Search for a command to run...
31 Oct 2006
సదా స్నేహీలుగా ఉండటముతోపాటు అఖండ మహాదానులుగా అయినట్లయితే విఘ్న-వినాశకులుగా, సమాధాన స్వరూపులుగా అవుతారు
31 October 2006 · తెలుగు
ఈ రోజు ప్రేమ సాగరుడు, పరమాత్మ ప్రేమకు పాత్రులైన తన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా స్నేహమనే అలౌకిక విమానములో ఇక్కడకు చేరుకున్నారు కదా! సాధారణ విమానములో వచ్చారా లేక స్నేహమనే విమానములో ఎగురుతూ చేరుకున్నారా? అందరి మనసులలో స్నేహపు అలలు వస్తూ ఉన్నాయి మరియు స్నేహమే ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది. మరి మీరందరూ కూడా ఇక్కడకు వచ్చారంటే స్నేహమే లాక్కుని వచ్చింది కదా! జ్ఞానాన్ని అయితే తర్వాత విన్నారు, కానీ స్నేహమే పరమాత్మ స్నేహీలుగా తయారుచేసింది. మేము పరమాత్ముని స్నేహానికి పాత్రులుగా అవుతాము అన్నది ఎప్పుడూ స్వప్నములో కూడా ఉండి ఉండదు. కానీ ఇప్పుడేమంటారు? స్నేహీలుగా అయిపోయాము. ఆ స్నేహము కూడా సాధారణమైన స్నేహము కాదు, అది హృదయపూర్వకమైన స్నేహము. అది ఆత్మిక స్నేహము, సత్యమైన స్నేహము, నిస్వార్థ స్నేహము. ఈ పరమాత్మ స్నేహము చాలా సహజముగా స్మృతిని అనుభవము చేయిస్తుంది. స్నేహీ అయినవారిని గుర్తు చేసుకోవటము కష్టము కాదు, మర్చిపోవటమే కష్టమవుతుంది. స్నేహము ఒక అలౌకిక అయస్కాంతము. స్నేహము సహజయోగిగా తయారుచేస్తుంది, శ్రమ నుండి విడిపిస్తుంది. స్నేహముతో గుర్తు చేయడములో శ్రమ అనిపించదు. ప్రేమ యొక్క ఫలాన్ని తింటారు. స్నేహానికి చిహ్నముగా విశేషముగా నలువైపులా ఉన్న పిల్లలు ఎలాగూ ఉన్నారు, కానీ డబల్ విదేశీయులు స్నేహము కారణముగా పరుగుపరుగున చేరుకున్నారు. చూడండి, 90 దేశాల నుండి ఎలా పరుగెత్తుకుని చేరుకున్నారు! భారత్‌లోని పిల్లలైతే ప్రభు ప్రేమకు పాత్రులుగా ఉండనే ఉన్నారు, కానీ ఈరోజు విశేషముగా డబల్ విదేశీయులకు సువర్ణావకాశము. మీ అందరికీ కూడా విశేషమైన ప్రేమ ఉంది కదా! స్నేహము ఉంది కదా! ఎంత స్నేహము ఉంది? దేనితోనైనా పోల్చగలరా? దేనితోనూ పోల్చలేరు. మీ అందరిదీ ఒక పాట ఉంది కదా - పోల్చటానికి ఆకాశములోని నక్షత్రాలు చాలవు, సాగరములోని నీరు చాలదు... అని! ఇది అనంతమైన ప్రేమ, అనంతమైన స్నేహము.
బాప్‌దాదా కూడా స్నేహీ పిల్లలను కలుసుకునేందుకు చేరుకున్నారు. పిల్లలైన మీరందరూ స్నేహముతో గుర్తు చేసారు మరియు బాప్‌దాదా మీ ప్రేమకు చేరుకున్నారు. ఎలా అయితే ఈ సమయములో ప్రతి ఒక్కరి ముఖముపై స్నేహపు రేఖ మెరుస్తూ ఉందో, అలాగే ఇప్పుడు దానికి ఇంకేమి చేర్చాలి? స్నేహమైతే ఉంది, ఇది పక్కా. స్నేహము ఉంది అని బాప్‌దాదా కూడా సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అర్థమైపోయింది కదా. ఇప్పుడు కేవలము అండర్లైన్ చెయ్యాల్సింది ఏమిటంటే - సదా స్నేహీలుగా ఉండాలి, సదా. అప్పుడప్పుడూ కాదు. స్నేహము ఎడతెగనిదిగానే ఉంది కానీ శాతములో తేడా వచ్చేస్తుంది. మరి ఈ తేడాను తొలగించేందుకు మంత్రమేమిటి? అదేమిటంటే - ప్రతి సమయము మహాదానులుగా, అఖండదానులుగా అవ్వండి. సదా దాతా పిల్లలుగా, విశ్వ సేవాధారుల సమానముగా ఉండండి. ఏ సమయములోనూ మాస్టర్ దాతలుగా అవ్వకుండా ఉండకూడదు ఎందుకంటే విశ్వ కళ్యాణ కార్యము కొరకు బాబాతోపాటు మీరు కూడా సహాయకులుగా అయ్యే సంకల్పము చేసారు. మనసా ద్వారా శక్తుల దానాన్ని మరియు సహయోగాన్ని ఇవ్వండి. వాచా ద్వారా జ్ఞాన దానాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి. కర్మల ద్వారా గుణాల దానాన్ని ఇవ్వండి మరియు స్నేహ సంపర్కము ద్వారా సంతోషము యొక్క దానాన్ని ఇవ్వండి. మీరు ఎన్ని అఖండ ఖజానాలకు యజమానులు, రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ (ప్రపంచములోనే అత్యంత సంపన్నులు). తరగని మరియు అఖండ ఖజానాలు ఉన్నాయి. వాటిని ఎంతగా ఇస్తూ ఉంటారో, అంతగా పెరుగుతూ ఉంటాయి. తక్కువ అవ్వవు, పెరుగుతాయి... ఎందుకంటే వర్తమాన సమయములో ఈ ఖజానాల కోసమని మెజారిటీ మీ అందరి ఆత్మిక సోదరులు మరియు సోదరీలు దాహముతో ఉన్నారు. మరి మీ సోదరీసోదరులపై దయ కలగటం లేదా! దాహముతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చరా? ‘ఓ మా దేవీ-దేవతలారా, మాకు శక్తిని ఇవ్వండి, సత్యమైన ప్రేమను ఇవ్వండి’ అన్న శబ్దము మీ చెవులకు చేరటం లేదా? మీ భక్తులు మరియు దుఃఖముతో ఉన్న ఆత్మలు, ఇరువురు కూడా - దయ చూపించండి, కృప చూపించండి, ఓ కృపా దేవీ-దేవతలారా! అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. సమయము యొక్క పిలుపు వినిపిస్తుంది కదా! అంతేకాక ఇచ్చే సమయము కూడా ఇప్పుడే ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? మీ వద్ద ఇంతటి తరగని అఖండ ఖజానాలు జమ అయ్యి ఉన్నాయి, మరి వాటిని ఎప్పుడు ఇస్తారు? చివరి సమయములో, అంతిమ సమయములో ఇస్తారా ఏమిటి? ఆ సమయములో కేవలము దోసిలి అంత మాత్రమే ఇవ్వగలరు. మరి జమ అయి ఉన్న మీ ఖజానాలను కార్యములో ఎప్పుడు పెడతారు? చెక్ చేసుకోండి - ప్రతి సమయము ఏదో ఒక ఖజానాను సఫలము చేస్తున్నారా! ఇందులో డబల్ లాభము ఉంది, ఖజానాలను సఫలము చేసుకోవటము వలన ఆత్మల కళ్యాణము కూడా జరుగుతుంది, అంతేకాక మీరందరూ కూడా మహాదానులుగా అయిన కారణముగా విఘ్న వినాశకులుగా సహజముగానే అవుతారు, అలాగే సమస్యా స్వరూపులుగా కాకుండా సమాధాన స్వరూపులుగా సహజముగానే అవుతారు. డబల్ లాభము ఉంది. ఈ రోజు ఇది వచ్చింది, నిన్న అది వచ్చింది, ఈ రోజు ఇది జరిగింది, నిన్న అది జరిగింది అని అనరు. విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా సదాకాలము కొరకు అవుతారు. సమస్య వెనుక ఏదైతే సమయాన్ని వెచ్చిస్తారో, కష్టపడతారో, ఒక్కోసారి ఉదాసీనులుగా అవుతారో మరియు ఒక్కోసారి ఉల్లాసములోకి వస్తారో, వాటన్నింటి నుండి రక్షించబడతారు ఎందుకంటే బాప్‌దాదాకు కూడా పిల్లలు శ్రమ పడటము మంచిగా అనిపించదు. పిల్లలు శ్రమ పడటాన్ని బాప్‌దాదా చూసినప్పుడు పిల్లల యొక్క ఆ శ్రమను బాబా చూడలేకపోతారు. కావున శ్రమ పడటము నుండి ముక్తులుగా అవ్వండి. పురుషార్థము చెయ్యాలి కానీ ఏ పురుషార్థము? ఇప్పటివరకు కూడా మీ చిన్న-చిన్న సమస్యలకే పురుషార్థము చేసేవారిగా ఉంటారా! ఇప్పుడు అఖండ మహాదానులుగా, అఖండ సహయోగులుగా అయ్యే పురుషార్థము చెయ్యండి. బ్రాహ్మణుల కొరకు సహయోగులుగా అవ్వండి మరియు దుఃఖి ఆత్మలు, దాహముతో ఉన్న ఆత్మల కొరకు మహాదానులుగా అవ్వండి. ఇప్పుడు ఈ పురుషార్థము యొక్క అవసరముంది. ఇష్టమే కదా! ఇష్టమేనా? వెనుక ఉన్నవారు, ఇష్టమేనా? మరి ఇప్పుడు కొంచెము మార్పు కూడా చేసుకోవాలి కదా! చాలాకాలముగా స్వయము కొరకు పురుషార్థము చేసారు. ఏమంటారు పాండవులు, ఇష్టమేనా? మరి రేపటి నుండి ఏం చేస్తారు? రేపటి నుండే ప్రారంభిస్తారా లేక ఇప్పటి నుండే ప్రారంభిస్తారా? ఇప్పటి నుండే సంకల్పము చెయ్యండి - నా సమయము, సంకల్పాలు విశ్వ సేవ కోసమే. ఇందులో స్వయము యొక్క కళ్యాణము ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది, అది ఆగదు, పెరుగుతుంది. ఎందుకని? మీరు ఎవరి ఆశలనైనా పూర్తి చేస్తే, దుఃఖానికి బదులుగా వారికి సుఖాన్ని ఇస్తే, నిర్బల ఆత్మలకు శక్తిని ఇస్తే, గుణాలను ఇస్తే వారు మీకు ఎన్ని ఆశీర్వాదాలను ఇస్తారు. అందరి నుండి ఆశీర్వాదాలను తీసుకోవటము, ఇదే ముందుకు వెళ్ళేందుకు అన్నింటికంటే సహజ సాధనము. భాషణ చెయ్యకపోయినా కానీ, ఎక్కువ ప్రోగ్రాములను చెయ్యలేకపోయినా కానీ ఏం ఫర్వాలేదు, చెయ్యగలిగితే ఇంకా ఎక్కువ చెయ్యండి, కానీ చెయ్యలేకపోయినా కూడా ఏమీ ఫర్వాలేదు, కానీ ఖజానాలను సఫలము చెయ్యండి. వినిపించాము కదా - మనసా ద్వారా శక్తుల ఖజానాను ఇస్తూ వెళ్ళండి, వాణి ద్వారా జ్ఞాన ఖజానాను, కర్మల ద్వారా గుణాల ఖజానాను మరియు బుద్ధి ద్వారా సమయమనే ఖజానాను, సంబంధ-సంపర్కముల ద్వారా సంతోషమనే ఖజానాను సఫలము చెయ్యండి. సఫలము చెయ్యటము ద్వారా సహజముగా సఫలతామూర్తులుగా తప్పకుండా అవుతారు. సహజముగా ఎగురుతూ ఉంటారు ఎందుకంటే ఆశీర్వాదాలు ఒక లిఫ్ట్ వలె పని చేస్తాయి, మెట్ల వలె కాదు. సమస్య వస్తే దానిని వెంటనే తొలగించండి. రెండు రోజులు పట్టడం, రెండు గంటలు పట్టడం, ఇది మెట్లు ఎక్కడం లాంటిది. సఫలము చెయ్యండి, సఫలతామూర్తులుగా అవ్వండి. ఆశీర్వాదాలనే లిఫ్ట్ ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణములో చేరుకుంటారు. సూక్ష్మవతనానికైనా చేరుకోండి లేక పరంధామానికైనా చేరుకోండి లేక మీ రాజ్యానికైనా చేరుకోండి. క్షణములో చేరుకోండి. లండన్‌లో ‘వన్ మినిట్ (ఒక్క నిమిషము)’ అన్న ప్రోగ్రామ్ చేసారు కదా. కానీ బాప్‌దాదా అయితే ‘వన్ సెకండ్ (ఒక్క క్షణము)’ అని అంటారు. ఒక్క క్షణములో ఆశీర్వాదాలనే లిఫ్ట్‌లో ఎక్కండి. కేవలం స్మృతి అనే స్విచ్‌ను నొక్కండి, అంతే, శ్రమ నుండి విముక్తులైపోతారు.
ఈరోజు డబల్ విదేశీయుల రోజు కదా. మరి బాప్‌దాదా ముందుగా డబల్ విదేశీయులను ఏ స్వరూపములో చూడాలనుకుంటున్నారు? శ్రమ నుండి ముక్తులుగా, సఫలతామూర్తులుగా, ఆశీర్వాదాలకు పాత్రులుగా. అలా అవుతారు కదా? ఎందుకంటే డబల్ విదేశీయులకు బాబాపై ప్రేమ బాగుంది. శక్తి కావాలి కానీ ప్రేమ బాగుంది. అద్భుతమైతే చేసారు కదా? చూడండి, 90 దేశాల నుండి, వేరు వేరు దేశాల నుండి, వేరు వేరు ఆచార పద్ధతుల నుండి వచ్చారు, కానీ 5 ఖండాలూ కలిసిపోయి ఒక చందన వృక్షముగా అయ్యింది. ఒక్క వృక్షములోకి వచ్చేసారు. ఒకటే బ్రాహ్మణ కల్చర్ (సంస్కృతి) అయ్యింది, ఇప్పుడు ఇంగ్లీష్ కల్చర్ ఉందా? మాది ఇంగ్లీష్ కల్చర్... అని అనరు కదా! బ్రాహ్మణులు కదా? ఇప్పుడైతే మాది బ్రాహ్మణ కల్చర్ అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. బ్రాహ్మణ కల్చర్, ఇది తప్ప మరేదీ లేదు. ఒక్కరిగా అయిపోయారు కదా! అందరూ ఒకే వృక్షానికి చెందినవారిగా అయిపోయినందుకు బాప్‌దాదా అభినందిస్తున్నారు. ఎంత బాగా అనిపిస్తుంది! మీరు ఎవరినైనా అడగండి, అమెరికావారినైనా, యూరప్ వారినైనా - మీరు ఎవరు అని అడిగితే వారు ఏమంటారు? బ్రాహ్మణులే కదా! లేదా యు.కే.కు చెందినవారము, ఆఫ్రికాకు చెందినవారము, అమెరికాకు చెందినవారము అని అంటారా, అలా అనరు కదా! అందరూ ఒకే బ్రాహ్మణులుగా అయిపోయారు, ఏకమతము వారిగా అయిపోయారు, ఏక స్వరూపానికి చెందినవారిగా అయిపోయారు, బ్రాహ్మణులు. ఏకమతము శ్రీమతము. ఇందులో మజా వస్తుంది కదా! మజా ఉందా లేక కష్టమనిపిస్తుందా? కష్టమైతే లేదు కదా! తల ఊపుతున్నారు. మంచిది.
బాప్‌దాదా సేవలో ఏ నవీనతను కోరుకుంటున్నారు? ఏ సేవలనైతే చేస్తున్నారో, వాటిని చాలా, చాలా, చాలా బాగా చేస్తున్నారు, అందుకైతే అభినందనలు ఉండనే ఉన్నాయి. కానీ ఇకముందు కోసం ఏమి చేర్చాలి? ఏదైనా నవీనత కావాలి అని మీ అందరి మనసులలో ఉంది కదా. బాప్‌దాదా చూసారు, ఏవైతే ప్రోగ్రాములు చేసారో, వాటి కోసం సమయాన్ని కూడా వెచ్చించారు మరియు వాటిని ప్రేమతోనే చేసారు, శ్రమ పడటము కూడా ప్రేమతోనే చేసారు, అంతేకాక ఒకవేళ స్థూల ధనాన్ని కూడా వెచ్చించినా, అది పదమా రెట్లుగా అయ్యి మీ పరమాత్మ బ్యాంక్‌లో జమ అయిపోయింది. దానిని వెచ్చించారు అని కాదు, వాస్తవానికి జమ చేసుకున్నారు. రిజల్టులో ఏం చూడడం జరిగిందంటే, సందేశము ఇచ్చే కార్యాన్ని, పరిచయాన్ని ఇచ్చే కార్యాన్ని అందరూ చాలా బాగా చేసారు. ఎక్కడ చేసినా కానీ, ఇప్పుడు ఢిల్లీలో జరుగుతూ ఉంది, లండన్‌లో జరిగింది మరియు డబల్ విదేశీయులు కాల్ ఆఫ్ టైమ్ (సమయపు పిలుపు) మరియు పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రాములు ఏవైతే చేస్తుంటారో, ఆ ప్రోగ్రాములన్నీ బాప్‌దాదాకు చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా ఏమేమి చెయ్యగలిగితే అవి చేస్తూ ఉండండి. సందేశమైతే లభిస్తుంది, స్నేహీలుగా కూడా అవుతారు, సహయోగులుగా కూడా అవుతారు, సంబంధములోకి కూడా కొందరు వస్తారు, కానీ ఇప్పుడు దీనికి మించి ఏమి జరగాలంటే - ఎప్పుడైనా ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ చేస్తే, అందులో సందేశమైతే లభిస్తుంది, కానీ ఏదైనా అనుభవము చేసి వెళ్ళాలి, ఆ అనుభవము చాలా త్వరగా ముందుకు తీసుకువెళ్తుంది. ఉదాహరణకు ఈ కాల్ ఆఫ్ టైమ్ ప్రోగ్రాములో లేక పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రాములో కాస్త ఎక్కువ అనుభవము చేస్తారు, కానీ పెద్ద ప్రోగ్రాములు ఏవైతే జరుగుతాయో, వాటిలో సందేశమైతే బాగా లభిస్తుంది, కానీ ఎవరు వచ్చినా సరే వారిని ఫాలో అప్ చేసి మళ్ళీ సంపర్కములోకి తీసుకువస్తూ వారికి అనుభవము చేయించాలన్న లక్ష్యము పెట్టుకోండి, వారు ఏదో ఒక అనుభవాన్ని చెయ్యాలి, ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోరు. అంతేకాక అనుభవము ఎటువంటి విషయమంటే అది వద్దనుకున్నా కానీ దానివైపుకు లాగుతుంది. కనుక బాప్‌దాదా అడుగుతున్నారు - ముందుగా బ్రాహ్మణులంతా ఎవరైతే ఉన్నారో, వారు, జ్ఞానములోని పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో స్వయం అనుభవజ్ఞులుగా అయ్యారా? ప్రతి శక్తిని అనుభవము చేసారా? ప్రతి గుణాన్ని అనుభవము చేసారా? ఆత్మిక స్థితిని అనుభవము చేసారా? పరమాత్మ ప్రేమను అనుభవము చేసారా? జ్ఞానాన్ని అర్థం చేసుకోవటము - ఇందులో అయితే పాస్ అయ్యారు, నాలెజ్ఫుల్గా అయితే అయ్యారు, దీనికి బాప్‌దాదా కూడా చెప్తున్నారు, బాగానే ఉన్నారు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, డ్రామా అంటే ఏమిటి అన్న జ్ఞానమైతే అర్థం చేసుకున్నారు, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయము కావాలంటే అంత సమయము, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఆ పరిస్థితిలో ఆత్మిక బలము అనుభవము అవ్వాలి, పరమాత్మ శక్తి అనుభవము అవ్వాలి, అది జరుగుతుందా? ఏ సమయములో, ఎంత సమయము, ఎలా అనుభవము చెయ్యాలనుకుంటే అలా అనుభవము అవుతుందా? లేక ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందా? నేను ఆత్మను అని భావిస్తున్నప్పుడు, ఒకవేళ పదే-పదే దేహ భానము వస్తుందంటే, మరి అనుభవం పనికొచ్చిన్నట్లా? అనుభవీమూర్తులు ప్రతి సబ్జెక్ట్ యొక్క అనుభవీమూర్తులుగా, ప్రతి శక్తిలో అనుభవీమూర్తులుగా ఉంటారు. కనుక స్వయములో కూడా అనుభవాన్ని ఇంకా పెంచండి. అనుభవమైతే ఉంది, లేదని కాదు, కానీ అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడే. బాప్‌దాదా అప్పుడప్పుడూ ఉండటాన్ని కోరుకోవటం లేదు. ఏదైనా జరిగిందంటే అది అప్పుడప్పుడూ లోకి మారిపోతుంది, ఎందుకంటే మీ అందరి లక్ష్యము ఏమిటంటే, ఎలా అవ్వాలన్నది మీ లక్ష్యము అని మిమ్మల్ని అడిగితే, బాబా సమానముగా అవ్వాలి అన్నది మా లక్ష్యము అని అంటారు. అందరూ ఒకే సమాధానాన్ని ఇస్తారు. బాబా సమానముగా అవ్వాలి అంటే మరి బాబా అయితే ఎప్పుడూ కొంచెము సమయము లేక అప్పుడప్పుడు అన్నట్లు లేరు కదా. బ్రహ్మాబాబా ఎల్లప్పుడూ రాజయుక్తముగా, యోగయుక్తముగా ఉండేవారు, ప్రతి శక్తిలో అప్పుడప్పుడు అన్నట్లు కాకుండా సదా అన్నట్లు ఉండేవారు. అనుభవమనేది సదాకాలము నడుస్తుంది. అది కొద్ది సమయము కొరకే ఉండదు. కనుక స్వయం అనుభవీమూర్తులుగా అయ్యి ప్రతి విషయములోనూ, ప్రతి సబ్జెక్ట్‌లోనూ అనుభవజ్ఞులుగా అవ్వాలి, జ్ఞాన స్వరూపములో అనుభవజ్ఞులుగా, యోగయుక్తముగా ఉండటములో అనుభవజ్ఞులుగా, ధారణా స్వరూపములో అనుభవజ్ఞులుగా ఉండాలి. ఆల్‌రౌండ్ సేవలో అనుభవజ్ఞులుగా అవ్వాలి, మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కము అన్నింటిలోనూ అనుభవజ్ఞులుగా అవ్వాలి, అప్పుడే పాస్ విత్ ఆనర్ అని అంటాము. మరి ఎలా అవ్వాలనుకుంటున్నారు? పాస్ అవ్వాలని అనుకుంటున్నారా లేక పాస్ విత్ ఆనర్ అవ్వాలనుకుంటున్నారా? పాస్ అయ్యే వాళ్ళు అయితే వెనుక కూడా వస్తారు. మీరైతే టూ లేట్ (చాలా ఆలస్యమైంది) అన్న బోర్డు పెట్టకముందే వచ్చేసారు, ఇప్పుడు కొత్తవారు కూడా వచ్చినా కానీ టూ లేట్ అన్న బోర్డు పెట్టబడలేదు. లేట్ బోర్డు పెట్టాము కానీ టూ లేట్ బోర్డు పెట్టలేదు. అందుకే ఎవరైనా కొత్తవారైనా కానీ, ఇప్పుడు కూడా తీవ్ర పురుషార్థము చేసి, పురుషార్థము కాదు, తీవ్ర పురుషార్థము చేసినట్లయితే ముందుకు వెళ్ళగలరు ఎందుకంటే ఇప్పుడింకా నంబర్ ప్రకటించలేదు. కేవలం రెండు నంబర్లు ప్రకటించబడ్డాయి, బాబా మరియు మమ్మా. ప్రస్తుతము ఇంకా సోదరీ-సోదరులు ఎవరిదీ మూడవ నంబరు ప్రకటించలేదు. దాదీలంటే చాలా ప్రేమ ఉంది అని మీరు అంటారు. బాబాకు కూడా దాదీలంటే ప్రేమ ఉంది కానీ నంబర్ ఇంకా ప్రకటించబడలేదు. అందుకే మీరు చాలా-చాలా సికీలధే, ప్రియమైన, భాగ్యశాలి పిల్లలు, మీరు ఎంతగా ఎగరాలనుకుంటే అంతగా ఎగరండి, ఎందుకంటే చూడండి, చిన్న పిల్లలు ఉంటారు కదా, వారిని తమ తండ్రి వేలు పట్టుకుని నడిపిస్తాడు, ఎక్స్ట్రా ప్రేమను ఇస్తారు, కానీ పెద్దవారిని వేలు పట్టుకుని నడిపించరు. వారు తమ కాళ్ళపై తాము నడుస్తారు. కనుక ఎవరైనా కొత్తవారైనా సరే, వారు ఆ లోటును భర్తీ చేసుకోవచ్చు. సువర్ణావకాశము ఉంది. కానీ చాలా త్వరలోనే టూ లేట్ బోర్డు పెట్టడం జరుగుతుంది, అందుకే ముందుగానే చెయ్యండి. కొత్తవారు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. అచ్ఛా. అభినందనలు. మొదటిసారి మీ ఇల్లు అయిన మధుబన్కు చేరుకున్నారు, అందుకే బాప్‌దాదా మరియు మొత్తము పరివారమందరి తరఫున, భారత్ వారి తరఫున మరియు విదేశాలవారి తరఫున, అందరి తరఫు నుండి పదమాల, పదమాల రెట్లు అభినందనలు.
ఇప్పుడు విన్నారా – ఎంత వీలైతే అంత యోగ్య ఆత్మలు చూసి అనుభవీమూర్తులుగా తయారు చేయండి. వస్తూ ఉండండి అని అప్పుడిక మీరు చెప్పనవసరం లేదు. మీరు రావద్దు అని చెప్పినాగానీ వస్తుంటారు. అనుభవం అటువంటిది. స్వయాన్ని కూడా అనుభవంలో పెంచండి. ఎంతెంతగా అనుభవంలో మరియు మహాదానిగా అయ్యి సేవ చెయ్యడంలో బిజీగా ఉంటారో, అప్పుడు సమస్యలలో ఏ సమయమైతే వృధా అవుతుందో, దాదీలకు తమ సమయాన్ని ఇవ్వవలసి వస్తుంది కదా, స్వయం కూడా సమయం ఇవ్వవలసి వస్తుంది, ఆ సమయం మిగులుతుంది ఎందుకంటే సమయం మహత్యం కూడా మీకు తెలుసు, అకస్మాత్తుగా జరుగనుంది. 10 సంవత్సరాల సమయం ఉందా, 20 సంవత్సరాలు ఉందా ఎంత సమయం ఉంది అన్నది కొద్దిగా సూచిన లభిస్తే బాగుంటుంది అని కొందరు సోదరసోదరీలు అనుకుంటారు. కానీ అకస్మాత్తుగా జరుగనుంది అని బాప్‌దాదా చెప్పేసారు. ఎవరెడీగా ఉండాలి. ఇప్పుడు ఫాస్ట్ గతితో చేయండి – స్వయం కూడా, ఇతరులను యెగ్యులుగా చేయడం కూడా.
మంచిది, ఫారెన్ సేవ కూడా బాగా వృద్ధిని పొందుతుంది. 90 దేశాల వరకు చేరుకున్నారు, ఇంకెంత ఉంది! 10 దేశాలు పెంచితే 100 అయిపోతుంది. (జయంతి అక్కయ్య వినిపించారు, 129 దేశాల వరకు చేరుకున్నాము, 100 దేశాలలో రెజిస్ట్రీ కూడా అయిపోయింది, మిగతా దేశాలలో బాబా కార్యము ఏదో ఒకటి జరుగుతూ ఉంది) మంచిది, బాప్‌దాదా ఆఫ్రికా సమాచారము కూడా విన్నారు, వారు కూడా కొద్ది సమయంలోనే మంచి వృద్ధిని చేసారు. బాగుంది. మర్సీఫుల్ ఆత్మలైనందున బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఆత్మలపై ప్రేమ ఉంది. చూడండి, ఎక్కడెక్కడి నుండి చేరుకన్నారు, ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయినాగానీ, ఎంతగా చెల్లాచెదరు అయ్యారో కదా! మరి మీ పరివారాన్ని వెతికి పట్టుకోవాలి కదా! అందరూ బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా పెద్ద ప్రోగ్రాము జరుగుతుంది. అసలైతే కామన్ మేళానే, కానీ క్రొత్త రూపంలో చేసేసరికి జనాలకు అభిరుచి ఉంటుంది. లండన్ ప్రోగ్రామ్ కూడా బాగా చేసారు, చాలామందికి పరిచయం కూడా లభించింది. ఇప్పుడు వారి అడ్రెసులు ఏవైతే ఉన్నాయో, వాటితో వారిని కాంటాక్ట్ చేస్తూ ఉండండి. ఎక్కడినుండి వచ్చినాగానీ, ఏ ప్రోగ్రాములో వచ్చినాగానీ వారి అడ్రెసు మరియు ఫోన్ నంబరును తప్పకుండా వ్రాయించండి. వ్రాయించే పాయింట్లు మేళాలో 8-10 స్థానాలలో కావాలంటే పెట్టండి, ఎందుకంటే అప్పుడే వారిని పిలిచి, సమయాన్ని ఇచ్చి, వారిని ముందుకు తీసుకు వెళ్ళడం వీలవుతుంది. ఇకపోతే సమయం అనే బాకా అకస్మాత్తుగా మ్రోగనుంది, దానికంటే ముందే మీ సోదరసోదరీల కళ్యాణమైతే చేయాలి కదా. దయ కలుగుతుంది కదా? ఇప్పుడు చిన్న చిన్న విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకండి. ఉదాహరణకు, ఈగ వస్తే, దోమ వస్తే, దానిని ఉండనిస్తారా! వెంటనే పారద్రోలుతారు కదా లేక దానిని కూర్చోబెడతారా? రా దోమ, రా అంటారా! ఏదైనా సమస్య అంటే ఏమిటి? ఈగ లేక దోమ వంటిదే కదా. వెంటనే పారద్రోలండి. వాటి పని రావడము, వచ్చే పనిని మాయ మానదు, కానీ బ్రాహ్మణులు పారద్రోలే పనిలో ఒక్కోసారి ఆలస్యం చేస్తారు. అన్ని దేశాలవారు వ్రాసిన తమ తమ పరివర్తనను బాప్‌దాదా చూసారు. పరివర్తన చేసారు మరియు దానిని వ్రాసారు – ఇందుకు అభినందనలు, అయితే దీనిని అవినాశిగా చేసుకోండి. అంతేగానీ, ఏదైనా చిన్న విషయం రాగానే అందులో వచ్చిన పరివర్తన మారిపోకూడదు, ఇలా చేయకండి. అమరభవ వరదానాన్ని తీసుకోండి. ఏ పరివర్తన అయితే తెచ్చుకున్నారో, బాప్‌దాదా అది విన్నారు, కొందరు మంచి పరివర్తనను తీసుకువచ్చారు, కానీ ‘సదా’ అన్న పదాన్ని ఎప్పుడూ మర్చిపోకండి ఎందుకంటే మాయ కూడా వింటుంది కదా, వీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు అని , అది కూడా తన ప్రయత్నం చేస్తుంది. కానీ మీరైతే మాయాజీతులు కదా! మాయాజీతులే జగత్‌జీతులుగా అవుతారు. కావున, మాయను చూసి, మాయ రావడాన్ని చూసి మీరు ఒక్కటే గుర్తుంచుకోండి – నా పని మాయను పారద్రోలడము. నేను రావడం మానను అని మాయ మీకు నేర్పిస్తుంది, మీరు విజయులుగా అవ్వడం మానకండి. కావున ఇప్పుడు చిన్న చిన్న ఈగలు, దోమలను రానివ్వకండి. సంపూర్ణ స్థితి ముందు ఈ చిన్న చిన్న విషయాలు ఏమిటి!
అచ్ఛా – మీ అందరి ప్రియాతి ప్రియమైన దాదీ సమ్ముఖంలోకి వచ్చేసారు (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) చాలా మధురంగా నవ్వుతున్నారు. చూడండి, అందరూ చేతులూపండి, వారు కూడా చూస్తారు, అక్కడ కనిపిస్తుంది. మంచిది. చూడండి, దాదీ అయితే బ్రహ్మా బాబాకన్నా ఎక్కువ సమయం సేవా పాత్రను చేసారు. మరి వీరు విశేషమైన హీరో యాక్టర్ కదా. చూడండి దాదీ, మిమ్మల్ని చూసి అందరూ చాలా-చాలా సంతోషిస్తున్నారు. (దాదీ డబల్ విదేశీయులందరికీ ప్రత్యేకంగా స్మృతిని ఇచ్చారు మరియు దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు) చూడండి, ఇది కూడా ప్రాక్టికల్‌గా దీపావళి కదా. మీరు ప్రాక్టికల్‌లో ఇంతమంది వెలుగుతున్న దీపాలను చూసి దాదీకి దీపావళి గుర్తుకు వచ్చింది. ఎంతో సందడిగా ఉంది, ఒక్కొక్క మస్తకంలో ఆత్మ మెరుస్తుంది, ఈ దీపాలు ఎంత బాగున్నాయి, అవినాశి దీపాలు. (దాదీ అన్నారు – అందరూ బాబా-బాబా అంటున్నారు, బాబా, మీరు బాగా గుర్తుకొస్తున్నారు) ఇప్పుడు త్వరగా వచ్చేస్తారు. చూడండి, అనారోగ్యం ఎంత ఉన్నాగానీ నొప్పి యొక్క ఫీలింగ్ లేకపోతే అది ఇబ్బంది పెట్టదు. హీరో యాక్టర్ కదా, శక్తి దేవి. ఇప్పుడు త్వరగా వచ్చేస్తారు, మీ అందరినీ కలుస్తారు. అచ్ఛా.
లండన్ ప్రోగ్రామ్ యొక్క జస్ట్ ఎ మినట్ గ్రూప్:- చాలా బాగుంది, ఒకేసారి ఇతర దేశాలు కూడా పాల్గొన్నాయి లేక చూసాయి కూడా, ఈ విశేషత బాగుంది, ఈ నవీనత బాగుంది. దీనిని మరింత రిఫైన్ చేసి, ఒకే సమయంలో అనేక వైపుల ఒకే సేవ యొక్క ధ్వని జరగాలి. ఇది బాగుంది. రిఫైన్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఒకే సమయంలో ఒకే ధ్వని నలు వైపుల మారుమ్రోగుతుంది అని అందరికీ తెలుస్తుంది. అందరూ బాగా కష్టపడ్డారు, మనస్ఫూర్తిగా చేసారు. పెద్ద మనసుతో చేసారు మరియు నిశ్చింతగా అయి లండన్ వారు చేసారు, ఇది వారి విశేషత. ఇందుకు అభినందనలు. ఏదైనా ప్రోగ్రామ్‌ను పెద్ద మనసుతో చేస్తే అది బాగా జరుగుతుంది. ఏమి జరుగుతుంది, ఎలా అవుతుంది, (క్యా, కైసే) ఈ కే, కే రాకూడదు. జరగాల్సిందే, చేయాల్సిందే, సఫలత మా జన్మసిద్ధ అధికారము. ఇది మంచి రిజల్ట్. లండన్‌ది పెద్ద మనసు. జనక్ బచ్చీ యొక్క పెద్ద మనసు నంబర్‌వన్, ఎందుకు, ఏమిటి అని ఆలోచించరు. అలాగే జరిగిపోతుంది కూడా. ఎంత సహజంగా జరిగిందో అందరూ చూసే ఉండవచ్చు. ఖర్చు అయితే అవుతుంది, బాప్‌దాదా విన్నారు, కానీ మిగిలింది కూడా. మిగిలింది, పెరిగింది, తక్కువ అవ్వలేదు. మరి ఇది ఎవరి అద్భుతము? పెద్ద మనసుది. ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ముందు మనసు పెద్దదిగా చేసుకుంటే సఫలత లభిస్తుంది. అభినందనలు. పెద్ద మనసుకు మరియు పెద్ద ప్రోగ్రామ్‌కు అభినందనలు. రిఫైన్ అయితే అవుతూ ఉంటుంది. ఎడిషన్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వారిని ఫాలోఅప్ చేయండి, ఇంతమంది ఎవరైతే వచ్చారో, వారు కనీసం సంబంధ సంపర్కంలో ఉండే విద్యార్థులుగా అవ్వాలి కదా, అవుతారు. (అమెరికా మోహిని అక్కయ్య యొక్క సహయోగం చాలా మంచిగా ఉంది) అందరూ కలిసి చేసారు కదా. మంచిది. చాలా మంచిది. సంగఠన శక్తి అద్భుతం చేస్తుంది. సంగఠితంగా కలిసి చేసారు, సఫలత ఉంది, సఫలత ఉంటుంది. అలసట లేదు కదా. సంతోషంగా ఉన్నారు. సభలో జనాలను చూసేసరికి సంతోషం కలిగింది. అచ్ఛా. అభినందనలు.
ఐ.టి. గ్రూప్:- మంచిది, మీ కార్యముతో నలువైపులకు వెళ్తున్న సమాచారముతో అందరి మనసులు సంతోషిస్తున్నాయి. ఎందుకంటే పరివారం కదా, పరివారంలో సమాచారం లభిస్తే సంతోషంగా ఉంటుంది. మంచిగా చేసారు. ఇంతకముందు కూడా పని జరిగేది, కానీ ఇప్పుడు సంగఠిత రూపంలో కలిసి పద్ధతి ప్రకారంగా చేస్తున్నారు, పెంచుతున్నారు, ఇది చాలా బాగా తయారు చేసారు కూడా మరియు పెంచారు కూడా. ఇందులో అపోజిషన్ అయితే ఉంటుంది, కానీ మీరు మీ పొజిషన్లో దృఢంగా ఉండండి అప్పుడు అపోజిషన్ సమాప్తం అయిపోతుంది. అపోజిషన్ ఉంటేనే మీకు ఉల్లాసం వస్తుంది కదా, ఇది చేయాలి, ఇది చేయాలి అన్న ఉత్సాహం వస్తుంది కదా... కావున అపోజిషన్ పొజిషన్‌ను పెంచుతుంది. సఫలత లభిస్తుంది కూడా మరియు లభిస్తూ ఉంటుంది కూడా. ఇది నిశ్చితము. ఎప్పుడైనా ఏదైనా జరిగితే గాభరా పడకండి, సఫలత మీతో ఉంది. అపోజిషన్ వైపు సఫలత లేదు, పొజిషన్ వారితో ఉంది. చాలా బాగా చేస్తున్నారు, ప్రతి దేశంలో సిస్టమ్ బాగా తయారు చేసారు (ఐ.టి గ్రూప్‌కు ముఖ్యులు మోహిని అక్కయ్య) బాగుంది, నియమానుసారంగా ఎవరైతే నిమిత్తవుతారో , వారు ఏ కార్యం చేసినా నియమంతో లాభము ఉంటుంది. మంచి ధైర్యాన్ని ఉంచి చేసారు, ఇందుకు చాలా-చాలా అభినందనలు. ప్రతి దేశం నుండి బాప్‌దాదా వద్దకు సమాచారము వస్తూ ఉంటుంది, ఎలా పరస్పరం మీటింగులు చేసుకున్నారు, ఎలా భవిష్య ప్లాన్లు తయారు చేసారు, ఇదంతా బాప్‌దాదా వద్దకు చేరుకుంటుంది, ఇందుకు అభినందనలు, అభినందనలు.
ఓ.ఆర్.సి గ్రూప్:- అచ్ఛా, వీరు ప్లానింగ్ బుద్ధి ఆత్మలన్నమాట. క్రొత్త క్రొత్త ప్లాన్లను తయారు చేస్తారు. నలు వైపుల సేవ యొక్క వృద్ధి మరియు బ్రాహ్మణ ఆత్మలలో కూడా ఎలా వృద్ధి జరగాలి, విధి ఏమిటి, ఇవన్నీ పరస్పరంలో కలిసి మీటింగ్ చేసుకుంటూ ఉంటారు, ఇది బాగుంది. బాప్‌దాదా వద్దకైతే అన్ని సమాచారాలు ఆ సమయంలోనే చేరుకుంటాయి ఎందుకంటే బాప్‌దాదా టి.వి స్విచ్ ఆన్ చేయగానే అన్నీ అందులో కనిపిస్తాయి, వినిపిస్తాయి. బాప్‌దాదాకు నచ్చింది. పరస్పరం కలిసి ప్లాన్ మరియు ప్రోగ్రామ్ తయారు చేస్తారు, ప్రాక్టికల్‌లో తీసుకువచ్చేందుకు మంచి పురుషార్థం చేస్తారు. ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు వెళ్ళాలి. సఫలత పిల్లల మెడలో హారమువంటిది. మంచిది, చాలా బాగుంది. ముందుకు వెళ్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి.
సేవకు నిమిత్తమైన మరికొంతమంది ముఖ్య సోదరీలు బాబా ఎదురుగా నిల్చున్నారు:- అచ్ఛా, వీరు భిన్న భిన్న దేశాలవారు, పరస్పరం కలిసి భవిష్య సేవల ప్లాన్‌ను తయారు చేస్తారు, నలువైపుల వాయుమండలాన్ని తెలుసుకుని, వాయుమండలాన్ని కూడా పరస్పర సలహాలతో శక్తిశాలిగా చేస్తారు ఎందుకంటే వాయుమండల ప్రభావం చాలా త్వరగా పడుతుంది. సేవ వృద్ధి కోసం కూడా ప్లాన్లు తయారు చేస్తున్నారు మరియు సెంటర్ల వాయుమండలాన్ని కూడా శక్తిశాలిగా తయారు చేసే ప్లాన్లను కూడా పరస్పర సలహాలతో చేస్తున్నారు, దీని వలన ఎప్పటికప్పుడు వాయుమండలం మంచిగా అవ్వడాన్ని చూసాము. వృద్ధి కూడా బాగుంది, విధి కూడా బాగుంది, విధి యొక్క సిద్ధి కూడా ఉంది. ఇది సంగఠన శక్తి కదా. సంగఠన శక్తి ఎంతో అద్భుతాన్ని చేస్తుంది, చేయాల్సిందే. పరస్పరం కలుసుకోవడం కూడా జరుగుతుంది మరియు సేవా వృద్ధికి విధి కూడా తయారవుతుంది, పరస్పరం సమీపంగా కూడా వస్తారు. మరి ఈ ప్రోగ్రామ్ ఏదైతే తయారు చేసారో ఇది బాప్‌దాదాకు నచ్చింది. డ్రామా అనుసారంగా మీకు మధుబన్ ఛాన్స్ కూడా లభిస్తుంది. ఈ సంగఠన చాలావరకు మధుబన్ వాయుమండలంలో ఉంటుంది. సంగఠన శక్తిని మరింత పెంచుతూ ఉండండి. శక్తి సైన్యం తమను ప్రత్యక్షం చేసుకున్నప్పుడు బాబా ప్రత్యక్షమవుతారు ఎందుకంటే శక్తులు మరియు పాండవుల ద్వారానే బాబా ప్రత్యక్షమవుతారు. కావున ముందుగా ఎప్పుడైతే శక్తులు లేక పాండవులు స్వయాన్ని సంపూర్ణంగా ప్రత్యక్షం చేసుకుంటారో అప్పుడు బాబా ప్రత్యక్షమవుతారు. ప్రతి ఒక్కరి ముఖంలో బాబానే కనిపిస్తారు. సంగఠనలో ఇంత శక్తి ఉంది, మంచిగా అనిపించింది. మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా. సంగఠన శక్తిని పెంచుతూ ఉండండి. బాబాను ప్రత్యక్షం చేస్తూ ఉండండి. అభినందనలు. బాగుంది, మోజారిటీ భారత్ సోదరీలు ఉన్నారు. చూడండి, ముందు భారతదేశం విదేశాలను మేల్కొల్పడానికి వెళ్ళింది, ఇప్పుడు విదేశము భారత దేశాన్ని మేల్కొల్పుతుంది. మెజారిటీ భారత్ వారున్నారు. మరి విదేశము భారత దేశాన్ని ఎప్పుడు మేల్కొల్పుతుంది? ఈ ఐ.టి గ్రూప్ మేల్కొల్పుతుందా? బాగుంది, కనెక్షన్ మంచిగా అవుతుంది.
సర్వ్ ఆఫ్రికా గ్రూప్:- చూడండి, ఆఫ్రికా వారికి ఒక విషయంలో చాలా చాలా అభినందనలు – ఇచ్చిన మాటను పూర్తి చేసారు. సంగఠన శక్తితో ఒకరికొకరు సహయోగిగా మంచిగా అయ్యారు. ఇలాంటి దేశంలో తమ పరివారం వారు వచ్చి చేరుకున్నారు, ఆ సోదరసోదరీలను వెతికి పట్టుకోవడం, అందుకోసం బాగా కష్టపడ్డారు, విధి కూడా మంచిగా ఉంది మరియు సమయానికి సఫలత కూడా ప్రాప్తించింది, ఇందుకు చాలా-చాలా అభినందనలు. బాగా చేసారు, బాగా కష్టపడ్డారు. ఎవరైతే నిమిత్తంగా అయ్యారో, వారందరూ పరస్పరం సంగఠిత రూపంలో బాగా నడుచుకున్నారు, నడుచుకుంటున్నారు. వీరు కూడా ఉన్నారు కదా? (జయంతి అక్కయ్య గురించి) మీరు కూడా లేవండి, బాగా చేసారు, పరస్పర సహాయం బాగా లభించింది. బాప్‌దాదాకు చూపించారు, శక్తులు కూడా నిమిత్తంగా ఉన్నారు మరియు పాండవులు కూడా నిమిత్తంగా ఉన్నారు. చాలా మంచి రికార్డును పెట్టుకున్నారు. చాలా మంచిది, సఫలత యొక్క మాలనైతే బాప్‌దాదా వేస్తున్నారు. ఆ మాలనైతే వేసుకుంటారు, తీసేస్తారు కానీ సఫలత మాలను ఒక్కొక్కరికీ బాప్‌దాదా వేస్తున్నారు. చాలా బాగుంది, అచ్ఛా, పదమారెట్ల అభినందనలు.
ఢిల్లీ ఓ.ఆర్.సిలో ఎస్.ఎమ్.ఎల్ ట్రైనింగ్ చేసే, చేయించే గ్రూప్:- బాగుంది, ఎంతగా అభ్యాసం చేస్తారో అంతగా పుణ్యం సంపాదించుకుంటారు. ఇతరుల సేవను చేసి వారిలో పరివర్తనను తీసుకురావడము, ఈ సేవా పుణ్యము జమ అవుతుంది. ఈ పుణ్యము వర్తమాన సమయం సంతోషాన్ని ఇస్తుంది మరియు భవిష్యత్తుకు కూడా జమ చేస్తుంది. ఎంతమందికైతే చేయిస్తారో అంతగా జమ అవుతుంది. ఎందుకు చేసారు? చేయించడానికి ట్రైనింగ్ తీసుకున్నారు కదా. అంటే ఇంతమంది హ్యాండ్స్ చేయించడానికి తయారయ్యాయి. అంటే ఎంత పుణ్యం జమ అయ్యింది! సేవ అంటే పుణ్యం జమ అవ్వడం, అది ఏ గ్రూప్ అయినా కావచ్చు. ఏ ఏ గ్రూపులైతే భిన్న భిన్న ప్రకారాల సేవలు చేసాయో, వారందరి పుణ్యం జమ అయిపోయింది, ఇలాగే జమ చేసుకుంటూ ఉండండి. అందుకే నేర్చుకున్నారు కదా! తెలివైనవారిగా అయిపోయారు కదా! ఇతరులకు కూడా చేయించగలరు కదా? ఒకరినొకరు ముందు ఉంచడము, ఇది కూడా మంచిగా చేసారు. నిమిత్తంగా అయ్యారు కదా? నిమిత్తంగా అయ్యేవారికి కూడా పుణ్యం జమ అవుతుంది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు, కానీ ఏదైతే నేర్చుకున్నారో దానిని నేర్చించడంలో నంబర్‌వన్‌లో ఉండండి. మీ వరకే ఉంచుకోకండి. ఉపయోగించండి. సమయం ఇచ్చారు మరియు నిమిత్తుల సమయాన్ని తీసుకున్నారు కావున ముందుకు సాగండి. అభినందనలు, అభినందనలు.
చాలా మంచిది, ఎవరైతే గ్రూప్‌లో కూర్చున్నారో, వారికి కూడా చాలా-చాలా అభినందనలు. ఏదో ఒక సేవలో మీ గ్రూపు కూడా ఉంది కదా, అందుకని ఇన్‌అడ్వాన్స్ అభినందనలు.
అచ్ఛా - ఇప్పుడు క్షణములో బాప్‌దాదా ఏ స్థితిలో స్థితులవ్వమని డైరెక్షన్ ఇస్తే ఆ స్థితికి క్షణములో చేరుకోగలరా! లేక పురుషార్థములోనే సమయము గడిచిపోతుందా? ఇప్పుడు క్షణములో చేయగలిగే ప్రాక్టీస్ కావాలి ఎందుకంటే మున్ముందు ఫైనల్ సమయము ఏదైతే వచ్చేదుందో, అందులో పాస్ విత్ ఆనర్ సర్టిఫికేట్ లభించాలంటే, దాని కోసం అభ్యాసము ఇప్పటి నుండే చెయ్యాలి. క్షణములో ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్ళగలగాలి, ఏ స్థితి కావాలంటే ఆ స్థితిలో స్థితులైపోవాలి. కావున ఎవరెడీగా ఉండండి. రెడీ అయిపోయారా?
ఇప్పుడు ముందుగా ఒక్క క్షణములో - నేను పురుషోత్తమ సంగమయుగి శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను, ఈ స్థితిలో స్థితులవ్వండి... ఇప్పుడు నేను ఫరిశ్తా రూపాన్ని, డబల్ లైట్‌ను... ఇప్పుడు విశ్వకళ్యాణకారిగా అయ్యి మనసా ద్వారా నలువైపులా శక్తి కిరణాలను ఇచ్చే అనుభవము చెయ్యండి. ఇలా మొత్తము రోజులో క్షణములో స్థితులైపోగలరా! ఈ అనుభవము చేస్తూ ఉండండి ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. ఎక్కువ సమయము లభించదు. అలజడిలో క్షణములో అచలముగా అవ్వగలగాలి, ఈ అభ్యాసాన్ని స్వయానికి స్వయమే తమ సమయాన్ని కేటాయించి మధ్యమధ్యలో చేస్తూ ఉండండి. దీని ద్వారా మనసును కంట్రోల్ చేయటము సహజమైపోతుంది. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ (నియంత్రణ చేసే శక్తి, పరిపాలించే శక్తి) పెరుగుతూ ఉంటాయి. అచ్ఛా!
నలువైపుల ఉన్న పిల్లల యొక్క ఉత్తరాలు కూడా ఎన్నో వచ్చాయి. అనుభవాలు కూడా ఎన్నో వచ్చాయి. బాప్‌దాదా పిల్లలకు రిటర్న్‌లో చాలా-చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను మరియు హృదయపూర్వకమైన ప్రియస్మృతులను పదమాల, పదమాల రెట్లు ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు వింటున్నారు కూడా, చూస్తున్నారు కూడా అన్నది బాప్‌దాదా చూస్తున్నారు. ఎవరైతే చూడటము లేదో, వారు కూడా స్మృతిలో అయితే ఉన్నారు. అందరి బుద్ధి ఈ సమయములో మధుబన్లోనే ఉంది. కనుక నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ పేరు సహితముగా ప్రియస్మృతులను స్వీకరించండి.
సదా ఉల్లాస-ఉత్సాహాలు అనే రెక్కల ద్వారా ఉన్నత స్థితిలో ఎగురుతూ ఉండే శ్రేష్ఠ ఆత్మలందరికీ, సదా స్నేహములో లవలీనులై ఉండే, ఇమిడిపోయే పిల్లలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా, సమస్యల నుండి ముక్తులుగా, విఘ్నాల నుండి ముక్తులుగా ఉండే, యోగయుక్తులైన, రాజయుక్తులైన పిల్లలకు, సదా ప్రతి పరిస్థితిలో క్షణములో పాస్ అయ్యేవారికి, అన్ని వేళలా సర్వశక్తి స్వరూపులుగా ఉండే మాస్టర్ సర్వశక్తిమంతులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మీ అందరికీ ప్రియమైన దాదీకు కూడా చాలా-చాలా ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు.
దాదీలతో:- ఈ ముక్త స్థితి కూడా బహుకాలం నుండి ఉండాలి. గ్రహచారంగానీ, విఘ్నంగానీ, ఇటువంటిదేదీ ఉండకూడదు. స్వదర్శనాన్ని నడిపిస్తూ ఉండాలి – అప్పుడు పరదర్శన, పరచింతన సమాప్తమవుతాయి. ముందుగా డబల్ విదేశీయులు చేసి చూపించండి, చేస్తారు కదా? నిమిత్తంగా అయ్యి చూపించండి. మాయాముక్తులు, మాయకు వీడ్కోలు ఇచ్చేయండి అప్పుడు బాబా నుండి అభినందనలు లభిస్తాయి. మాయకు సదా కోసం వీడ్కోలు ఇవ్వడము అంటే బాబా నుండి అభినందనలు తీసుకోవడము. (దాదీ తరఫున మోహిని అక్కయ్య బాబాను కౌగిలించుకున్నారు) మీ అందరికీ తెలుసు కదా, మీ పర్దాదీ (నిర్మల్శాంత దాదీ) ఉన్నారు కదా, వారు కూడా ఎంతో మధురంగా తమ పాత్రను పోషిస్తున్నారు. బాబాతో పాటు మీ అందరికీ కూడా చాలా-చాలా స్మృతిని పంపారు. వారి ధైర్యాన్ని చూసి బాప్‌దాదా చాలా సంతోషిస్తున్నారు. ఏ డాక్టర్ వచ్చినాగానీ, డాక్టర్‌కు కూడా జ్ఞానాన్ని వినిపించడం మొదలుపెడతారు. డాక్టర్ దాదీని చూసి పేషంట్ అనుకుంటే దాదీ అయితే డాక్టర్‌కే జ్ఞానాన్ని వినిపించి వారికి పెషంస్ను (సహనాన్ని) నేర్పిస్తారు. ఇలా వీరు కూడా చాలా మంచిగా తమ పాత్రను పోషిస్తున్నారు. స్మృతిలో ఉంటూ మున్ముందుకు ఎగురుతున్నారు. బెడ్‌పై ఉన్నా కూడా ఎగురుతున్నారు. అందరూ స్మృతిని ఇచ్చారు, పర్దాదీకైతే చాలా పెద్ద స్మృతి కావాలి కదా. అచ్ఛా, చాలా మంచిది.
(దాదీ జానకి బాబాను కౌగిలించుకున్నారు)
మీరైతే కౌగిలిలో ఉన్నారు, ఇలా ఇతరులను కూడా తీసుకోవాలి (మున్ని అక్కయ్య, ఈషూ దాదీ కూడా ప్రత్యేకంగా స్మృతిని పంపారు) అచ్ఛా – దాదీ వద్ద సేవకు ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో మున్ని బచ్చీ, డాక్టర్‌గారు (డా. అశోక్ మోహతా) మరియు ఇతర సోదరసోదరీలందరూ మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నారు, బాగా సేవ చేస్తున్నారు, అందుకనే మనస్ఫూర్తిగా సేవను చేసేవారికి దిలారాముడైన బాప్‌దాదా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు, ప్రియస్మృతులు కూడా ఇస్తున్నారు. పర్దాదీ వద్ద ఉన్న సేవాధారులకు కూడా బాప్‌దాదా విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. మీరు కూడా ఇస్తున్నారు కదా? మున్ని, ఈషూ, పార్లా యోగిని అక్కయ్య మరియు ఇతర సేవా సహచరులు అందరూ బాగా చేస్తున్నారు, హాస్పిటల్లో ఎవరైతే బ్రాహ్మణ ఆత్మలు సేవ చేస్తున్నారో, వారందరికీ ప్రియస్మృతులు. (మున్ని అక్కయ్య చెప్తున్నారు – 40 సంవత్సరాలలో బాబా మధుబన్‌లో, మేము ముంబయిలో ఉండటము ఇదే మొదటిసారి) బాప్‌దాదా మీ అందరినీ మధుబన్‌లో చూస్తున్నారు, ఎక్కడున్నాగానీ మధుబన్‌లో బాబా ఎదురుగా ఉన్నారు. ఫరిశ్తా రూపంలో ఎదురుగా ఉన్నారు.
విదేశాల పెద్దక్కయ్యలతో:- పరస్పర ఆలోచనలను తీసుకుని, సంగఠిత రూపంలో సేవలో నడుచుకుంటున్నారు, ఇందుకు అభినందనలు. బాప్‌దాదా యొక్క జన్మ వరదానం ఉంది (అందరూ టెన్షన్ ముక్తులుగా ఉన్నారు) ఒకవేళ వీరికి టెన్షన్ ఉంటే ఇక ఇతరుల సంగతేమిటి? వీరి వెనుక లైన్ ఉంది కదా. వీరికైతే టెన్షన్ స్వప్నంలో కూడా ఉండదు ఎందుకంటే లైన్ పెద్దగా ఉంది. వీరైతే ఉన్నారు కానీ విశ్వం యొక్క లైన్ కూడా ఉంది కదా, ఆ అల వ్యాపిస్తుంది. హెల్త్ కూడా బాగుంది, వెల్త్ కూడా బాగుంది, హ్యాపీ కూడా ఉంది. అందరూ హెల్దీగా ఉన్నారు. భారతదేశ సోదరీలు విదేశాన్ని సంభాళించారు, ఇందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. (ముంబయి, ఢిల్లీ యొక్క అద్భుతం) గుజరాత్ కూడా ఉంది, గుజరాత్ పేరు కూడా పెట్టండి కదా. అన్ని కార్య వ్యవహారాలు కూడా మంచిగా జరుగుతున్నాయి.
(ఈసారి జనవరి మాసము స్పెషల్‌గా ఉంటుంది) ఈసారి జనవరి మాసాన్ని ఎలా జరుపుకోవాలంటే అందరూ విఘ్న ముక్త సర్టిఫికేట్‌ను తీసుకోవాలి. అందరికీ సర్టిఫికేట్ లభించాలి, నవీనతను చేయండి. నవీనత ఉంటే ఎగురుతారు. ఇప్పుడు ఎగిరే సమయము ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు, అలజడి యొక్క సమయము. అందులో మీరు అచలంగా ఉండాలి. మేము అలజడిలో ఉంటే వీరు నిశ్చలంగా ఉన్నారు అన్నది అందరికీ అనిపించాలి. ఇలా జరగాల్సిందే. మంచిది. చాలా-చాలా అభినందనలు.
దాదీ శాంతమణి, దాదీ మనోహర్ ఇంద్ర, దాదీ రతన్మోహిని:- ఈ త్రిమూర్తులు మధుబన్కు నిమిత్తులు. మధుబన్ అంటే అందులో అన్నీ వచ్చేస్తాయి. నిమిత్తంగా భావిస్తూ నడుస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఆది రత్నాలు కదా. ఆది రత్నాలలో ఆది దేవతల సంస్కారాలు ఆటోమేటిక్‌గా నిండి ఉన్నాయి, వాటిని ప్రాక్టికల్‌లో తీసుకురండి. అందరూ మిమ్మల్ని చూసి ఎంతగానో సంతోషిస్తారు. మరి సంతోషాన్ని ఇస్తున్నారు, సంతోషాన్ని ఇస్తూ ఉంటారు. చాలా బాగుంది. (దాదీ శాంతమణితో) శాంతమణి దాదీ అయితే 5 పక్షులలో (5 చిడియా) కూడా ఒకరు, 5మంది సోదరీలు ఎవరైతే నిమిత్తమయ్యారో, అందులో కూడా ఒకరు. అచ్ఛా!
ఓంశాంతి