Search for a command to run...
24 Jan 1970
బ్రాహ్మణుల ముఖ్య కర్తవ్యం – సమర్పణ చేయడం మరియు చేయించడం
24 January 1970 · తెలుగు
మీ జీవితమనే నావను ఎవరికి అర్పించారు? (శివబాబాకు) శ్రీమతంపై పూర్తిగా నడుచుకుంటున్నారా? శ్రీమతంపై నడవడము అంటే ప్రతి కర్మలో అలౌకికతను తీసుకురావడం. శివబాబా వారసత్వానికి నేను పూర్తి అధికారిని అని స్వయాన్ని భావిస్తున్నారా? ఎవరైతే వారసత్వానికి అధికారిగా భావిస్తున్నారో వారు ఏ విషయానికీ అధీనమవ్వలేరు. దేహము, దైహిక బంధాలు మరియు దైహిక వస్తువులకు అధీనమయ్యేవారు అధికారులుగా అవ్వలేరు. అధికారి అధీనమవ్వలేరు. నేను అధికారిని అని సదా భావిస్తూ ఉన్నట్లయితే మాయ యొక్క రూపాలకు అధీనమవ్వకుండా కాపాడబడతారు. అలౌకిక కర్మలు ఎంత చేసాను, లౌకిక కర్మలు ఎంత చేసాను అని ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండండి. అలౌకిక కర్మలు ఇతరులకు అలౌకికంగా అవ్వాలన్న ప్రేరణను ఇస్తాయి. మేము ఉన్నతోన్నతమైన బాబా పిల్లలం, ఉన్నతోన్నతమైన రాజ్య పదవిని పొందుతాము అని లక్ష్యం పెట్టుకున్నారా లేక ఏ పదవి లభించినా ఫర్వాలేదా? ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలైనప్పుడు లక్ష్యం కూడా ఉన్నతంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే అవినాశి ఆత్మిక స్థితిలో ఉంటారో అప్పుడే అవినాశి సుఖాన్ని పొందుతారు. ఆత్మ అవినాశి కదా.
మధుబనానికి వచ్చి మధుబన వరదానాలను పొందారా? వరదానము, కష్టం లేకుండా సహజంగానే లభిస్తుంది. అవ్యక్త స్థితిలో అవ్యక్త ఆనందం, అవ్యక్త స్నేహం, అవ్యక్త శక్తి వీటన్నిటి ప్రాప్తి సహజంగానే జరుగుతుంది. మరి ఇటువంటి వరదానాలను సదా ఉంచేందుకు ప్రయత్నం చేస్తారు. సదా వరదానాల స్మృతిలో ఉన్నప్పుడు ఈ వరదానాలు అవినాశిగా ఉండిపోతాయి. ఒకవేళ వరదాతను మర్చిపోతే వరదానాలు కూడా సమాప్తమవుతాయి. కనుక వరదానాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. వరదాత తోడుగా ఉంటే వరదానాలు తోడుగా ఉంటాయి. పూర్తి సృష్టిలోకి అన్నిటికన్నా ప్రియమైన వస్తువు (శివబాబా), అలాంటప్పుడు వారి స్మృతి కూడా స్వతహాగా ఉండాలి. అతి ప్రియమైనవారు అయితే వారి స్మృతిని ఎందుకు మర్చిపోతున్నారు? తప్పకుండా మరేదో గుర్తుకు వస్తుంది. ఏ విషయమూ కారణం లేకుండా జరగదు. విస్మృతికి కూడా కారణం ఉంటుంది. విస్మృతికి కారణం ప్రియమైన వస్తువు దూరం అవ్వడం. విస్మృతికి కారణం మీలోని బలహీనతలు. లభించిన శ్రీమతంపై పూర్తిగా నడుచుకోని కారణంగా బలహీనత వస్తుంది. బలహీనత కారణంగా విస్మృతి వస్తుంది. విస్మృతిలో ప్రియమైన వస్తువును మర్చిపోతారు. కనుక, ఏ పనినైనా చేసే ముందు శ్రీమతాన్ని గుర్తుంచుకుని తర్వాత కర్మ చేయండి. అప్పుడు ఆ కర్మ శ్రేష్ఠమవుతుంది. అందుకే చేసే ప్రతి పని ముందు చెకింగ్ చేసుకోండి. కర్మ చేసిన తర్వాత చెకింగ్ చేసుకుంటే జరిగిన తప్పుడు కర్మకైతే వికర్మ తయారైపోయింది కదా. అందుకే ముందే చెకింగ్ చేసుకోండి, తర్వాత కర్మ చేయండి.
ఈశ్వరీయ చదువును చాలా సహజంగా, సరళమైన రీతిలో ఎవరికైనా ఇచ్చే పద్ధతి వచ్చా? ఒక్క సెకండులో బాబా పరిచయాన్ని ఇవ్వగలరా? ఎంతగా ఇతరులకు పరిచయాన్ని ఇస్తారో అంతగా మీ భవిష్య ప్రాలబ్ధం తయారవుతుంది. ఇక్కడ ఇవ్వాలి, అక్కడ తీసుకోవాలి. అంటే తీసుకోవడమే అవుతుంది. ఎంత ఇస్తూ ఉంటారో అంత తీసుకుంటామని అర్థం చేసుకోండి. ఈ జ్ఞానం యొక్క ప్రత్యక్ష ఫలం మరియు భవిష్య ప్రాలబ్ధ ప్రాప్తిని అనుభం చేయండి. వర్తమాన ప్రాప్తి ఆధారంగానే భవిష్యత్తును అర్థం చేసుకోవచ్చు. వర్తమాన అనుభవం భవిష్యత్తును స్పష్టం చేస్తుంది. స్వయాన్ని ఏ రూపంలో భావించి నడుచుకుంటున్నారు? నేను శక్తిని, జగన్మాతను – ఈ భావన ఉంటుందా? జగన్మాత రూపంలో జగత్తు యొక్క కళ్యాణం ఉంటుంది. శివశక్తి రూపంలో ఎటువంటి బలహీనత ఉండదు. నేను జగన్మాతను, నేను శివశక్తిని, ఈ రెండు రూపాలను గుర్తుంచుకోండి అప్పుడు మాయాజీతులుగా అవుతారు. విశ్వ కళ్యాణ భావనతో అనేక ఆత్మల కళ్యాణానికి నిమిత్తమవుతారు. నష్టోమోహ సంబంధాలలో అయ్యారా లేక మీ శరీరంతో అయ్యారా? నష్టోమోహ యొక్క అంతిమ స్థితి ఎంతవరకు వచ్చింది? ఎంతగా నష్టోమోహులుగా అవుతారో అంతగా స్మృతి స్వరూపులుగా అవుతారు. కావున స్మృతిని సదా నిలుపుకోవడానికి సాధనము నష్టోమోహులుగా అవ్వడము. నష్టోమోహగా అవ్వడము సహజమా లేక కష్టమా? స్వయాన్ని సమర్పణ చేసుకుంటే అన్నీ సహజమైపోతాయి. ఒకవేళ సమర్పణ అవ్వకుండా మీపైనే పెట్టుకుంటే అప్పుడు కష్టమనిపిస్తుంది. సహజంగా చేసుకోవడానికి ముఖ్య సాధనము – సమర్పణ చేయడం. బాబాకు ఏది కావాలో అది చేయించాలి. మషీన్ ఉంటుంది కదా, కర్మాగారంలో ఆ మషీన్ ద్వారానే అంతా జరుగుతుంది, అలాగే మనం కూడా నిమిత్తమాత్రులం. నడిపించేవారు ఎలా నడిపిస్తే అలా మనం నడుచుకోవాలి. ఇలా భావించినప్పుడు కష్టంగా అనిపించదు. ఈ స్థితిని రోజురోజుకూ పరిపక్వం చేసుకుంటూ ఉండాలి. ఈ ముఖ్యమైన విషయంపై అటెన్షన్ పెట్టండి. ఎంతగా స్వయాన్ని బాబా ముందు సమర్పించుకుంటారో అంతగా బాబా కూడా ఆ పిల్లల ఎదుట సమర్పణ అవుతారు. అంటే ఏదైతే బాబా ఖజానా ఉందో అది స్వతహాగా వారిదవుతుంది. మీలోని గుణాలను ఇతరులకు ఇవ్వడం కష్టమనిపిస్తుందా? సమర్పణ చేయడం మరియు చేయించడం – ఇదే బ్రాహ్మణుల కర్తవ్యం. ఇది బ్రాహ్మణుల పని అన్నప్పుడు బ్రాహ్మణులు కాకుండా ఇంకెవరికి దీని గురించి తెలుసు! ఎలా అయితే బాబా కొద్దిగలో రాజీ అవ్వరో అలా పిల్లలు కూడా కొద్దిగలో రాజీ కాకూడదు.
నిశ్చయానికి గుర్తు ఏమిటి? విజయము. ఎంతగా నిశ్చయబుద్ధితో ఉంటారో అంతగా అన్ని విషయాలలో విజయులుగా అవుతారు. నిశ్చయబుద్ధికి ఎప్పుడూ ఓటమి ఉండదు. ఓటమి వస్తుందంటే నిశ్చయంలో లోపం ఉందని అర్థం చేసుకోండి. నిశ్చయబుద్ధి విజయి రత్నాలలో మేము ప్రతి ఒక్కరం రత్నాలము అని స్వయాన్ని భావించండి. విఘ్నాలైతే వస్తాయి, వాటిని సమాప్తం చేయడానికి యుక్తి – ఇది పరీక్ష అని భావించండి. మీ స్థితి ఎలా ఉందని ఈ పరీక్ష చెప్తుంది. ఎటువంటి విఘ్నం వచ్చినా గానీ దానిని పేపరుగా భావించి పాస్ అవ్వండి. విషయాన్ని చూడకండి, పేపరుగా భావించండి. పేపరులో కూడా భిన్న భిన్న ప్రశ్నలు ఉంటాయి – మనసు గురించి, లోక మర్యాద గురించి, సంబంధాల గురించి, దేశవాసుల గురించి ప్రశ్నలు ఉంటాయి. కానీ ఇవి చూసి గాభరా పడకండి. గుహ్యతలోకి వెళ్ళండి. వాతావరణం ఎలా తయారు చేయాలంటే వద్దనుకున్నాగానీ వ్యక్తి ఆకర్షింపబడి రావాలి. ఎంతగా స్వయం అవ్యక్త వాతావరణాన్ని తయారు చేయడంలో బిజీగా ఉంటారో అంతగా స్వతహాగా అన్నీ జరుగుతాయి. దారిలో వెళ్తున్నప్పుడు చక్కని సుగంధం వస్తే ఎక్కడినుండి వస్తుందో ఆగి చూద్దామనిపిస్తుంది కదా, అలాగే అవ్యక్త సుగంధం కూడా వద్దన్నా ఆకర్షిస్తుంది.
ఏ లక్ష్యమునైతే పెట్టుకున్నారో దానిని పూర్తి చేయడానికి అటువంటి లక్షణాలను కూడా మీలో నింపుకోవాలి. ఢీలా ప్రయత్నం చేసేవారు ఎక్కడివరకు చేరుకోగలరు? ప్రయత్నం అన్న మాట ఉపయోగిస్తుంటే ప్రయత్నం వద్దే ఉండిపోతారు. చేయాల్సిందే అన్న లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ప్రయత్నిస్తాను అన్న మాట బలహీనతకు గుర్తు. బలహీనతను తొలగించడానికి ప్రయత్నం అన్న మాటను సమాప్తం చేయండి. నిశ్చయంతో విజయం లభిస్తుంది. సంశయం వస్తే శక్తి తగ్గుతుంది. నిశ్చయబుద్ధిగా అయితే అందరి సహకారం కూడా లభిస్తుంది. ఏ కార్యమునైనా చేసేటప్పుడు నేను తప్ప ఈ కార్యాన్ని ఎవ్వరూ చేయలేరు అని అనుకుని చేయండి అప్పుడే సఫలత లభిస్తుంది. ఈరోజు నుండి ప్రయత్నం అనే మాటను సమాప్తం చేయండి. నేను శివశక్తిని. శివశక్తి అన్ని కార్యాలను చేయగలదు. శక్తులను పులిపై సవారి అయినట్లుగా చూపిస్తారు. ఏ విధంగానైనా మాయ పులి రూపంలో వచ్చినాగానీ భయపడకండి. శివశక్తులు ఎప్పుడూ ఓటమి పొందలేరు. ఇప్పుడు సమయం ఎక్కడుంది! సమయంకన్నా ముందే స్వయాన్ని మార్చుకుంటే ఒకటికి లక్ష రెట్లు లభిస్తుంది. మారవలసిందే, ఇలా మారండి. గత కల్పంలో కూడా వారతస్వం తీసుకున్నామని గుర్తుకు వచ్చిందా! స్వయాన్ని పాతవారిమి అని అనుకుంటే ఆ కల్ప క్రితపు స్మృతులతో పురుషార్థం సహజమవుతుంది. ఎందుకంటే కల్ప క్రితం కూడా నేను తీసుకున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను అన్న నిశ్చయం ఉంటుంది. కల్ప క్రితపు స్మృతి శక్తినిస్తుంది. సదా స్వయాన్ని ధైర్యవంతులుగా చేసుకోండి. ధైర్యాన్ని కోల్పోకండి. ధైర్యంతో సహాయం కూడా లభిస్తుంది. మనం సర్వశక్తిమంతుని పిల్లలం, బాబాను గుర్తు చేస్తే ఇదే ధైర్యం. బాబాను గుర్తు చేయడం సహజమా లేక కష్టమా? సహజమని అనుకుంటే సహజమైపోతుంది. ఇది నా కర్తవ్యం. బాధ్యత. ఏమి చేయను అనే సంకల్పం వస్తే కష్టమవుతుంది. ఎప్పుడు కూడా మీ లోపల బలహీన సంకల్పాలను పెట్టుకోకండి. ఒకవేళ మనసులో బలహీన సంకల్పాలు ఉత్పన్నమైనా కానీ వాటిని అక్కడే సమాప్తం చేసి శక్తిశాలిగా అవ్వండి. ఇప్పటికీ ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటే అవ్యక్త ఆకర్షణ యొక్క అనుభూతిని ఎప్పుడు పొందుతారు? ప్రయత్నం ఉన్నంతవరకు మీలో అవ్యక్త ఆకర్షణ రాదు. ఈ భాషయే బలహీనతను సూచిస్తుంది. సర్వశక్తిమంతుని పిల్లలు ఇలా చెప్పకూడదు. వారి సంకల్పం, వాణి అన్నీ నిశ్చయానికి చెందినవిగా ఉంటాయి. ఇటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. సంకల్పం అనే పునాది గట్టిగా ఉందా అని సదా చెక్ చేసుకుంటూ ఉండండి. తీవ్ర పురుషార్థీల నడవడికలో ఈ విశేషత ఉంటుంది – వారి సంకల్పం, వాణి, కర్మ మూడూ సమానంగా ఉంటాయి. సంకల్పాలు గొప్పగా, కర్మలు బలహీనంగా ఉంటే వారిని తీవ్ర పురుషార్థీలు అనరు. మూడింటి సమానత ఉండాలి. సదా ఇలా భావించండి. మాయ అప్పుడప్పుడూ తన రూపాన్ని చూపించడానికి వస్తుంది కదా, నిజానికి అది సదా కోసం మీ నుండి వీడ్కోలు తీసుకోవడానికి వస్తుంది. వీడ్కోలు చెప్పడానికి బదులు ఆహ్వానాన్ని ఇస్తున్నారు మీరు. నేను శివబాబాతో ఉన్నాను, వారితో ఎప్పటికీ వేరు అవ్వను అన్నట్లుగా ఉంటే ఎవరైనా ఏమి చేయగలరు! ఎవరైనా బిజీగా ఉంటే మూడవ వ్యక్తి వారిని డిస్టర్బ్ చేయలేరు. విసిగించేవారు ఎవ్వరూ రాకూడదనే అనుకుంటారు కాబట్టి డిస్టర్బ్ చేయకండి అని ఒక బోర్డు పెడతారు. మీరు కూడా అలా ఒక బోర్డును పెట్టండి, అప్పుడు మాయ తిరిగి వెళ్ళిపోతుంది. రావడానికి అవకాశమే లభించదు. కుర్చీ ఖాళీగా ఉంటే ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు.
మాతలకైతే చాలా సహజం, కేవలం బాబాను గుర్తు చేయాలి, అంతే. బాబాను స్మృతి చేస్తే జ్ఞానము దానంతటదే ఇమర్జ్ అవుతుంది. ఎవరైతే బాబాను గుర్తు చేస్తారో వారికి ప్రతి కార్యంలో బాబా సహాయం లభిస్తుంది. స్మృతికి ఎంత శక్తి ఉందంటే ఇక్కడ పొందిన అనుభూతిని అక్కడ గుర్తుంచుకుంటే అది అవినాశిగా అవుతుంది. నేను పరంధామ నివాసిని అని బుద్ధిలో పదే పదే గుర్తుంచుకోండి. కర్తవ్యం కోసం ఇక్కడకు వచ్చారు. మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఎంతగా బుద్ధిని ఈ విషయాలలో బిజీగా పెట్టుకుంటారో అప్పుడు భ్రమించరు. జ్ఞానాన్ని కూడా ఎవరికైనా యుక్తిగా వినిపించాలి. నేరుగా జ్ఞానాన్ని వినిపిస్తే కంగారు పడతారు. ముందుగా వారిని ఈశ్వరీయ స్నేహంలోకి తీసుకురండి. శరీరధారులకు ధనము కావాలి, బాబాకు మనసు కావాలి. మనసును ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలగాలి. మరెక్కడా దానిని ప్రయోగించకండి. యోగయుక్తమైన అవ్యక్త స్థితిలో ఉండి రెండు మాటలు మాట్లడటం కూడా భాషణ చేసినట్లే అవుతుంది. ఒక గంట ప్రసంగం యొక్క సారాన్ని రెండు మాటలలో వినిపించగలగాలి.
రోజురోజుకూ అడుగులు ముందుకు పడుతున్నట్లుగా అనిపిస్తుందా? ఇంకా సమయం ఉందిలే, పురుషార్థం చేద్దాములే అనుకోకండి. సమయంకంటే ముందే సమాప్తం చేసి ఈ స్థితి యొక్క అనుభవాన్ని పొందండి. సమయం వచ్చినప్పుడు ఈ స్థితిని అనుభవం చేసుకుంటే సమయంతో పాటు స్థితి కూడా మారిపోతుంది. సమయం సమాప్తం అయితే అవ్యక్త స్థితి యొక్క అనుభూతి కూడా సమాప్తం అవుతుంది, మరో పాత్ర వస్తుంది. కనుక ముందునుండే అవ్యక్త స్థితిని అనుభవం చేయండి. కుమారీలు పరిగెత్తడంలో వేగంగా ఉంటారు. ఈ ఈశ్వరీయ పరుగులో కూడా వేగంగా పరిగెత్తండి. ఫస్టు వచ్చినవారే ఫస్ట్ వారికి సమీపంగా ఉంటారు. సాకారుడు ఫస్ట్ వెళ్ళారు కదా, అలా. లక్ష్యమైతే ఉన్నతంగా పెట్టుకోవాలి. లక్ష్యం సంపూర్ణంగా ఉంటే పురుషార్థం కూడా సంపూర్ణంగా చేయాలి, అప్పుడే సంపూర్ణ పదవి లభిస్తుంది. సంపూర్ణ పురుషార్థం అంటే అన్ని విషయాలలో స్వయాన్ని సంపన్నంగా చేసుకోవడం. పెద్ద విషయమేమీ కాదు. తెలుసుకున్న తర్వాత గుర్తు చేయడం కష్టమనిపిస్తుందా? తెలుసుకోవడమే నాలెజ్ అంటారు. ఒకవేళ నాలెజ్, లైట్, మైట్ లేకపోతే ఆ నాలెజ్ ఇంకెందు, దానిని తెలుసుకోవడం అనరు. తెలుసుకోవడం మరియు చేయడం ఒకటిగా ఉండాలి. బయటివారిలో తెలుసుకోవడంలో మరియు చేయడంలో తేడా ఉంటుంది. నాలెజ్ అనేది ఆ రూపాన్ని తయారు చేస్తుంది. ఈశ్వరీయ నాలెజ్ ఏ రూపాన్ని తయారు చేస్తుంది? ఈశ్వరీయ స్థితి. మరి ఈశ్వరీయ నాలెజ్ను తెలుసుకున్నవారు ఈశ్వరీయ రూపంలో ఎందుకు ఉండలేరు? ధియరీ (సిద్ధాంతం) వేరు. తెలుసుకోవడం అంటే బుద్ధిలో ధారణ చేసుకోవడం వేరు. ధారణతో కర్మలు ఆటోమేటిక్గా జరుగుతాయి. ధారణ అంటేనే అర్థం ఆ విషయాన్ని బుద్ధిలో ఇముడ్చుకోవడం. బుద్ధిలో ఇమిడినప్పుడు బుద్ధి ఇచ్చే డైరెక్షన్ల అనుసారంగానే కర్మేంద్రియాలు కూడా పని చేస్తాయి. నాలెజ్ఫుల్ అయిన బాబా పిల్లలం మనం, ఈశ్వరీయ నాలెజ్ యొక్క లైట్ మైట్ మన వద్ద ఉన్నాయి. ఇలా భావించి నడుచుకోండి. జ్ఞానాన్ని కేవలం వినడం వేరే విషయం. కేవలం వినడమే కాదు ఇముడ్చుకోవాలి. భోజనం తినడం వేరు, దానిని అరిగించుకోవడం వేరు. కేవలం తింటేనే శక్తి రాదు. అరిగితే శక్తి వస్తుంది. తిన్న భోజనాన్ని అరిగించుకుంటేనే శక్తి రూపంగా అవుతాం. శక్తిమంతుని తండ్రి పిల్లలు, ఏమీ చేయలేము అనడం, ఇది వీలవుతుందా? లేకపోతే తండ్రి పేరును సిగ్గుపడేలా చేస్తారు. ఏ కర్మ చేసినా అది ఉదాహరణగా నిలిచిపోవాలి అని భావించి కర్మ చేయండి. వేచి ఉండకండి, ఉదాహరణగా నిలవండి. బాబా ఉదాహరణగా అయ్యారు కదా.
మా ఇంటికి వచ్చాము అని భావిస్తున్నారా? తప్పిపోయిన వ్యక్తి తన ఇంటికి తిరిగి వస్తే ఎంత ఆరామంగా అనిపిస్తుందో ఇక్కడ కూడా అంతటి విశ్రాంతి యొక్క అనుభూతి కలుగుతుంది. స్థానం లభిస్తే విశ్రాంతి స్థితి వస్తుంది. సదా స్వయాన్ని విశ్రామ స్థితిలో ఉన్నట్లుగా భావించండి. కార్యార్థం వెళ్ళండి, అప్పుడు కూడా ఈ స్థితి యొక్క అనుభూతిని మీతోనే పెట్టుకోండి. దీనిని తోడు పెట్టుకుంటే ఎంతటి కార్యాన్ని చేస్తున్నాగానీ స్థితి విశ్రామంగా ఉంటుంది. విశ్రామ స్థితిలో సుఖశాంతుల అనుభూతి కలుగుతుంది. స్వయంలో శక్తి వచ్చినప్పుడు వాతావరణ ప్రభావం మనపై పడదు, మన ప్రభావం వాతావరణంపై పడుతుంది. సర్వశక్తిమంతుడు వాతావరణమా లేక బాబానా? సర్వశక్తిమంతుని పిల్లలైనప్పుడు వాతావరణం మీకన్నా శక్తిశాలిగా ఎందుకుండాలి? మీ శక్తిని మర్చిపోయిన కారణంగానే వాతావరణం యొక్క ప్రభావం పడుతుంది. ఎలా అయితే డాక్టరు ఎటువంటి రోగి ముందుకు వెళ్ళినాగానీ వారి ప్రభావం డాక్టరుపై పడదో అలాగే మీ స్మృతిని పెట్టుకుని సర్వీసు చేయండి. నేను వాతావరణాన్ని తయారు చేయాలిగానీ వాతావరణం నన్ను తయారు చేయకూడదు అని మీలో శక్తిని పెట్టుకోండి. యుగళ్ అయినాకానీ ఒంటరి ఆత్మను నేను అన్న స్మృతిలో ఉంటున్నారా? ఆత్మ ఒంటరిది కదా. ఒకవేళ ఆత్మ బంధాలలోకి రావాలన్నాగానీ ఎవరి బంధంలోకి రావాలి? సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి? ఒక్కరితో. ఒకటి నుండి రెండు కూడా ఉండాలి, బాబా మరియు పిల్లలు. మూడవ బంధమేమీ లేదు. సర్వ సంబంధాలు ఒక్కరితో జోడించాలి. ఒక్క ఆత్మ శివబాబాతో ఉండాలి, ఈ స్థితినే ఉన్నతమైన స్థితి అంటారు. మూడవదాన్ని చూస్తున్నాగానీ చూడకండి. చూడాలంటే ఒక్కరినే చూడండి, వారితోటే మాట్లాడండి. ఇటువంటి స్థితి ఉన్నప్పుడే మాయజీతులుగా అవుతారు. ఎవరైతే మాయాజీతులుగా అవుతారో వారు జగత్జీతులుగా అవుతారు. ఈ శుద్ధమైన స్నేహము కల్పమంతటిలోకీ ఒక్కసారే లభిస్తుంది. ఇటువంటి స్నేహాన్ని మనం పొందుతున్నామన్న విషయాన్ని సదా గుర్తుంచుకోండి. ఎవ్వరికీ ప్రాప్తించనిది మనకు ప్రాప్తించింది. ఈ నషా మరియు నిశ్చయంలో ఉండాలి. ఢిల్లీలో అద్భుతం ఎప్పుడు చేస్తారు! ఢిల్లీ నుండి వచ్చే శబ్దమే నలువైపులకు వెళ్తుంది. ఢిల్లీలో పేరు ప్రఖ్యాతి అవ్వడమంటే భారతదేశంలో పేరు ప్రఖ్యాతి అవ్వడం.
ఇంతటి బాధ్యతను ఢిల్లీవారు తీసుకోవాలి. సమయం తక్కువగా ఉంది, సేవ ఎక్కువగా ఉంది. ఈ వేగంతో సేవ చేస్తేనే అందరికీ సందేశం అందుతుంది. ఎవరినైనా ధనవంతులుగా చేయడానికి అవకాశం ఇవ్వడం కూడా మహాదానమే, మహాదానం యొక్క ఫలితం కూడా అంతే ఎక్కువ లభిస్తుంది. బాబాను సదా తోడు పెట్టుకుంటే, వీరితో సర్వశక్తిమంతుడు ఉన్నారు అని మాయ చూసి అది దూరంగా వెళ్ళిపోతుంది. ఒంటరిగా ఉన్నట్లుగా చూస్తే అప్పుడు మీ వద్దకు వచ్చే ధైర్యం చేస్తుంది. వేటాడేటప్పుడు ఏ జంతువు దాడి చేయకుండా ఉండటానికి అగ్నిని వెలిగిస్తారు. అలాగే యోగ అగ్ని వెలిగి ఉంటే మాయ రాలేదు. ఈ లగనం అనే అగ్ని ఆరిపోకూడదు. తోడుగా పెట్టుకుంటే శక్తి దానంతటదే వచ్చేస్తుంది. తర్వాత విజయమే విజయము.
బాప్దాదాకు వృద్ధ మాతలంటే చాలా ఇష్టం. ఎందుకంటే అనేక దుఃఖాలతో అలసిపోయి ఉన్నారు. అలసిన పిల్లలపై బాబాకు ఎంతో స్నేహం ఉంటుంది. అంతే ప్రేమ పిల్లలు కూడా ఉంచాలి. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి యాత్రలో పాస్ అయితే ముందుకు వెళ్ళవచ్చు. ఎంతగా స్మృతి యాత్రలో సఫలమవుతారో అంతగా మనసు భావనలు కూడా శుద్ధమవుతూ ఉంటాయి. అందరూ సేవలో సహయోగిగా ఉంటున్నారా? ఎంతగా ఇతరులకు సందేశాన్ని ఇస్తారో అంతగా స్వయానికి కూడా సంపూర్ణత యొక్క సందేశం లభిస్తుంది. ఎందుకంటే ఇతరులకు చెప్తూ ఉంటే స్వయం సంపూర్ణమవ్వాలన్న ఆలోచన వద్దన్నా వస్తుంది. ఈ సేవ చేయడం కూడా స్వయాన్ని సంపూర్ణంగా చేసుకునేందుకు తీయని బంధనం. ఈ బంధనంలో ఎంతగా స్వయాన్ని బంధిస్తారో అంతగా సర్వ సంబంధాల నుండి విముక్తులవుతారు. సర్వ బంధనాల నుండి ముక్తి పొందడానికి సాధనము ఏమయింది? ఒక్క బంధనంలో స్వయాన్ని బంధించుకోవడం. ఈ తీయని బంధనం కూడా ఇప్పటిదే. ఇంకెప్పుడూ ఉండదు. అందరూ ఈశ్వరీయ బంధనంలో బంధింపబడి ఉన్న ఆత్మలు. శ్రేష్ఠ కర్మలు చేస్తేనే శ్రేష్ఠ పదవి లభించగలదు మరియు శ్రేష్ఠాచారాలుగా అవుతారు. ఒకే శ్రేష్ఠ కర్మతో వర్తమానం కూడా తయారవుతుంది మరియు భవిష్యత్తు కూడా తయారవుతుంది. ఏమి చేస్తే రెండూ (వర్తమానం, భవిష్యత్తు) శ్రేష్ఠంగా అవుతాయో ఆ కర్మ చేయాలి. అహ్మదాబాదు అందరికన్నా ఎక్కువ సేవ చేయాలి. ఎందుకంటే అహ్మదాబాదు అన్ని సెంటర్లకు బీజరూపము. బీజంలో ఎక్కువ శక్తి ఉంటుంది. బాగా గర్జించండి. గాఢ నిద్రలో నిద్రిస్తున్న వారిని లేపండి. కుమారీలైతే ఎంతో అద్భుతాన్ని చేయవచ్చు. ఒక కుమారిలో ఎంత శక్తి ఉందో ఆ శక్తి సేవలో సఫలత రూపంలో కనిపించాలి. కుమారీలు పురుషార్థంలో, సేవలో, అన్నింటిలో వేగంగా వెళ్ళవచ్చు. సేవలో ముందంజలో శక్తులున్నారా లేక పాండవులా? మీ స్మృతిచిహ్నం ఉంది కదా – మేము కల్పక్రితపు పాండవులం. ఎన్నిసార్లు పాండవులు అయ్యారు, అనేకసార్లు జరిగితే అది పక్కా అయిపోతుంది. ఈ స్మృతి ఉంటే ఇంకెప్పుడూ విస్మృతి జరగదు. కల్ప క్రితం కూడా మేమే ఉన్నాము, ఇప్పుడు కూడా మేము ఉన్నాము అన్న నషా మరియు నిశ్చయం ఉంచండి. మేమే హక్కుదారులం, ఎవరిపై హక్కు? ఉన్నతోన్నతమైన బాబాపై. ఈ స్మృతి ఉంటే సదా ఏకరస స్థితి ఉంటుంది. ఒక్కరి స్మృతిలో ఉంటేనే ఏకరస అవస్థ ఉంటుంది.
అవ్యక్తంలో సేవ ఎలా జరుగుతుంది? ఈ అనుభవం అవుతూ ఉందా? అవ్యక్తంలో ఉంటూ సేవలో తోడుగా ఎలా ఎప్పుడూ ఉంటారు? ఇది కూడా అనుభవం అవుతుందా? స్నేహి ఆత్మలకు తోడుగా ఉంటాను అన్న ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, ఆ తోడు సదా అనుభవం అవుతుందా? కేవలం రూపం మారింది, కర్తవ్యం అదే జరుగుతుంది. స్నేహి పిల్లలపై ఛత్రం రూపంలో కనిపిస్తారు. ఛత్రఛాయ క్రింద అన్ని పనులు జరుగుతున్నాయి అని అనిపిస్తుంది. వ్యక్తం నుండి అవ్యక్తం, అవ్యక్తం నుండి వ్యక్తంలోకి రావడం – ఈ మెట్లు ఎక్కడం మరియు దిగడం అలవాటైపోవాలి. ఇప్పుడే అక్కడ, ఇప్పుడే ఇక్కడ. ఎవరికైతే ఇటువంటి స్థితి తయారవుతుందో, అభ్యాసం అవుతుందో వారికి వ్యక్త దేశం కూడా అవ్యక్తంగా అనిపిస్తుంది. స్మృతి మరియు దృష్టి మారిపోతాయి. అందరూ ఎవరెడీగా అయి కూర్చున్నారా? ఎటువంటి దైహిక లెక్కాచారాల నుండి కూడా తేలికగా అవ్వండి. ఆరంభంలో, వతనంలో పక్షుల ఆటను చూపించాము, పక్షులను ఎగురవేసాము. అలాగే ఈ ఆత్మ కూడా పక్షి వంటిది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగరగలదు. అభ్యాసం ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. స్వయం ఎగిరే పక్షిగా అయినప్పుడు ఇతరులను కూడా ఒక్క సెకండులో ఎగిరించగలరు. ఇప్పుడైతే సమయం పడుతుంది. అపరోక్షంగా వతనం యొక్క అనుభవాన్ని వినిపించాము. అపరోక్షంగా ఎంత సమయం వతనంలో కలిసి ఉంటున్నారు? ఈ సమయంలో, ఎవరిపైనైతే ఎక్కువ స్నేహం ఉంటుందో, వారు విదేశాలలో ఉన్నాగానీ మనసు ఎక్కువగా వారివైపుకే వెళ్తుంది. వారు ఏ దేశంలో ఉంటారో స్వయాన్ని కూడా ఆ దేశవాసిగానే భావిస్తారు. అలాగే మీరు కూడా ఇప్పుడు సూక్ష్మవతనవాసిగా అవ్వాలి. సూక్ష్మవతనాన్ని స్థూలవతనంలో ఇమర్జ్ చేసుకుంటున్నారా లేక మీరే స్వయంగా సూక్ష్మవతనంలో ఉన్నట్లుగా అనుకుంటున్నారా? ఎటువంటి అనుభవం ఉంది? సూక్ష్మవతనవాసి అయిన బాబాను ఇక్కడ ఇమర్జ్ చేసుకుంటున్నారా లేక మిమ్మల్ని సూక్ష్మవతనవాసిగా చేసుకుని బాబాతో కలిసి ఉంటున్నారా? స్థూల వతనంలో ఉంటూ కూడా సూక్ష్మవతనవాసిగా అవుతాన్నారని బాబా అనుకుంటున్నారు, ఇక్కడకు పిలిచినాగానీ సూక్ష్మవతన వాతావరణంలోనే సూక్ష్మం నుండి సేవ తీసుకోవచ్చు. అవ్యక్త స్థితిలో స్థితి అయ్యి సహాయాన్ని పొందవచ్చు. వ్యక్త రూపంలో అవ్యక్త సహాయం లభిస్తుంది. ఇప్పుడు అధిక సమయం స్వయాన్ని ఫరిశ్తాగా భావించండి. ఫరిశ్తాల ప్రపంచంలో ఉంటే చాలా తేలికతనం అనుభవం అవుతుంది, సూక్ష్మవతనాన్ని స్థూల వతనంలోకి దించారా అన్నట్లుగా అనిపిస్తుంది. స్థూలము మరియు సూక్ష్మంలో తేడా ఉండదు. అప్పుడు సంపూర్ణ స్థితిలో కూడా తేడా ఉండదు. ఈ వ్యక్త దేశము అవ్యక్త దేశంగా మారుతుంది. సంపూర్ణతకు సమీపంగా వస్తారు. బాప్దాదా వ్యక్తంలోకి వచ్చినాగానీ అవ్యక్త రూపం యొక్క అవ్యక్త దేశంలోని అవ్యక్త ప్రవాహంలోనే ఉంటారు. అదే పిల్లలకు అనుభవం చేయించడానికి వస్తారు. ఇలా పిల్లలైన మీరు కూడా మీ అవ్యక్త స్థితి యొక్క అనుభూతిని ఇతరులకు చేయించండి. అవ్యక్త స్థితి యొక్క స్టేజ్ సంపూర్ణమైనప్పుడే తమ రాజ్యంలోకి కలిసి వెళ్తారు. ఒక కంట్లో అవ్యక్త సంపూర్ణ స్థితి, రెండవ కంట్లో రాజ్య పదవి. సాకార రూపంలో కనిపించినంత స్పష్టంగా కనిపిస్తుంది. బాల్యపు రూపం కూడా మరియు సంపూర్ణ రూపం కూడా. ఇక ఇలా తయారైన తర్వాత ఇలా అయిపోతాను. ఈ స్మృతి ఉంటుంది. భవిష్య రూపురేఖలు కుడా సంపూర్ణంగా కనిపిస్తాయి. ఎంతగా ఫరిశ్తా జీవితంలో సమీపంగా ఉంటారో అంతగా రాజ్య పదవిని కూడా ఎదురుగా చూస్తారు. రెండూ ఎదురుగా ఉంటాయి. ఈరోజుల్లో కొందరికి తమ గతం పూర్తిగా గుర్తుంటుంది. అలాగే మీ భవిష్యత్తు మీకు గుర్తుండాలి. అప్పుడు ఆ భవిష్య సంస్కారాలు ఇమర్జ్ అవుతూ ఉంటాయి. మర్జ్ కాదు, ఇమర్జ్ అవుతాయి. అచ్ఛా.