Search for a command to run...
18 Jan 2008
సత్యమైన స్నేహితులుగా అయి, అన్ని భారాలను బాబాకు ఇచ్చేసి సంతోషాన్ని అనుభవం చేయండి, శ్రమ నుండి ముక్తులు కండి
18 January 2008 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా తమ నలు వైపుల ఉన్న నిశ్చింత చక్రవర్తుల సంగఠనను చూస్తున్నారు. ఇంత పెద్ద చక్రవర్తుల సభ పూర్తి కల్పంలో ఈ సంగమ సమయంలోనే ఉంటుంది. స్వర్గంలో కూడా ఇంత పెద్ద చక్రవర్తుల సభ ఉండదు. కానీ ఇప్పుడు బాప్‌దాదా సర్వ చక్రవర్తుల సభను చూసి సంతోషిస్తున్నారు. దూరంగా ఉన్నవారు కూడా హృదయానికి దగ్గరగా కనిపిస్తున్నారు. మీరందరూ నయనాలలో ఇమిడి ఉన్నారు, వారు హృదయంలో ఇమిడి ఉన్నారు. ఎంతటి సుందరమైన సభ, అందరి ముఖాలలో నేటి విశేష దివసం నాడు అవ్యక్త స్థితి యొక్క స్మృతి దృశ్యము కనిపిస్తూ ఉంది. అందరి హృదయాలలో బ్రహ్మాబాబా స్మృతి నిండి ఉంది. ఆదిదేవుడైన బ్రహ్మాబాబా మరియు శివబాబా ఇద్దరూ పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు.
ఈరోజు ఉదయం రెండు గంటల నుండి బాప్‌దాదా మెడలో భిన్న భిన్న రకాల మాలలు కనిపిస్తున్నాయి. పూలతో చేసిన మాలలైతే సాధారణమైనవే. వజ్రాల మాల కూడా ఏమంత పెద్ద విషయము కాదు. కానీ స్నేహము అనే అమూల్యమైన ముత్యాల మాల అతి శ్రేష్ఠమైనది. పిల్లలు ప్రతి ఒక్కరి మనసులలో ఈరోజు విశేషంగా స్నేహము ఇమర్జ్ అయి ఉంది. బాప్‌దాదా వద్దకు నాలుగు రకాల భిన్న భిన్న మాలలు ఇమర్జ్ అయ్యాయి. మొదటి నంబరు శ్రేష్ఠ పిల్లలది, తండ్రి సమానంగా కావాలన్న శ్రేష్ఠ పురుషార్థీ పిల్లలు మాల రూపంలో బాబా మెడలో హారంగా ఉన్నారు. మొదటి మాల చాలా చిన్నగా ఉంది. రెండవ మాల - మనస్ఫూర్తిగా స్నేహము కలిగి సమీపంగా మరియు సమానంగా కావాలన్న పురుషార్థీ పిల్లల మాల, వారు శ్రేష్ఠ పురుషార్థీలు, వీరు పురుషార్థీలు. మూడవ మాల - ఈ మాల పెద్దది, వీరు స్నేహితులు కూడా, బాబా సేవలో సహయోగులు కూడా కానీ ఒకసారి తీవ్ర పురుషార్థి మరియు మరోసారి తుఫానులను ఎక్కువగా ఎదుర్కునేవారు. కానీ కోరుకునేవారు, సంపన్నంగా కావాలన్న కోరిక కూడా మంచిగా ఉంది. నాల్గవ మాల - ఫిర్యాదుల మాల. భిన్న భిన్న రకాల పిల్లల మాలలు అవ్యక్త ఫరిశ్తా ముఖాలతో మాలలు ఉన్నాయి. బాప్‌దాదా కూడా భిన్న భిన్న మాలలను చూసి సంతోషిస్తున్నారు అలాగే స్నేహము, శక్తిని కూడా ఇస్తున్నారు. మరి నేను ఏమిటి అని మీరందరూ ఆలోచించుకోండి. కానీ నలు వైపుల ఉన్న పిల్లల మనసులలో వర్తమాన సమయములో ఏదైనా చెయ్యాల్సిందే అన్న విశేష సంకల్పం ఇమర్జ్ అయి ఉంది. ఈ ఉల్లాస ఉత్సాహము మెజారిటీ పిల్లలలో సంకల్ప రూపంలో ఉంది. స్వరూపంలో నంబరువారీగా ఉంది కానీ సంకల్పంలో ఉంది.
బాప్‌దాదా పిల్లలందరికీ స్నేహ దివసము, స్మృతి దివసము, సమర్థ దివసము అయిన నేడు విశేషంగా హృదయపూర్వక దీవెనలను మరియు హృదయపూర్వక అభినందనలను ఇస్తున్నారు. ఈరోజు విశేషంగా స్నేహ దివసము అయిన కారణంగా మెజారిటీ స్నేహంలో మునిగి ఉన్నారు. ఇలాగే పురుషార్థంలో సదా స్నేహంలో మునిగి ఉండండి. లవ్లీనమై అయి ఉండండి. కావున సహజ సాధనము స్నేహము, హృదయపూర్వక స్నేహము. తండ్రి పరిచయము యొక్క స్మృతి సహితమైన స్నేహము. తండ్రి ప్రాప్తుల యొక్క స్నేహ సంపన్నమైన స్నేహము. స్నేహము చాలా సహజమైన సాధనము ఎందుకంటే స్నేహీ ఆత్మ శ్రమ నుండి రక్షింపబడుతుంది. స్నేహములో లీనమై ఉన్న కారణంగా, స్నేహంలో మునిగి ఉన్న కారణంగా ఏ విధమైన శ్రమ అయినా మనోరంజకంగా అనుభవం అవుతుంది. స్నేహి ఆత్మ దేహ భానము నుండి, దేహ సంబంధాల ధ్యాస నుండి, దైహిక ప్రపంచముపై ఉన్న ధ్యాస నుండి దూరంగా స్నేహంలో స్వతహాగానే లీనమై ఉంటుంది. హృదయపూర్వక స్నేహము తండ్రి సమీపతను, తోడును, సమానతను అనుభవం చేయిస్తుంది. స్నేహి సదా స్వయాన్ని తండ్రి దీవెనలకు పాత్రులుగా భావిస్తారు. స్నేహము అసంభవాన్ని కూడా సహజంగా సంభవం చేసేస్తుంది. సదా తమ మస్తకంపై, తమ శిరస్సుపై తండ్రి సహయోగము మరియు స్నేహ హస్తమును అనుభవం చేస్తారు. నిశ్చయ బుద్ధి, నిశ్చింతులుగా ఉంటారు. ఆది సమయంలో స్థాపనలో ఉన్న పిల్లలకు ఆది సమయము యొక్క అనుభవం ఉంది, ఇప్పుడు కూడా సేవ యొక్క ఆది నిమిత్త పిల్లలకు అనుభవం ఉంది, ఏమనగా ఆదిలో పిల్లలందరికీ తండ్రి లభించారు అన్న స్మృతితో స్నేహము యొక్క నషా ఎంత ఉండేది! జ్ఞానమైతే తర్వాత లభించింది, మొట్టమొదటి నషా స్నేహములో మునిగి ఉండటము. తండ్రి స్నేహ సాగరుడు కావున మెజారిటీ పిల్లలు ఆది నుండి స్నేహ సాగరంలో మునిగి ఉన్నారు, పురుషార్థం యొక్క వేగంలో ఎంతో స్పీడ్‌గా వెళ్తున్నారు. కానీ కొంతమంది పిల్లలు స్నేహ సాగరంలో మునిగిపోతారు, కొందరు కేవలం మునిగి బయటకు వచ్చేస్తారు. అందుకే మునిగి ఉన్నవారికి ఎంత అయితే శ్రమ తక్కువగా ఉంటుందో అంతగా వారికి అనిపించదు. ఒకసారి కష్టము, ఒకసారి ప్రేమ, రెండింటిలో ఉంటారు. కానీ ఎవరైతే స్నేహములో లవలీనమై ఉంటారో వారు సదా స్వయాన్ని ఛత్రఛాయలో ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు. హృదయపూర్వక స్నేహము ఉన్న పిల్లలు శ్రమను కూడా ప్రేమలోకి మార్చేస్తారు. వారికి పర్వతం వంటి సమస్య కూడా పర్వతంలా కాక దూదిపింజలా అనుభవం అవుతుంది. రాయి కూడా నీటి వలె అనుభవం అవుతుంది. ఈరోజు విశేషంగా స్నేహము యొక్క వాతావరణంలో ఉన్నారు, మరి మీరు శ్రమను అనుభవం చేసారా లేక మనోరంజకంగా ఉందా!
ఈరోజు అయితే అందరికీ స్నేహము అనుభవం అయింది కదా! స్నేహములో మునిగిపోయారా? మునిగిపోయారా అందరూ? ఈరోజు శ్రమ అనుభవం అయిందా? ఏ విషయంలోనైనా శ్రమ అనుభవం అయిందా? ఏమిటి, ఎందుకు, ఎలా అన్న సంకల్పాలు వచ్చాయా? స్నేహము అన్నిటినీ మరిపింపజేస్తుంది. కావున, స్నేహాన్ని మరువకండి అని బాప్‌దాదా చెప్తున్నారు. స్నేహ సాగరుడు లభించారు, ఆ సాగరంలో బాగా ఆడుకోండి. ఎప్పుడైనా శ్రమ అనుభవం అయితే, ఎందుకంటే మాయ మధ్య-మధ్యలో పేపరు తీసుకు వస్తూ ఉంటుంది, కానీ ఆ సమయంలో స్నేహము యొక్క అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు శ్రమ ప్రేమలోకి మారిపోతుంది. అనుభవం చేసి చూడండి. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఆ సమయంలో ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలలోకి చాలా వెళ్ళిపోతారు. ఏదైతే వస్తుందో అది వెళ్తుంది కూడా, కానీ ఎలా వెళ్తుంది? స్నేహాన్ని గుర్తుకు తెచ్చుకుంటే శ్రమ వెళ్లిపోతుంది ఎందుకంటే అందరికీ భిన్న భిన్న సమయాలలో బాప్‌దాదా ఇరువురి స్నేహమైతే అనుభవం ఉంది కదా. ఉంది కదా అనుభవం! ఎప్పుడైనా అనుభవం చేసి ఉంటారు కదా, సదా కాకపోయినా ఎప్పుడైనా చేసారు కదా! తండ్రి స్నేహము అంటే ఏమిటి అని ఆ సమయంలో స్మృతి చేసుకోండి. తండ్రి స్నేహములో ఏమేమి అనుభవం చేసారు! కావున స్నేహ స్మృతితో శ్రమ మారిపోతుంది ఎందుకంటే బాప్‌దాదాకు పిల్లల శ్రమ యొక్క స్థితి మంచిగా అనిపించదు. నా పిల్లలు మరియు శ్రమ! మరి శ్రమ ముక్తులుగా ఎప్పుడు అవుతారు? ఈ సంగమయుగంలోనే శ్రమ నుండి ముక్తులుగా, సంతోషాలలో ఉండగలిగేది. సంతోషము లేదు అంటే ఏదో ఒక భారము బుద్ధిలో ఉంది అని అర్థము. భారాన్ని నాకు ఇచ్చేయండి అని బాబా చెప్పారు. నాది అనేదాన్ని మర్చిపోయి ట్రస్టీలుగా కండి. బాధ్యతను బాబాకు ఇచ్చేయండి మరియు స్వయం హృదయపూర్వకంగా సత్యమైన పిల్లలుగా అయి తినండి, ఆడండి మరియు సంతోషంగా ఉండండి ఎందుకంటే ఈ సంగమయుగము అన్ని యుగాలలోకి సంతోషాల యుగము. ఈ సంతోషాల యుగములో కూడా సంతోషాన్ని జరుపుకోకపోతే మరి ఇంకెప్పుడు జరుపుకుంటారు? పిల్లలు భారాన్ని మోస్తూ, శ్రమ పడుతూ, భారాన్ని ఇవ్వకుండా స్వయమే మోస్తూ ఉండటాన్ని బాప్‌దాదా చూసినప్పుడు బాబాకు దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది కదా! సంతోషించాల్సిన సమయంలో శ్రమ! స్నేహములో మునిగిపోండి, స్నేహము యొక్క సమయాన్ని గుర్తు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయములో విశేషమైన స్నేహ అనుభూతి జరిగే ఉంటుంది, జరిగింది. జరిగింది అని బాబాకు తెలుసు కానీ గుర్తు చేసుకోరు. శ్రమనే చూస్తూ ఉంటారు, చిక్కుకుపోతూ ఉంటారు. ఒకవేళ ఈరోజు కూడా అమృతవేళ నుండి ఇప్పటి వరకు హృదయపూర్వకంగా బాప్‌దాదా ఇరువురు అథారిటీల స్నేహమును అనుభవం చేసి ఉంటే ఈనాటి స్మృతిని గుర్తు తెచ్చుకున్నా కానీ స్నేహము ఎదుట శ్రమ సమాప్తమైపోతుంది.
ఇప్పుడు బాప్‌దాదా ఈ సంవత్సరంలో పిల్లలు ప్రతి ఒక్కరినీ స్నేహయుక్తులుగా, శ్రమ ముక్తులుగా చూడాలని ఆశిస్తున్నారు. శ్రమ యొక్క నామరూపాలు మనసులో ఉండకూడదు, జీవితంలో ఉండకూడదు. వీలవుతుందా? వీలవుతుందా? చేసి తీరుతాము అని అనుకునేవారు, ధైర్యము ఉన్నవారు చేతులెత్తండి. ఈరోజు విశేషంగా ఇటువంటి పిల్లలకు బాబా యొక్క విశేష వరదానము - శ్రమ ముక్తులు. స్వీకారమేనా? సరేనా! ఏదైనా జరిగితే అప్పుడు ఏమి చేస్తారు? ఏమిటి, ఎందుకు అని అనరు కదా? ప్రేమ యొక్క సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోండి మరియు అనుభవంలో మునిగిపోండి. మేము బాబా ద్వారా 21 జన్మల కొరకు జీవన్ముక్త స్థితి యొక్క పదవిని ప్రాప్తి చేసుకుంటున్నాము, చేసుకుని తీరుతాము అని మీ అందరి ప్రతిజ్ఞ ఉంది కదా, మరి జీవన్ముక్తిలో శ్రమ ఉంటుందా అని బాప్‌దాదా ప్రశ్నిస్తున్నారు? 21 జన్మలలో ఒక జన్మ సంగమము. మీరు చేసిన ప్రతిజ్ఞ 21 జన్మలకు, 20 జన్మలకు కాదు. మరి ఇప్పటి నుండే శ్రమ నుండి ముక్తులుగా అనగా జీవన్ముక్తులుగా మరియు నిశ్చింత చక్రవర్తులుగా కండి. ఇప్పటి సంస్కారాలే ఆత్మలో 21 జన్మలు ఇమర్జ్ అయి ఉంటాయి. మరి 21 జన్మల వారసత్వాన్ని తీసుకున్నారు కదా. లేక ఇప్పుడు తీసుకోవాలా? అటెన్షన్ ప్లీజ్! శ్రమ నుండి ముక్తులుగా, సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టపరచండి. కేవలం ఉండటం కాదు, చేయాలి కూడా. అప్పుడే శ్రమ నుండి ముక్తులుగా ఉంటారు. లేకపోతే రోజూ ఏదో ఒక భారము యొక్క విషయాలు, శ్రమ నిండిన విషయాలు, ఎందుకు, ఏమిటి అన్న భాష వస్తుంది. ఇప్పుడు సమయము యొక్క సమీపతను చూస్తున్నారు. ఎలా అయితే సమయము సమీపతలోకి వస్తుందో అలాగే మీ అందరూ తండ్రితో సమీపత యొక్క అనుభవాన్ని పెంచుకోవాలి కదా! తండ్రితో మీకున్న సమీపత, సమయము యొక్క సమీపతను సమాప్తం చేస్తుంది. దుఃఖము మరియు అశాంతితో కూడుకున్న ఆత్మల పిలుపులు పిల్లలైన మీ చెవులకు వినిపించడం లేదా! మీరే పూర్వజులు కూడా, పూజ్యులు కూడా! కావున హే పూర్వజ ఆత్మల్లారా, హే పూజ్య ఆత్మల్లారా! విశ్వ కళ్యాణ కార్యాన్ని ఎప్పుడు సంపన్నం చేస్తారు?
ప్రతి వర్గంవారు తమ తమ మీటింగులు చేస్తారు, విశ్వ కళ్యాణం యొక్క గతిని ఎలా తీవ్రతరం చెయ్యాలి అని ప్లానును తయారు చెయ్యడం బాప్‌దాదా సమాచారాలలో చూసారు. ప్లాను అయితే చాలా బాగా చేస్తారు, కానీ బాప్‌దాదా ప్రశ్నిస్తున్నారు - ఎంతవరకు ఇలా? ఇందుకు జవాబు దాదీలు ఇస్తారు - ఇలా ఎంతవరకు? పాండవులు చెప్పండి - ఎంతవరకు ఇలా? తండ్రి ప్రత్యక్షత జరగాలి అనేదే ప్రతి వర్గంలోని వారు తయారు చేసే ప్లాను యొక్క లక్ష్యము. కానీ దృఢ ప్రతిజ్ఞ తోటే ప్రత్యక్షత జరుగుతుంది. ప్రతిజ్ఞలో దృఢత. ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల లేక కొన్ని విషయాల కారణంగా దృఢత తగ్గుతుంది. ప్రతిజ్ఞ చాలా బాగా చేస్తారు, అమృతవేళ మీరు వినగలిగితే, బాప్‌దాదా అయితే వింటారు కదా. అందరి మనసులలోని విషయాలను వినగలిగే సాధనాన్ని మీ సైన్సు ఇంకా ఇవ్వలేదు. బాప్‌దాదా వింటారు, ప్రతిజ్ఞల మాలలు, సంకల్పం చేసే మాటలు ఎంత మంచిగా హృదయాన్ని రంజింపజేసేవిగా ఉంటాయి అంటే బాప్‌దాదా వాహ్! పిల్లలు వాహ్! అని అంటారు. ఏమేమి చెప్తారో వినిపించమంటారా? మురళిలో కూడా 75 శాతం మాత్రమే సరిగ్గా ఉంటారు. కానీ కర్మయోగంలోకి వచ్చినప్పుడు అందులో తేడా కనిపిస్తుంది. కొన్ని సంస్కారాలు, కొన్ని స్వభావాలు, స్వభావాలు మరియు సంస్కారాలు ఎదురైనప్పుడు ప్రతిజ్ఞ దృఢంగా ఉండాల్సింది బదులుగా సాధారణమైపోతుంది. దృఢత యొక్క శాతం తగ్గిపోతుంది.
బాప్‌దాదా పిల్లల ఒక ఆటను చూసి నవ్వుకుంటారు. ఏ ఆటను ఆడుతారు, చెప్పమంటారా? ఈ ఆటను సమాప్తం చేస్తాము అంటేనే చెప్తాము. సమాప్తం చేస్తారా? చేస్తారా? ఈరోజు అయితే స్నేహము యొక్క శక్తి ఉంది కదా! చేస్తారా? చేతులెత్తండి. కేవలం చేతిని కాదు, మనసు యొక్క చేతిని ఎత్తండి. చేయాల్సిందే. మరి బాప్‌దాదా కొంచెం...., కొంచెం కొంచెం ఏదైనా చేస్తారు. చెప్పమంటారా? పాండవులు చెప్పండి, చెప్పమంటారా? ఈ మొదటి లైను వారు చెప్పండి, చెప్పమంటారా? చెప్పండి? చెయ్యాల్సి ఉంటుంది. చెప్పమంటారా? ఒకవేళ సరేనంటే మొదటి లైనువారు చేతులెత్తండి. ఈ రెండు లైన్లవారు చేతులెత్తండి, మధుబన్వారు కూడా చేతులెత్తండి. మనసు యొక్క చేయి కదా. అచ్ఛా. బాప్‌దాదాకు అయితే ఆటను చూసి దయ కలుగుతుంది, సంతోషంగా లేదు ఎందుకంటే పిల్లలు తమ విషయాన్ని ఇతరుల మీద పెట్టడంలో తెలివైనవారు అని బాప్‌దాదా చూసారు. ఏ ఆటను ఆడుతారు? మాటలు తయారు చేస్తారు. చూసేవారు ఎవరులే ! నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. బాబా అయితే పరంధామంలో, సూక్ష్మవతనంలో కూర్చుని ఉన్నారు అని అనుకుంటారు. ఒకవేళ ఇది చెయ్యకండి అని ఎవరికైనా చెప్తే ఏ ఆటను ఆడుతారో తెలుసా? అవును, అయింది కానీ....కానీ అని తప్పకుండా అంటారు. కానీ ఏమిటి? ఇలా జరిగింది కదా, ఇలా చేసారు కదా, ఇలా జరుగుతుంది కదా, అందుకే ఇలా జరిగింది, నేను చెయ్యలేదు, ఇలా జరిగింది కాబట్టి... వీరు చేసారు కాబట్టి నేను చేసాను, లేకపోతే నేను చెయ్యను. మరి ఇది ఏమిటి? స్వయము యొక్క అవగాహన, రియలైజేషన్ తక్కువగా ఉంది. అచ్ఛా, సరే, వారు అలా చేసారనుకోండి, అందుకే మీరు అలా చేసారు, సరే చాలా మంచిది. వారు మొదటి నంబరు అయ్యారు, మీరు రెండవ నంబరు అయ్యారు. సరే. బాప్‌దాదా ఇది కూడా ఒప్పుకుంటున్నారు. మీరు మొదటి నంబరు కాదు, రెండవ నంబరు కానీ మొదటి నంబరు వారు పరివర్తన అయితే నేను మారుతాను అని అంటే, ఇది సరియేనా? ఆ సమయంలో ఇలానే అనుకుంటారు కదా? మొదటి నంబరువారు పరివర్తన అయ్యారు అనుకోండి. బాప్‌దాదా మరియు ఇతరులందరూ మొదటి నంబరువారిదే తప్పు, మీరు పరివర్తన కావాలి అని అన్నారు. సరే. అచ్ఛా. ఒకవేళ మొదటి నంబరువారు పరివర్తన అయితే అప్పుడు మొదటి నంబరు ఎవరికి లభిస్తుంది? మీకైతే మొదటి నంబరు లభించదు కదా. పరివర్తన శక్తిలో మీది మొదటి నంబరు కాదు. మొదటి నంబరు మీరు వారికి ఇచ్చినప్పుడు మీది ఏ నంబరు అవుతుంది? రెండవ నంబరు కదా? మీది రెండవ నంబరు అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? కాదు, ఇలా జరిగింది, అలా జరిగింది, ఎలా అయింది... అని అంటారు. ఆటలో ఈ భాష చాలా కనిపిస్తుంది. ఇలా, అలా, ఎలా అన్న ఆటను సమాప్తం చేసి నేను పరివర్తన కావాలి అని అనుకోండి. నేను పరివర్తన చెంది ఇతరులను పరివర్తన చెయ్యాలి అని అనుకోవాలి. కానీ ఒకవేళ ఇతరులను పరివర్తన చెయ్యలేకపోతే శుభ భావన, శుభ కామన అయితే ఉంచగలరు కదా! అదైతే మీ వస్తువే కదా. కావున హే అర్జునులారా! నేను కావాలి. విశ్వ రాజ్యాధికారులైన మొట్టమొదటి లక్ష్మీ నారాయణుల సమీపంలోకి రావాలా లేక రెండవ నంబరు వారి సమీపంలోకి రావాలా?
ఈ సంవత్సరం బాప్‌దాదా ఆశ - సర్వ బ్రాహ్మణ ఆత్మలు, బహ్మా కుమార్ బ్రహ్మా కుమారీలు ఎలా అయితే ఇక్కడ ఈ బ్యాడ్జ్‌ను పెట్టుకుంటారు కదా, అందరూ పెట్టుకుంటారు కదా! ఇక్కడకు వచ్చినప్పుడు కూడా మీకు బ్యాడ్జ్ లభిస్తుంది కదా, అది కాగితముది కావచ్చు, బంగారముది కావచ్చు లేక వెండిది కావచ్చు. ఎలా అయితే ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుంటారో, అలాగే హృదయంలో, మనసులో ‘‘నేను పరివర్తన కావాలి, నేను నిమిత్తంగా కావాలి’’ అన్న బ్యాడ్జ్‌ను పెట్టుకోండి. పరివర్తన కార్యంలో బ్రహ్మాబాబా సమానంగా ముందు నేను. ఇతర విషయాలలో వెనుక ఉండండి, ఫర్వాలేదు, వ్యర్థమైన విషయాలలో. కానీ పరివర్తనలో ముందు నేను. సరేనా? రేపు అమృతవేళ బాప్‌దాదా చూస్తారు. బాప్‌దాదాకు ఆలస్యం అవ్వదు, స్విచ్ ఆన్ చెయ్యగానే విశ్వమంతా కనిపిస్తుంది. రేపు అమృతవేళ అందరూ బాబాతో మిలనం జరుపుకుంటారు కదా. మిలనం జరుపుకుంటున్నప్పుడు ఈ బ్యాడ్జ్ పెట్టుకోండి. ప్రాక్టికల్‌గా ఎవరు ఈ బ్యాడ్జ్‌ను పెట్టుకుంటారో చూస్తాము. షో కోసం పెట్టుకోవడం కాదు, పరివర్తన చెందాల్సిందే. దృఢత ఉంది కదా. దృఢమే కదా? అందరూ చేతులెత్తినప్పుడు వీరు చెయ్యగలరా, లేదా అని బాప్‌దాదాకు కొంచెం అనిపిస్తుంది కానీ చేతిని ఎత్తినప్పుడు ఒక్క క్షణమైనా మంచి సంకల్పం చేసారు కదా, ఇదికూడా మంచిదే. కానీ చేసే తీరాలి. నేను మారాలి, నేను మారి అందరినీ మార్చాలి. వీరు మారాలి, ఈ విషయము మారాలి, ఈ వ్యక్తి మారాలి, ఈ పరిస్థితులు మారాలి అని అనుకోకండి. నేను మారాలి. పరిస్థితులైతే వస్తాయి. మీరు ఉన్నతంగా అవుతున్నారు. ఉన్నత స్థానంలో సమస్యలు కూడా ఉన్నతంగానే ఉంటాయి కదా! కానీ ఎలా అయితే ఈరోజు నంబరువారీగా, యథాశక్తి స్నేహ శక్తి యొక్క వాతావరణము ఉన్నదో అలాగే తమ మనసులో సదా స్నేహంలో లవ్లీనమై ఉండే వాతావరణాన్ని సదా ఇమర్జ్ చెయ్యండి.
బాప్‌దాదా వద్దకు సమాచారాలు చాలా మంచిగా వస్తాయి. సంకల్పాల వరకు చాలా బాగుంటాయి. స్వరూపంలోకి రావడంలో మాత్రం యథాశక్తి అయిపోతున్నారు. ఇప్పుడు రెండు నిమిషాలు అందరూ పరమాత్మ స్నేహములో, సంగమ యుగపు ఆత్మిక ఆనందపు స్థితిలో స్థితులు కండి. (డ్రిల్)
అచ్ఛా – ఇదే అనుభవాన్ని పదేపదే ప్రతి రోజు ఎప్పటికప్పుడు అనుభవం చేస్తూ ఉండండి. స్నేహమును వదిలిపెట్టకండి. స్నేహములో మునిగిపోవడం నేర్చుకోండి. అచ్ఛా.
సేవ టర్న్ గుజరాత్ జోను వారిది:- అచ్ఛా, గుజరాత్ కుమారులు లేవండి. బాగుంది. కుమార్ అనగా శరీరం కూడా శక్తిశాలి మరియు మనసు యొక్క శక్తిలో కూడా శక్తిశాలిగా ఉండేవారు. శరీరం ద్వారా కూడా తేలికగా మరియు ఆత్మ కూడా తేలికగా ఉండేవారు. మరి ఇటువంటి కుమారులేనా? చేతులు ఊపండి, ఇటువంటివారేనా? ఎటువంటి భారము యొక్క రిపోర్టు రాదు కదా? ఈరోజు నుండి గుజరాత్ యూథ్ నుండి ఎటువంటి రిపోర్టు రాదు కదా. అంతేనా? రిపోర్టు రాదు కదా లేక వస్తుందా? ఎవరైతే రిపోర్టు రాదు అని అంటారో వారు చేతులెత్తండి. మీరు ఫోటో తియ్యండి. పక్కాగా పని చెయ్యాలి కదా. బాగుంది. బాప్‌దాదా వద్దకు ఒక యూథ్ గ్రూపువారి రిపోర్టు వచ్చింది. మంచి పురుషార్థము చేసారు, మంచి ధైర్యాన్ని ఉంచారు, ప్రోగ్రాము యొక్క విధి కూడా బాగుంది. ఒకవేళ ఏదైనా జోనువారు ఈ విధిని ఉపయోగించాలంటే బాప్‌దాదాకు ఈ విధి నచ్చింది. ఏదైతే ప్రోగ్రాము తయారు చేసారో మరియు ఇప్పుడు ఏదైతే చేసారో అందుకు బాప్‌దాదా తరఫు నుండి అమరభవ వరదానము లభిస్తుంది. ఇప్పుడు వచ్చిన యూథ్ అందరికీ, ముందుగా పరివర్తనలో నేను ముందడుగు వేస్తాను అన్నది సమ్మతమేనా? ముందు నేను అంటారా లేక ముందు వారు అని అంటారా? ముందు నేను అనేవారు చేతులెత్తండి. చూడండి, మీరు బాగా ఫోటో తియ్యండి. బాప్‌దాదా రిజల్టును చూడాలి కదా. మంచిది. యూథ్ పూర్తి విశ్వ విద్యాలయం యొక్క రిజల్టును ప్రత్యక్షం చెయ్యగలరు. ప్రభుత్వ సమస్యలను దూరం చెయ్యగలరు - రెండు ప్రభుత్వాలు. ఆల్మైటీ ప్రభుత్వం కూడా నిర్విఘ్నంగా చూడాలని ఆశిస్తుంది మరియు ఈనాటి ప్రభుత్వం కూడా నిర్విఘ్న భారతదేశాన్ని చూడాలని ఆశిస్తుంది. కానీ నిమిత్తంగా యూథ్ను చేయాలని అనుకుంటుంది. మరి చేసి చూపించాలి, అమరులుగా ఉండాలి. ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడంలో కూడా అమరులుగా కండి. ఇకపోతే పురుషార్థం చేస్తున్నారు, సంకల్పం చేసారు, ఇక ముందు కూడా చేస్తూ ఉండండి మరియు చేయిస్తూ ఉండండి. మరి గుజరాత్ యూథ్ ఈరోజు నుండి నిర్విఘ్నులు. నిర్విఘ్నంగా ఉంటారు కదా. చాలా మంచిది.
మాతలతో:- అచ్ఛా, మాతలకు వరదానము ఉంది, ఎందుకంటే మాతలు విశ్వపరివర్తకులుగా అయ్యారు అన్న నవీనతనే ప్రపంచంవారు కూడా చూస్తున్నారు. మేము సదా శుభ చింతకులుగా మరియు శుభ చింతనలో ఉండాలి అన్న విషయాన్ని మాతలు సదా పక్కా చేసుకోండి. ఉండగలరా? ఉంటారా? ఎటువంటి ఆత్మ అయినా కానీ మీరు శుభ చింతకులుగా ఉండాలి. సదా శుభ చింతకులు కానీ వ్యర్థ చింతకులు కాదు, చెడు చింతకులు కాదు. శుభ చింతన. ఎవరైతే శుభ చింతకులుగా మరియు శుభ చింతనతో ఉంటారో వారే 21 జన్మల వారసత్వానికి అధికారులుగా అవుతారు. కావున రెండు మాటలను గుర్తు పెట్టుకోండి - శుభ చింతకులు మరియు శుభ చింతన. మంచి సంఖ్య ఉంది. ఎప్పుడూ పరచింతన చెయ్యకండి, వ్యర్థ చింతన కూడా చెయ్యకండి. ఈ రిజల్టును చూపించండి. టీచర్లు అందరూ తమ తమ సెంటర్లలో గుజరాత్ మాతలకు ఇవ్వబడిన ఈ వరదానాన్ని పక్కా చేయించండి మరియు రిజల్టును ఇవ్వండి. పరచింతన సమాప్తము, వ్యర్థ చింతన సమాప్తము. శుభ చింతన మరియు శుభ చింతకులు. ప్రతి ఆత్మ పట్ల, ఆ ఆత్మ మీ వెంట పడి ఉన్నాకానీ, మీకు చెడు మిత్రులుగా అయి ఉన్నా కానీ శుభ చింతన. పక్కా. మాతలు చేతులెత్తండి. టీచర్లు రిజల్టును చూడండి, ప్రతి వారము ఈ విషయములో రిజల్టును చూడండి. చూడగలరు కదా. అచ్ఛా.
పాండవులతో:- వెనుక చాలా మంది పాండవులు ఉన్నారు. చేతులు ఊపండి. పాండవుల సంఖ్య కూడా తక్కువగా లేదు. పాండవులు ఏమి చేస్తారు? పాండవుల గాయనము ఏమిటి? పాండవులు పాండవపతితో సదా తోడుగా మరియు సహచరులుగా ఉన్నారు. తోడుగాకూడా ఉన్నారు, సహయోగులుగా కూడా ఉంటున్నారు అందుకే పాండవుల టైటిల్ ఏముంది? విజయి పాండవులు. పాండవులకు విజయం లభించింది కదా. కారణము? పరమాత్మ తోడుగా మరియు సహచరుడిగా ఉన్నారు. మరి ఈరోజు నుండి హృదయంతో, మనసుతో బాబా తోడును వదిలి పెట్టకండి. తోడును వదిలిపెట్టినప్పుడు మాయ వస్తుంది. బాబా తోడును వదిలిపెట్టడం అంటే మాయ వచ్చేందుకు సింహద్వారాన్ని తెరచినట్లు అర్థం. తలుపు తెరిచినప్పుడు అది వస్తుంది కదా. ఎందుకు రాదు, 63 జన్మల పురాతనమైనది కదా. కావున బాబాను మర్చిపోవద్దు, మర్చిపోవడము అంటే మాయ రావడము అని అర్థము. కావున సదా తోడుగా ఉండాలి మరియు సేవలో విశ్వ పరివర్తన కార్యంలో సదా తోడుగా నిలవాలి. పరమాత్మ కార్యంలో తోడుగా ఉండాలి. ఇందులోనే మనసా-వాచ-కర్మణ అనగా ముఖము మరియు నడవడికలో తోడుగా ఉండండి. ఇష్టమేనా? తోడుగా ఉంటారా, సహచరులుగా ఉంటారా? మాయ వచ్చే తలుపును మూసేసారా? డబల్ లాక్ వేసెయ్యండి. సింగల్ లాక్ కాదు. డబల్ లాక్. నిరంతర సేవాధారి మరియు నిరంతర స్మృతి - ఈ డబల్ లాక్ వెయ్యండి. సరేనా? పాండవులు కూడా నిర్విఘ్నులు. నిర్విఘ్నము, చేతులెత్తండి. మనసుతో చేతులెత్తుతున్నారా? ఎవరైతే మనసుతో ఎత్తుతున్నారో వారు ఎక్కువ ఊపండి. చూడండి టీచర్లు, చేతులెత్తుతున్నారు. గుజరాత్వారు పక్కింటివారు కదా. మధుబన్కు పక్కింటివారు కదా. మరి పక్కింటివారు అద్భుతాన్ని చేస్తారు కదా. అచ్ఛా.
టీచర్లు మరియు కుమారీలు ఇద్దరూ లేవండి:- కుమారీలందరూ టీచర్లుగా కావలసిందే కదా. కుమారీలు ఏమవుతారు? టీచర్లు అవుతారు కదా. అందుకే టీచర్లతోటి లేపాము. ఉద్యోగం చేయాల్సి వచ్చినా కానీ బాప్‌దాదా అంటారు - ఒకవేళ టీచరు లేక విశ్వ కళ్యాణ లక్ష్యము ఉన్నట్లయితే కుమారీలు ప్రతి శనివారం ఎప్పుడైతే సెలవు ఉంటుందో అప్పుడు సెంటరులో ఉండాలి. కానీ అక్కడ సేవ చెయ్యాలి. ఊరికే ఉండటం కాదు. సేవ యొక్క అభ్యాసం కావాలి. ఏదైనా కొంచెం లెక్కాచారము ఉంటే దానిని సమాప్తం చెయ్యండి. ఒకవేళ అత్యవసర లెక్క ఉంది, నడవలేము కాబట్టి ఉద్యోగము చేస్తున్నాము అంటే ఫెయిల్ అయినట్లే. నిజంగా ఏదైనా కారణం ఉంటే, కొందరికి పరిస్థితులు ఉంటాయి కానీ మనసు కూడా ఉంటుంది. శనివారము మరియు ఆదివారము సేవ చెయ్యండి. ఆదివారం రోజు పూర్తిగా సేవ చెయ్యండి. సంస్కారం చేసుకోండి. కేవలం ఉండే సంస్కారం కాదు, సేవ చేసే సంస్కారం చేసుకోండి. నేను సేవాధారిగా కావడానికి వచ్చాను అని భావించండి, ప్రాక్టీసు చేస్తూ ఉండండి, ఎంతగా ప్రాక్టీసు చేస్తూ ఉంటారో, అంతగా సంతోషము కలుగుతూ ఉంటుంది. సంతోషము కలిగినప్పుడు మీరే ఏదో ఒక కారణమును వెతికి స్వయాన్ని విడిపించుకోగలరు. కుమారీలు తెలివైనవారే, అమాయకులేమీ కారు. కావున కుమారీలు అనగా స్వ ఉన్నతిలో ప్రతి సమయము అడుగులు వేయడము. కేవలం ఉద్యోగము కాదు, స్వ ఉన్నతిలో తమ పరిస్థితుల అనుసారంగా ముందుకు సాగండి. అంతే కానీ ఏదో నడుస్తుంది, ఉద్యోగం చెయ్యాలి, ఎంత వరకు చెయ్యాలి, ఎంత వరకు చెయ్యకూడదు అన్నది ఏమీ ఆలోచించుకోకుండా ఉండటం కాదు. కుమారీలు బ్రహ్మాకుమారీలే కదా. కుమారీలందరూ బ్రహ్మాకుమారీలే. సేవ చేసేవారు కూడా బ్రహ్మాకుమారీలే. కానీ ఎవరైతే విశ్వ కళ్యాణ భావన, కామన కలిగి ఉంటారో వారే బ్రహ్మాకుమారీలు. మరి కుమారీలు యోగ్యమైన టీచర్లుగా అయ్యారా, గొడవ సృష్టించేవారిగా అవ్వలేదు కదా అని బాప్‌దాదా చూస్తారు. యోగ్య టీచరు, ఎందుకంటే యోగ్య టీచర్ల ఆవశ్యకత ఉంది. ఈరోజుల్లో ఏమవుతుంది, ట్రైనింగ్ కూడా చేస్తున్నారు, కానీ సెంటరుకు వెళ్ళగానే ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. మరి అప్పుడు హ్యాండ్సుగా తయారు కాలేరు కదా. కుమారి అనగా బాప్‌దాదాకు సేవా సహచరులు మరియు నిర్విఘ్న సహచరులు. స్వయాన్ని అడ్జస్టు చేసుకునేవారు. అడ్జస్టు అయ్యేవారే కదా, లేక అగెనెస్టుగా(విరుద్ధంగా) అయ్యేవారా?ఎవ్వరి పట్లా అగెనెస్టుగా ఉండవద్దు, అడ్జస్టు అయ్యేవారు. అచ్ఛా, మరి ఇటువంటి కుమారీలుగా అవుతారు కదా. చేతులెత్తండి. అడ్జస్టు అయ్యే కుమారీలు. ఆలోచించి చేతులెత్తండి. అందరితో కలిసిపోవాలి. అందరితో స్వయాన్ని సహయోగిగా మార్చుకోవాలి. నిర్విఘ్నము. అప్పుడు హ్యాండ్సు ఎంతోమంది తయారుకాగలరు. ఇప్పుడు హ్యాండ్సు యొక్క లోటు ఎంతో ఉంది. బాప్‌దాదా కుమారీలందరికీ చెప్తున్నారు. సహయోగులుగా అవుతారు కదా. సహయోగులుగా అవుతాము అనేవారు చేతులెత్తండి. కానీ ఎటువంటి సహయోగము? నిర్విఘ్న సహయోగము. నిర్విఘ్న సహయోగులు ఇప్పుడు చేతులెత్తండి. అచ్ఛా. ఇన్ అడ్వాన్సు అభినందనలు, అభినందనలు, అభినందనలు. కుమారీలందరూ కూర్చోండి. అచ్ఛా.
టీచర్లతో:- టీచర్లు కూడా గుజరాత్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు టీచర్లు ఏమి చెయ్యాలి? టీచర్లు ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాతావరణాన్ని వ్యాపింపచేయాలి. సెంటరులోకానీ, విశ్వంలో కానీ, విశ్వంలో కూడా వైరాగ్య వృత్తి వాతావరణం యొక్క ఆవశ్యకత ఉంది ఎందుకంటే భ్రష్టాచారము, పాపాచారము పెరిగిపోయాయి. వైరాగ్య వృత్తి లేకపోతే ఈ ఆత్మల కళ్యాణము జరుగదు. సందేశాన్ని ఇచ్చే కార్యాన్ని మంచిగా చేస్తున్నారు. బాప్‌దాదాకు నచ్చింది. కానీ దానితో సహయోగులుగా అవుతున్నారు. మైకులుగా అవుతున్నారు. మీవంటి వారసత్వపు పిల్లలు, సమర్పణ పిల్లలు తక్కువగా అవుతున్నారు. నలు వైపుల ఉన్న సెంటర్లలో వైరాగ్య వృత్తి యొక్క ఆవశ్యకత ఉంది. గుజరాత్‌ను నిమిత్తం చేస్తున్నాము, వైరాగ్య వృత్తి యొక్క ఆవశ్యకత ఉంది. వైరాగ్య వృత్తి కేవలం ఆహార పానీయాలు లేక ధరించే వాటి మీదే కాదు, సాధనాల మీద కాదు కానీ పూర్తిగా మానసిక దృష్టి, వృత్తి మరియు కృతి నలు వైపుల ఉన్న జోన్లలో ఇప్పుడు వైరాగ్య వృత్తితో ఉపరామంగా, దేహ భానం నుండి ఉపరామంగా ఉండే అల ఇప్పుడు రావాలి. అనంతమైన వైరాగ్య వృత్తి, ముందుగా దేహ భానపు వైరాగ్య వృత్తి. దేహ పదార్థాలలో వైరాగ్య వృత్తి. దేహము యొక్క భావన, భావము, ఇందులో వైరాగ్య వృత్తి కావాలి. మరి బాప్‌దాదా నలు వైపుల ఉన్న పిల్లలకు ఈ అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు - ఒకవేళ తీవ్రగతితో, బ్రాహ్మణులలో కానీ, సహయోగి ఆత్మలలో కానీ వైరాగ్య వృత్తి యొక్క వాతావరణమును స్వయములో మరియు సర్వులలో వ్యాపింపజేసినప్పుడే శ్రేష్ఠ ఉన్నతి జరుగుతుంది, అప్పుడే సందేశం వ్యాపిస్తుంది. అన్ని వర్గాల వారు కూడా ప్రత్యక్షత జరగాలి అని ఆలోచిస్తారు, ప్రోగాములు కూడా చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకూ కాలేదు, ఎందుకని? కారణము - నలువైపుల పాప కర్మలలో కానీ, భ్రష్టాచారములో కానీ, పరిస్థితులలోకానీ, పదవిలో కానీ ఇంకా వైరాగ్య వృత్తి లేదు. ఇప్పుడు ప్రత్యక్షత సహజంగా కాజాలదు. మరి ఇప్పుడు నలువైపుల అనంతమైన వైరాగ్య వృత్తి, బ్రహ్మాబాబాను అంతిమం వరకు చూసాము, ఎంతటి అనంతమైన వైరాగ్య వృత్తి కలిగి ఉన్నారు! తమ దేహముపై కూడా వైరాగ్య వృత్తి. పిల్లల సంబంధాలలో కూడా వైరాగ్య వృత్తి. మరి ఏమి చేస్తారు? ఈ లక్ష్యమునే లక్షణంలోకి తీసుకురండి. అచ్ఛా. గుజరాత్వారైతే సేవలో సదా హాజరు అయ్యేవారు. సేవా వృద్ధిని కూడా బాగా చేసారు. సంఖ్య కూడా బాగా ఉంది. ఇప్పుడు వారసులు మరియు మైకులను తయారు చెయ్యండి. ఎటువంటి మైకును తయారు చెయ్యండి అంటే మైకు యొక్క ప్రభావం పడాలి. వీరు చెప్తున్నారు, వీరు చెప్తున్నారు అంటే ఏదో ఉండాలి అని అందరూ అనాలి. అటువంటి మైకులను తయారు చెయ్యండి. అచ్ఛా, సేవకు అభినందనలు. నిర్విఘ్న సేవకు చాలా-చాలా అభినందనలు.
డాక్టర్లు (మెడికల్) మరియు ఇంజినీర్ వింగు:- అచ్ఛా. రెండు వర్గాలూ చాలా ఆవశ్యకమైనవి. బాప్‌దాదా రెండు వర్గాలవారి ప్లానును విన్నారు. డాక్టర్లు తయారు చేసిన ప్లాను మంచిగా ఉంది. బాప్‌దాదాకు నచ్చింది. అభినందనలు. ఎందుకు నచ్చింది? ఎందుకు నచ్చిందంటే అన్నీ వివరంగా, స్పష్టంగా తయారు చేసారు. ఏమి చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, ఎప్పటి లోపు చెయ్యాలి, రిజల్టు ఎలా ఉండాలి ఇదంతా స్పష్టంగా చెప్పారు. ఎలా అయితే గ్రామాలవారు మరియు యూథ్వారు తమది స్పష్టంగా చేసి దానిని ప్రాక్టికల్‌గా చేసారో, అందుకే బాప్‌దాదా వీరిద్దరి ప్లాను మరియు ప్రాక్టికల్‌కు అభినందనలు ఇస్తున్నారు, అలాగే డాక్టర్లు కూడా ఏదైతే ప్లానును తయారు చేసారో చాలా స్పష్టంగా చేసారు. ఆరోగ్యం పేరు వినగానే అందరూ ఇచ్ఛుకులుగా ఉంటారు ఎందుకంటే రోజురోజుకీ కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, వైద్య విధానాలు కూడా చాలా వచ్చాయి అలాగే రోగాలు కూడా చాలా వస్తున్నాయి. రోగాలతో అందరూ విసుగెత్తి ఉన్నారు. ఈ ప్లానుతో సేవ సహజంగా కాగలదు. మంచి ధైర్యాన్ని ఉంచారు. సహయోగులుగా కూడా అందరూ మంచి మంచివారు వచ్చారు మరియు నలువైపుల సందేశం వ్యాపించేలా ప్లానును తయారు చేసారు. ఒక్క జోను కాదు, పూర్తి భారతదేశముది, కావున నలువైపుల సందేశం వ్యాపించడం ద్వారా మంచిగా సందేశం వ్యాపిస్తుంది. అభినందనలు. ప్లానును ఇప్పుడు ప్రాక్టికల్లోకి తీసుకురండి. సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. డాక్టర్ల సంఖ్య కూడా బాగా ఉంది. ప్రపంచంలోని డాక్టర్లందరూ కలిస్తే సంఖ్య చాలా ఉంటుంది. డాక్టర్లు ఉపయోగపడ్తారు. అంతిమ సమయంలో మీరు ఎంతో సేవ చెయ్యవలసి ఉంటుంది. ఎంతో దుఃఖాన్ని సమాప్తం చెయ్యవలసి ఉంటుంది. అందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటే మీరు తనువు మరియు మనసుకు డబల్ డాక్టర్లుగా అయి సేవ చేస్తారు. అచ్ఛా.
ఇంజినీర్ మరియు సైన్స్ వింగ్:- రెండు డిపార్టుమెంటులు మంచివి. సైన్సు ఎలా అయితే ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తుందో అలాగే సైలెన్సు పవర్ యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించే ప్లానును తయారు చెయ్యండి ఎందుకంటే ఈరోజుల్లో వినడానికి బదులుగా, ప్రమాణాన్ని చూడాలని అనుకుంటున్నారు. మరి ఇటువంటి ఏదైనా ప్రమాణాన్ని తయారు చెయ్యండి. ఎలా అయితే సైన్సు ఋజువు చేసి వినిపిస్తుందో, సైన్సు ద్వారా ఇది ఋజువు అయింది, ఈ లాభము చేకూరింది లేక ఈ మార్పు వచ్చింది అని అంటారో అలాగే సైలెన్సు శక్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించండి. అప్పుడు లోకుల్లో ఆకర్షణ కలుగుతుంది. సరేనా. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ రూపంలో ఏదైనా ప్లానును తయారు చెయ్యండి. తయారు చెయ్యగలరు, తెలివైనవారే. చేస్తారు. అచ్ఛా. వర్గీకరణ ఎప్పటి నుండైతే అయిందో, అప్పటి నుండి సేవలో వృద్ధి జరిగింది. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- విదేశీయుల చతురత బాప్‌దాదాకు చాలా బాగా నచ్చింది. ప్రతి టర్నులో ఛాన్సు తీసుకుంటున్నారు. ఎన్ని దేశాల నుండి వచ్చారు? 35 దేశాల నుండి వచ్చారు. అంటే 35 దేశాల కళ్యాణము అయితే అవుతుంది కదా. మీరు ఏ దేశము నుండైతే వచ్చారో ఆ దేశ కళ్యాణము అయితే జరుగుతుంది కదా. అయితే విశ్వ కళ్యాణకారులు అన్న టైటిల్ యథార్థమే కదా. ఏ మూలా మిగిలిపోకూడదు. ఏ మూల కూడా సందేశం లభించకుండా ఉండకూడదు అన్న ప్లానునే విదేశాల వారు తయారు చేసారు అని బాప్‌దాదా విన్నారు. తయారు చేసారు కదా? మరి బాబా ఇచ్చిన విశ్వ కళ్యాణకారి అన్న టైటిల్‌ను మంచిగా ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారు. ముందు కేవలం భారత కళ్యాణకారులుగా ఉండేవారు, ఇప్పుడు గర్వంగా విశ్వ కళ్యాణకారులము అని చెప్తున్నారు. బాబాకున్న విశ్వ కళ్యాణకారి టైటిల్‌ను డబల్ విదేశీయులు ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారు. నలువైపులగల విదేశీయులు ఒక విషయంలో తెలివైనవారు, చెప్పమంటారా? విదేశీయులు ఎప్పుడూ చేతిలో చేయి వేసి నడుస్తారు. అలవాటు. మరి డబల్ విదేశీయులు తండ్రి చేతిలో చేతిని ఉంచి నడిచేవారు. అవునా? చేతిలో చేయి ఉందా? ఎటువంటి చేయి? నిరాకారుడికి చేయి లేదు కదా? నిరాకారుని చేయి శ్రీమతము. మరి శ్రీమతమనే చేతిలో చేయి పెట్టి నడిచేవారు కదా? చేతిలో చేయి పెట్టడంలో ఎప్పుడూ అలసిపోవడం లేదు కదా? అలసిపోతున్నారా! కొంచెం కొంచెం? సదా తండ్రి శ్రీమతము అనే చేతిలో మీ చేయి అనగా తోడుగా, సహయోగులుగా కావడము అని అర్థము. బాబా చెప్పింది చెయ్యడము. ఇలాంటివారే కదా? ఇలాంటివారేనా? ఎదురుగా ఉన్నవారు ఇలాంటివారేనా? పక్కా? చూడండి, బాప్‌దాదా లెక్కల చార్టును చూస్తారు కదా! బాబా చెప్పారు అంటే పిల్లలు చేసేస్తే వారే సుపాత్రులైన పిల్లలు. చెయ్యాలా వద్దా, ఇలా జరగదు కదా, అలా జరగదు కదా అని ఆలోచించవద్దు. బాబా చెప్పారు నేను చేసాను, వీరే పక్కా వారసులు. ఆలోచించేవారు కాదు, చేసేవారు. చేస్తాము, చూడండి తప్పకుండా చేస్తాము అని కొందరు అంటారు, అలా కాదు. త్వరిత కర్మ. వారు త్వరిత దానము అని అంటారు. కానీ ఇక్కడ బాప్‌దాదా అంటారు త్వరితంగా ప్రతి కర్మలో ఫాలో చెయ్యడము మహా పుణ్యము. మహా పుణ్యము మరియు పుణ్యములో కూడా తేడా ఉంది. భక్తిలో కూడా ఒక్క దెబ్బకు బలి అయినదానిని మహా ప్రసాదముగా భావిస్తారు, ఆలోచించి మరణిస్తే దానిని మహాప్రసాదము అని అనరు. కావున శ్రీమతాన్ని వెంటనే ఫాలో చెయ్యడమే మహా పుణ్యము. సరేనా. చాలా తెలివైనవారు. మంచిగా అనిపిస్తుంది, ఈ సింధీల గ్రూపు కూడా మంచిగా ఉంది. మధువన అలంకారము కదా. అయితే చాలా మంచిది, మరి డబల్ విదేశీయులు డబల్ పురుషార్థులు. క్రిందటి గ్రూపులో డబల్ విదేశీయులు డబల్ పురుషార్థీలు అని వరదానము ఇవ్వడం జరిగింది. ఆలోచించే పురుషార్థీలు కాదు. అచ్ఛా, సేవ చేస్తున్నారు, ఎక్కడ నుండి వచ్చినా కానీ సేవ బాగా చేస్తున్నారు, స్వ పురుషార్థంలో కూడా అటెన్షన్ ఉంది మరియు ఇక ముందు మరింత తీవ్రం చెయ్యండి. పురుషార్థం ఉంది కానీ తీవ్రం చెయ్యండి ఎందుకంటే సమయం ఎంతో వేగంగా వెళ్తుంది. అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. అచ్ఛా. అందరికీ దీవెనలు మరియు హృదయపూర్వక ప్రియస్మృతులు. అచ్ఛా.
నలు వైపుల ఉన్న యోగయుక్త, యుక్తియుక్త, రహస్యయుక్త, స్వయం కూడా రహస్యాన్ని తెలుసుకుని సదా సంతోషపరిచేవారు మరియు సంతోషంగా ఉండేవారికి, కేవలం స్వయం సంతోషంగా కాదు, సంతోషంగా చెయ్యాలి కూడా, ఇలా సదా స్నేహ సాగరంలో లవ్లీన్ అయిన పిల్లలకు, సదా తండ్రి సమానంగా అయ్యే తీవ్రపురుషార్థీ పిల్లలకు, సదా అసంభవాన్ని కూడా సహజంగా సంభవం చేసేటువంటి శ్రేష్ఠ ఆత్మలకు, సదా తండ్రి తోడుగా ఉంటూ మరియు తండ్రి సేవలో సహయోగులుగా ఉండేటువంటి చాలా-చాలా లక్కీ మరియు లవ్లీ పిల్లలకు ఈనాటి అవ్యక్త దివసము యొక్క, అవ్యక్త ఫరిశ్తా స్వరూపం యొక్క ప్రియస్మృతులు మరియు హృదయపూర్వక దీవెనలు. అచ్ఛా.
ఈరోజు వతనం యొక్క దృశ్యము చాలా మంచిగా ఉంది. ఈరోజు బాప్‌దాదా వతనంలో అడ్వాన్సు పార్టీ వారందరినీ పిలిచారు. అడ్వాన్సు పార్టీవారు అడ్వాన్సు స్టేజివారికి ప్రియస్మృతులను తెలుపమన్నారు. మరి మీరు అడ్వాన్స్ స్టేజి వారు, వారు అడ్వాన్సు పార్టీవారు, మీకు చాలా ప్రియస్మృతులను పంపారు. ఈరోజు బాప్‌దాదా ఎన్నో సంవత్సరాలు అవ్యక్త పార్టు నడవడానికి నిమిత్తమైన దాదీని మరియు గుల్జార్ దాదీని, ఇద్దరినీ తమ తోటి కూర్చోపెట్టుకున్నారు. ఎన్నో సంవత్సరాలు అవ్యక్త పాత్ర నడిచింది, వ్యక్త సేవకన్నా అధికంగా అలౌకిక పాత్ర జరిగింది. బాప్‌దాదా ఈరోజు ఇద్దరికీ ఎంతో స్నేహమును ఇచ్చారు మరియు అడ్వాన్సు పార్టీ ఎంతో స్వాగతం చేసారు. బాప్‌దాదా ఇద్దరికీ తమ బాహువుల మాలను ధరింపజేసారు, దగ్గరకు తీసుకున్నారు మరియు ఇద్దరి కార్యాన్ని వినిపించారు. దాదీ గురించి, దాదీ పరివారాన్ని, సేవను, తోటివారిని అందరినీ చాలా మంచిగా చూసుకున్నారు, నడిపించేందుకు నిమిత్తమయ్యారు మరియు నిమిత్తము అని భావించి నడిపించారు. గుల్జార్ బిడ్డ అయితే బాప్‌దాదాను ఇముడ్చుకునే కార్యమును చేసారు. ఇద్దరి కార్యము విశేషంగా ఉంది కావున ఇద్దరినీ విశేషంగా వతనంలో స్వాగతం చేసారు. వీరితో పాటు ఎవరైతే ఆది నుండి ఆది రత్నాలైన దాదీలు అనండి, వారి స్వాగతం కూడా జరిగింది. ఇద్దరి కార్యాలలో సఫలతకు కారణము నాది అన్న భావన లేకపోవడమే అని బాప్‌దాదా వినిపించారు. గుల్జార్ బిడ్డ యొక్క మహిమ కూడా జరిగింది - వీరు నిర్మలమైనవారు, నిర్మాన్, సేవకు నిమిత్తమయ్యారు, మరియు ఇముడ్చుకునే శక్తి అనుసారంగా, పరమాత్మ మరియు ఆత్మ రెండింటినీ, బ్రహ్మా బాబా ఆత్మ మరియు పరమాత్మను ఇముడ్చుకునే శక్తి బాబా ద్వారా ఏదైతే లభించిందో, దానిని కార్యంలో వినియోగించారు. అంతిమంలో దాదీ చేతిలో చేయి వేసి బాప్‌దాదా విల్ పవర్స్ యొక్క విల్ ఏదైతే ఇచ్చారో ఆ విల్ పవర్‌తో కార్యమును నిర్విఘ్నంగా నడిపించారు, కావున ఇద్దరి విశేషత తక్కువేమీ కాదు. ఇద్దరూ ఎంతో మంచిగా పాత్రను వహించారు. ఇప్పుడు కూడా పాత్రను నిర్వహిస్తూ ఉంటారు. అయితే బాప్‌దాదా అంటారు ఎవరైతే విశేష కార్యానికి నిమిత్తమయ్యారో వారికి బాప్‌దాదా మరియు బ్రాహ్మణుల అభినందనలు తప్పక లభిస్తాయి. వారి అభినందనలు, శుభ భావనలు, శుభ కామనలు చాలా లభిస్తాయి, మరి ఇద్దరిదీ వారి వారి పాత్ర ఉంది. సఫలం అయ్యారు, సఫలత ఉంటుంది. అవ్యక్త పాత్ర కూడా నడుస్తుంది, నడుస్తూ ఉంటుంది. దాదీ పాత్ర కూడా శక్తినిచ్చే, సమయాన్ని సమీపానికి తీసుకువచ్చే పాత్ర నడుస్తూ ఉంటుంది. వీరితో పాటు దాదీలందరికీ మరియు ఇద్దరికీ తోడుగా ఉండే తోటి నిమిత్త సోదరీలకు, తోడుగా ఉన్నారు, ఎంతో యోగయుక్తంగా సేవ చేసారు, చేస్తున్నారు. వారిని కూడా బాప్‌దాదా ఇమర్జ్ చేసుకున్నారు మరియు సదా ఇలాగే యోగయుక్తంగా, రహస్యయుక్తంగా ఉంటూ నడుచుకోండి అని వరదానమును ఇచ్చారు. తండ్రి దీవెనల హస్తము మీ మస్తకముపై ఉన్నది, ఇలా వతనంలో దృశ్యము జరిగింది. అడ్వాన్సు పార్టీ వారందరూ మరియు ఆదిరత్నాలు కూడా ఇమర్జ్ అయ్యారు. వారు ఇద్దరిపైన బంగారు పుష్పాలను కురిపించారు. చూసారా, బంగారు పుష్పాలను చూసారా? చాలా తేలికగా ఉంటాయి, బరువుగా ఉండవు. తగలడం, నొప్పి కలగడం ఉండవు. చాలా తేలికగా ఉంటాయి కానీ రంగు రంగుల డిజైన్లతో ఉంటాయి. మరి బాప్‌దాదా ఈరోజు ఇద్దరి పాత్ర యొక్క విశేషతను వినిపిస్తూ అందరి ద్వారా బంగారు పుష్పాలను కురిపించారు. బాప్‌దాదా ఇద్దరినీ ఎంతో ప్రేమ చేసారు. ఇద్దరూ బాబా, బాబా అంటూ ఉన్నారు, బాబా మీరు చేయించారు, బాబా మీరు చేయించారు, బాబా మీరు చేయించారు అనే గీతాన్నే పాడుతున్నారు. ఇది ఈనాటి వతనం యొక్క దృశ్యము. అచ్ఛా.
దాదీలతో:- ఆది రత్నాలు ఎంతైనా ఆది రత్నాలే. ఆది రత్నాల శోభయే వేరుగా ఉంటుంది. బాగుంది. మీరందరూ ఎవరైతే నిమిత్తమై ఉన్నారో, మీరందరూ నిమిత్తులే కదా, నిమిత్త గ్రూపు అంతా చాలా బాగుంది. ఒకరికొకరు సహయోగమును ఇచ్చుకుంటూ ఇప్పటికీ నడిపిస్తున్నారు, మంచిగా నడిపిస్తున్నారు, బాప్‌దాదా చూసి దీవెనలు ఇస్తున్నారు. ఒకరు చెప్తే మరొకరు ఒప్పుకోవడము మరియు కార్యములో సఫలత రావడము. రాయ్బహాదూరులు కూడా మరియు కార్యకర్తలు కూడా. కానీ అందరూ కలిసి, పాండవులు నిమిత్తం కావచ్చు, శక్తులు నిమిత్తం కావచ్చు, కానీ మంచిగా నడిపిస్తున్నారు, మరియు మంచిగా నడుస్తుంది. ఇదే బాప్‌దాదా వరదానము.
దాదీ నిర్మల్శాంతగారితో:- సంతోషంగా ఉంటారు, సంతోషంలో ఉంటారు. అనారోగ్యంలో బాధపడరు. ఇది చాలా బాగుంది. యోగము చాలా బాగా చేస్తున్నారు.ఇది చాలా బాగుంది. (దాదీ పాట పాడారు, సంతోషంగా ఉండు, సమృద్ధిగా ఉండు- ఖుష్ రహో, ఆబాద్ రహో...) ఈ పాఠము చాలా బాగుంది. మంచి పాత్రను నిర్వహిస్తున్నారు.
దాదీ శాంతమణిగారితో:- బాగుంది, శరీరాన్ని నడిపించండి, నడిచిపోతుంది ఎందుకంటే ఆత్మ విశ్వాసం ఉంది కదా. ఇన్ని సంవత్సరాల ఆత్మ విశ్వాసము ఉపయోగపడుతుంది. కార్యంలో వినియోగిస్తున్నారు మరియు వినియోగిస్తూ ఉండండి. సేవ కూడా బాగా చేస్తున్నారు.
దాదీ మనోహర్గారితో:- ఆది రత్నము అందరి దృష్టిలో ఉన్నారు. ఎలా ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ అందరి దృష్టిలో ఆది రత్నము ఆదియే. అందరూ ఆది రత్నాలు. విల్ పవర్ ఉంది.
(దాదీ జానకి అన్నారు, బాబా చాలా బాగున్నారు) పిల్లలు కూడా మంచిగా ఉన్నారు. మంచి తండ్రి తమ సమానంగా తయారు చేసారు. అచ్ఛా.
ఈరోజు విశేషంగా బ్రహ్మా బాబా మిమ్మల్ని ఒక్కొక్కరినీ గుర్తు తెచ్చుకుంటూ బాహువుల మాలను వేసారు. (ప్రాక్టికల్‌గా చేసి చూపించారు) ప్రాక్టికల్‌గా వీలు కాదు కదా, ఎందుకంటే ఒక్కరు కాదు కదా, అందరూ ఉన్నారు. అందరూ హక్కుదారులే. బ్రహ్మా బాబాకు పిల్లలపై ఎంతో ప్రేమ ఉంది. అలాగే దాదీ కూడా మర్చిపోలేదు. మాటిమాటికీ గుర్తుకు వస్తారు. ఎలా ఉన్నారు? ఎలా నడుస్తుంది? మంచిగా నడుస్తుందా, నాకు వినిపించండి, ఎలా జరుగుతుంది? అడుగుతూ ఉంటారు. సఖులైతే గుర్తుకు వస్తారు కదా, పాండవులు కూడా గుర్తుకు వస్తుంటారు. కార్య వ్యవహారము మంచిగా నడుస్తుందా అని అడుగుతారు? మంచిగా నడుస్తుందా? మంచిగానే ఉంది కదా! దాదీకి కూడా సంతోషము మరియు బ్రహ్మా బాబాకు అయితే వారికన్నా ఎక్కువ సంతోషము. (దాదీ పాత్ర ఏమిటి?) దాదీ శక్తిని మరియు టచింగ్ను ఇచ్చి వారిని తీవ్రం చేస్తారు. చిన్నతనం నుండే వారి మనసులో ఎన్నో ప్లాన్లు నడుస్తాయి. (జన్మ తీసుకున్నారా?) ఇంకా లేదు. సమయానికి జన్మ తీసుకుంటారు కదా. ఇంకా తీసుకోలేదు. సమయానికి తీసుకోవడమే ఈ నాటి కాలంలో యథార్థము. కానీ మీ అందరినీ కలుస్తూ ఉంటారు, సూక్ష్మంగా.
మీ స్మృతిచిహ్నమైన సోమనాథ్‌కు వెళ్తున్నాము అని రమేష్ అన్నయ్య వినిపించారు:- సందేశమైతే అందరికీ లభిస్తుంది కానీ ఇప్పుడు మైకులు మరియు వారసులు ఇంకా తయారు కాలేదు, వారిని తయారు చెయ్యండి ఎందుకంటే భక్తి రూపంలో కూడా వారు చాలా మంది ఉన్నారు, సందేశము ఇవ్వడము సరి అయినదే కానీ ఇప్పుడు నిమిత్తమయ్యే విధంగా పురుషార్థం చెయ్యండి. వెలువడగలరు, కొద్దిగా శ్రమ కావాలి, ఎందుకంటే భక్తి ప్రభావము అయితే ఉంటుంది కదా.
నారాయణ్ దాదా మరియు మనోజ్‌తో:- సంతోషంగా ఉన్నారు, శరీర నిర్వహణ చింత లేదు కదా? వీరికి ఉందా? లేదు. నిశ్చింతగా ఉన్నారా? ఎప్పుడూ ఆలోచించకండి. మీ పరివారము అనంతమైనది కావున నిశ్చింత. ఏ చింత లేదు. (బాబా, ఇక సేవలో పెట్టుకోండి) అచ్ఛా, సలహా తీసుకుని మీకు చెప్తాము.
భూపాల్ అన్నయ్యతో:- బాప్‌దాదా అందరినీ గుర్తు తెచ్చుకుని బాహువుల మాలను వేసారు. అందరినీ గుర్తు చేస్తారు. దాదీ తమ భుజాలను మరిచిపోలేదు. పెద్దవారిని వదిలిపెట్టండి, భుజాలను కూడా మర్చిపోలేదు. అచ్ఛా!
ఓంశాంతి