని అందించడానికి మోటర్ సైకిల్ ర్యాలీ ప్రోగ్రామును తయారు చేసిన సమాచారము బాప్‌దాదా వద్దకు చేరుకుంది. అన్ని జోన్లు కలిసి చేస్తారు. మీరు కూడా ఇలా పరస్పరం కలిసి ప్లాను తయారు చేయండి, ఏ ఏరియా మిగలకూడదు, కనీసం సందేశమైనా అందాలి, లేకపోతే మీకు చాలా ఫిర్యాదులు వస్తాయి. మా బాబా వచ్చారు, కానీ మాకు సూచన లేదు అంటారు. తమిళనాడు కూడా ఉంది, వారు కూడా ఇటువంటి ప్లాను ఏదైనా తయారు చేస్తారేమో చూస్తాము! ప్రతి జోను వారు పరస్పరం కలుసుకుని ఇటువంటి ప్లానును తయారు చేయాలి. సంతోషంగా ఉంటుంది, మేము మా సేవా కార్యాన్ని, సందేశాన్ని ఇచ్చే కార్యాన్ని పూర్తి చేసాము అని మనసులో సంతృప్తి ఉంటుంది. మరి ఇప్పుడు తయారు చేయండి. చేయగలరు కదా! బెంగాల్ వారు చేతులెత్తండి. బీహార్ వారు చేతులెత్తండి. నేపాల్ వారు, ఒరిస్సా వారు ధైర్యవంతులు. ఇంకా ఉన్నారు కదా, అస్సాం! చూడండి, ఎంతో పెద్ద ఏరియాను తీసుకున్నారు. పెద్ద రాజుగా అవ్వాలి కదా. మరి, మరుసటి సీజన్‌కల్లా సందేశాన్ని ఇచ్చే కార్యం గురించి ప్లాన్ తయారు చేసి ప్రాక్టికల్‌గా ప్రారంభించండి. చేయగలరు కదా! చేయగలరా? ఎందుకంటే బాప్‌దాదాకు ఏ పిల్లలైనా ఫిర్యాదు చేస్తే మంచిగా అనిపించదు. ప్లాన్ బాప్‌దాదా విన్నారు, అందరూ ప్లాన్ చాలా బాగా తయారు చేసారు. కానీ బాప్‌దాదా ఎప్పుడూ చెప్తారు, ప్లాన్‌తో పాటు ప్లెయిన్ బుద్ధి ఉండాలి. ప్లెయిన్ బుద్ధి మరియు ప్లాన్ రెండూ కలిసి ఉండాలి. అప్పుడు సఫలత చాలా సహజంగా మరియు శ్రేష్ఠంగా వస్తుంది. తమిళనాడు కూడా చేస్తుందా? చేస్తారా? చూడండి, బాప్‌దాదా పిల్లలందరికీ ఉల్లాస-ఉత్సాహాలు, ధైర్యము యొక్క వరదానము ఒకేలా ఇచ్చారు. ఒకరికి ఎక్కువగా, ఒకరికి తక్కువగా అవ్వలేదు. ఎక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయో, ధైర్యము ఉంటుందో అక్కడ ఏమి జరగదు! అసంభవము కూడా సంభవము అవుతుంది.
ఇకముందు ఏమి చేయాలి అని అందరూ అడుగుతున్నారు. తయారై ఉన్న స్టేజీపై ఎక్కువ ఛాన్సులను తీసుకోవాలన్నది బాప్‌దాదా సంకల్పము. వారిని సహయోగిగా చేసుకోండి, మీరు సకాశ్ ఇవ్వండి. 70 సంవత్సరాలు మీ ధైర్యముతో చేసారు. ఇప్పుడు ఇతరుల భాగ్యాన్ని తయారు చేయండి. వారికి భాగ్యాన్ని తయారు చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి. భాగ్యం చేయించడానికి స్వయం ఏ సకాశ్ను ఇవ్వాలి? ఒకటైతే దయాహృదయులుగా చాలా అవ్వండి. క్షమలో బాబాతో పాటు ఉండండి. శక్తిశాలి వృత్తితో వాయుమండలం ఎలా తయారు చేయాలంటే, వారే వచ్చి మీకు ఆఫర్ చేయాలి, ఇటువంటి ఆఫర్లు నలువైపుల నుండి రావాలి. ఇక్కడకు రండి, ఇక్కడకు రండి, ఇక్కడకు రండి అని ప్రతి జోనులో ఆఫర్లు రావాలి. ఇదే, ఇదే, ఇదే అని అప్పుడు స్వతహాగా ప్రసిద్ధి అవుతుంది. ఇప్పుడు వారికి కూడా స్నేహి, సహయోగిగా అయ్యే ఛాన్సును ఇవ్వండి. ఎందుకంటే ప్రతి జోనులో స్నేహి, సహయోగులు యథాశక్తిగా ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. అయితే ఇప్పుడు వారిని సేవా సహచరులుగా చేయండి. వారికి కూడా ఉల్లాస ఉత్సాహాల రెక్కలను ఇవ్వండి. నలువైపుల ఉన్నారు, బాప్‌దాదా అన్ని వైపుల చుట్టి వస్తారు కదా! బాప్‌దాదా తమ పిల్లలను కూడా చూస్తారు మరియు స్నేహి సహయోగి పిల్లలను కూడా చూస్తారు. బాప్‌దాదా దృష్టిలో ఉన్నారు కానీ ఛాన్సు ఇవ్వలేదు, ప్రాక్టికల్ ఛాన్సును తీసుకోలేదు. కనుక, ఈ సంవత్సరం వారిని నిమిత్తం చేయండి, స్నేహి సహయోగులకు ఉల్లాస ఉత్సాహాలను ఇవ్వండి. తీసుకురావాల్సి ఉంటుంది కదా. ఇలా కూడా చేయవచ్చు అని మాకు మీరు చెప్పనే లేదు అని వారు కూడా మీకు ఫిర్యాదు చేస్తారు. కావున ఇప్పుడు ఛాన్సు ఇచ్చేవారిగా అవ్వండి. ఫారెన్ వారు, వీలవుతుందా? వీలవుతుందా? సేవకు నిమిత్తమైన ఫారెన్ సోదరులు లేవండి. చూడండి, ఎంత మంచిగా సకాశ్ ఇచ్చే ఆత్మలు ఉన్నారో! మరి ఇప్పుడు ఏ జోన్ తయారై ఉన్న స్టేజీని తీసుకుంటుందో చూస్తాము. ఎలా అయితే ఒక సంవత్సరం మెగా ప్రోగ్రాము చేయాలన్న తపన ఉండింది కదా, అలా ఇప్పుడు తయారై ఉన్న స్టేజీని తీసుకోవాలన్న కోలాహలం కనిపించాలి. వీలవుతుందా? ఫారెన్ వారు, వీలవుతుందా? బ్రాయన్కు చెప్తున్నాము, (ఆస్ట్రేలియా యొక్క బ్రాయన్ అన్నయ్యను చూసి బాబా మాట్లాడారు) అద్భుతాన్ని చేసి చూపించండి. దాదీ జానకిగారి సలహా తీసుకుంటూ వెళ్ళండి. బాప్‌దాదా తోడుగా ఉంటారు. అందరూ చేయగలరు ఎందుకంటే అందరూ పాతవారు మరియు సేవాధారులు. (జయంతి అక్కయ్య వినిపించారు – విదేశాలలో ఈ సంవత్సరంలో ఇటువంటి 4 అంతర్జాతీయ ఆహ్వానాలు లభించాయి, ఇందులో దాదీలు వచ్చి తమ ఆశీర్వచనాలు ఇవ్వాలి. రెండు, లండన్‌లో ఉన్న బాబా దుకాణానికి సేవ కోసం గోల్డ్ మెడల్ లభించింది. మంచిది, అభినందనలు. అందరి చప్పట్ల అభినందనలు వారికి ఇవ్వండి.
500 మంది డబల్ విదేశీయులు వచ్చారు:- డబల్ విదేశీయులు మధుబన్కు అలంకారము అని బాప్‌దాదా సదా చెప్తుంటారు. ఎలా అయితే దేశము తమ తమ ఉల్లాస ఉత్సాహాల అనుసారంగా ముందుకు వెళ్తుందో అలాగే విదేశము కూడా తక్కువేమీ కాదు. విదేశము కూడా కొద్ది సమయంలోనే ఎక్కువ విస్తారము చేసింది. ఇప్పుడు విదేశము కేవలం ఒక్క బహుమతిని తీసుకోవలసి ఉంది, ఏ బహుమతిని తీసుకోవాలో చెప్పమంటారా, ప్రత్యేకంగా డబల్ విదేశీయులు? నలు వైపుల స్వ మరియు సేవల బ్యాలెన్సు యొక్క బహుమతిని తీసుకోండి. ఇష్టమేనా? విదేశీయులకు ఇష్టమేనా? చేతులెత్తండి. వెల్కమ్. అభినందనలు, ఇన్ అడ్వాన్స్ అభినందనలు (జర్మనీలో ఒక పెద్ద గురువు బ్రహ్మాకుమారీలను తమ వద్దకు ప్రవచనానికి ఆహ్వానించారు) చాలా మంచిది. ఇలాంటివైతే ఇండియాలో కూడా అప్పుడప్పుడూ లభిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ అలను వ్యాప్తి చేయండి. అప్పుడప్పుడూ అయితే లభిస్తూనే ఉంటాయి, కానీ ఇప్పుడు నలువైపుల ప్రతి జోనులో, దేశంలో, విదేశంలో ఈ అలను వ్యాప్తి చేయండి. అచ్ఛా!
మధుబన్ నివాసులు ఏమి చేస్తారు? మధుబన్ వారు ఏమి చేస్తారో చెప్పండి. ఆబూలో స్టేజ్ తయారు చేస్తారా? మధుబన్ వారు ఏదైనా నవీనతను చేయండి. మధుబన్ యొక్క ఒక విశేషత చాలా బాగుంది, ఎవరు వచ్చినా కానీ, ఏ జోన్ వారు సేవ చేసినా, సేవ వారు చేస్తారు కానీ మధుబన్పై ముద్ర పడుతుంది. మధుబన్ వారు వాయుమండలం, వైబ్రేషన్, స్వచ్ఛత మరియు స్నేహము యొక్క ముద్రను మంచిగా వేస్తారు. ఎలా అయితే మీరు మధుబన్ ఇంట్లో ఉంటారో, అలాగే వారిని కూడా ఇంటివారిగా చేసేస్తారు, ఇది మధుబన్ యొక్క విశేషత. ఇలా చేస్తారు కదా? సేవ మంచిగా చేస్తారు కదా! అచ్ఛా – మధుబన్ వారు లేవండి. మంచిది, వారు తీసుకువస్తారు, మీరు వారిని డబల్ లైట్‌గా చేసి ఎగిరిస్తూ ఉంటారు. వారికి ఎటువంటి పాలనను ఇవ్వండి అంటే, మంచిగా తాగించండి, తినిపించండి, నాది అన్న అనుభవాన్ని కలిగించండి, వారిపై ముద్రను వేయండి. ఈ సేవను అందరూ చేస్తారు కదా? వాయుమండలం యొక్క సేవనైతే చేస్తారు కదా! మంచిది, దాదీలు కూడా లేచారు, అభినందనలు. దాదీల కోసమైతే చప్పట్లు కొట్టండి. మంచిది, మధుబన్, మధుబన్. చివరకు అందరూ ఎక్కడకు చేరుకోవాలి, మధుబన్కే చేరుకోవాలి కదా. సేవ బాగా చేస్తారు. మీ డ్యూటీని బాగా చేస్తారు. ఈరోజు ఏదైతే బాప్‌దాదా చెప్పారో, స్వ తీవ్ర పురుషార్థము మరియు సేవ రెండింటి బ్యాలెన్సు గురించి పరస్పరం సంగఠన తయారు చేసుకుని బ్యాలెన్సు చేసి చూపించండి. వచ్చే సీజన్ కోసం మధుబన్ వారు ఏమి చేస్తారు? పరస్పరం మీటింగ్ చేసుకుని, దాదీల సహయోగం తీసుకుని బ్యాలెన్సు యొక్క జల్వాను చూపించండి. ఎవరిని చూసినాగానీ, మీ హాల్చాల్(మీ స్థితిగతులు) అడిగితే ఏమంటారు? మీ స్థితి (హాల్) ఏమిటి? మీ గతి(చాల్) ఏమిటి? వచ్చినవారు మీ అందరి కుశల స్థితి మరియు ఫరిశ్తా గతిని చూడాలి. ఎక్కడ చూస్తే అక్కడ ఫరిశ్తా గతి, నడిచే గతి కాదు, ఎగిరే గతి. నడిచేవారు ఉండిపోతారు, ఎగిరేవారు బాబాతో కలిసి వెళ్తారు. మరి మధుబన్‌లో ఉండేవారు మొదటి ఛాన్సును తీసుకోవాలి. దాదీలతో కలిసి ఉంటారు, బాబాతో కలిసి ఎగిరే ఛాన్సును తీసుకోండి, వెనుక వెనుక ఉండిపోవద్దు. ఛాన్సు తీసుకుంటారు కదా? మీటింగ్ చేస్తారా? చెప్పండి, ఇటువంటి మీటింగ్ చేస్తారా? అచ్ఛా. ఒక నెలలో రిజల్టును ఇవ్వండి. ఒక నెల సరిపోతుందా? దృఢ నిశ్చయంతో చేతులెత్తుతున్నారు కదా? అలా అయితే బాప్‌దాదా మధుబన్ వారికి ఏదో ఒక బహుమతిని ఇస్తారు. బాగున్నారు. మధుబన్ నివాసి అన్న టైటిలే చాలా బాగుంది. మరి పక్కా కదా! ఇప్పుడు పక్కా. ఏమి జరిగినా కానీ ఇతరులను చూడకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, నేను చేయాలి, నేను మారాలి. ఇతరులు మారితే నేను మారుతాను, కాదు. ఇలా చేస్తారా? పక్కా? పక్కా అయితే చేయి ఇలా పెట్టండి (పిడికిలితో ఉన్న చేయి) చూడండి, అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. మధుబన్ వారి పేరు విని సంతోషిస్తున్నారు. అచ్ఛా.
7 ఏప్రిల్ 2007 నుండి వార్షిక మీటింగ్ పెట్టడం జరిగింది, అందుకోసం బాప్‌దాదా ప్రేరణ:- ఆ మీటింగులో, బాప్‌దాదా ఏదైతే సేవా సాధనము చెప్పారో, తయారై ఉన్న స్టేజీని తీసుకోమన్నారు అలాగే పురుషార్థము మరియు దాని ప్రాలబ్ధము రెండింటి ప్రాక్టికల్ స్వరూపము ప్రత్యక్షం చేయండి. మీటింగులో వచ్చేవారు దీని రిజల్టును ఇవ్వాలి. వారు పరస్పరం మీటింగ్ చేసుకుని రెండు నెలలు, మూడు నెలలు, ఒక నెల ఫిక్స్ చేసుకోండి మరియు దాని రిజల్టును ప్రాక్టికల్లోకి తీసుకురండి. అది బాప్‌దాదా చూస్తారు ఎందుకంటే ఇది విశేషంగా నిమిత్త ఆత్మల మీటింగు. ఒకవేళ నిమిత్త ఆత్మలు బ్యాలెన్సు యొక్క విశేషతను చూపిస్తే ఆ వాయుమండలం చాలా త్వరగా మరియు శక్తిశాలిగా వ్యాపిస్తుంది. స్వయాన్ని ప్రత్యక్షం చేసుకుంటే బాబా ప్రత్యక్షత కూడా చాలా సహజంగా మరియు త్వరగా జరుగుతుంది. మీటింగ్‌లో ఎవరి పేరు ఉన్నాగానీ, వారికి బాధ్యత ఉంది, కేవలం వినడానికి లేక వినిపించడానికి లేరు, బ్యాలెన్సు పెట్టడము మరియు పెట్టించడానికి వారు బాధ్యులు. ఇది మీటింగ్ యొక్క విశేష కార్యము. బాప్‌దాదా సందేశి ద్వారా రిజల్టును వింటూ ఉంటారు మరియు భవిష్యత్తు కోసం ప్రోగ్రామును ఇస్తూ ఉంటారు.
బాప్‌దాదా లక్ష్యాన్ని అయితే అందరూ అర్థం చేసుకున్నారు, ఇప్పుడు బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ అధికారి రూపంలో చూడాలని కోరుకుంటున్నారు. ఎటువంటి సేవలోనైనా కానీ లేక పురుషార్థంలో కానీ పరవశులవ్వకూడదు. అధికారి. ఒక్కొక్కరూ రాజ్య అధికారులు. అందరూ రాజులే కదా! రాజులు కాదా? రాజయోగులేనా? ప్రజాయోగులైతే కాదు కదా? రాజ్యాధికారులుగా చూడాలనుకుంటున్నాము. ఏమి చేయను, జరిగిపోయింది అనకండి. అనుకోలేదు కానీ జరిగిపోయింది అనకండి. స్వ అధికారి, పాత స్వభావ సంస్కారాలకు అధీనులు కాదు, అధికారి, సరేనా. అచ్ఛా.
ఇప్పుడు బాప్‌దాదా ఏదైతే డ్రిల్ చెప్పారో అది గుర్తుందా? 5-5 నిమిషాలు రోజంతటిలో అనేకసార్లు డ్రిల్ చేయాలి. అది చేసారా? ఎవరైతే ఈ డ్రిల్ చేసారో వారు చేతులెత్తండి. కొద్దిమందే చేతులెత్తారు. ఎందుకని? కొద్ది సమయమే చేసారా? ఎక్కువ సమయం చేయలేదంటే మరి ఇప్పుడు ఏమి చేస్తారు? కనీసం, చెప్పమంటారా, కనీసం 8 సార్లు రోజంతటిలో చేయగలరా? చేయగలరా? ఇందులో చేతులెత్తండి. చేస్తారా? అచ్ఛా. మరుసటి సీజన్ ప్రారంభమయినప్పుడు, బాప్‌దాదా అందరి రిజల్టును అడుగుతారు. చివరలో ఒక విషయం చెప్తాము, ఇప్పుడే చెప్పము. తర్వాత చెప్తాము. మధుబన్ వారైతే చేస్తారు కదా? మొదటి నంబర్. మరి ఈ సంవత్సరం యొక్క హోమ్‌వర్కు, ఈ సీజన్లో ఇచ్చిన హోమ్‌వర్కును మరుసటి సీజన్ వరకు కనీసం 8 సార్లు ఈ డ్రిల్‌ను తప్పకుండా చేయాలి. తప్పకుండా, చూస్తాము అనకండి, చేయవలసిందే. ఒకవేళ మిస్ అయినాకానీ ఒక గంటలో అనేకసార్లు చేసి పూర్తి చేయండి. తర్వాత నిదురించండి. ముందు డ్రిల్, తర్వాత నిద్ర. ఎనిమిది సార్లు పూర్తి చేసి తర్వాత నిదురించండి. సరేనా టీచర్లు! చాలా బాగుంది, టీచర్ల వాయుమండలం స్వతహాగానే వ్యాపిస్తుంది.
ఈరోజు బాప్‌దాదా అందరినీ ఇలా చూడాలనుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే చూడాలనుకుంటున్నారు – ఒక్క క్షణంలో కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్ల సంస్కారాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చి స్వరాజ్యమనే సీట్‌పై క్షణంలో సెట్ అయ్యి కూర్చోగలరా! రెండు, మూడు నిమిషాల కొరకు ఒక్క క్షణంలో రాజ్యాధికారి సీట్‌పై సెట్ అయిపోండి. అచ్ఛా. (డ్రిల్)
నలువైపుల కల పిల్లల ప్రియస్మృతులతో కూడిన ఉత్తరాలు, అలాగే సైన్స్ సాధనాల ద్వారా ఎవరైతే ప్రియస్మృతులను పంపారో అవన్నీ బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. తమ మనసు సమాచారాన్ని కూడా చాలామంది పిల్లలు వ్రాస్తారు, ఆత్మిక సంభాషణలో కూడా వినిపిస్తారు. సదా సత్యమైన హృదయము కలవారిని చూసి సాహెబ్(బాబా) సంతోషిస్తారు అని బాప్‌దాదా ఆ పిల్లలందరికీ బదులు సమాధానాన్ని ఇస్తున్నారు. మనసుకు బాగా ప్రియమైన అటువంటి విశేష ఆత్మల కొరకు మనస్ఫూర్వకమైన ఆశీర్వాదాలు. సమాచారాలను ఇచ్చిన నలువైపుల ఉన్నవారికి, మంచి మంచి ఉల్లాస ఉత్సాహాలతో ప్లాన్లను తయారు చేసినవారందరికీ బాప్‌దాదా అభినందనలను కూడా ఇస్తున్నారు, వరదానమును కూడా ఇస్తున్నారు. ఉన్నతి చెందుతూ ఉండండి, ఉన్నతి చేయిస్తూ ఉండండి.
నలువైపుల ఉన్న బాప్‌దాదా పిల్లలు కోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క విశేష ప్రియస్మృతులు. బాప్‌దాదా పిల్లలందరి ధైర్యం మరియు ఉల్లాస-ఉత్సాహాలకు శుభాకాంక్షలను ఇస్తున్నారు. ముందు ముందు తీవ్ర పురుషార్థిగా అయ్యేందుకు, సమానతను ఉంచుకునేందుకు కోటానుకోట్ల రెట్లు ఆశీర్వాదాలను కూడా ఇస్తున్నారు. అందరి భాగ్య సితార సదా మెరుస్తూ ఉండాలి. ఇతరుల భాగ్యాన్ని తయారుచేస్తూ ఉండాలి, ఇందుకు కూడా ఆశీర్వాదాలను ఇస్తున్నారు. నలువైపుల కల పిల్లలు తమ తమ స్థానాలలో వింటున్నారు కూడా, చూస్తున్నారు కూడా, బాప్‌దాదా కూడా నలువైపుల, దూరదూరాలలో కూర్చుని ఉన్న పిల్లలందరినీ చూసి చాలా సంతోషిస్తున్నారు. చూస్తూ ఉండండి మరియు మధుబన్ శోభను సదా పెంచుతూ ఉండండి. పిల్లలందరికీ మనస్ఫూర్వకమైన ఆశీర్వాదాలతోపాటు నమస్తే.
దాదీలతో:- (దాదీ ఆరోగ్యం మెరుగవుతూ ఉంది, దాదీ అందరికీ విశేష స్మృతిని అందించారు) మీ అందరి సైలెన్సు బలం డాక్టర్లకు టచ్ అయింది. క్రొత్త క్రొత్త ఇన్వెషన్లు వెతుకుతున్నారు. సహజమయ్యేందుకు ఏదో ఒక విధిని వెతికారు. అందరూ చాలా బాగా సేవ చేస్తున్నారు, మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నారు. (అంకుల్-ఆంటీ కూడా స్మృతిని అందించారు) వారికి విశేష ప్రియస్మృతులు మరియు టోలీని పంపండి. మంచిది, స్థాపన కార్యంలో నిమిత్తమయ్యారు. ఫారెన్‌లో వి.ఐ.పీ రూపంలో వీరు మొదటి ఉదాహరణ. సేవకు నిమిత్తమయ్యారు. అచ్ఛా. దాదీలందరూ ఆరోగ్యంగా అయిపోయారు.
పర్దాదీతో:- అద్భుతాన్ని చేసి చూపించారు (4 నెలలు అహ్మదాబాదులో ఉన్నారు) అక్కడ కూడా సేవ చేసారు, ఊరికే లేరు, సేవ చేసారు. (బాబా ఒడిలోకి వచ్చేసారు) సదా బాబా ఒడిలోనే ఉంటారు. అచ్ఛా.
యోగిని అక్కయ్యతో:- మంచి ధైర్యాన్ని ఉంచారు, ప్రేమ ఇది, కష్టము కాదు. ఇదైతే బాంబే వారికి లభించిన లిఫ్టు. మీరు మంచి ధైర్యాన్ని ఉంచారు.
శాంతమణి దాదీతో:- వీరు అద్భుతాన్ని చేసారు. వీరి విల్ పవర్ పని చేసింది అని డాక్టర్లు కూడా ఒప్పుకుంటున్నారు. విల్ పవర్‌ను ప్రత్యక్షంగా వీరు చూపించారు, ఇందుకు మీకు చాలా అభినందనలు. ఒక ఉదాహరణగా అయితే అయ్యారు. విల్ పవర్ అంటే ఏమిటి అనే దానికి ఉదాహరణగా నిలిచారు. బాప్‌దాదాకు చాలా మంచిగా అనిపించింది. ఇందుకు అభినందనలు.
నిమిత్తమైన ప్రతి దాదీకి విశేషత ఉంది. ఏ దాదీ లేకపోయినా కానీ ఖాళీ ఖాళీగా ఉంది అని అందరూ అంటారు. 1000మంది ఉన్నాగానీ ఖాళీగా ఉంది అంటారు. ఎక్కడ దాదీలు ఉంటారో అక్కడ శోభ ఉంటుంది. ఇలాగే అందరికీ నేర్పించండి. ఇటువంటి ఏదైనా గ్రూపును తయారు చేయండి, బాప్‌దాదా బహుమతిని ఇస్తారు, ఇటువంటి గ్రూపును తయారు చేయండి. పాండవులు కూడా ఇటువంటి గ్రూపును తయారు చేయండి, ఆ గ్రూపులో అందరూ హా జీ, హా జీ (సరేనండీ, సరేనండీ) అంటూ ఉండాలి, అక్కడ హజూర్ హాజరు అవుతారు. చూస్తాము. దాదీలు ముందుగా ఇటువంటి గ్రూపును తయారు చేస్తారా లేక పాండవులు తయారు చేస్తారా! నిమిత్తంగా దాదీలు ఉన్నప్పటికీ మీరు పరస్పరంలో ధైర్యాన్ని ఉంచాల్సి వస్తుంది. ధైర్యము మీది సహాయము దాదీలది. బాప్‌దాదా అయితే ఉండనే ఉన్నారు. ఇటువంటి ఏదైనా గ్రూపు తప్పకుండా కావాలి. పాండవుల గ్రూపు కూడా కావాలి, శక్తుల గ్రూపు కూడా కావాలి, దీనితో వాయుమండలం చాలా త్వరగా వ్యాపిస్తుంది. బాగుంది.
డా.అశోక్ మెహతాతో:- ఎవరెడీ యొక్క ప్రాక్టికల్ రూపాన్ని చూపించారు. ఇలాగే పురుషార్థంలో కూడా ఎవరెడీ. బాగుంది, హాస్పిటల్ ఒక ఉదాహరణ. ఈ హాస్పిటల్లో ఎటువంటి వాతావరణాన్ని తయారు చేయాలంటే – సహజయోగులను చూడాలనుకుంటే, సహజ ధారణ స్వరూప సేవాధారులను చూడాలనుకుంటే, సేవ చేస్తూ కూడా యోగులుగా ఉండేవారి చిరునామా కావాలంటే హాస్పిటల్‌కు రావాలి, ఇటువంటి ఉదాహరణగా వర్కర్ల సహితంగా అందరినీ తయారు చేయండి. కర్మ చేస్తూ ఇలా ఉండవచ్చు అన్న ఉదాహరణ చూడాలంటే ఈ అడ్రెస్ ఇవ్వాలి. ఇటువంటి ఏదైనా నవీనతను చేసి చూపించండి. హాస్పిటల్ పనైతే జరుగుతూనే ఉంటుంది కానీ మీరు ఏదైనా నవీనతను చేసి చూపించండి. కర్మయోగి జీవితాన్ని తయారు చేసుకున్నవారి గ్రూపును బాప్‌దాదా వద్దకు తీసుకురండి. (మాహిమ్ హాస్పిటల్లో కూడా మంచి సేవలు జరుగుతున్నాయి) ఎక్కడైనా చేయండి. ఈ చికిత్స ఇక్కడ బాగా ఉంటుంది, ఈ ఆపరేషన్ ఇక్కడ బాగా చేస్తారు అని ఎలా అయితే ఆసుపత్రులు ప్రసిద్ధి చెందుతాయో అలాగే కర్మయోగుల గ్రూపును చూడాలంటే ఈ ఆసుపత్రికి రావాలి అనేలా చేసి చూపించండి. (మీ ఆశీర్వాదము కావాలి) బాప్‌దాదా ఆశీర్వాదముతోటే జన్మించారు. జన్మయే ఆశీర్వాదముతో జరిగింది. జన్మించారు కూడా, పాలన కూడా పొందుతున్నారు. మంచిది, స్వయాన్ని ఎక్కువగా ఇరికించుకోకండి, ఏదైనా నవీనతను చేసి చూపించండి. అచ్ఛా.
బృజ్ మోహన్ అన్నయ్యతో:- సేవ జరుగుతుంది కానీ ఇప్పుడు సేవలో ఏదైనా నవీనతను తీసుకురండి. ఎవరైతే స్నేహి సహయోగులు ఉన్నారో, ప్రతి వర్గంలో వారిని తీసుకురండి – ఈ నవీనతను తీసుకురండి. ఢిల్లీలో మరుసటి సీజనుకల్లా ప్రతి వర్గం యొక్క గ్రూపు ఉండాలి. ఇటువంటి చిన్న గ్రూపును తయారు చేయండి, దానిని అందరూ కాపీ చేస్తారు.
రమేష్ అన్నయ్యతో:- బాగుంది, బాంబేలో కూడా ఇటువంటి ప్లాను తయారు చేయండి, అది షార్టుగా ఉండాలి, నవీనంగా కూడా ఉండాలి.
భోపాల్ అన్నయ్యతో:- (చాలా మంచి నిర్విఘ్న సీజన్ ఉండింది) శాంతివన్ శోభ కదా. అందరికీ సుఖమైతే లభించింది కదా. అందుకు ఆశీర్వాదాలు లభిస్తాయి.
గోలక్ అన్నయ్యతో:- వీరు కూడా మంచిగా ఉన్నారు, అలసిపోరు. ధైర్యము మీది, సహాయం బాబాది. ఇప్పుడు లక్ష్యం మంచిగా పెట్టుకున్నారు, మంచిగా జరుగుతూ ఉంటుంది. (మీటింగ్ చేసాము) దాదీలకు రిజల్టును వినిపించండి.
డా. ప్రతాప్ అన్నయ్యతో:- హాస్పిటల్ వారికి విశేషమైన ప్రియస్మృతులను ఇవ్వండి, మీరు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎవ్వరిదీ వినకండి. మీరు ఏమి చేస్తున్నారో, ఎంత చేస్తున్నారో బాప్‌దాదాకు తెలుసు. ఏమీ చింతించకండి, ఎగురుతూ ఉండండి. బాప్‌దాదా సర్టిఫికేట్ సరిపోతుంది.
కొంతమంది వి.ఐ.పీలు బాప్‌దాదాను కలుస్తున్నారు:
• చూడండి, మీరు అందరికన్నా ఎక్కువ సేవ చేయవచ్చు, ఎందుకంటే న్యూట్రల్‌గా ఉండి (నిష్పాక్షికంగా ఉండి) మీరు వినిపించే అనుభవంతో ఇతరులను అనుభవీలుగా చేయవచ్చు. కొందరు జ్ఞానాన్ని వినడానికి ఇష్టపడరు కానీ అనుభవాలు వినడానికి ఇష్టపడతారు. మరి మీరంతా మీ అనుభవంతో సేవ చేయవచ్చు. మైక్ అవ్వండి, మైట్ నిండిన మైక్. ఎలా అయితే ఈ లైట్ యొక్క మైక్ ఉంది కదా, మీరు మైట్ యొక్క మైక్‌గా అవ్వండి. అవ్వగలరు. ఎంతమంచిగా అవ్వగలరు! (పరివారంతో) ఎంతమంది మాతల కళ్యాణము చేయవచ్చు! మాతలను మేల్కొల్పండి, శివ శక్తిగా అవ్వండి. యూథ్ను మేల్కొల్పండి. అందరూ సేవను చేయగలరు. బాప్‌దాదా యొక్క అభినందనలు కూడా ఉన్నాయి.
• మీది ఎంతో పెద్ద భాగ్యము ఉంది, కోట్లలో కొద్దిమంది అంటారు కదా, వారు మీరే. ఇప్పుడు ఎలా అవ్వాలి? ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమందిగా అవ్వాలి. కోట్లలో కొద్దిమందిగా అయితే అయ్యారు, కానీ కొద్దిమందిలో కూడా కొద్దిమందిగా అవ్వాలి. మరి ఎలా అవుతారు? సేవ చేయాలి కదా? మీ భాగ్యము గురించి, మీకు లభించిన ప్రాప్తుల గురించి అందరికీ వినిపించండి. ఎందుకంటే ప్రాక్టికల్ అనుభవం యొక్క ప్రభావం త్వరగా పడుతుంది. ఇంకేమీ వినిపించకపోయినా కానీ నాకేమి లభించింది, జీవితంలో ఎటువంటి మార్పు వచ్చింది అని వింటే మీకు పుణ్యం జమ అవుతుంది. పుణ్య ఖాతాను జమ చేసుకోవాలి కదా. భవిష్యత్తును తయారు చేసుకోవాలి కదా. వర్తమానంలో సంతోషం లభిస్తుంది, భవిష్యత్తు కోసం పుణ్యం జమ అవుతుంది, డబల్ లాభము. భాషణ ఎవరైనా విన్నా వినకపోయినా కానీ, మీ కథను అందరూ వింటారు, ఎందుకంటే అది మీ జీవిత కథ అయిపోయింది, కథను అందరూ అభిరుచితో వింటారు. మరి ఇలాంటి సేవను చేయండి. చేయగలరు కదా? చేయగలరు.
• వీరి విశేషత ఏమిటంటే, ఏ సంకల్పము అయితే చేస్తారో, అది పూర్తి చేస్తారు. ఈ బచ్చీ కూడా బాగుంది. పూర్తి పరివారము లక్కీ. మాతాజీ కూడా లక్కీ. బాగుంది. ఎక్కడి నుండి వచ్చినాగానీ సేవాధారులే. చాలా మంచి సేవను చేయగలరు.
• సదా సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టపరచండి అన్నది బ్లెస్సింగ్. మీ ముఖము ద్వారా సదా సంతుష్టత కనిపించేలా మీ జీవితాన్ని తయారు చేసుకోండి, అందరికీ సంతుష్టత కావాలి. మీ ముఖము మాట్లాడాలి. మాటలు కాదు, ముఖము మాట్లాడాలి.
• ఎవరైతే ఈశ్వరీయ కార్యంలో సహయోగులుగా అవుతారో, సహయోగానికి రిటర్నుగా బాబా సహాయం లభిస్తుంది. ధైర్యము మీది సహాయం బాబాది. ధైర్యము నాది సహాయము తండ్రిది అని సదా గుర్తుంచుకోండి. అన్ని కార్యాలు సహజంగా జరిగిపోతూ ఉంటాయి. ఎవరు వచ్చినాగానీ అందరూ సేవలో ఉండిపోవాలి. అందరికీ మీ అనుభవం ద్వారా సందేశాన్ని ఇవ్వండి.
• ఎక్కడ పని చేస్తున్నాగానీ, అక్కడ మీ అనుభవం యొక్క ఆధారంతో ఇతరులను కూడా అనుభవీలుగా తయారు చేయండి. ఎవరు లభించినా కానీ సంతోషాన్ని పంచండి, అప్పుడు మీకు పుణ్య ఖాతా జమ అవుతూ ఉంటుంది.
విదేశీ పెద్దక్కయ్యలతో:- బ్యాలెన్సు ద్వారా సదా బ్లెసింగ్స్ తీసుకునేవారు. ఎక్కడ బ్యాలెన్సు ఉంటుందో అక్కడ బ్లెసింగ్స్ స్వతహాగా లభిస్తాయి. ఎన్ని బ్లెసింగ్స్ లభిస్తాయి? అమృతవేళ స్వ స్థితిని ఇమర్జ్ చేసుకోండి. మీ స్వమానాన్ని ఇమర్జ్ చేసుకోండి. ఇక సేవ అయితే పెరుగుతూ ఉంది, ఇందుకు అభినందనలు. ఇప్పుడు సేవ మరియు స్వ రెండింటి బ్యాలెన్సు ఉంచండి. అందరి ఎదుట ఉదాహరణగా నిలిచేలా అటువంటి సేవాస్థానాన్ని తయారు చేయండి. మ్యూజియం ఉందనుకోండి, పట్టణంలో ఎక్కడకు వెళ్ళినా కానీ ఇక్కడకు వెళ్ళండి, ఇక్కడకు వెళ్ళండి అని అడ్రెసు ఇస్తారు కదా, అలాగే ఎవరికన్నా శాంతి కావాలన్నా, ధైర్యము కావాలన్నా, ఉల్లాస ఉత్సాహాలు కావాలన్నా వారికి మీ అడ్రెసు ఇవ్వాలి. వ్యాపించాలి, శాంతి వైబ్రేషన్లు కావాలంటే ఇక్కడకు వెళ్ళండి, ధైర్యాన్ని నింపుకోవాలంటే ఇక్కడకు వెళ్ళండి, ఇలా ఏదైనా స్పెషల్‌గా చేయండి. సరేనా. ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక మ్యూజియంలు ఉన్నాయో, అక్కడ భాషణలు కూడా చేస్తున్నారు. కానీ ఆ స్థానాన్ని ఏదైనా విశేషత ఎలా ఉండాలంటే బ్రాహ్మణులలో కూడా మరియు బయట కూడా – ఇది కావాలంటే ఇక్కడకు వెళ్ళండి అని ప్రసిద్ధి అవ్వాలి. ఎందుకంటే ఈరోజుల్లో జనాలకు వినే అలవాటు ఉంది కానీ అనుభవం చేసుకునే అలవాటు లేదు. మరి అనుభవం చేసుకోవాలనుకుంటే మీ వద్దకు రావాలి. అనుభవం చెందాలంటే ఈ అడ్రెసుకు వెళ్ళండి అని మీ స్థానము ప్రసిద్ధి అవ్వాలి. ఇకపోతే అంతా బాగుంది. నిమిత్తమై ఉన్నారు. బాప్‌దాదాకు అయితే సేవ అంటే చాలా ఇష్టము. సేవ బాగా చేస్తున్నారు. పరస్పరం ఇక్కడ ఎప్పుడైతే సంగఠనలోకి వస్తారో అప్పుడు సంగఠన కూడా మంచిగా ఉంటుంది, స్వయం మరియు సేవ రెండూ మంచిగా చేస్తారు. ఇందులో ముందుకు వెళ్తూ ఉండండి.
డబల్ విదేశీ ముఖ్య సోదరులతో:- బాగుంది, మీ సంగఠన చాలా బాగుంది. ఈరోజు బాప్‌దాదా ఏదైతే బ్యాలెన్సు గురించి వినిపించారో, స్వ మరియు సేవ, రెండింటి బ్యాలెన్సు బాబా నుండి బ్లెసింగ్స్ వచ్చేలా చేస్తాయి. ఇకపోతే అందరూ తమ తమ సేవలలో మంచిగా వెళ్తున్నారు, అందుకు అభినందనలు. నిర్విఘ్నంగా ఉన్నారు కదా! ఎందుకంటే మీరు నిమిత్తంగా ఉన్నారు, నిమిత్తంగా ఉన్నవారు ఏమి చేస్తే అది చూసి అందరూ చేస్తారు. అందుకు ఎక్స్ట్రా పుణ్యం లభిస్తుంది ఎందుకంటే ఇతరులకు ధైర్యం లభించింది, వారు కూడా ముందుకు వెళ్ళారు. మరి మీ అనుభవంతో వేరొకరు అనుభవీగా అవుతున్నారు, ముందుకు వెళ్తున్నారు, ఇందుకు ఫలం మీకు లభిస్తుంది, ఆ ఫలం ఏమిటి? ఆంతరిక సంతోషము. తేలికతనము. ఏ ప్రాబ్లమ్ అయినా కానీ ప్రాబ్లమ్‌గా అనిపించదు. పర్వతం కూడా దూదిగా అయిపోతుంది అన్న గాయనము ఉంది కదా. చూడటానికి పెద్ద ప్రాబ్లమ్‌గా అనిపిస్తుంది, కానీ అనుభవం యొక్క ఆధారంతో దూది వలె తేలికగా అయిపోతుంది. అంటే ప్రాబ్లమ్ ప్రూఫ్‌గా అయిపోతారు. నో ప్రాబ్లమ్‌గా జీవితం అయిపోతుంది. ప్రాబ్లమ్ ఉందా? కేవలం మనసుతో గుర్తు చేయండి, ఏదైనా చిన్న పెద్ద విషయం వచ్చినాగానీ, నా బాబా అనండి, చాలు. బాబా, మీరు తీసేసుకోండి. అప్పుడు ప్రాబ్లమ్ బాబా వద్దకు చేరుకుంటుంది, మీరు తేలికగా అయిపోతారు. బాబాతో కలిసి వెళ్ళాలి కదా, వెనుక వెనుక కాదు కదా, కలిసి వెళ్ళాలి అంటే ఎగరాల్సి ఉంటుంది. బాబా ఎగురుతారు కానీ పిల్లలు తేలికగా లేకపోతే ఎలా ఎగురుతారు! కలిసి వెళ్ళలేరు. అందుకే డబల్ లైట్. ఎటువంటి భారము వద్దు. ఏ భారము ఉన్నాగానీ బాబాకు ఇచ్చేయండి. స్వయం తేలికగా ఉండండి. ఇవ్వడమైతే వచ్చు కదా. చాలా మంచి పాత్రను పోషించేవారు మీరు. ప్రాబ్లమ్‌ను చూడకండి. డబల్ లైట్‌గా అయ్యి ముందుకు వెళ్తూ ఉండండి. (వీరి (దాదీ జానకి) డైరెక్షన్ అనుసారంగా నడుచుకోండి. బాబా మీకు సహాయాన్ని ఇస్తారు. చాలా సేవ చేయవచ్చు. విశేషత ఉంది. అందరూ విశేషమైనవారే. గ్రూపే విశేషమైనది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది, అందుకే ఈ గ్రూపు తయారయింది. ఆ విశేషతను కార్యంలో వినియోగించండి. ఆగకండి, కార్యంలో పెట్టండి. సరేనా. అందరూ చాలా మంచిగా ఉన్నారు, నిమిత్త ఆత్మలు మంచిగా ఉన్నారు. బాప్‌దాదా యొక్క విశేషమైన ప్రేమ ఉంది. అందరూ ఒకరిని మించి మరొకరు మంచివారు. అచ్ఛా!
ఓంశాంతి