Search for a command to run...
20 Dec 1969
ప్లేన్ స్మృతితో ప్లాన్లలో సఫలత
20 December 1969 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా ఏమి చూస్తున్నారు? ఏమి చూడటానికి మరియు ఏమి చేయడానికి వచ్చారు? ఈరోజు బాప్‌దాదా తమ అతి స్నేహి పిల్లలతో ఒక ప్రతిజ్ఞను చేయించడానికి వచ్చారు. ప్రతిజ్ఞను చేయడంలో అయితే ఈ ఆత్మలు ఆది నుండి ప్రవీణులే. ఎలా అయితే ఆరంభంలో ప్రతిజ్ఞను చేయడంలో ఏమీ ఆలస్యం చేయలేదు, ఏమీ ఆలోచించలేదో అలాగే ఇప్పుడు కూడా బాప్‌దాదా ప్రతిజ్ఞను తీసుకోవడానికి వచ్చారు. అసలైతే పూర్తి డ్రామాలో అనేక ఆత్మల మధ్యలో మీరే ధైర్యవంతులుగా ప్రసిద్ధి చెందారు. ధైర్యం ఉంచి బాప్‌దాదాకు సమీపంగా ఉన్నారు, స్నేహాన్ని కూడా తీసుకున్నారు. సహాయాన్ని కూడా తీసుకున్నారు మరియు ఇచ్చారు కూడా. మరి ఆ సంస్కారాలను మళ్ళీ పరీక్షించడానికి వచ్చాము. అందరూ ఎవరెడీ కదా. ప్రతిజ్ఞ ఏమిటంటే, ఇప్పటినుండి అందరమూ ఏకత, స్వచ్ఛత, మహీనత, మధురత మరియు మనసు, వాణి, కర్మలో మహానత – ఈ 5 విషయాలు ప్రతి ఒక్కరి నడవడికలో కనిపించాలి. భట్టీ తర్వాత సేవా స్థానాలకు వెళ్ళాలి అని వినిపించాము కదా. వీరంతా ఒకే అచ్చు నుండి వచ్చారా అనేవారు. అందరి విషయము ఒకటే, అందరి జీవనశైలి, అందరి ఆకర్షణ ఎక్కడంటే అక్కడ కనిపించేది. అక్కడ ఎవరి ప్రభావం పడుతుంది? అవ్యక్త పాలన యొక్క ప్రభావము. వ్యక్తంలో ఉంటూ కూడా అందరికీ అవ్యక్త ఫరిశ్తాలు కనిపించేవారు. సాధారణ రూపంలో ఉన్న ఆకర్షణ మూర్తులుగా మరియు అలౌకిక వ్యక్తులుగా కనిపించేవారు. ఇప్పుడు మళ్ళీ అలా, ఆ 16 సంవత్సరాల భట్టీ, ఈ 16 రోజుల భట్టీ. ప్రపంచాన్ని మార్చడానికి వీరు మారి వచ్చారు అని అందరికీ తెలియాలి. పూర్తి దైవీ పరివారానికి ఈ గ్రూపుపై విశేష ఆశ ఉంది. మరి విశేష ఆత్మలు తమ విశేషతను చూపించాలి, ఏ విశేషత? ఆ 5 విషయాలను వినిపించాము. ఎప్పుడైతే ఈ 5 విషయాలు ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో గుర్తుంటాయో అప్పుడే విశేష ఆత్మలు అందరికీ కనిపిస్తారు. ఎప్పుడైతే స్వయంలో విశేషతను తీసుకువస్తారో అప్పుడు బాబాను కూడా ప్రత్యక్షం చేయగలరు. మీ సంపూర్ణ సంస్కారాలతోటే బాబాను ప్రత్యక్షం చేయగలరు. కేవలం సేవా ప్లాన్లతో కాదు, మీ సంపూర్ణ సంస్కారాలతో, మీ సంపూర్ణ శక్తితో బాబాను ప్రత్యక్షం చేయవచ్చు. ప్లాన్లు అయితే తయారు చేయవలసి ఉంటుంది, కానీ ప్లానుతో పాటు మీ ప్రేమ పూర్తిగా ఉన్నప్పుడే సఫలత లభిస్తుంది. ఎటువంటి కలగలపు ఉండకూడదు. ప్లేన్ (సాదా) స్మృతితో సఫలం కాగలరు. ప్లేన్ స్మృతిలో ఉన్నానా అని ప్లాన్కన్నా ముందు చెకింగ్ చేసుకోండి. ఆరంభంలో చేసిన ప్రతిజ్ఞ ఏమిటి, ఆ పాట గుర్తుందా? దానిని మళ్ళీ సాకార రూపంలోకి తీసుకురండి అంటే బుద్ధి యొక్క ప్రేమ ఒక్క మీతోటే ఉంది అన్న సాక్షాత్కారము సాకార రూపంలో అందరికీ జరగాలి. ఏమి చేయడానికి వచ్చాము, ఏమి చూడటానికి వచ్చాము అన్నది ఇప్పుడు అర్థమయిందా? రకరకాల విషయాలు బాబాకు నచ్చుతాయి. ఇది ఆత్మిక సంభాషణ. ఇందులో ఎవరైనా ఫెయిల్ అవుతారా? ఇప్పుడైతే మీరు అందరినీ ఫెయిల్ చేసేవారిగా అయ్యారు, ఫెయిల్ అయ్యేవారు కాదు. స్వయాన్ని ఫెయిల్ అవ్వనివ్వరు – ఇది కూడా బాగుంది. కానీ ఫీల్ అవుతారు. తమ మాటలో గెలవాలంటే ఆ కళను పిల్లల వద్దే నేర్చుకోవాలి. కొద్దిగా ఈ తేడా తొలగితే ఆత్మలన్నీ మీపై పడిపోతారు. ఎలా అయితే మీరంతా బాప్దాదాపై బలి అయ్యారు కదా, అలాగే మీ భక్తులు శక్తులైన మీపై బలిహారం అవుతారు. కానీ కేవలం ఇలాంటి విషయాలు తొలగాలి. ఫీల్ అవ్వడం అన్నది తొలగాలి. అందరికన్నా తెలివైనవారిగా అయితే అయ్యారు, ఎందుకంటే వెంటనే వ్యాపారం చేసేసారు. పూర్తి సృష్టిలోని ఆత్మలకన్నా ధైర్యవంతులు కూడా, తెలివైనవారు కూడా. అందుకే, ఇది అందరికన్నా తెలివైన పిల్లల సంగఠన అని బాప్‌దాదా అన్నారు. ధైర్యవంతులు కూడా. ఇతరులు ఎంత ధైర్యముంచినా కానీ, ‘త్వరిత దానము మహాపుణ్యము’ అన్న ధైర్యము ఏదైతే ఉంచారో ఇటువంటి ధైర్యము ఇప్పుడు ఎవ్వరూ పెట్టలేరు. నదులలో అందరూ స్నానం చేస్తారు కానీ మీరైతే సాగరంలో స్నానం చేసారు. నదిలో మరియు సాగరంలో స్నానం చేయడంలో తేడా ఉంది. ఇందులో అయితే పాస్ అయ్యారు. ఇప్పుడు కేవలం పాస్ అవ్వడమే మిగిలి ఉంది. దాని ఆధారంగానే మార్కులు ఉంటాయి.
ఎప్పుడు ఏ డైరెక్షన్, ఏ రూపంలోనైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలి అని రావచ్చు, ఎంత సమయం కోసం అని కూడా రావచ్చు, ఒక్క సెకండులో తయారుగా ఉండండి అన్న డైరెక్షన్ కూడా రావచ్చు. మరి ఇలా అందరూ ఎవరెడీగా అయ్యారా? అశుద్ధ ప్రవృత్తిని విడిచిపెట్టడానికి ఏమైనా ఆలోచించారా? నగలు, బట్టలు, పిల్లలు మొదలైన వేటినీ చూడలేదు. మరి ఇదేమో పవిత్ర ప్రవృత్తి, ఇందులో ఈ విషయాలను చూడాల్సిన అవసరం ఏముంది! మునుపు కేవలం స్నేహంలో ఉన్నారు. స్నేహంలో ఇదంతా చేసారు. జ్ఞానంతో కాదు. కేవలం స్నేహమే ఇదంతా చేయించింది. ఇప్పుడు స్నేహంతో పాటు శక్తి కూడా కావాలి. స్నేహము మరియు శక్తి ఉన్నప్పటికీ ఇందులో ఎవరెడీగా అవ్వడంలో ఆలస్యం ఎందుకు? ఆరంభంలో, అందరూ ఈ సమయానికి మైదానంలోకి రావాలి అన్న ప్రకటన జరిగేది కదా, అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేయాల్సిందే, కానీ భిన్న భిన్న రూపాలలో. భవిష్యత్తు తెలిసి బాప్‌దాదా ప్రకటించినా కానీ మీరేమో ఈ సేవా బంధనంలో స్వయాన్ని బంధించి ఉంచుకోకూడదు. బంధనం ఉన్నాకానీ బంధనంలో ఉండకూడదు. ఏ ఆత్మ యొక్క బంధనంలోనైనా రావడము అంటే ఇది నిర్బంధనము యొక్క గుర్తు కాదు. అందుకే అందరూ పాస్ విత్ ఆనర్‌గా పాస్ కావాలి. ఏ విషయాలైతే మీ దృష్టిలో ఉండవో, స్వప్నంలో కూడా ఊహించి ఉండరో అటువంటి ప్రకటనలు జరుగుతాయి. అటువంటి పేపరులో ఎవరైతే పాస్ అవుతారో వారే పాస్ విత్ ఆనర్ అవుతారు. అందుకే ముందే వినిపిస్తున్నాము. ముందునుండే సూచన లభిస్తుంది. దీనినే మహీనతలోకి వెళ్ళడము అంటారు. ఎవరైతే మహీన్ బుద్ధితో ఉంటారో వారి విశేషత ఏమిటి? మహీన్ బుద్ధి ఉన్నవారు ఎటువంటి పరిస్థతిలోనైనా మోల్డ్ కాగలరు. పరిస్థితినిబట్టి స్వయాన్ని మల్చుకోగలరు. ఎదుర్కునే సాహసము వీరిలో ఉంటుంది, వారు ఎప్పుడూ గాభరా పడరు. దాని లోతుల్లోకి వెళ్ళి స్వయాన్ని ఆ విధంగా నడిపించుకుంటారు. కనుక, ఎప్పుడైతే తేలికగా అవుతారో అప్పుడే మోల్డ్(మల్చుకోవడము) అవుతారు. మెత్తగా(నరమ్) మరియు వేడిగా(గరమ్) ఉన్నప్పుడే మల్చుకోవడం వీలవుతుంది. ఒక్కటి తక్కువున్నాగానీ మోల్డ్ అవ్వలేరు. ఏదైనా వస్తువును వేడి చేసి మెత్తగా చేస్తారు. తర్వాత మోల్డ్ చేస్తారు. ఇక్కడ మెత్తదనం, వేడితనము ఏమిటి? నిర్మాణత అనేది మెత్తదనము, శక్తి రూపము అనేది వేడి. నిర్మాణత అంటే స్నేహ రూపము. ఎవరిలో అయితే ప్రతి ఆత్మ పట్ల స్నేహము ఉంటుందో వారే నిర్మాణతలో ఉండగలరు. స్నేహము లేకపోతే దయాహృదయము ఉండదు, నమ్రచిత్తము ఉండదు. కనుక నిర్మాణత మరియు శక్తి రూపము అనగా ఎంతగా నిర్మాణతలో ఉంటారో అంతగానే యజమానితనము. శక్తిరూపంలో యజమానితనము ఉంటుంది, నమ్రతలో సేవా గుణము ఉంటుంది. సేవ కూడా మరియు యజమానితనము కూడా. సేవాధారిని కూడా, విశ్వానికి యజమానిని కూడా అన్న నషా ఉండాలి. ఎప్పుడైతే ఈ మెత్తదనము మరియు వేడితనము రెండూ ఉంటాయో అప్పుడు ప్రతి విషయంలో మోల్డ్ అవ్వగలరు. మా బుద్ధి అను తక్కెడలో వేడిదనము మరియు మెత్తదనము రెండూ సమానంగా ఉన్నాయా అని ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. అక్కడక్కడ అతి నిర్మాణత కూడా నష్టం తెస్తుంది, అక్కడక్కడ అతి యజమానితనము కూడా నష్టం తెస్తుంది, కనుక రెండింటిలో సమానత కావాలి, ఎంతగా సమానత ఉంటుందో అంతగా మహానత. ఏ ఒక్క విషయంలో పాస్ విత్ ఆనర్‌గా అవ్వాలో ఇప్పుడు అర్థమయిందా? ఈ ఫైనల్ పేపరును ముందుగానే అనౌన్సు చేస్తున్నాము. ప్రతి సమయము నిర్బంధనముగా ఉండాలి. సేవా బంధనం నుండి కూడా నిర్బంధనము. ప్రకటన రాగానే ఎవరెడీగా అయ్యి మైదానంలోకి రావాలి. ఈ ఫైనల్ పరీక్ష సమయం వచ్చినప్పుడు ప్రాక్టికల్‌లో వస్తుంది. ఈ పరీక్షలో పాస్ అయితే ఇంకేదీ పెద్ద విషయం కాదు. ఈ పేపరులో పాస్ అవ్వడము అంటే అవ్యక్త స్థితి ఉండటము. శరీర భానము నుండి కూడా అతీతంగా అయితే ఇంకేదీ పెద్ద విషయము కాదు. జీవిత నావ యొక్క త్రాళ్ళు ఎంత వరకు వీడాయి అని దీని ద్వారానే తెలుస్తుంది. ఒకటి బంగారపు సంకెళ్ళు, రెండు ఇనుప సంకెళ్ళు. ఇనుప సంకెళ్ళనైతే విడిచారు కానీ బంగారపు సంకెళ్ళు కూడా సూక్ష్మంగా ఉన్నాయి. ఇవి ఎవ్వరికీ కనిపించనటువంటివి.
కనుక, ఏదైనా బంధనం నుండి ఎంత సహజంగా ముక్తి అవుతారో అంత సహజంగా శరీర బంధనం నుండి ముక్తి కాగలగాలి, లేకపోతే శరీర బంధనం నుండి కూడా చాలా కష్టంగా ముక్తులవుతారు. అంతిమ మతి సో గతి అనేదే ఫైనల్ పేపరు. అంతిమంలో సహజంగా శరీర భానం నుండి ముక్తి కావాలి, ఇదే పాస్ విత్ ఆనర్ గుర్తు. కానీ మీ వస్త్రము టైట్(బిగుతు)గా లేనప్పుడే ఇది వీలవుతుంది. టైట్నెస్ ఉంటే సహజంగా ముక్తిని పొందలేరు. టైట్నెస్ అంటే అర్థము ఎవరిపైననైనా మోహము ఉండటము. కనుక ఈ ఒక్క విషయాన్ని చెక్ చేసుకోండి – ఒక్క సెకండులో ఈ శరీరాన్ని విడిచేంతగా వస్త్రము లూజ్‌గా ఉందా? ఒకవేళ ఎక్కడైనా ఇరుక్కుని ఉంటే బయటకు వచ్చే సమయంలో కూడా ఇరుక్కుంటుంది. దీనినే ఎవరెడీ అంటాము. ఎవరైతే ప్రతి విషయంలో ఎవరెడీగా ఉంటారో వారే ఈ విధంగా ఎవరెడీగా ఉంటారు. సాకారంలో చూసాము కదా, ఒక్క సెకండులో పిలుపు రాగానే ఎవరెడీ అయి చూపించారు. పిల్లలు ఏమవుతారు అని ఆలోచించారా? పిల్లలను కలవకుండా ఎలా వెళ్ళడము అని ఆలోచించారా? ప్రకటన రాగానే ఎవరెడీ అయిపోయారు. వస్త్రము నుండి ఈజీగా ఉంటే వస్త్రాన్ని విడిచిపెట్టడము కూడా ఈజీ అవుతుంది, అందుకే ఈ ప్రయత్నాన్ని ప్రతి సమయం చేస్తూ ఉండాలి. ఎలా ఉన్నాగానీ అతీతంగా ఉన్నారు అన్నదే సంగమయుగ గాయనము. అప్పుడే ఒక్క సెకండులో అతీతంగా అవ్వగలిగారు. బహుకాలం నుండి అతీతంగా ఉన్నవారే ఒక్క సెకండులో అతీతంగా అవ్వగలరు. బహుకాలం నుండి అతీతతనము లేనప్పుడు ఈ శరీరంపై ఉన్న ప్రేమనే పశ్చాత్తాపాన్ని తెస్తుంది, అందుకే దీనితో ప్రియంగా అవ్వకండి. దీనితో ఎంత అతీతంగా ఉంటారో అంతగా విశ్వానికి ప్రియంగా అవుతారు. అందుకని ఇప్పుడు ఈ పురుషార్థాన్నే చేయాలి. ఏదైనా వ్యాధి మొదలైన రూపాలు చూసినప్పుడు వెళ్తాము, అప్పుడు స్వయాన్ని సరి చేసుకుంటాము అని అనుకోకండి. ఇటువంటిదేమీ ఉండదు, అంతిమంలో పిల్లల అద్భుత మరణాలు ఎలా జరుగుతాయంటే సన్ షోస్ ఫాదర్ అవుతుంది. అందరిదీ ఒకేలా జరగదు. కొంతమంది పిల్లలది డ్రామాలో ఈ మృత్యువులో కూడా అద్భుతమైన పాత్రను పోషించే గాయనము ఉంది, దీనితో వీరు సన్ షోస్ ఫాదర్ చేస్తారు. ఎవరిలో అయితే ఒక విశేష గుణం ఉంటుందో వారే ఇది చేయగలరు. ఈ పాత్ర కూడా చాలా కొద్దిమందిదే ఉంటుంది. అంతిమం వరకు బాబాను ప్రత్యక్షం చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్టు. అంతిమ క్షణం కూడా బాబాను ప్రత్యక్షం చేస్తూ ఉంటారు. ఇటువంటి ఆత్మలు తప్పకుండా చాలా పవర్ఫుల్ అయి ఉంటారు, వీరు బహుకాలం నుండి అశరీరిగా అయ్యే అభ్యాసం చేస్తుంటారు. వీరు ఒక్క సెకండులో అశరీరిగా అయిపోతారు. ఉదాహరణకు మీరిప్పుడు యోగంలో కూర్చున్నారు, ఎటువంటి విఘ్నాల స్థితిలో కూర్చున్నా, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటున్నా కానీ ఒక్క సెకండులో ఆలోచించగానే అశరీరిగా అయిపోవాలి. నిజానికి ఒక్క సెకండులో అశరీరిగా అవ్వడం చాలా సహజము కానీ ఏదైనా సమయంలో ఏదైనా విషయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఏదైనా సేవా జంజాటము ఎదురైనప్పుడు కష్టమవుతుంది, కానీ అభ్యాసము ఎలా ఉండాలంటే ఒక్క సెకండులో, సెకండు కూడా ఎక్కువే, ఆలోచిస్తుండగానే వెంటనే జరిగిపోవాలి. ఆలోచించిన తర్వాత పురుషార్థం చేయాల్సిన అవసరం రాకూడదు. ఇప్పుడైతే మీరు ఆలోచించి తర్వాత ఆ అవస్థలో స్థితులవుతారు కానీ ఈ అభ్యాసం చేసేవారి ఆలోచన మరియు స్థితి రెండూ ఒకేసారి జరిగిపోతాయి. ఆలోచన మరియు స్థితిలో తేడా ఉండదు. ఆలోచించడము మరియు జరిగిపోవడము. ఇటువంటి అభ్యాసకులు ఎవరైతే ఉంటారో వారే సేవాబాధ్యతను తీసుకోగలరు. ఇలా కొంతమంది నిమిత్తంగా ఉన్నారు, కానీ చాలాకొద్దిమంది ఉన్నారు, మెజారిటీ లేరు. మైనారిటీ ఉన్నారు, వారిపైన ఇక్కడే పూల వర్షం కురుస్తుంది. ఇలా ఎవరైతే పాస్ విత్ ఆనర్ అవుతారో వారిపైనే ద్వాపరయుగ భక్తులు అంతిమంలో సాకార రూపంలో పూల వర్షాన్ని కురిపిస్తారు. వారు చివరి వరకు సన్ షోస్ ఫాదర్ చేస్తూ ఉంటారు. ఇటువంటి సేవాయోగ్య మృత్యువు జరుగుతుంది. ఈ మృత్యువుతో కూడా సేవ జరుగుతుంది. సేవకు పిల్లలే నిమిత్తము, తల్లిదండ్రులు కాదు. వారు గుప్త రూపంలో ఉంటారు. సేవలో తల్లిదండ్రులు వెన్నెముక వంటివారు, పిల్లలు ముందుంటారు. ఈ సేవా పాత్రలో తల్లిదండ్రుల పాత్ర లేదు. ఇందులో పిల్లలే తండ్రిని షో చేయాలి. ఇది కూడా సేవా అంతిమంలో మెడల్ ప్రాప్తిస్తుంది, ఇటువంటి మెడల్ డ్రామాలో కొంతమంది పిల్లలకు లభించేది ఉంది. నేను మెడల్‌ను ప్రాప్తి చేసుకునేందుకు నిమిత్తంగా కాగలనా అని ప్రతి ఒక్కరూ గమనించుకోండి. పాత సోదరీలే అవ్వగలరు అని కాదు. ఎవ్వరైనా కాగలరు. కొత్త కొత్త రత్నాలు కూడా అద్భుతాన్ని చేసి చూపిస్తారు.
ఇప్పుడు సేవలో నవీనతను తీసుకురావాలి. ఎలా అయితే మీలో నవీనతను తీసుకువస్తారో అలాగే సేవలో కూడా నవీనతను తీసుకురావాలి. నవీనతను తీసుకురావడానికి 5 విషయాలు గుర్తుంచుకోండి. వీరెక్కడి నుండి వచ్చారు అని అందరి నోటినుండి రావాలి. ఆరంభంలో వెలువడినట్టుగా, కానీ ఆరంభంలో వాణి బలము ఉండేది కాదు, ఇప్పుడు మీకు వాణి బలము ఉంది. కానీ అలౌకిక స్థితి యొక్క బలము గుప్తమైపోయింది. దాగిపోయింది. కనుక ఇప్పుడు మళ్ళీ ఇటువంటి అలౌకికతను అందరికీ చూపించండి, అది అందరూ అనుభవం చేయాలి. ఎలా అయితే ఆరంభంలో భట్టీ నుండి వెలువడిన ఆత్మలు ఎంతో సేవకు నిమిత్తమయ్యారు కదా, ఇప్పుడు మళ్ళీ సృష్టి యొక్క దృశ్యాన్ని ఛేంజ్ చేసేందుకు నిమిత్తం కావాలి. వారి ద్వారా ఇప్పుడు సేవ పెరిగింది. మరి ఇటువంటి శక్తిరూపులుగా మరియు స్నేహ రూపులుగా అవ్వండి. వేలాదిమంది మధ్య నిల్చున్నా కానీ దూరంనుండి అలౌకిక వ్యక్తిగా కనిపించాలి. సాకార రూపం గురించి వర్ణిస్తూ, వీరిని అలౌకిక వ్యక్తిగా కొత్త వ్యక్తులు కూడా గుర్తించేవారు అంటారు కదా. వేలమంది మధ్యలో ఆ వజ్రం మెరిసేది. మరి ఫాలో ఫాదర్. వారి వైబ్రేషన్లను మీలోకి తీసుకోకండి, మీ వైబ్రేషన్లతో వారిని అలౌకికంగా చేయండి – ఈ నవీనతను తీసుకురండి. ఇప్పుడు సేవ కారణంగా ప్రాపంచిక వ్యక్తులతో కలిసినట్లుగా కనిపిస్తున్నారు. సేవ కోసం సంబంధాలలో ఉంటూ కూడా అతీతంగా ఉండేందుకు ఇచ్చిన మంత్రాన్ని మర్చిపోకండి. ఇప్పుడు ఆ సంబంధాలు ఏవైతే పెట్టుకోవాలో అవి పెట్టుకున్నారు, ఇప్పుడు ఈ విధంగా సంబంధం పెట్టుకోవలసిన అవసరం కూడా లేదు. సేవ కారణంగా మీరు తేలిక అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆ సమయం గడిచిపోయింది. ఇప్పుడు లౌకికం మధ్యలో అలౌకికంగా కనిపించాలి. అనేక వ్యక్తుల మధ్యన అవ్యక్తమూర్తిగా కనిపించాలి. వారు వ్యక్తంగా కనిపిస్తారు, మీరు అవ్యక్తంగా కనిపించాలి – ఇదే పరివర్తన. ఆరంభంలో ఎవరి వైబ్రేషన్ అయినా లేక సాంగత్యమైనా మీలో పరివర్తన తెచ్చిందా? అందుకే బ్రహ్మాకుమారీలు మొండివారు అనేవారు, కానీ ఆ మొండితనము మంచిదే. ఇది ఈశ్వరీయ మొండితనము, కనుక ఇప్పుడు వైబ్రేషన్ల మధ్య ఉంటూ కూడా స్వయాన్ని అతీతంగా మరియు ప్రియంగా తయారు చేసుకోండి. ఇంతటి సేవను చేయలేరా? కేవలం వాణితో బలిహారం అవ్వరు. మీరు ఎలా బలిహారం అయ్యారు? ఆంతరిక ఆత్మిక స్నేహంతో. ప్రజలను చాలామందిని తయారు చేసుకున్నారు, కానీ ఇప్పుడు బలిహారం చేయించాలి. ఈ సేవ మిగిలి ఉంది. వారసులను తక్కువగా, ప్రజలను ఎక్కువగా చేసుకున్నారు. ఎందుకంటే వాణితో ప్రజలు తయారవుతారు కానీ ఈశ్వరీయ స్నేహము మరియు శక్తితో వారసులుగా అవుతారు, కనుక వారసులను తయారు చేసుకోండి. ఇది ఫస్ట్ స్టేజ్ పురుషార్థము. వాణితో ఎవ్వరినీ నీటిలా కరిగించలేరు కానీ స్నేహము మరియు శక్తితో ఒక్క సెకండులో స్వాహా చేయించగలరు. దీనికి కూడా అంతిమంలో మార్కులు లభిస్తాయి. వారసులను ఎంతమందిని తయారు చేసారు, ప్రజలను ఎంతమందిని తయారు చేసారు? వారసులు కూడా ఏ వెరైటీ మరియు ప్రజలు కూడా ఏ వెరైటీ వారిని తయారు చేసారు మరియు ఎంత సమయంలో తయారు చేసారు? ఫైనల్ పేపరును ఈరోజు వినిపిస్తున్నాము. ఏ ఏ ప్రశ్నలకు మార్కులు లభిస్తాయి అని వినిపిస్తున్నాము, ఒకటైతే ఈ ప్రశ్న అంతిమ రిజల్టులో ఉంటుంది. రెండవది వినిపించాము కదా, అంతిమం వరకు సేవ యొక్క షో. మూడవ విషయము, ఆది నుండి అంతిమం వరకు ఏ అవస్థ అయితే ఉండినదో అందులో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు మరియు ఎంత సమయంలో విజయాన్ని పొందారు? ఏదైనా సమస్యను ఎదుర్కోవడంలో ఎంత సమయం పట్టింది? ఇందుకు కూడా మార్కులు ఉంటాయి. మరి, జీవితమంతా చేసిన సేవ, స్వ స్థితి మరియు అంతిమం వరకు సేవకు రుజువు – ఈ మూడు విషయాలను చూడటం జరుగుతుంది.
ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ, ఈ మూడు విషయాలలో తమ లెక్కలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని ఇతరుల ముందు చూసుకోగలరా? రిజల్టును ముందుకు తీసుకువచ్చి, మీ రిజల్టును ముందు నుండే చెక్ చేసుకోవచ్చు, ఏదైతే లోపము ఉందో దానిని రివైజ్ చేసి పూర్తి చేయవచ్చు. ఇప్పుడు కూడా ఒకవేళ ఈ విషయాలలో లోపం ఉంటే నింపుకోండి. మేకప్ చేసుకోవచ్చు. అర్థగంటలో కూడా బండిని మేకప్ చేయవచ్చు. 6 గంటలలో అవ్వనిది అర్థగంటలో అవుతుంది. కనుక ఇప్పుడు మేకప్ చేసుకోవడానికి ఇది చివరి అవకాశము. ఇప్పుడు రిజల్టును చూస్తాము. చాలా ఉన్నతమైన ఆత్మలు మన వద్దకు వచ్చారు అని ఆరంభంలో సమాచారము వచ్చేది కదా, అలా ఇప్పుడు కూడా మళ్ళీ ఆ సమాచారము రావాలి. భట్టీ అర్థమే పరివర్తన. అచ్ఛా!
ఓంశాంతి