Search for a command to run...
28 Mar 2006
విశ్వములోని ఆత్మలను దుఃఖాల నుండి విడిపించేందుకు మనసా సేవను పెంచండి, సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వండి
28 March 2006 · తెలుగు
ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్‌దాదా తమ నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ సర్వ ఖజానాలకు యజమానిగా తయారుచేసారు. ఇచ్చేవారు ఒక్కరే మరియు వారు అందరికీ ఒకే విధంగా సర్వ ఖజానాలను ఇచ్చారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకని? బాబా తరగని ఖజానాలకు యజమాని. అది అనంతమైన ఖజానా, కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని ఖజానాలకు యజమానులు. బాప్‌దాదా పిల్లలందరికీ ఒకే విధంగా, సమానంగా ఇచ్చారు. కానీ ధారణ చేసేవారిలో కొందరు సర్వ ఖజానాలను ధారణ చేసేవారైతే కొందరు యథా శక్తితో ధారణ చేసేవారు. కొందరు నంబర్‌వన్ అయితే, కొందరు నంబరువారుగా ఉన్నారు. ఎవరు ఎంతగా ధారణ చేసారో అంతగా వారి ముఖము నుండి, నయనాల నుండి ఖజానాల నషా స్పష్టముగా కనిపిస్తుంది. ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మ ముఖము ద్వారా, నయనాల ద్వారా నిండుగా కనిపిస్తుంది. ఏ విధంగా స్థూల ఖజానాను ప్రాప్తి చేసుకునే ఆత్మ యొక్క నడవడిక ద్వారా, ముఖము ద్వారా ఆ నషా కనిపిస్తుందో, అలా ఈ అవినాశీ ఖజానాల నషా, సంతోషము స్పష్టముగా కనిపిస్తాయి. సంపన్నత యొక్క నషా నిశ్చింత చక్రవర్తులుగా తయారుచేస్తుంది. ఎక్కడైతే ఈశ్వరీయ నషా ఉంటుందో అక్కడ చింత ఉండదు, నిశ్చింత చక్రవర్తులుగా, నిశ్చింతపురికి చక్రవర్తులుగా అవుతారు. మరి మీరందరూ ఈశ్వరీయ సంపన్నతా ఖజానాలు కల నిశ్చింత చక్రవర్తులే కదా! మీరు నిశ్చింతపురికి చక్రవర్తులు. ఏదైనా చింత ఉందా? ఏదైనా దుఃఖము ఉందా? ఏమవుతుందో, ఎలా అవుతుందో అన్నదాని చింత కూడా ఉండకూడదు. త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉండేవారికి, ఏదైతే జరుగుతూ ఉందో అది మంచిది, ఏదైతే జరగబోయేది ఉందో అది ఇంకా మంచిది అన్న విషయము తెలుసు. ఎందుకని? మీరు సర్వశక్తిమంతుడైన బాబాకు సహచరులు, వారితో పాటు ఉండేవారు. బాప్‌దాదా సదా మా హృదయములో ఉంటారు మరియు మేము సదా బాబా హృదయ సింహాసనముపై ఉంటాము అని ప్రతి ఒక్కరికీ నషా ఉంది, శుద్ధ గర్వము ఉంది. ఇటువంటి నషా ఉంది కదా! ఎవరైతే హృదయ సింహాసనాధికారులో వారి సంకల్పములో కాదు కదా, కనీసం స్వప్నములో కూడా దుఃఖపు అల అంశమాత్రముగా కూడా రాదు. ఎందుకని? వారు సర్వ ఖజానాలతో నిండుగా ఉంటారు, నిండుగా ఉన్న వస్తువులో అలజడి కలగదు కదా.
నలువైపులా ఉన్న పిల్లల యొక్క సంపన్నతను చూస్తున్నాము, బాప్‌దాదా ప్రతి ఒక్కరి జమా ఖాతాను చెక్ చేసారు. ఖజానాలైతే తరగనంతగా లభించాయి కానీ లభించిన ఆ ఖజానాలను కార్యములో పెడుతూ ఖాళీ చేసేసారా లేక లభించిన ఆ ఖజానాలను కార్యములో కూడా పెట్టారు మరియు పెంచారు కూడానా? ప్రతి ఒక్కరి ఖాతాలో ఎంత శాతము జమ అయ్యింది? ఎందుకంటే ఈ ఖజానాలు కేవలము ఇప్పుడు ఈ సమయము కొరకే కాదు, ఈ ఖజానాలు భవిష్యత్తులో కూడా మీతోపాటు వస్తాయి. జమ అయినదే మీతోపాటు వస్తుంది. కావున శాతము చూస్తున్నాము. ఏమి చూసాము? సేవనైతే పిల్లలందరూ యథా యోగము, యథా శక్తి అనుసారముగా చేస్తున్నారు, కానీ సేవా ఫలము జమ అవ్వటములో తేడా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లల జమ ఖాతాను చూసాము, వారు సేవనైతే చాలానే చేస్తారు కానీ సేవ చేసినందుకు ఫలము జమ అయ్యిందా లేదా అన్నదాని గుర్తులు ఏముంటాయి? సేవ ఏదైనా కానీ, అది మనసా సేవ అయినా, వాచా సేవ అయినా, కర్మణా సేవ అయినా, మూడింటిలోనూ 100 శాతము మార్కులు ఉంటాయి. మూడింటిలోనూ 100 శాతము ఉంటాయి. సేవనైతే చేసారు కానీ ఒకవేళ సేవ చేసే సమయములో లేక సేవ చేసిన తరువాత స్వయము తమ మనసులో స్వయముతో సంతుష్టముగా ఉన్నారా, అలాగే ఎవరి సేవనైతే చేసారో వారు, అలాగే ఎవరైతే సేవలో సహచరులుగా ఉన్నారో వారు, లేక సేవ చేసేవారిని చూసినవారు, విన్నవారు, వారంతా కూడా సంతుష్టముగా ఉన్నారంటే, జమ అయినట్లుగా భావించండి. స్వయము యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత లేనట్లయితే జమ అయినదాని శాతము తక్కువైపోతుంది.
యథార్థ సేవకు విధి ఏమిటి అనేది ఇంతకుముందు కూడా చెప్పాము - మూడు విషయాలు విధిపూర్వకముగా ఉన్నట్లయితే జమ అవుతుంది, అవేమిటో వినిపించాము కదా - ఒకటి నిమిత్త భావము, రెండు నిర్మాన భావన, మూడు నిర్మల స్వభావము, నిర్మల వాణి. భావము, భావన మరియు స్వభావము, మాటలు. ఒకవేళ ఈ మూడు విషయాలలో ఏ ఒక్కటైనా తక్కువగా ఉన్నట్లయితే, ఒకటి ఉండి రెండు లేకపోయినా, రెండు ఉండి ఒకటి లేకపోయినా కూడా, ఆ లోటు జమ శాతమును తగ్గించేస్తుంది. కావున నాలుగు సబ్జెక్టులలోనూ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - నాలుగు సబ్జెక్టులలోనూ మా ఖాతా జమ అయ్యిందా? ఎందుకని? బాప్‌దాదా చూసారు - భావము, భావన, స్వభావము, మాటలు... అని ఈ నాలుగు విషయాలనేవైతే వినిపించామో, వాటి అనుసారముగా చూస్తే, చాలామంది పిల్లల సేవా సమాచారము చాలా ఎక్కువగా ఉంది కానీ జమ ఖాతా తక్కువగా ఉంది.
ప్రతి ఖజానాను చెక్ చేసుకోండి - జ్ఞాన ఖజానా అనగా ఏ సంకల్పాలు మరియు కర్మలైతే చేసారో, అవి నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యి చేసారా? అవి సాధారణముగా అయితే లేవు కదా? యోగము అనగా సర్వ శక్తుల ఖజానా నిండుగా ఉండాలి. కనుక చెక్ చేసుకోండి - ప్రతి రోజు యొక్క దినచర్యలో ఏ సమయములో ఏ శక్తి యొక్క అవసరము ఉందో, ఆ సమయములో ఆ శక్తి ఆర్డర్లో ఉందా? మాస్టర్ సర్వశక్తిమాన్ అంటేనే యజమాని అని అర్థము. సమయము గడిచిపోయిన తరువాత ఆ శక్తి గురించి ఆలోచిస్తూ ఉండిపోవటం లేదు కదా. ఒకవేళ అవసరమైన సమయములో శక్తిని ఆజ్ఞాపించినప్పుడు అది ప్రత్యక్షము కాకపోతే, ఒక్క శక్తినైనా సరే ఆజ్ఞానుసారముగా నడిపించలేకపోతే, మరి నిర్విఘ్న రాజ్యానికి అధికారులుగా ఎలా అవుతారు? మరి శక్తుల ఖజానా ఎంత జమ అయి ఉంది? అవసరమైన సమయములో కార్యములో పెట్టినప్పుడే అది జమ అవుతుంది. కావున, నా ఖాతా ఎంత ఉంది అన్నదానిని చెక్ చేసుకుంటూ వెళ్తున్నారా? ఎందుకంటే బాప్‌దాదాకు పిల్లలందరి పట్ల అతి ప్రేమ ఉంది, పిల్లలందరి జమ ఖాతా నిండుగా ఉండాలి అని బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు. ధారణలో కూడా నిండుగా ఉండాలి. ధారణ ఉంది అన్నదానికి గుర్తు ఏమిటంటే, ప్రతి కర్మ గుణ సంపన్నముగా ఉంటుంది. ఏ సమయములో ఏ గుణము యొక్క అవసరము ఉంటుందో, ఆ గుణము ముఖము, నడవడికలో ఇమర్జ్ అయి కనిపించాలి. ఒకవేళ ఏ గుణములోనైనా లోటు ఉంటే, ఉదాహరణకు కర్మ చేసే సమయములో సరళతా గుణము అవసరమనుకోండి, మధురత అవసరమనుకోండి, అప్పుడు మాటలలో, కర్మలలో ఒకవేళ సరళత, మధురతకు బదులుగా కాస్త ఆవేశము వస్తే లేక అలసట కారణముగా మాటలు మధురముగా లేకపోతే, ముఖము మధురముగా లేకపోతే, సీరియస్‌గా ఉంటే, అప్పుడు వారిని గుణ సంపన్నులు అని అనరు కదా! పరిస్థితులు ఎటువంటివైనా కానీ నా గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ గుణాలే ఇమర్జ్ అవ్వాలి. ప్రస్తుతము క్లుప్తంగా వినిపిస్తున్నాము.
అలాగే సేవ - సేవలో సేవాధారుల యొక్క అన్నింటికంటే మంచి లక్షణము ఏమిటంటే - స్వయము కూడా సదా తేలికగా, లైట్‌గా మరియు సంతోషముగా కనిపించటము. సేవకు ఫలము సంతోషము. ఒకవేళ సేవ చేస్తున్నప్పుడు సంతోషము మాయమైపోతే సేవా ఖాతా జమ అవ్వదు. సేవ చేసారు, సమయాన్ని వెచ్చించారు, కష్టపడ్డారు అంటే అప్పుడు కొంచెము శాతములో జమ అవుతుంది, వ్యర్థముగా పోదు, కానీ ఎంత శాతములో జమ అవ్వాలో అంత జమ అవ్వదు. అలాగే సంబంధ-సంపర్కాలలో జమ అవ్వడానికి గుర్తు - ఆశీర్వాదాలు ప్రాప్తించటము. ఎవరి సంబంధ, సంపర్కములోకైతే వస్తారో వారి మనసు నుండి మీ కొరకు ఆశీర్వాదాలు వెలువడాలి - చాలా మంచివారు అని ఊరికే పైపైకి అనటం కాకుండా, మనసు నుండి వెలువడాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు వెలువడాలి. ఆశీర్వాదాలు ప్రాప్తించినట్లయితే ఆశీర్వాదాలు లభించటమనేది చాలా సహజ పురుషార్థానికి సాధనము. భాషణ చెయ్యకపోయినా కానీ, సరే, మనసా సేవ కూడా అంత శక్తిశాలిగా లేదనుకోండి, కొత్త-కొత్త ప్లాన్లు తయారుచెయ్యటం రాదనుకోండి, ఏమీ ఫర్వాలేదు, అన్నిటికంటే సహజ పురుషార్థానికి సాధనము - ఆశీర్వాదాలను తీసుకోండి, ఆశీర్వాదాలను ఇవ్వండి. ఇలా బాప్‌దాదా అనేకమంది పిల్లల మనసులోని సంకల్పాలను చదువుతారు. కొంతమంది పిల్లలు సమయమనుసారముగా, పరిస్థితుల అనుసారముగా ఏమంటూ ఉంటారంటే, ఒకవేళ ఎవరైనా చెడు పని చేసారనుకోండి, అప్పుడు వారికి ఆశీర్వాదాలను ఎలా ఇవ్వాలి? వారిపైనైతే కోపము వస్తుంది కదా, వారికి ఆశీర్వాదాలను ఎలా ఇవ్వాలి? అంతేకాక క్రోధానికి పిల్లాపాపలు కూడా చాలా ఉంటాయి. సరే, అతను చెడు పని చేసారు, అతను చెడ్డవాడు, వారు చెడు పని చేసారు అని మీరు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. మీరు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు, మంచిగా అర్థం చేసుకున్నారు, కానీ ఒకటేమో అర్థం చేసుకోవటము, మరొకటి వారి చెడు పనులను, చెడు విషయాలను మీ మనసులో పెట్టుకోవటము. అర్థం చేసుకోవటానికి మరియు లోపల పెట్టుకోవటానికి తేడా ఉంది. ఒకవేళ మీరు తెలివైనవారైతే, తెలివైనవారు ఎక్కడైనా చెడు విషయాలను తమ వద్ద పెట్టుకుంటారా? వారు చెడ్డవారు అన్న విషయాన్ని మీ మనసులో పెట్టుకున్నారు అంటే మీరు చెడు వస్తువును మీ వద్ద పెట్టుకున్నట్లు, దానిని సంభాళించినట్లు. అర్థం చేసుకోవటము వేరే విషయము, లోపల పెట్టుకోవటము వేరే విషయము. తెలివైనవారిగా అవ్వటము మంచిదే, అవ్వండి, కానీ లోపల పెట్టుకోవద్దు. ‘వీరు ఉన్నదే ఇలా’ అని అనుకున్నారంటే అది లోపల పెట్టుకున్నట్లు. ఇలా భావిస్తూ వ్యవహారములోకి రావటము అంటే అది తెలివైన పని కాదు. బాప్‌దాదా చెక్ చేసారు. ఇప్పుడు సమయము దానంతటదే సమీపముగా రాదు, మీరు తీసుకురావాలి. కొందరు ఏమని అడుగుతుంటారంటే, 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎంత సమయము పడుతుందో కాస్త సూచన అయితే ఇవ్వండి కదా!
మరి బాబా పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు, బాబానైతే చాలా ప్రశ్నలు అడుగుతుంటారు కదా. ఈరోజు బాబా పిల్లలను ప్రశ్నిస్తున్నారు - సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేవారు ఎవరు? డ్రామాయే, కానీ నిమిత్తులెవరు? ఎవరు ఆపినందుకు ఉదయము ఆగి ఉంది...(కిస్కే రోకే రుకా హై సవేరా...) అని మీ పాట కూడా ఒకటి ఉంది కదా. పాట ఉంది కదా? మరి ఆ ఉదయాన్ని తీసుకువచ్చేవారు ఎవరు? వినాశనకారులైతే వినాశనము చెయ్యాలి, వినాశనము చెయ్యాలి... అని తపిస్తూ ఉన్నారు కానీ నవ నిర్మాణము చేసేవారు అంతగా రెడీగా ఉన్నారా? ఒకవేళ పాతది సమాప్తమైపోయిన తరువాత నవ నిర్మాణము జరగకపోతే ఏమవుతుంది? అందుకని బాప్‌దాదా ఇప్పుడు తండ్రి రూపానికి బదులుగా టీచర్ రూపాన్ని ధారణ చేసారు. హోమ్‌వర్క్ ఇచ్చారు కదా? హోమ్‌వర్క్ ఎవరు ఇస్తారు? టీచరు. చివరిలో ఉన్నది సద్గురువు పాత్ర. కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - సంపన్న మరియు సంపూర్ణ స్థితి ఎంతవరకు తయారైంది? శబ్దము నుండి అతీతమవ్వటము మరియు శబ్దములోకి రావటము, ఈ రెండూ సమానముగా ఉన్నాయా? ఎప్పుడు కావాలంటే అప్పుడు శబ్దములోకి రావటము సహజమైపోయిందో, అలాగే శబ్దము నుండి దూరమైపోవటము, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఉందా? క్షణములో శబ్దములోకి రావటము, క్షణములో శబ్దము నుండి అతీతమైపోవటము - అంత ప్రాక్టీస్ ఉందా? ఏ విధంగా శరీరము ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడకు కావాలంటే అక్కడకు రావటము-పోవటము చెయ్యగలరు కదా, అలాగే మనసు, బుద్ధి ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడకు కావాలంటే అక్కడకు రావటము-పోవటము చెయ్యగలరా? ఎందుకంటే అంతిమములో పాస్ మార్కులు ఎవరికి లభిస్తాయంటే ఎవరైతే క్షణములో ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా, ఏది ఆజ్ఞాపిస్తే అందులో సఫలురైపోవాలి. సైన్స్ వారు కూడా, సహజముగా కూడా ఉండాలి మరియు తక్కువ సమయములో అయిపోవాలి అని ఇదే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. మరి అటువంటి స్థితి ఉందా? నిమిషాల వరకు వచ్చారా, క్షణాల వరకు వచ్చారా, ఎక్కడి వరకు వచ్చారు? లైట్ హౌస్ , మైట్ హౌస్ అనేది ఒక్క క్షణములో ఆన్ చెయ్యగానే దాని కాంతిని వ్యాపింపజేస్తుంది కదా, అలాగే మీరు క్షణములో లైట్ హౌస్‌గా అయ్యి నలువైపులా లైట్‌ను వ్యాపింపజెయ్యగలరా? ఈ స్థూల నేత్రాలు ఒక స్థానములో కూర్చునే దూరము వరకు చూడగలవు కదా, వాటి దృష్టిని వ్యాపింపజెయ్యగలవు కదా! అలాగే మీరు మూడవ నేత్రము ద్వారా ఒక స్థానములో కూర్చునే వరదాత, విధాతగా అయ్యి నలువైపులా ఉన్నవారిని మీ దృష్టితో సంతృప్తిపరచగలరా? మిమ్మల్ని మీరు అన్ని విషయాలలోనూ చెక్ చేసుకుంటున్నారా? మూడవ నేత్రము అంత శుభ్రముగా, స్పష్టముగా ఉందా? అన్ని విషయాలలోనూ ఒకవేళ కొంచెము బలహీనత ఉన్నా కానీ, దానికి కారణము ఇంతకుముందు కూడా వినిపించాము కదా, అదేమిటంటే - ‘నేను మరియు నాది’కి సంబంధించిన హద్దులోని మోహము. నేను అన్నదాని గురించి స్పష్టముగా వినిపించాము కదా, హోమ్‌వర్క్ కూడా ఇచ్చాము. రెండు, ‘నేను’ అనేవాటిని సమాప్తము చేసి ఒక్క ‘నేను’ను ఉంచుకోవాలి. అందరూ ఈ హోమ్‌వర్క్‌ను చేసారా? ఎవరైతే ఈ హోమ్‌వర్క్‌లో సఫలురయ్యారో వారు చేతులెత్తండి. బాప్‌దాదా అందరినీ చూసారు. ధైర్యము పెట్టండి, భయపడకండి, చేతులెత్తండి. మంచిది, అభినందనలు లభిస్తాయి. చాలా కొద్దిమంది ఉన్నారు. వీరందరి చేతులను టి.వి.లో చూపించండి. చాలా కొద్దిమంది చేతులెత్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అందరికీ తమపై తమకే నవ్వు కూడా వస్తుంది.
అచ్ఛా - రెండవ హోమ్‌వర్క్- క్రోధాన్ని వదలటము, ఇదైతే సహజమే కదా! క్రోధాన్ని ఎవరు వదిలారు? ఇన్ని రోజులలో ఎప్పుడూ క్రోధము చేయలేదా? (ఇందులో చాలామంది చేతులెత్తారు). ఇందులో కొంచెం ఎక్కువమందే ఉన్నారు. ఎవరైతే క్రోధము చేయలేదో, ఈ విషయములో మీ చుట్టుపక్కల ఉన్నవారిని కూడా అడుగుతాము. ఎవరైతే చేతులెత్తారో వారు లేచి నిలబడండి. అచ్ఛా, చాలామంది ఉన్నారు. క్రోధము చేయలేదా? సంకల్పములోనైనా, మనసులోనైనా క్రోధము వచ్చిందా? సరే, అయితే అభినందనలు, ఒకవేళ మనసులో క్రోధము వచ్చినాగానీ నోటి ద్వారా కోప్పడలేదంటే అందుకు కూడా అభినందనలు. చాలా మంచిది.
రిజల్ట్ లెక్కలో మీరే చూడండి - స్థాపనా కార్యము అనగా స్వయాన్ని సంపన్నముగా చేసుకోవటము మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించటము, ఇది సంపన్నమైందా? స్వయాన్ని జీవన్ముక్తి స్వరూపముగా తయారు చేసుకోవటము మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించటము - ఇదే స్థాపనా కర్తలైన ఆత్మల శ్రేష్ఠ కర్మ. అందుకనే బాప్‌దాదా అడుగుతున్నారు - సర్వ బంధనాల నుండి ముక్తులై, జీవన్ముక్తి స్థితికి సంగమములోనే చేరుకోవాలా లేక సత్యయుగములో చేరుకోవాలా? సంగమయుగములో సంపన్నంగా అవ్వాలా లేక అక్కడ కూడా రాజయోగాన్ని చేసి నేర్చుకోవాలా? సంపన్నంగా అయితే ఇక్కడే అవ్వాలి కదా? సంపూర్ణంగా కూడా ఇక్కడే అవ్వాలి. సంగమయుగ సమయము కూడా అన్నింటికంటే అత్యంత పెద్ద ఖజానా. మరి ఎవరు ఆపినందుకు ఉదయము ఆగి ఉంది? చెప్పండి.
మరి బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే బాబా ఆశల దీపాలు పిల్లలే కదా. కనుక మీ ఖాతాను బాగా చెక్ చేసుకోండి. కొంతమంది పిల్లలను చూసాము, మౌజీరామ్ వలె ఉన్నారు, మజాలో నడుస్తున్నారు. ఏది జరిగితే అదే మంచిది అని అనుకుంటున్నారు. ఇప్పుడైతే బాగా ఆనందించండి, సత్యయుగములో ఎవరు చూస్తారు, ఎవరికి తెలుసు అని అనుకుంటున్నారు. జమ ఖాతాలో ఇటువంటి మజాలాల్ అనండి, మజారామ్ అనండి, ఇటువంటి పిల్లలను కూడా చూసాము. వారు ఇతరులకు కూడా చెప్తూ ఉంటారు - అరే, ఏం చేసేది ఉంది, ఆనందించండి, తినండి, త్రాగండి, ఆనందాన్ని అనుభవించండి. ఆనందించండి. సరే, ఆనందించండి అని బాబా కూడా అంటారు. ఒకవేళ కొంచెములోనే సంతోషపడిపోయేవారైతే కొంచెముకే సంతోషపడిపోండి. వినాశీ సాధనాల ఆనందము అల్పకాలికముగా ఉంటుంది. సదాకాలము యొక్క ఆనందాన్ని వదిలి ఒకవేళ అల్పకాలికమైన సాధనాల ఆనందములో ఉండాలనుకుంటే ఇక బాప్‌దాదా ఏమంటారు? సూచనను ఇస్తారు, ఇంకేమి చేస్తారు? ఎవరైనా వజ్రాల గని వద్దకు వెళ్ళి రెండు వజ్రాలను తీసుకుని వాటికే సంతోషపడిపోతే ఇక అటువంటివారిని ఏమంటాము? అటువంటివారిగా అవ్వకండి. అతీంద్రియ సుఖము యొక్క ఆనందాల ఊయలలో ఊగండి. అవినాశీ ప్రాప్తుల ఊయల అనే ఆనందములో ఊగండి. డ్రామాలో చూడండి, మాయ పాత్ర కూడా విచిత్రమైనది. ఈ సమయములోనే ఎలాంటి, ఎలాంటి సాధనాలు వెలువడ్డాయంటే, అవి ఇంతకుముందు అసలు లేనే లేవు. కానీ సాధనాలు లేకుండా కూడా ఎవరైతే సాధన చేసారో, సేవ చేసారో, ఆ ఉదాహరణమూర్తులు కూడా ఎదురుగా ఉన్నారు కదా! ఈ సాధనాలు ఇంతకుముందు ఉండేవా? కానీ సేవ ఎంతగా జరిగింది? క్వాలిటీవారైతే వెలువడ్డారు కదా! ఆది రత్నాలైతే తయారయ్యారు కదా! ఇది సాధనాల ఆకర్షణ. సాధనాలను ఉపయోగించటము తప్పు అని అనటం లేదు కానీ సాధనను మర్చిపోయి సాధనాలలో మునిగిపోవటము, దీనిని బాప్‌దాదా తప్పు అంటారు. సాధనాలు జీవితములో ఎగిరే కళకు సాధనము కాదు, అవి ఆధారము కాదు. సాధనే ఆధారము. ఒకవేళ సాధనకు బదులుగా సాధనాలను ఆధారముగా చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది? సాధనాలు వినాశీ అయినవి, రిజల్టు ఏముంటుంది? సాధన అవినాశీ అయినది, దాని రిజల్ట్ ఏముంటుంది? అచ్ఛా!
మరి బాప్‌దాదా పిల్లలను ప్రశ్న అడుగుతున్నారు – ఎప్పటివరకు ప్రతి ఒక్కరూ స్వయాన్ని సంపన్నంగా మరియు సంపూర్ణంగా తయారు చేసుకుంటారు? ఇతరులను చూడకండి, ఇది నిర్లక్ష్యాన్ని తీసుకువస్తుంది. ఇతరులు కూడా చేస్తున్నారు కదా, నేను చేస్తే ఏమవుతుంది! ఇదే నిర్లక్ష్యము. నేను స్వయాన్ని సంపన్నం చేసుకోవాలి. ఇప్పుడు ఇందుకోసం ఎంత సమయం కావాలి? దీని లెక్క కూడా పెట్టుకోవాలా వద్దా? సంగఠన ఇది, బాబాకు తెలుసు, సంగఠనలో చాలా వినవలసి ఉంటుంది, చూడవలసి వస్తుంది, నడుస్తూ ఉంటే ఎదురుగా అనేక విషయాలు వస్తాయి, కానీ ఇవన్నీ వస్తాయి. విషయాలు సమాప్తమైతే నేను సంపన్నంగా అవుతాను అంటే అది జరగని పని. ఎంతగా ముందుకు వెళ్తుంటారో, రూపం తప్పకుండా మారుతుంది కానీ విషయాలైతే వస్తాయి. చివరి పేపర్లోనే చూడండి ఎన్ని పేపర్లు వచ్చాయో! కానీ విషయాలు కనిపించకూడదు, బాబా కనిపించాలి. బాబా ఏమి చెప్పారు అన్నది ఆలోచించండి, విషయాలు ఏమి చేస్తాయి, విషయాలు ఏమి చెప్తున్నాయి అని కాదు. బాబా ఏమి చెప్పారు. బాబాను ఫాలో చేయాలి. విషయాలను ఫాలో చేయాలా లేక ఫాలో ఫాదర్ చేయాలా? బాప్‌దాదా ఇప్పుడు ఇది చూడాలనుకుంటున్నారు, ఒకవేళ వతనంలో స్విచ్ ఆన్ చేస్తే, దేశంలోగానీ విదేశంలోగానీ, గ్రామంలోగానీ, పెద్ద పట్టణాలలోగానీ పిల్లలందరూ సంపన్న రూపంలో రాజా పిల్లలుగా కనిపించాలి. ఇప్పుడు బాబాకు తమ పిల్లలందరిపై ఈ శ్రేష్ఠ ఆశయే ఉంది. మరి మీరందరూ బాబా యొక్క ఆశా దీపాలే కదా! అవుతాము అంటే చేతులెత్తండి. అలా ఊరికే చేతులెత్తకండి. ఫైల్లో చేసారు అన్న మాటను వ్రాయమంటారా, కాదు ఫైనల్ అని రాయమంటారా? అందరూ ఈ ఆశను పూర్తి చేస్తారా? అచ్ఛా, అభినందనలు. ఎవరైతే చేతులెత్తలేదో వారు చేతులెత్తండి. ఎవరైనా ఉన్నారా? అచ్ఛా, వీరికి టైమ్ కావాలా? ఒక సంవత్సరం కావాలా? తీవ్ర పురుషార్థం చేయండి. చేయవలసిందే, జరగవలసిందే. మెజారిటీ ఎత్తారు. బాప్‌దాదాకు ఇందుకు సంతోషంగా ఉంది మరియు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలను ఇస్తున్నారు, ఇప్పుడు ప్రాక్టికల్‌గా చేసి చూపించండి. తర్వాత బాప్‌దాదా వస్తారు. ఇప్పుడు టీచర్ అయి వస్తారు, అలా వచ్చేయరు. ఇప్పుడు మధ్యలో సమయం ఉంది. మొదటి టర్న్‌కు బాప్‌దాదా వచ్చినప్పుడు, మొదటి టర్న్ ఫారెన్ వారికి లభిస్తుంది, అయితే ముందుగా ఫారెన్ వారు తయారు కావలసి ఉంటుంది. రెడీ? ఫారెన్ వారు తయారవుతారా? ఒకవేళ ఫారెన్ వారు తయారవ్వకపోతే మొదటి టర్న్‌ను ఇండియాకు ఇస్తాము. ముందు మధుబన్ వారు తయారు కావలసి ఉంటుంది ఎందుకంటే బాప్‌దాదా రావలసింది మధుబన్లోనే కదా, మరింకెక్కడా రారు. బాప్‌దాదాకు ఫారెన్ వారిపై నమ్మకము ఉంది, ఇండియా వారిపై లేదని కాదు. కానీ ఫారెన్ వారిది మొదటి టర్న్ అయినప్పుడు తయారయ్యే చూపిస్తారు. సరేనా! ఫారెన్ కోసం మీరు చెప్పండి (దాదీ జానకితో) సాకారంలో అయితే మీరు నిమిత్తం కావలసి ఉంటుంది. ఇప్పుడింకా సమయం ఉంది, 5-6 నెలల సమయం ఉంది. మరి సత్యమైన హృదయంతో సమాచారాన్ని వ్రాయండి. బాప్‌దాదా అయితే చూస్తారు కదా, ఇప్పుడు కొద్దిగా మిక్స్ అయి ఉన్నారని బాప్‌దాదా వద్ద కనిపిస్తుంది. ఎవరైతే ఎవరెడీ అని వ్రాస్తారో వారినే బాప్‌దాదా కలుస్తారు, ఇతరులను కలవరు. మధుబన్ వారు కావచ్చు, మరెక్కడివారైనా కావచ్చు. సరేనా? మధుబన్ వారు, సరేనా? డబల్ విదేశీయులైతే ఎవరెడీగా ఉంటారు కదా! బాప్‌దాదా అందరి సంపన్న స్వరూపాన్ని చూస్తారు. ఎవరెడీగా ఉంటారా? సరేనా? మెజారిటీ చేతులెత్తారు. అభినందనలు. అందరికీ ముందుగానే అభినందనలు తెలుపుతున్నాము. తర్వాత అందరూ ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి, వాహ్! సంపూర్ణ్ వాహ్! వాహ్! సంపన్న్ వాహ్! ఎందుకంటే దుఃఖము పెరుగుతుంది, మీరు మొర వినడం లేదు కదా, బాప్‌దాదా వింటారు. బాగా ధైర్యహీనులుగా, నిరాశగా అయిపోయారు. ఎలా అయితే సైన్స్ వారు కూర్చున్న చోటనుండే తమ యంత్రాన్ని ఎక్కడకు పంపాలో అక్కడకు పంపిస్తారో అలాగే మీరు మీ మనసా శక్తి ద్వారా సేవను చేయండి. మనసా సేవను పెంచండి. వాచ అయితే చేయాల్సిందే కానీ విశ్వాత్మలకు వారసత్వము ఇప్పించడము, దుఃఖము నుండి విడిపించడము, ఇందుకోసం మీరు సంపన్నంగా అవ్వవలసి ఉంటుంది. మనసా సేవను నలువైపులకు వ్యాప్తి చేయండి అప్పుడే విశ్వ కళ్యాణము జరుగుతుంది. ఇటువంటి మనసా సేవను చేయగలరా? ఎవరికైతే మనసా సేవను చేసే అభ్యాసము ఉందో, కొద్దిగా చేసినా ఎక్కువ చేసినాగానీ అభ్యాసము ఉంటే చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) ఇందులో అందరూ పాస్ అయ్యారు. ఇంతమంది ఆత్మలు ఒకవేళ మనసా సేవతో వాయుమండలాన్ని వ్యాప్తి చేయగలిగినప్పుడు ఏమంత పెద్ద విషయము! ఎంతగా మనసా సేవలో బిజీగా ఉంటారో అంతగా సమస్యల నుండి ముక్తులవుతారు. ఎందుకంటే మీ మనసు, బుద్ధి బిజీగా ఉంటాయి, ఫ్రీగా లేకపోతే మాయ ఎక్కడినుండి వస్తుంది, తిరిగి వెళ్ళిపోతుంది. సమస్య ధైర్యాన్ని ఉంచలేదు. కావున మనసా సేవను పెంచండి. అర్థమయిందా!
అచ్ఛా. ఇప్పుడు ఒక్క నిమిషం కోసం అందరూ లైట్ హౌస్, మైట్ హౌస్ స్థితి ద్వారా విశ్వంలో మీ లైట్ మైట్‌ను వ్యాప్తి చేయండి. (డ్రిల్) అచ్ఛా – ఇలాంటి అభ్యాసాన్ని ఎప్పటికప్పుడు కార్యంలో ఉంటూ కూడా చేస్తూ ఉండండి.
లండన్ ప్రోగ్రామ్ కోసం చాలా మంచి టాపిక్‌ను ఎంచుకున్నారని బాప్‌దాదా విన్నారు. అందరికీ వినిపించండి (జయంతి అక్కయ్య వినిపించారు – జస్ట్ ఎ మినట్ – ఒక్క నిమిషంలో సైలెన్స్ అనుభూతి, స్వ పరివర్తన యొక్క అనుభూతి) మంచి టాపిక్‌ను పెట్టారు. ఈ అభ్యాసము ఆ సమయంలో ఇండియావారు, ఫారెన్వారు అందరూ చేస్తారు కదా! (ఈ ప్రోగ్రామ్ అన్ని చోట్ల విశ్వవ్యాపిగా చేయాలన్నది సంకల్పం) మంచిది, ఈ అభ్యాసము అవసరము. ఒక్క నిమిషమైనా ఒకవేళ నలువైపుల వాయుమండలం తయారైతే, బ్రహ్మా కుమారీలు ఏమి కోరుకుంటున్నారు, ఏమి చేస్తున్నారు అన్నది అందరికీ తెలుస్తుంది. ఇది కూడా వ్యాపిస్తుంది. అచ్ఛా. నలువైపుల దీనిని అందరూ కలిసి చేస్తే ఇది ఒక మంచి సేవా సాధనంగా అవుతుంది. అచ్ఛా.
సేవ టర్న్ మహారాష్ట్ర, ముంబయి మరియు ఆంధ్ర ప్రదేశ్ వారిది:- ఎవరి టర్న్ ఉంటుందో, సగం క్లాసు వారే ఉంటారు. అచ్ఛా – మహారాష్ట్ర సదా మహాన్ స్థితిలో ఉండేవారు మరియు విశ్వంలో జీవితం యొక్క మహానతను ప్రత్యక్షం చేసేవారు, మంచిది, సంఖ్య కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటివరకు 9 లక్షలు పూర్తవ్వలేదు. 9 లక్షల మంది పూర్తయ్యారా? అవ్వలేదా? మరి మహారాష్ట్ర వారి సంఖ్య ఇంత ఉన్నప్పుడు, మరుసటి సీజన్లో బాప్‌దాదా వచ్చినప్పుడు, ఇప్పుడు ఎంతమంది వచ్చారు? (మహారాష్ట్ర 5500మంది వచ్చారు) మరి మహారాష్ట్ర ముందు కూర్చుంది అంటే దాని అనుసారంగా పని కూడా చేస్తారు కదా. ఎంత మందైతే వచ్చారో, మరుసటి సీజన్‌కల్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరినీ తయారు చేసి తీసుకు రావాలి. బాగా తయారు చేయండి, ఎందుకంటే 6 నెలల సమయం ఉంది, మీ నియమం ఒక్క సంవత్సరం. అంటే 6 నెలలలో ఒక్క సంవత్సరమంతగా తయారు కావాలి. 9 లక్షలైతే పూర్తి చేయాలి కదా. ఇప్పుడు టోటల్ సంఖ్య ఎంత ఉంది? (8 లక్షల 12 వేలు) ఇక కొద్దిమందే కావాలి, మరైతే ఇలా చేయండి. ఇప్పుడు మీటింగ్ ఉంది కదా. ప్రతి జోన్ వారు తమ తమ జోన్ ప్రకారంగా సంఖ్యను పంచుకోవాలి. బాప్‌దాదా వచ్చినప్పుడు, ఇక్కడకు ముఖాముఖిగా రాలేకపోయినాగానీ, తయారు చేసి రండి, ఆ లిస్ట్‌ను తీసుకురండి. మరి ఈ హోమ్‌వర్క్ బాగుందా? జోన్ వారు చేస్తారా? అచ్ఛా, 9 లక్షలైతే పూర్తి చేయండి. ఏమంత పెద్ద విషయము! డబల్ ఫారెనర్లు కావచ్చు, ఇండియా వారు కావచ్చు, ఈసారి 9 లక్షలు పూర్తి చేయవలసిందే. మధుబన్ వారు కూడా చేస్తారు, చుట్టుప్రక్కల సేవ చేస్తారు కదా! మరి అన్ని జోన్లు తయారు చేసి రండి. ఇక్కడకు రాకపోయినాగానీ వింటారు కదా. మిగతా విషయాలను మీటింగ్‌లో ఫైనల్ చేయండి. బాగుంది, బాప్‌దాదాకు ఇంత సంఖ్యను చూసి సంతోషంగా ఉంటుంది. (దాదీ జానకి అంటున్నారు, 9 లక్షలైతే బ్రాహ్మణులు కావాలి కానీ సందేశమైతే కోట్లమందికి ఇంకా ఇవ్వాల్సి ఉంది కదా) ఆ ప్రోగ్రామైతే చేస్తున్నారు కదా. అది చేయవలసిందే. కానీ ముందు స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి, అలాగే సేవను కూడా చేయాలి. అదైతే చేతులెత్తారు కదా. తయారు చేస్తారు కదా! ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా నడిచే సమయం గడిచిపోయింది, ఇప్పుడు ఎగరండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడకు కావాలంటే అక్కడకు సేవలో హాజరైపోండి. అచ్ఛా. మీరందరూ కూడా తయారు చేసుకుని వస్తారు కదా. ఎక్కువ మందినేమీ వద్దు, ఒక్కొక్కరినీ తయారు చేయండి, చాలు. ఎక్కువ చేస్తే అందుకు అభినందనలు. బాగుంది, స్వయాన్ని సంపూర్ణంగా తయారు చేసుకోవడంలో మహారాష్ట్ర బంగారు అవకాశాన్ని తీసుకుంది. ఇక్కడి వాయుమండలం సహజంగానే అశరీరిగా అయ్యేందులో సహాయం చేస్తుంది. కావున, ఏ జోన్ అయితే ఛాన్స్ తీసుకుంటుందో, స్వయాన్ని సంపూర్ణంగా తయారు చేసుకునే ఛాన్స్‌ను, వారికి ఈ గోల్డెన్ ప్రాప్తి జరుగుతుంది. కర్మణ యొక్క ఫలము మరియు వాయుమండలంలో స్థితి యొక్క ఫలితం కూడా లభిస్తుంది. డబల్ ఫలం యొక్క ప్రాప్తి లభిస్తుంది. బాగుంది. బాప్‌దాదాకు పిల్లలు అందరూ ఒకరికంటే మరొకరు ప్రియమైనవారు. పిల్లలు ఎటువంటి వారైనాగానీ పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయితే అవుతారు. ఈ పరమాత్మ ప్రేమ కేవలం ఈ సమయంలోనే లభిస్తుంది. అందరికీ బాప్దాదాపై 100 శాతం ప్రేమ ఉంది, లేక తక్కువ ఉందా? ప్రేమలో 100 శాతం ఉంది అనేవారు చేతులెత్తండి. 100 శాతం ప్రేమ ఉందా? ప్రేమ ఉన్నప్పుడు స్వయంలో ఉన్నవాటిని బలిహారం చేయడం ఎంత సహజము! అభినందనలు. ప్రేమకు నిదర్శనము బలిహారం అవ్వడము. మరి మీరు సుపుత్రులే కదా. ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చేవారే సుపుత్రులు. బాప్‌దాదాకు పిల్లల ప్రేమ చేరుకుంటుంది, కానీ శక్తిశాలి స్థితి తక్కువగా చేరుకుంటుంది. ప్రేమలో బాప్‌దాదా కూడా మంచి శాతాన్నే పిల్లలలో చూస్తున్నారు కానీ ఇప్పుడు శక్తి స్వరూపము, సంపన్న స్వరూపంలో అన్నిటికన్నా ఎక్కువ మార్కులు తీసుకోవాలి. మరి మహారాష్ట్ర నంబర్‌వన్ తీసుకుంటుందా? తీసుకుంటుందా? మంచిది. ఎవరు ముందుంటారో వారు అర్జునులు. అర్జున్ నంబర్‌వన్. అచ్ఛా.
నలువైపుల ఉన్న పిల్లల యొక్క పురుషార్థము మరియు ప్రేమకు సంబంధించిన సమాచార ఉత్తరాలు బాప్‌దాదాకు అందాయి. బాప్‌దాదా పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూసి, ఇది చేస్తాము, అది చేస్తాము... అనే సమాచారము విని సంతోషిస్తున్నారు. ఇప్పుడు కేవలం ఏదైతే ధైర్యము పెట్టారో, ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయో, వాటిపై పదే-పదే అటెన్షన్ పెట్టి ప్రాక్టికల్లోకి తీసుకురండి. పిల్లలందరికీ ఇవే బాప్‌దాదా నుండి మనస్ఫూర్వకమైన ఆశీర్వాదాలు. సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో, సంబంధ-సంపర్కములలో సంపన్నముగా అయ్యే నలువైపులా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వదర్శనాన్ని చేసుకునే స్వదర్శన చక్రధారీ పిల్లలకు, సదా దృఢ సంకల్పము ద్వారా మాయాజీతులుగా అయ్యి బాబా ముందు స్వయాన్ని ప్రత్యక్షము చేసుకునేవారికి మరియు విశ్వము ముందు బాబాను ప్రత్యక్షము చేసే పిల్లలకు, సర్వీసబుల్, నాలెడ్జ్‌ఫుల్, సక్సెస్ఫుల్ పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు మనస్ఫూర్వకమైన పదమాల, పదమాల రెట్ల ఆశీర్వాదాలు మరియు నమస్తే, నమస్తే.
దాదీలతో:- త్వరత్వరగా ప్రత్యక్షత జరగాలన్నదే మీ లక్ష్యం కూడా కదా. అందుకే బాప్‌దాదా హోమ్‌వర్క్ ఇస్తారు. సద్గురువుని పాత్ర మొదలైతే సమాప్తి జరిగిపోతుంది. అందుకోసం అందరినీ తయారు చేస్తున్నాము. (మా ముందు ముగ్గురూ ఉన్నారు) బాప్‌దాదాకు అఫిషియల్ స్వరూపాన్ని ధారణ చేయవలసి వస్తుంది. అసలైతే సదా మూడు రూపాలూ ఉంటాయి. మేమందరం విజయులుగా అయిపోయాము అని అందరూ చెప్పాలన్నది బాప్‌దాదా కోరుకుంటున్నారు. అవ్వాల్సిందే, అవుతున్నాము అని కాదు. అయిపోయాము. అందరి మస్తకంలో మెరుస్తున్న సితార స్పష్టంగా అనుభవం అవుతుంది. ఈ అనుభవం అనే నేత్రం ఇప్పుడు ఇతరులకు అనుభవం చేయిస్తుంది. అందరూ అనుభవాన్ని కోరుకుంటారు. స్వయం కూడా ప్రతి శక్తి, ప్రతి గుణంలో అనుభవీలుగా అవ్వాలి, అప్పుడే అనుభవం చేయించగలరు. కావున మీ అనుభవాన్ని పెంచుకుంటే ఇతరులకు అనుభవం జరిగిపోతుంది. బాగుంది. మీ అందరి మనసు కోరికలు తీరవలసిందే. సరేనా! సరేనా? ఎంత బాగుంది! మంచిది, బ్రాహ్మణ కులానికి శోభ మీరు. దాదీలందరినీ చూసి అందరూ సంతోషిస్తారు. చూడండి, వీరు చేసిన అద్భుతము ఏమిటంటే, సాధనాలు లేకుండానే వీరు సఫలతను పొందారు. (ఎంతో నడిచాము, బండి లేదు, కారు లేదు...) ఈ తపస్యే ఇంత విస్తారాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు కొద్దిగా సాధనాలు ప్రాప్తించాయి కదా, కనుక కొద్దిగనే ఆకర్షణ ఉంటుంది. అచ్ఛా!
ఓంశాంతి