Search for a command to run...
25 Jan 1970
స్మృతి చిహ్నాన్ని శాశ్వతపరుచుకునే విధి
25 January 1970 · తెలుగు
అవ్యక్త స్థితియే ముఖ్యమైన సబ్జెక్టు. వ్యక్తంలో ఉంటూ, కర్మలు చేస్తూ కూడా అవ్యక్త స్థితిలో ఉండాలి. ఈ సబ్జెక్టులోనే పాస్ అవ్వాలి. మీ బుద్ధిలైన్ను క్లియరుగా పెట్టుకోవాలి. దారి స్పష్టంగా ఉన్నప్పుడు త్వరత్వరగా పరిగెత్తి గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. పురుషార్థం అనే మార్గంలో ఏదైనా ఆటంకం ఉంటే దానిని తొలగించి లైన్ క్లియర్ చేసుకోవడము – ఈ సాధనముతోటే అవ్యక్త స్థితి ప్రాప్తిస్తుంది. మధుబనానికి వచ్చి, ఏదో ఒక విశేషతను అందరికీ ఇవ్వండి, ఇదే స్మృతిచిహ్నము. అదైతే జడమైన స్మృతిచిహ్నము. కానీ ఇక్కడ మీరు గుణాలను గుర్తుగా ఇవ్వడమే చైతన్య స్మృతిచిహ్నము, దీనిని ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఎప్పుడు ఎక్కడకు వెళ్ళినాగానీ ఇదే లక్ష్యాన్ని పెట్టుకోండి, ఎక్కడకు వెళితే అక్కడ మీ స్మృతిచిహ్నాన్ని శాశ్వతంగా చేసుకోండి. ఇక్కడనుండి విశేషంగా స్నేహాన్ని మీలో నింపుకొని వెళ్ళండి, స్నేహము రాయిని కూడా కరిగిస్తుందని అంటారు. ఈ ఆత్మిక స్నేహ కానుకను మీతో పాటు తీసుకుని వెళ్ళండి. దీనితో ఎవరిపైనైనా విజయం లభిస్తుంది. సమయం ఎక్కువ లభించిందా లేక తక్కువ లభించిందా? అయితే ఇప్పుడు తక్కువ సమయంలోనే 100% వరకు చేరుకునే ప్రయత్నం చేయాలి. మీకున్న ధైర్యాన్నంతా వినియోగించండి. ఒక్క సెకండు కూడా వృధా కాకూడదు, ఇంతగా శ్రద్ధ పెట్టండి. సంగమంలో ఒక్క సెకండు కూడా చాలా పెద్దది. మీ సమయం మరియు సంకల్పాలు రెండింటినీ సఫలం చేయండి. పెద్దవారు చేయలేని వాటిని చిన్నవారు చేయగలరు. ఇప్పుడు ఆ కార్యం మిగిలి ఉంది. ఇప్పటి వరకు చేసిన పరుగు జరిగిపోయింది, ఇప్పుడు జంప్ చేయాలి, అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరు. సెకండులో అనేక విషయాలను పరివర్తన చేయాలి – ఇదే జంప్ చేయడం అంటే అర్థం. ఇంత ధైర్యం ఉందా? ఏదైతే విన్నారో దానిని జీవితంలోకి తీసుకువచ్చి చూపించండి. ఎవరితో స్నేహం ఉంటుందో వారిలా అవ్వాలి. మరి ఏవైతే బాప్దాదా గుణాలున్నాయో వాటిని స్వయంలో ధారణ చేసుకోవడమే స్నేహానికి బాధ్యత. బాబాలో ఉన్న శ్రేష్ఠతను స్వయంలో ధారణ చేసుకోండి. ఇదే స్నేహం. ఒక్క విశేషతలో కూడా లోటు ఉండకూడదు. సర్వ గుణ సంపన్నంగా అవ్వాలన్న లక్ష్యమే పెట్టుకోవాలి. బాబా గుణాలను ఎదురుగా పెట్టుకుని నేను ఎంతవరకు చేరుకున్నాను అని స్వయాన్ని చెక్ చేసుకోండి. తక్కువ శాతం ఉండకూడదు. శాతం కూడా సంపూర్ణంగా ఉండాలి, అప్పుడే అక్కడ కూడా సంబంధంలో సమీపంగా రాగలరు.
ఇప్పుడు ఆత్మనే చూడండి. దేహాన్ని చూసి-చూసి అలసిపోయారు. కనుక ఇప్పుడు ఆత్మనే చూడండి. దేహాన్ని చూడటం వలన ఏమి లభించింది? దుఃఖితులుగానే అయ్యారు. ఇప్పుడు ఆత్మ -ఆత్మను చూస్తే ఉపశమనంగా ఉంటుంది. శూరవీరులు కదా! శూరవీరుల గుర్తు ఏమిటి? వారికి ఏ విషయాన్నీ దాటడం కష్టంగా అనిపించదు, సమయమూ పట్టదు. వారి సమయం సేవలో తప్ప విఘ్నాలు మొదలైన వాటిని తొలగించడంలో ఖర్చవ్వదు. వీరినే శూరవీరులు అంటారు. మీ సమయాన్ని మీ విఘ్నాలలో కాదు, సేవలో ఉపయోగించండి. ఇప్పుడైతే సమయం చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఈ లెక్కన ఇప్పుడు అటువంటి విషయాలన్నీ బాల్యానివే అవుతాయి. చిన్న పిల్లలు కోమలంగా ఉంటారు. పెద్దలు ధైర్యంగా ఉంటారు. పురుషార్థంలో కూడా పిల్లతనం వద్దు. ఇటువంటి ధైర్యశాలిగా అవ్వండి. పరిస్థితి ఎటువంటిదైనా, ఏదైనా, వాయుమండలం ఎలా ఉన్నాకానీ బలహీనంగా అవ్వకండి, వీరినే శూరవీరులు అంటాము. శారీరక బలహీనత ఉంటే వాతావరణం, గాలి మొదలైన వాటి ప్రభావం పడుతుంది. ఆరోగ్యవంతులపై ప్రభావం పడదు. ఇక్కడ కూడా కోమలంగా ఉండేవారిపై వాయుమండలం యొక్క ప్రభావం పడుతుంది. వాయుమండలం రచయిత కాదు. అది రచన. రచయిత పెద్దనా లేక రచననా? (రచయిత) మరైతే రచయిత రచనకు ఎందుకు అధీనమవుతున్నారు? ఇప్పుడు శూరవీరులుగా అయ్యే స్మృతి దివసాన్ని గుర్తుంచుకోండి. ఈ స్మృతిని మర్చిపోకండి. మీ చిత్రపటంలో బాబా కనిపించేలా పటాన్ని తయారు చేసుకుని వెళ్ళండి. స్వయానికి సంపూర్ణత యొక్క పటాన్ని చూపించండి. ధైర్యము ఉంటే సహాయం తప్పకుండా లభిస్తుంది. ఇక్కడకు వచ్చాక మీలోని ఢీలాతనంలో వేగం వచ్చిందని భావిస్తున్నారా? ఇప్పుడు పురుషార్థంలో ఢీలా అవ్వకండి. సంపూర్ణ హక్కును పొందడానికి సంపూర్ణ ఆహుతి కూడా ఇవ్వవలసి వస్తుంది. ఏదైనా యజ్ఞాన్ని రచిస్తే అది సంపూర్ణం సఫలం ఎలా అవుతుంది? అందులో ఆహుతి వేసినప్పుడు. ఆహుతి తక్కువైతే యజ్ఞం సఫలమవ్వదు. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఇదే చూసుకోండి – నేను ఆహుతి వేసానా? కొద్దిగైనా ఆహుతిలో లోటు ఉంటే సంపూర్ణ సఫలత అని చెప్పలేము. ఎంతకు అంత అన్నట్లుగానే లెక్క ఉంటుంది. లెక్క వేయడానికి ధర్మరాజు కూడా ఉన్నారు. వారు ఏ లెక్కనూ విడిచిపెట్టరు. అందుకే ఆహుతి ఇవ్వాల్సినవన్నిటినీ సంపూర్ణంగా ఆహుతి ఇవ్వండి, తర్వాత సంపూర్ణంగా తీసుకోండి. ఇవ్వడంలో సంపూర్ణత లేకపోతే తీసుకోవడంలో కూడా ఉండదు. ఎంత ఇస్తారో అంతే తీసుకుంటారు. ఏమి చేస్తే సఫలత వస్తుందో తెలిసి కూడా సఫలం చేయకపోతే ఏమి జరుగుతుంది? లోటు ఉండిపోతుంది కావున ఎక్కడైనా ఏదైనా ఉండిపోకుండా ఉండేలా శ్రద్ధ పెట్టండి. మనసులో, వాణిలో, కర్మలో ఎక్కడ కూడా ఏమీ ఉండిపోకూడదు. ఏదైనా కార్యం యొక్క ముగింపు రోజు వచ్చినప్పుడు ఏదైనా మిగిలిపోయిందా అని అన్ని వైపులా చూస్తారు. అలాగే ఇది ముగింపు సమయం. ఏదైనా మిగిలిపోతే అది ఎప్పటికీ మిగిలిపోతుంది. తర్వాత దానిని స్వీకరించడం జరగదు. అప్పుడు దానిని సంపూర్ణ ఆహుతి అని చెప్పలేము. కనుక ఇంతగా శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు లోటు పెట్టుకునే సమయం గడిచిపోయింది. ఇప్పుడు సమయం చాలా వేగంగా వస్తుంది. సమయం వేగంగా వెళ్ళిపోయి, స్వయం ఢీలాగా మిగిలిపోతే ఏమి జరుగుతుంది? గమ్యానికి చేరుకోగలరా? అప్పుడు సత్యయుగ గమ్యానికి చేరుకునే బదులు త్రేతలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎలా అయితే సమయం వేగంగా పరిగెడుతుందో అలాగే స్వయం కూడా పరిగెత్తండి. భౌతికంగా కూడా, ఏదైనా బండిని పట్టుకోవాలంటే సమయాన్ని చూస్తారు కదా. లేకపోతే ఉండిపోతారు. సమయమైతే గడుస్తూనే ఉంది. ఎవరికోసమూ సమయం ఆగదు. ఇప్పుడు ఢీలాగా నడిచే రోజులు గడిచిపోయాయి. పరిగెత్తే రోజులు కూడా పోయాయి. ఇప్పుడు జంప్ చేయాల్సిన రోజులు. ఏదైనా విషయంలో లోటు అనిపిస్తే దానిని ఒక్క సెకండులో పరివర్తన చేయండి, దీనిని జంప్ చేయడం అంటారు. చూడటానికి ఎత్తుగా అనిపిస్తుంది కానీ చాలా సహజం. ఇందుకోసం కేవలం నిశ్చయం మరియు ధైర్యం కావాలి. నిశ్చయం ఉన్నవారి విజయమైతే కల్ప క్రితం కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇంత పక్కాగా స్వయాన్ని తయారు చేసుకోవాలి. ప్రతి సెకండు మనసు, వాణి మరియు కర్మలను చూసుకుంటూ ఉండండి. బాప్దాదాకు ఇది చూడటం పెద్ద కష్టమేమీ కాదు. చూడటానికి ఇప్పుడు ఎటువంటి ఆధారము అవసరం లేదు. ఎక్కడినుండైనా చూడవచ్చు. మేము చేసి చూపిస్తాము అన్న ఉల్లాసం పాతవాళ్ళకన్నా క్రొత్తవారిలో ఉంటుంది. ఇటువంటి తీవ్ర విద్యార్థులు కూడా ఉన్నారు. క్రొత్తవారే అద్భుతాన్ని చేసి చూపించగలరు ఎందుకంటే వారికి సమయం స్పష్టంగా కనిపిస్తుంది. సమయం యొక్క సహయోగం కూడా ఉంది, పరిస్థితుల సహయోగం కూడా ఉంది. పరిస్థితులు కూడా ఇప్పుడు పురుషార్థం ఎలా చేయాలో చూపిస్తున్నాయి. పరీక్షలు మొదలైతే పురుషార్థం చేయలేరు. తర్వాత ఫైనల్ పేపరు మొదలవుతుంది. పేపరుకన్నా ముందే చేరుకున్నారు, ఇది కూడా మీ భాగ్యంగా భావించండి, సరైన సమయానికే చేరుకున్నారు. పేపరు రాయడానికి దాఖలు అవ్వగలిగారు. పేపరు మొదలైతే తలుపులను మూసి వేయడం జరుగుతుంది. ఆరంభంలో వచ్చిన వారికి వైరాగ్యాన్ని ఇవ్వవలసి వచ్చేది. కానీ ఈనాటి పరిస్థితులే వైరాగ్యాన్ని తెప్పిస్తున్నాయి. మీ ధరణి తయారవ్వడంలో ఆలస్యం లేదు. కేవలం జ్ఞానంలో నిశ్చయం అనే పక్కా బీజాన్ని వేస్తే ఫలం తయారవుతుంది. ఇది త్వరగా ఫలాన్నిచ్చే బీజము. బీజము శక్తివంతమైనది. ఇకపోతే పాలన అందించడం, చూసుకోవడం మీ పని. తండ్రేమో సర్వశక్తిమంతుడు, పిల్లలకేమో సంకల్పాలను ఆపే శక్తి కూడా లేదా! తండ్రి సృష్టిని మారుస్తారు, పిల్లలు తమను తాము కూడా మార్చుకోలేరా! బాబా ఏమిటి, నేను ఏమిటి అని ఆలోచించండి. అప్పుడు మీపై మీకే సిగ్గుగా అనిపిస్తుంది. మీ నడవడికను మార్చుకోండి. వాణితో అంతగా అర్థం చేసుకోలేరు. పరివర్తనను చూసి, మిమ్మల్ని ఇలా ఎవరు తయారు చేసారు అని వారే అడుగుతారు. ఎవరైనా మారి చూపిస్తే, ఈ మార్పు ఎలా వచ్చింది, ఏమి జరిగింది అని వద్దన్నా ప్రశ్నిస్తారు, అలాగే మీ నడవడికను కూడా చూసి వారే ఆకర్షింపబడతారు.
ఇది నిమిత్త సేవాకేంద్రము. ముఖ్య కేంద్రమైతే అందరికీ ఒక్కటే. ఇటువంటి అనంతమైన దృష్టిలో ఉంటున్నారు కదా. ముఖ్య కేంద్రంతోటే అందరి కనెక్షన్ ఉంటుంది. సర్వాత్మల కనెక్షన్ వారితోటే, సంబంధం కూడా. ఒక్కరితో సంబంధం ఉంటే స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. మరెక్కడైనా సంబంధాల ఆకర్షణ ఉంటే ఏకరస స్థితి ఉండదు. మరి ఏకరస స్థితిని తయారు చేసుకోవడానికి ఒక్కరిని తప్ప మరెవ్వరినీ చూస్తూ కూడా చూడకుండా ఉండండి. ఏదైతే చూస్తున్నారో ఆ వస్తువులేవీ ఉండేవి కావు. మీకు తోడుగా ఉండే అవినాశి వస్తువు ఒక్క బాబా మాత్రమే. ఆ ఒక్కరి స్మృతిలో సర్వ ప్రాప్తులు లభిస్తాయి, సర్వుల స్మృతితో ఏదీ ప్రాప్తించదు, మరి ఏ బేరము మంచిది? అన్నీ చూసుకుని బేరం కుదుర్చుకుంటారా లేక చెప్పారని చేసుకుంటారా? ఈ మాయ సదాకోసం వీడ్కోలు తీసుకోవడానికి వెళ్ళే ముందు తన ముఖాన్ని మీకు చూపించి వెళ్తుందని మీకు తెలుసు. ఇప్పుడు వీడ్కోలు తీసుకోవడానికి వస్తుంది, ఓడించడానికి కాదు. అనుమతి తీసుకోవడానికి వస్తుంది. ఆ సమయంలో గాభరా పడితే అది బలహీనత అవుతుంది. బలహీనత ఉంటే మాయ దాడి జరుగుతుంది. ఇప్పుడైతే శక్తి లభించింది కదా. సర్వశక్తిమంతునితో సంబంధం ఉంటే వారి శక్తి ముందు మాయ శక్తి ఏపాటిది? సర్వశక్తిమంతుని పిల్లలు మేము అన్న నషాను మరువకండి. మర్చిపోతేనే మాయ దాడి చేస్తుంది. మూర్ఛపోకండి. తెలివైనవారు స్పృహలో ఉంటారు. ఈరోజుల్లో దొంగలు కూడా ఏవో వస్తువులతో మూర్ఛపోయేలా చేస్తున్నారు. అలాగే మాయ కూడా చేస్తుంది. మాయ పద్ధతి ఇది అని తెలుసుకున్న చతురులు ముందునుండే జాగ్రత్తపడతారు. తమ స్పృహను కోల్పోరు. ఈ సంజీవని మూలికను ఎప్పటికీ గుర్తుంచుకోండి.
ఒక నెల నుండే వస్తుండవచ్చు. ఇది కూడా ఎక్కువ. ఒక్క సెకండులో పరివర్తన అవ్వవచ్చు. మేము ఇప్పుడే వచ్చాము, క్రొత్తవారిమి అని అనుకోకండి. ఇక్కడ క్షణాల బేరము ఉంటుంది. ఒక్క క్షణంలో జన్మ సిద్ధ అధికారాన్ని పొందవచ్చు. కనుక ఇటువంటి తీవ్ర పురుషార్థాన్ని చేయండి. ఇందుకు ఇదే ఉపాయం లభిస్తుంది. ఏ విషయం వచ్చినాగానీ ఒక్క క్షణంలో మారిపోవాలి అన్న లక్ష్యం పెట్టుకోండి. పూర్తి కల్పంలో ఇదే సమయం. ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు అన్న మంత్రాన్ని గుర్తుంచుకోండి. ఏవైతే పాత సంస్కారాలు, పాత స్వభావాలు ఉన్నాయో అవి మారి ఈశ్వరీయంగా అవ్వాలి. ఎటువంటి పాత సంస్కారాలు, పాత అలవాట్లు ఉండకూడదు. మీ పరివర్తనతో అనేకులు సంతృప్తి చెందుతారు. నా నడవడిక ద్వారా ఎవ్వరికీ దుఃఖం కలగకూడదు అనే ప్రయత్నమే ఎప్పుడూ ఉండాలి. నా నడవడిక, సంకల్పం, వాణి, ప్రతి కర్మ సుఖదాయిగా ఉండాలి. ఇదే బ్రాహ్మణ కుల రీతి. వీరు మాకన్నా భిన్నంగా ఉన్నారని వారికి దూరం నుండే అనిపించాలి. అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి – ఇదే పురుషార్థం. ఇతరులను కూడా ఇలా తయారు చేయాలి. అవ్వాలి మరియు చేయాలి – ఈ లక్ష్యమునే పెట్టుకోండి. ఎవరు ఎంతగా అవుతారో అంతగా తయారు చేస్తారు. మీ జీవీతంలో అలౌకికత కనిపిస్తుందా? స్వయాన్ని ఇతరులకన్నా భిన్నమైనవాడిని అని భావిస్తున్నారా? ఒకవేళ స్మృతిని మర్చిపోతే బుద్ధి ఎక్కడ ఉంది? ఒక వైపున మర్చిపోతే మరో వైపుకు వెళ్తుంది కదా. అవ్యక్త స్థితి నుండి క్రిందకు దిగినప్పుడు ఏ వ్యక్తి వైపుకు బుద్ధి వెళ్తుంది అని పరిశీలించుకోండి. తప్పకుండా ఏదో మిగిలిపోయి ఉంది అక్కడ, అందుకే బుద్ధి అక్కడకు వెళ్తుంది. కొన్ని విషయాలను పొడిగిస్తే అవి పొడుగు అవుతూ ఉంటాయి. మరి కొన్ని విషయాలలో ఢీలాగా వదలడం కూడా లాగడమే అవుతుంది. గాలిపటాన్ని పైకి ఎగురవేయడానికి ఢీలాగా వదలాల్సి ఉంటుంది. ఈ విధంగా పైకి వెళ్ళడం లేదని గమనించినప్పుడు ఢీలాగా వదలాలి, అప్పుడు అది దానంతటదే పైకి వెళ్తుంది.
విఘ్నాలను తొలగించే యుక్తులు సదా గుర్తున్నట్లయితే పురుషార్థంలో ఎప్పుడూ ఢీలా అవ్వరు. ఉపాయాలను మర్చిపోతున్నారు కనుకనే పురుషార్థం కూడా ఢీలాపడుతుంది. ఒక్కొక్క విషయానికి ఎన్నో యుక్తులు లభించాయి! ప్రాప్తి చాలా పెద్దది, మార్గం చాలా సులభమైనది. అనేక జన్మలు కష్టపడినాగానీ ఇది లభించలేదు. అటువంటి మార్గాన్ని ఒక్క జన్మలో కూడా కొన్ని క్షణాలలోనే పొందుతున్నారు. ఇంతటి నషా ఉంటుంది కదా. ‘‘ఇచ్ఛా మాత్రమ్ అవిద్య’’ ఇటువంటి స్థితిని తయారు చేసుకోవడానికి విధానాన్ని చెప్పాము. ఇంతటి ఉన్నతమైన జ్ఞానము, ఎంతో సూక్ష్మమైనది. నేను దేవతగా అవ్వగలను అన్న ఇంతటి ఉన్నతమైన లక్ష్యాన్ని మరెవ్వరూ పెట్టుకోలేరు. నేనే దేవతను అని ఎప్పుడైనా అనుకున్నారా? ఏమనుకున్నారు, ఏమవుతున్నారు? అడగకుండానే అమూల్యమైన రత్నాలు లభిస్తున్నాయి. నేను ఇంతటి పదమాపదమ భాగ్యశాలిని అని భావిస్తున్నారా? ప్రెసిడెంటు మొదలైనవారు కూడా మీ ముందు ఏమిటి? ఇంత ఉన్నతమైన దృష్టి, ఇంత ఉన్నతమైన స్వమానము గుర్తుంటున్నాయా లేక మర్చిపోతున్నారా? స్మృతి-విస్మృతి అనే ఎత్తును ఎక్కుతూ దిగుతూ ఉన్నారా? చెత్త ఉంటే దోమలు మొదలైనవి వస్తాయి అందుకని వాటిని తొలగించడం జరుగుతుంది. అలాగే మీలోని బలహీనత కారణంగా మాయ అనే క్రిములను పట్టుకుంటున్నారు. బలహీనతను రానివ్వకపోతే మాయ రానేరాదు. సర్వశక్తిమంతునితో నాకు సంబంధం ఉంది అని సదా గుర్తుంచుకోండి. అఫ్పుడు బలహీనత ఎందుకు ఉంటుంది? సర్వశక్తిమంతుడైన బాబా పిల్లలైనప్పటికీ మాయ శక్తిని సమాప్తం చేయలేరా! నా తండ్రి సర్వశక్తిమంతుడు అని గుర్తుంచుకోండి. మేము అందరికన్నా శ్రేష్ఠమైన సూర్యవంశీయులం. మాపై మాయ ఎలా దాడి చేయగలదు! మీ తండ్రిని, మీ వంశాన్ని గుర్తుంచుకుంటే మాయ ఏమీ చేయలేదు. స్మృతి స్వరూపులుగా అవ్వాలి. ఇన్ని జన్మలు విస్మృతిలో ఉన్నారు కదా, ఇప్పటికీ విస్మృతి నచ్చుతుందా? 63 జన్మలు విస్మృతిలో ఉండి మోసపోయారు, ఇప్పుడు ఒక్క జన్మలో మోసపోకుండా ఉండటం కష్టమా? పదే పదే బలహీనపడుతూ ఉంటే, చెకింగ్ చేసుకోకపోతే వారి స్వభావం బలహీనంగానే అవుతుంది. స్థితిని పరిశీలించుకుని స్వయాన్ని శక్తిశాలిగా చేసుకోండి, బలహీనతను మార్చి శక్తిని తీసుకోండి.
అందరూ, ఇక్కడ కూర్చున్న వారు, స్వయాన్ని సూర్యవంశీ సితారలుగా భావిస్తున్నారా? సూర్యవంశీ సితారల కర్తవ్యం ఏమిటి? సూర్యవంశీ సితారలు మాయకు అధీనమవ్వగలరా? అందరూ మాయాజీతులుగా అయ్యారా? అయ్యారా లేక అవ్వాలా? మాయాజీత్ అన్న టైటిల్ను స్వయంపై ధారణ చేసుకున్నారా? యుగళులలో కూడా ఒకరంటారు, నేను మాయాజీతునిగా అవుతున్నాను అని, మరొకరు అంటారు, నేను అయిపోయాను అని. ఒక్కటే చదువు, చదివించే వారు ఒక్కరే, అయినాగానీ ఒకరు విజయిగా అయిపోతే, మరొకరు అవుతూ ఉన్నారు, ఈ తేడా ఎందుకు? ఒకవేళ ఇప్పటికీ దోషాలు (త్రుటి) ఉంటే త్రేతా యుగంలోకి వెళ్తారు. పురుషార్థీలు సత్యయుగానికి వెళ్తారు. ముందునుండే పూర్తి అభ్యాసం ఉంటే ఆ అభ్యాసం సహాయం చేస్తుంది. కానీ ఇటువంటి అభ్యాసమే ఉంటే, ఒకసారి స్మృతి, ఒకసారి విస్మృతి ఉంటే అంతిమ సమయంలో కూడా విస్మృతి జరగగలదు. బహు కాల సంస్కారాలే అంతిమ స్థితిగా అవుతాయి. లౌకిక రీతిలో, ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే, వారిలో ఏదైనా సంస్కారం బలంగా ఉంటే, ఆహారంలో లేక ధరించే విషయంలో లేక ఇంకేవైనా ఉంటే అంతిమ సమయంలో కూడా ఆ సంస్కారమే ఎదురుగా కనిపిస్తుంది. కావున ఇప్పటినుండే సదా స్మృతి యొక్క సంస్కారాన్ని నింపుకోండి, అప్పుడు చివరలో ఇదే సహాయం చేస్తుంది – విజయిగా అవ్వడానికి. విద్యార్థి చాలాకాలం నుండి చదువు సరిగ్గా చదవకపోతే పరీక్ష సరిగా రాయలేడు. బహుకాలపు అభ్యాసం కావాలి. కావున ఇప్పుడు ఈ విస్మృతి మరియు ఓడిపోయే సంస్కారాలు తొలగిపోవాలి. ఇప్పుడు ఆ సమయం గడిచిపోయింది. ఎందుకంటే సాకార రూపంలో సంపూర్ణత యొక్క రుజువును చూసారు. సాకారుడు సంపూర్ణతను పొందేసారు, మరి మీరేమి చేస్తారు? సమయం యొక్క గంట మోగింది. గంట మోగిన తర్వాత కూడా పురుషార్థం చేస్తే ఏమవుతుంది? అవ్వగలరా? మొదటి ఈల వేయడం జరిగింది. రెండవది కూడా మోగింది. మొదటి ఈల – సాకార మమ్మాది, రెండవ ఈల సాకార బాబాది. ఇప్పుడిక మూడవ ఈల మోగాల్సి ఉంది. తయారవ్వడానికి రెండు ఈలలు వేయడం జరుగుతుంది, మూడవ ఈల బయలుదేరడానికి. రెండు గంటలు సూచన ఇవ్వడానికి, హెచ్చరించడానికి మోగిస్తారు. మూడవది కాదు. మూడవది ప్రయాణమవ్వడానికి వేయడం జరుగుతుంది. మూడవ గంట మ్రోగిన తర్వాత మిగిలిపోయినవారు ఇక మిగిలిపోయినట్లే. ఇంత కొద్ది సమయమే ఉంది, మరి ఏమి చేయాలి? మూడవ గంట మ్రోగినప్పుడు సంస్కారాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఉండిపోతారు. పెట్టె పడక ఏమిటో వినిపించాము కదా. వ్యర్థ సంకల్పాల పడకను, అనేక సమస్యల పెట్టెను ఇప్పుడు మూసివేయండి. ఎప్పుడైతే రెండింటినీ సర్దేసి తయారై ఉంటారో అప్పుడే వెళ్ళగలరు. ఏదైనా ఒకవేళ ఉండిపోతే బుద్ధియోగం తప్పకుండా అటువైపు వెళ్తుంది. అప్పుడు ప్రయాణం అవ్వలేరు అంటే విజయులుగా అవ్వలేరు. ఇప్పుడు దీనిని ఏమి చేయాలి? ఎప్పుడు చేస్తారు? ‘ఎప్పుడు’ అనే పదాన్ని తీసేయండి. ‘ఇప్పుడు’ పదాన్ని ధారణ చేయండి. ఎప్పుడు చేయాలి, నిదానంగా చేద్దాము అని ఆలోచించేవారు దూరంగానే ఉండిపోతారు. ఇప్పుడు అటువంటి సమయం సమీపించింది. అందుకే బాప్దాదా ఇప్పుడు వినిపిస్తున్నారు, ఆ తర్వాత ఫిర్యాదు చేయకండి. సమయాన్ని కూడా ఆధారంగా చేసుకోవాలి. ఒకవేళ సమయాన్ని ఆధారంగా చేసుకుని ఆగిపోతే ప్రాప్తి ఏమీ ఉండదు. సమయంకన్నా ముందుగా మారితే మీరు చేసిన దానికి ఫలితం లభిస్తుంది. ఎవరు చేస్తారో వారు పొందుతారు. సమయం అనుసారంగా చేస్తే, అది సమయం చేసిన అద్భుతం అవుతుంది. మీరు కృషి చేయాలి.
బాబాకు పిల్లలపై స్నేహం ఉంది. మరి స్నేహానికి గుర్తు సంపూర్ణంగా అవ్వడం. నడుస్తున్నారు కానీ వేగాన్ని కూడా చూసుకోవాలి. ఇప్పుడు సంపూర్ణతనే లక్ష్యంగా పెట్టుకోవాలి అప్పుడు సంపూర్ణ రాజ్యంలోకి వస్తారు. ఏదైనా లోటు ఉండిపోతే సంపూర్ణ రాజ్యాన్ని పొందలేరు. ఎంత ఎక్కువగా ప్రజలను తయారు చేసుకుంటారో అంతగా సమీపంగా వస్తారు. దూరంగా ఉన్నవారు దూరంగా ఉండే చూస్తారు. దగ్గరగా ఉన్నవారు ప్రతి కార్యాన్ని కలిసి చేస్తారు. నంబరవన్ ఎవరు, శక్తులా లేక పాండవులా? ఇతరులను ముందుంచడము కూడా స్వయం ముందుండటమే. ముందుంచేవారికి కూడా పేరు వస్తుంది కదా. మధ్య మధ్యలో చెకింగ్ కూడా కావాలి. ప్రతి కార్యాన్ని చేసేకన్నా ముందు మరియు తర్వాత చెకింగ్ చేసుకుంటూ ఉండండి. కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు అదే స్థితిలో కార్యాన్ని ప్రారాంభించారో లేదో చూసుకోండి. మధ్యలో కూడా చెకింగ్ చేసుకుంటూ ఉండండి. ఎంత సమయం స్మృతి ఉంది? కార్యం చేసేకన్నా ముందే చెకింగ్ చేసుకుంటే ఆ కార్యం సఫలం కూడా అవుతుంది మరియు స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. కేవలం రాత్రి మాత్రమే చార్టును చూసుకుంటే రోజంతా అలాగే గడిచిపోతుంది. ప్రతి కర్మలో, ప్రతి గంటకు చెకింగ్ ఉండాలి. అభ్యాసం జరిగితే ఆ అభ్యాసం అవినాశిగా అవుతుంది. ధైర్యం ఉంచితే సహజంగా జరిగిపోతుంది. కష్టంగా భావిస్తే కష్టంగానే అనిపిస్తుంది. మీ పురుషార్థాన్ని ఇంకెప్పుడు వేగవంతం చేసుకుంటారు, ఇప్పుడు సమయం ఎక్కడుంది!
పూర్తి కల్పానికి కావలసిన అదృష్టాన్ని ఈ సమయంలోనే తయారు చేసుకోవాలి. అంతగా శ్రద్ధపెట్టి నడుచుకోవాలి. పూర్తి కల్పానికి కావలసిన అదృష్టాన్ని తయారు చేసుకునే సమయం ఇది. ఈ సమయాన్ని అమూల్యంగా భావించి ప్రయోగించండి అప్పుడు సంపూర్ణంగా అవుతారు. ఒక్క సెకండులో పదమాల సంపాదనను తయారు చేసుకోవాలి. ఒక్క సెకండు వృధా అయితే పదమాల సంపాదన పోయినట్లే, ఇంతటి అటెన్షన్ పెట్టినప్పుడే విజయులుగా అవుతారు. ఒక్క సెకండు కూడా వృధాగా పోకూడదు. సంగమంలోని ఒక్క సెకండు కూడా చాలా పెద్దది. ఒక్క సెకండులోనే ఎంతో గొప్పగా అవ్వగలరు. ఇటువంటి లెక్కను గుర్తుంచుకోండి. అచ్ఛా –