Search for a command to run...
4 Sept 2005
శిక్షణతోపాటు క్షమను మరియు దయను అలవరుచుకోండి, ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి, అప్పుడు మీ ఇల్లు ఆశ్రమంలా అవుతుంది
4 September 2005 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా పిల్లలందరి మస్తకముపై పవిత్రత యొక్క రేఖలను చూస్తున్నారు ఎందుకంటే బ్రాహ్మణ జీవితము యొక్క పునాదియే పవిత్రత. పవిత్రతా రేఖలు ఏమిటో తెలుసా? పవిత్రత అందరికీ ప్రియమైనది. పవిత్రత సుఖము, శాంతి, ప్రేమ, ఆనందాలకు జనని. పవిత్రత మానవునికి సత్యమైన అలంకారము. పవిత్రత లేకపోతే మానవ జీవితానికి విలువ లేదు. మీరు చూస్తుంటారు కదా, దేవతలు పవిత్రులు కావుననే గౌరవనీయులుగా, పూజ్యనీయులుగా ఉంటారు. పవిత్రత లేకపోతే మానవ జీవితము ఎలా ఉంటుంది అనేది ఈ రోజుల్లో చూస్తున్నారు. బాప్‌దాదా పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జన్మ యొక్క వరదానముగా - పవిత్ర భవ, యోగి భవ అన్న ఈ వరదానమునే ఇచ్చారు. ఏ ఆత్మలోనైతే పవిత్రత ఉంటుందో, వారి నడత, నడవడిక, ముఖము మెరుస్తుంటాయి, అందుకే పవిత్రతయే జీవితాన్ని శ్రేష్ఠముగా తయారుచేస్తుంది. వాస్తవానికి పిల్లలైన మీ అందరి ఆది స్వరూపమే పవిత్రత. అనాది స్వరూపము కూడా పవిత్రతయే. ఇటువంటి పవిత్ర ఆత్మల విశేషత ఏమిటంటే - వారి జీవితములో సదా పవిత్రతతో కూడిన పర్సనాలిటీ కనిపిస్తుంది. పవిత్రత యొక్క రియాలిటీ, పవిత్రత యొక్క రాయల్టీ వారి ముఖము మరియు నడతలో కనిపిస్తుంటుంది. ఈ రేఖలు జీవితానికి అలంకారములు. రియాలిటీ ఏమిటంటే - నేను అనాది, ఆది స్వరూపమును అన్న ఈ స్మృతి ద్వారా సమర్థులుగా అవుతారు. రాయల్టీ ఏమిటంటే - స్వయము కూడా స్వమానములో ఉంటారు మరియు ప్రతి ఒక్కరికీ గౌరవాన్ని ఇస్తూ నడుచుకుంటారు. పర్సనాలిటీ ఏమిటంటే - సదా సంతుష్టత మరియు ప్రసన్నత. స్వయము కూడా సంతుష్టముగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. పవిత్రతతో ప్రాప్తులు కూడా ఎన్నో లభిస్తాయి. బాప్‌దాదా పిల్లలైన మీ అందరికీ ఏయే ప్రాప్తులను అందించారు, తెలుసు కదా! ఎన్ని ఖజానాలతో నిండుగా చేసారు, ఒకవేళ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకున్నట్లయితే నిండుగా అవుతారు.
అన్నింటికంటే మొదటగా ఇచ్చిన ఖజానా - జ్ఞాన ఖజానా. దీని ద్వారా జీవితములో ఉంటూ దుఃఖము, అశాంతుల నుండి ముక్తులుగా అవుతారు. వ్యర్థ సంకల్పాలు, నెగెటివ్ సంకల్పాలు, వికల్పాలు, వికర్మల నుండి ముక్తులైపోతారు. ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పము లేక వికల్పము వచ్చినా కూడా జ్ఞాన బలముతో విజయులుగా అయిపోతారు.
రెండవ ఖజానా - స్మృతి, యోగము. దీని ద్వారా శక్తులు ప్రాప్తిస్తాయి మరియు శక్తుల ఆధారముతో సర్వ సమస్యలను, సర్వ విఘ్నాలను సహజముగా దాటివేస్తారు.
మూడవ ఖజానా - ధారణల ఖజానా, దీని ద్వారా సర్వ గుణాల ప్రాప్తి కలుగుతుంది. మరియు నాల్గవ ఖజానా - సేవ యొక్క ఖజానా, దీని ద్వారా సేవ చెయ్యడముతో, ఎవరి సేవనైతే చేస్తారో వారి ఆశీర్వాదాలు లభిస్తాయి, సంతోషము లభిస్తుంది.
ఇన్ని ఖజానాలు బాబా ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తాయి. బాబా అందరికీ ఒకేలా ఖజానాలను ఇస్తారు, కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇవ్వరు. కానీ తీసుకునేవారిలో తేడా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు ఖజానాలను ప్రాప్తి చేసుకుని తింటారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, ఆ మజా చేయడంలో ఖజానాలను సమాప్తము చేసేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు తింటారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తూ జమ కూడా చేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు వాటిని కార్యములో కూడా ఉపయోగిస్తారు కానీ పెంచుకుంటూ వెళ్తారు. ఖజానాలను పెంచుకునేందుకు తాళము చెవి - ఆ ఖజానాలను స్వయము కొరకు మరియు ఇతరుల కొరకు ఉపయోగించటము. ఎవరైతే ఉపయోగిస్తారో వారు వాటిని పెంచుతారు. మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - ఈ విశేష ఖజానాలు జమ అయ్యి ఉన్నాయా? జమ అయ్యి ఉన్నాయా, ఏమంటారు? జమ అయ్యి ఉన్నాయా లేక కొద్దికొద్దిగానే జమ అయ్యి ఉన్నాయా? ఎవరి వద్దనైతే ఈ ఖజానాలు జమ అయ్యి ఉన్నాయో, వారు సదా నిండుగా ఉంటారు. చూడండి, ఏ వస్తువైనా నిండుగా ఉంటే అలజడి కలగదు. ఒకవేళ నిండుగా లేకపోతే అలజడి కలుగుతుంది, అది కదులుతుంది. ఏ వస్తువునైనా ఒకవేళ పూర్తిగా నింపకపోతే అది కదిలిపోతుంది, అలాగే ఇక్కడ కూడా ఒకవేళ సర్వ ఖజానాలతో నిండుగా లేకపోతే అలజడి కలుగుతుంది. బాబా ఖజానాలు నా జన్మసిద్ధ అధికారము అని సదా ఈ నషా ఉండాలి. బాబా ఇచ్చారు, మీరు తీసుకున్నారు, అంటే మరి సర్వ ఖజానాలు ఎవరివయ్యాయి? మీవే అయ్యాయి కదా. మరి ఎవరి వద్దనైతే ఖజానాలు ఉన్నాయో, వారు ఎంత నషాలో ఉంటారు? రాజుకు కొడుకైన చిన్న వయసులోని రాకుమారుడు ఉంటాడు కదా, అతడికి అతడి తండ్రి వద్ద ఏమేమి ఖజానాలు ఉన్నాయి అనేది తెలియదు కూడా, అయినా కానీ నా తండ్రి ఖజానాలు నా ఖజానాలు అన్న నషా ఉంటుంది మరియు ఆ ఖజానాల సంతోషములో ఉంటాడు. ఒకవేళ సంతోషము తక్కువగా ఉంటే దానికి కారణము ఏమిటి? బాబా అయితే ఖజానాలను ఇచ్చారు. విన్నారా! కానీ ఒకరు వినేవారు, మరొకరు ఇముడ్చుకునేవారు, ఎవరైతే ఇముడ్చుకుంటారో వారు నషాలో ఉంటారు.
ఈరోజు కొత్త-కొత్త పిల్లలు కూడా వచ్చారు. బాప్‌దాదా లక్కీ పిల్లలైన మీకు మీ అందరి భాగ్యానికిగాను శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. మీ భాగ్యాన్ని మీరు గుర్తించారు! గుర్తించారా? పరమాత్మ ప్రేమ, అవినాశి ప్రేమ, ఇది కేవలం ఒక్క జన్మకే కాదు, అనేక జన్మలు సదా ఈ ప్రేమ నిలిచి ఉంటుంది, ఎందుకంటే ఈ సమయమేదైతే నడుస్తుందో, ఈ సమయము కూడా సంగమయుగ భాగ్యశాలి యుగము. సత్యయుగాన్ని కూడా భాగ్యశాలి యుగము అని అంటారు, కానీ వర్తమాన సంగమయుగ సమయము దానికంటే కూడా భాగ్యశాలి అయినది. ఎందుకని? ఈ సంగమయుగములోనే బాబా ద్వారా అఖండ భాగ్యానికి చెందిన వరదానము, వారసత్వము ప్రాప్తిస్తాయి. కనుక ఇటువంటి సంగమయుగములో, భాగ్యశాలి సమయములో మీరందరూ మీ భాగ్యాన్ని తీసుకునేందుకై చేరుకున్నారు. బాప్‌దాదా పిల్లలకు చాలా సహజమైన పురుషార్థపు విధి ఒకటి వినిపిస్తున్నారు - సహజమైనదే కోరుకుంటారు కదా! కష్టమైనదైతే కోరుకోరు కదా! ఈ పిల్లలకు (పాతవారికి) అయితే భాగ్యము యొక్క సహజ విధి లభించింది. లభించింది కదా? అన్నింటికంటే సహజమైనది, వేరే ఇంకేమీ చెయ్యాల్సిన పని లేదు, కేవలము ఒక్క విషయము చెయ్యాలి, ఒక్క విషయాన్ని అయితే చెయ్యగలరు కదా! అవునా, కాదా చెప్పండి! హా జీ అని చెప్పండి. అన్నిటికంటే సహజ విధి - అమృతవేళ నుండి మొదలుకుని అందరికీ, ఎవరు కలిసినా సరే వారి నుండి ఆశీర్వాదాలను తీసుకోండి మరియు ఆశీర్వాదాలను ఇవ్వండి. క్రోధీ వ్యక్తి వచ్చినా కానీ మీరు వారికి కూడా ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి, ఎందుకంటే ఆశీర్వాదాలు తీవ్ర పురుషార్థానికి చాలా సహజమైన యంత్రము వంటివి. ఉదాహరణకు సైన్సులో రాకెట్ ఉంటుంది కదా - అది ఎంత త్వరగా పని చేసేస్తుంది. అలా ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు ఆశీర్వాదాలను తీసుకోవటము, ఇది కూడా ముందుకు వెళ్ళడానికి చాలా సహజ సాధనము. అమృతవేళలో బాబా నుండి సహజ స్మృతి ద్వారా ఆశీర్వాదాలను తీసుకోండి మరియు మొత్తము రోజంతటిలో ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి, ఇది చెయ్యగలరా? చెయ్యగలరంటే చేతులెత్తండి. ఎవరైనా శాపనార్థాలు ఇస్తే అప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా మిమ్మల్ని పదే-పదే విసిగిస్తుంటే? చూడండి, మీరు పరమాత్ముని పిల్లలు, దాత పిల్లలు, దాతలు కదా! మీరు మాస్టర్ దాతలు. మరి దాత పని ఏముంటుంది? ఇవ్వటము. అన్నిటికంటే మంచి పని ఆశీర్వాదాలను ఇవ్వటము. ఎటువంటి వ్యక్తి అయినా సరే, వారు మీ సోదరుడు మరియు మీ సోదరియే కదా. పరమాత్ముని పిల్లలు కనుక సోదర-సోదరీలయ్యారు కదా! కనుక వారు పరమాత్ముని సంతానము, నా ఈశ్వరీయ సోదరుడు, ఈశ్వరీయ సోదరి... వారికి ఏం ఇస్తారు! శాపనార్థాలను ఇస్తారా? బాబా ఎప్పుడైనా శాపనార్థాలు ఇస్తారా! ఇస్తారా? ఇస్తారా? ఇస్తారా, ఇవ్వరా? అవునా, కాదా చెప్పండి. ఇలా చేస్తే చాలా సంతోషముగా ఉంటారు. ఎందుకని? ఒకవేళ శాపనార్థాలు ఇచ్చినవారికి కూడా మీరు ఆశీర్వాదాలను ఇస్తే, వారు ఇచ్చినా, ఇవ్వకపోయినా మీరు ఆశీర్వాదాలను తీసుకుంటే ఇక దుఃఖము ఎందుకు కలుగుతుంది. బాప్‌దాదా ఇప్పుడు ఇక్కడకు వచ్చిన పిల్లలైన మీకు ఒక వరదానము ఇస్తున్నారు - ఆ వరదానాన్ని గుర్తు పెట్టుకుంటే సదా సంతోషముగా ఉంటారు. వరదానము వినిపించమంటారా? వింటారా!
వరదానము ఏమిటంటే - ఒకవేళ మీకు ఎవరైనా దుఃఖము ఇచ్చినా సరే మీరు ఆ దుఃఖాన్ని తీసుకోకండి, వారు ఇచ్చినా కానీ మీరు తీసుకోకండి. ఎందుకంటే ఇచ్చేవారు ఇచ్చేసారు, కానీ తీసుకునేవారైతే మీరే కదా! దుఃఖాన్ని ఇస్తున్నవారు అది తీసుకోవటం లేదు. ఒకవేళ వారు ఏదైనా చెడు వస్తువు ఇస్తే, దుఃఖమును ఇస్తే, అశాంతిని ఇస్తే, అవి చెడు కదా. మీకు దుఃఖము ఇష్టమా? ఇష్టము లేదు కదా? అది చెడు వస్తువు కదా, మరి చెడు వస్తువును తీసుకోవటం జరుగుతుందా? ఎవరైనా మీకు చెడు వస్తువును ఇస్తే మీరు తీసేసుకుంటారా? తీసుకుంటారా? తీసుకోరు. మరైతే ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకోవడమైతే తీసేసుకుంటున్నారు కదా! ఒకవేళ దుఃఖము తీసుకుంటే ఎవరు దుఃఖితులుగా అవుతారు? మీరు అవుతారా లేక వారు అవుతారా? తీసుకునేవారు ఎక్కువ దుఃఖితులుగా అవుతారు. ఒకవేళ ఇప్పటి నుండి దుఃఖము తీసుకోకపోతే ఇక మీకు సగం దుఃఖము దూరమైనట్లే, ఎందుకంటే తీసుకోనే తీసుకోరు కదా! అంతేకాక, మీరు దుఃఖానికి బదులుగా వారికి సుఖము ఇచ్చినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. కనుక సుఖముగా కూడా ఉంటారు మరియు ఆశీర్వాదాల ఖజానా కూడా నిండుగా అవుతూ ఉంటుంది. ప్రతి ఆత్మ నుండి, వారు ఎలాంటివారైనా సరే, మీరు ఆశీర్వాదాలను తీసుకోండి. శుభ భావన, శుభ కామన పెట్టుకోండి. అప్పుడప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా పొరపాటు పని చేస్తే, వారికి శిక్షణ ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తారు, వీరిని సరి చేస్తాను అని శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇవ్వండి, కానీ శిక్షణ ఇచ్చేందుకు సర్వోత్తమమైన విధి ఏమిటంటే - క్షమా స్వరూపులుగా అయ్యి శిక్షణను ఇవ్వండి. కేవలము శిక్షణ మాత్రమే ఇవ్వకండి, దయ చూపించటము, క్షమించటము కూడా చెయ్యండి మరియు శిక్షణ కూడా ఇవ్వండి. రెండు పదాలను గుర్తుంచుకోండి - శిక్షణ మరియు క్షమ, దయ. ఒకవేళ దయార్ద్ర హృదయులుగా అయ్యి వారికి శిక్షణను ఇచ్చినట్లయితే మీ శిక్షణ పని చేస్తుంది. ఒకవేళ దయార్ద్ర హృదయులుగా అయ్యి శిక్షణ ఇవ్వకపోతే ఆ శిక్షణను ఒక చెవితో వింటారు, మరొక చెవితో వదిలేస్తారు. ఆ శిక్షణ ధారణ అవ్వదు. అంతే కదా? అనుభవము ఉందా? మీరు కూడా ఎవరికో ఒకరికి శిక్షకునిగా అవుతారు కదా? శిక్షకునిగా అవ్వటం త్వరగా వస్తుంది కానీ క్షమించటము... ఈ రెండూ కలిసి ఉండాలి. ఇక ఇప్పటి నుండీ దయ ఉండాలి... దయ చూపించేందుకు విధి - శుభ భావన, శుభ కామన. సత్యమైన ప్రేమ రాయిని కూడా నీటిగా మార్చేస్తుంది... అని అంటారు కదా! అలాగే క్షమా స్వరూపముతో శిక్షణను ఇస్తే, మీరు ఏ విషయములోనైతే ఇలా చెయ్యకూడదు, ఇలా జరగకూడదు అని అనుకుంటున్నారో, అది ప్రత్యక్షముగా కనిపిస్తుంది. మీరు దయార్ద్ర హృదయులై శిక్షణ ఇచ్చినందుకు, దాని ప్రభావముతో వారి కఠినమైన హృదయము కూడా పరివర్తన అయిపోతుంది. మరి ఏ వరదానము లభించింది? దుఃఖము ఇవ్వకూడదు, దుఃఖము తీసుకోకూడదు. ఇష్టమేనా? ఇష్టమైతే ఇప్పుడిక తీసుకోకండి. పొరపాటు చెయ్యకండి. బాబా దుఃఖాన్ని ఇవ్వనప్పుడు మరి ఫాలో ఫాదర్ చేయాలి కదా? చేస్తున్నారు! అప్పుడప్పుడు కొంచెం మందలిస్తున్నారు. మందలించకండి. దయ చూపించండి. దయ చూపించడముతో పాటుగా శిక్షణ ఇవ్వండి. పదే-పదే ఎవరినైనా మందలిస్తే ఆ ఆత్మ ఇంకా శత్రువులా అయిపోతుంది. వారికి ద్వేషము కలుగుతుంది. పరమాత్ముని పిల్లలు కదా! కనుక ఏ విధంగా బాబా పతితులను కూడా పావనముగా తయారుచేసేవారో, అలా మీరు దుఃఖితులకు సుఖాన్ని ఇవ్వలేరా? ఇప్పుడు వెళ్ళి ట్రయల్ చెయ్యండి, ట్రయల్ చేస్తారు కదా! ముందుగా దానము ఇంటి నుండి ప్రారంభమవ్వాలి. మీ పరివారములో ఒకవేళ ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినా కూడా దుఃఖము తీసుకోకండి. ఆశీర్వాదాలను ఇవ్వండి, దయార్ద్ర హృదయులుగా అవ్వండి, ముందుగా ఇంటివారితో ఇలా చేయండి. మీ ఇంటి ప్రభావము ఆ ప్రాంతముపై పడుతుంది, ఆ ప్రాంతము ప్రభావము దేశముపై పడుతుంది, దేశము ప్రభావము విశ్వముపై పడుతుంది. సహజమే కదా! మీ పరివారముతో ప్రారంభించండి ఎందుకంటే చూడండి, ఇంట్లో ఒక్కరు కోపగించుకున్నా ఇంటి వాతావరణము ఎలా అయిపోతుంది? ఇల్లులా అనిపిస్తుందా లేక యుద్ధ మైదానములా అనిపిస్తుందా? ఆ సమయములో బాగా అనిపిస్తుందా? అనిపించదు కదా!
ఈ మాట మీ కోసం కూడా చెప్తున్నాము (ఈ రోజు వి.ఐ.పి.లతోపాటు మధుబన్‌లోని సమర్పిత సోదరీ-సోదరులు కూడా ముందు కూర్చుని ఉన్నారు). మీ, మీ సహచరుల నుండి, మీ కార్యకర్తల నుండి దుఃఖము తీసుకోకండి, దుఃఖము ఇవ్వకండి. ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. ఒకవేళ మీరు అటువంటి సమయములో కూడా హృదయపూర్వకముగా అధికారముతో నా బాబా అని అన్నారంటే, పరమాత్మ తండ్రి, నా బాబా... అని అన్నారంటే, భగవంతుడు సదా హాజరై ఉంటారు అన్న నానుడి ఉంది కదా. ఒకవేళ మీరు హృదయపూర్వకముగా, అధికార రూపముతో అటువంటి సమయములో నా బాబా అని అన్నారంటే, స్వామి అయిన బాబా హాజరైపోతారు, ఎందుకంటే బాబా దేని కోసం ఉన్నారు? పిల్లల కోసమే ఉన్నారు. అంతేకాక అధికారి పిల్లలకు బాబా సహయోగాన్ని ఇవ్వకపోవటమన్నది జరగనే జరగదు. అది అసంభవము. కనుక ఈ పరివర్తన చేసుకుని వెళ్ళండి. ఎలా వచ్చారో అలానే వెళ్ళకండి. పరివర్తన అయ్యే వెళ్ళాలి, ఎందుకంటే చూడండి, ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చారు, టికెట్ అయితే తీసుకుంటారు కదా. ఖర్చు కూడా పెట్టుకున్నారు, సమయము కూడా ఇచ్చారు కావున దానికి విలువ అయితే ఇస్తారు కదా! విలువ ఇవ్వడమంటే - స్వ పరివర్తన ద్వారా ముందు ఇంటి పరివర్తన, ఆ తర్వాత, విశ్వ పరివర్తన, దేశ పరివర్తన. మీ ఇల్లు ఆశ్రమముగా అయిపోవాలి. ఇల్లు కాదు, ఆశ్రమము. శాస్త్రాలలో కూడా గృహస్థాశ్రమము అని అంటారు, కానీ ఈరోజు అది ఆశ్రమములా లేదు. ఆశ్రమము వేరుగా, ఇల్లు వేరుగా ఉంది. కనుక ఇంటిని ఆశ్రమములా తయారుచెయ్యండి. ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు తీసుకోవటము, ఇది ఆశ్రమము యొక్క కార్యము. మీ ఇల్లు మందిరములా అయిపోతుంది. మందిరములోని మూర్తి ఏం చేస్తుంది? ఆశీర్వాదాలను ఇస్తుంది కదా! మూర్తి (విగ్రహం) ఎదురుగా వెళ్ళి ఏమని అంటారు? ఆశీర్వదించండి. దయ చూపించండి, దయ చూపించండి అని అంటూ ఆర్తనాదము చేస్తారు. కనుక మీరు కూడా ఏమివ్వాలి? ఆశీర్వాదాలు. ఈశ్వరీయ ప్రేమను ఇవ్వండి. ఆత్మిక ప్రేమను ఇవ్వండి, శారీరిక ప్రేమ కాదు, ఆత్మిక ప్రేమ. ఈ రోజుల్లోని ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమలా ఉంది. సత్యమైన హృదయముతో కూడిన ప్రేమ లేదు. ఏదైనా స్వార్థము ఉంటే ప్రేమిస్తారు, లేదంటే పట్టించుకోరు. మరి మీరేమి చేస్తారు? ఆత్మిక ప్రేమను ఇవ్వండి, ఆశీర్వాదాలను ఇవ్వండి, దుఃఖము తీసుకోకండి, దుఃఖము ఇవ్వకండి. చూడండి, మీకు ఛాన్స్ లభించింది, బాప్‌దాదాకు కూడా సంతోషముగా ఉంది. ఇంతమంది వచ్చారు కదా, (భారత్ నుండి సుమారుగా 250 మంది వి.ఐ.పి.లు రిట్రీట్‌కు వచ్చారు) ఇంతమంది ఇళ్లు అయితే ఆశ్రమాలుగా అయిపోతాయి కదా. అలా తయారుచేస్తారా? పక్కానా? లేక కాస్త కచ్చానా? ఏం జరిగినా కానీ, కాస్త సహనమైతే వహించాల్సి ఉంటుంది, ఇముడ్చుకునే శక్తిని కూడా కార్యములో వినియోగించాల్సి ఉంటుంది, కానీ సహనశక్తి యొక్క ఫలము చాలా మధురముగా ఉంటుంది. సహనము చెయ్యాల్సి ఉంటుంది, కానీ ఫలము చాలా మధురముగా ఉంటుంది. కనుక ఎవరైతే పక్కా ప్రతిజ్ఞ చేస్తారో, ఇంటింటిని స్వర్గముగా తయారుచేస్తారో, మందిరముగా తయారుచేస్తారో, ఆశ్రమముగా తయారుచేస్తారో, వారు చేతులెత్తండి. ఇతరులను చూసి చేతులెత్తవద్దు ఎందుకంటే బాప్‌దాదా తర్వాత లెక్క తీసుకుంటారు. ఇతరులను చూసి చేతులెత్తవద్దు. సత్యాతి సత్యముగా మనసు యొక్క చేతిని ఎత్తండి, మనస్ఫూర్తిగా చేతులెత్తండి. అచ్ఛా! దాదీలూ, ఇందుకుగాను వీరికి ఏ ప్రైజ్‌ను ఇస్తారు? చెప్పండి దాదీ, ఇన్ని మందిరాలు తయారైతే మీరు వారికి ఏం ప్రైజ్ ఇస్తారు? (వారి ఇంటివారిని తీసుకురావాలి) ఇది కానుకను ఇచ్చినట్లు కాదు, వారికి పని చెప్పారు. (బాబా ఏది ఆజ్ఞాపిస్తే అదే). చూడండి, మీకు ప్రైజ్ అయితే లభించేస్తుంది, అదేమీ పెద్ద విషయము కాదు, కానీ... కానీ అనేది ఉందా? కానీ ఏమిటో చెప్పమంటారా? మీరు ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత మీ ధారణ ద్వారా పరివర్తనను తీసుకురండి మరియు 15 రోజుల తర్వాత, నెల తర్వాత మీ రిజల్ట్‌ను వ్రాయండి. ఎవరైతే ఒక్క నెల అయినా దుఃఖము తీసుకోరో మరియు ఇవ్వరో, వారికి చాలా మంచి ప్రైజ్ ఇస్తాము. ఒకవేళ మీరు వస్తే అభినందనలు, ఒకవేళ రాలేకపోయినా కూడా సెంటర్‌కు పంపిస్తాము. అచ్ఛా.
ఈరోజు విశేషంగా వీరి కోసం రావడం జరిగింది కదా. అయితే అద్భుతాన్ని చేసి చూపించండి. పరమాత్ముని పిల్లలు అద్భుతం చేయకపోతే ఇంకేమి చేస్తారు! ధమాల్ చేయకండి, కమాల్ చేయండి. ఒకవేళ పొరపాటున ఏదైనా చెడు సంకల్పం మీ వద్దకు వస్తే, అప్పుడు ఏమి చేస్తారు? రావడమైతే వస్తుంది, ఎందుకంటే మీరు చాలా కాలం చెడును పోషించారు కదా. చూడండి, పెంచిన పశువులను కూడా ఒకవేళ దూరంగా వదిలేస్తే అవి తిరిగి పెంచిన వారి వద్దకు వచ్చేస్తాయి. ఉదాహరణకు, మీరు చెడును దగ్గరకు తీసుకోము అని చేతులెత్తారే అనుకోండి, చాలా మంచిది, అయినా కానీ ఏదైనా బలహీనత పొరపాటున వస్తే ఏమి చేస్తారు? బలహీనతను తీసుకుంటారా? చూడండి, ఇందుకు కూడా విధిని చెప్తాము. మీరైతే ప్రతిజ్ఞ చేసారు కదా, చెడును ఇచ్చేసారు కదా. అచ్ఛా, ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, అది పొరపాటున మీ వద్దకు మళ్ళీ వస్తే మీరు ఏమి చేస్తారు? మీ వద్ద పెట్టుకుంటారా లేక తిరిగి ఇచ్చేస్తారా? తిరిగి ఇచ్చేస్తారు కదా? మరి అలాగే మీ వద్దకు కొంచెం క్రోధం యొక్క రేఖ, లోభం, మోహం, అభిమానం, పొరపాటున వస్తే, ఎందుకంటే చాలా సమయం మీ వద్ద పెట్టుకున్నారు కదా. మరి దానిని తిరిగి ఇచ్చేయండి, బాబా, బాబా... మీరు మీ వస్తువును సంభాళించుకోండి, ఇది నాది కాదు. బాబా అయితే సాగరుడు కదా, సాగరంలో కలిపేయండి. మీరు ఉపయోగించకండి ఎందుకంటే అమానత్తు అయిపోయింది కదా, అమానత్తులో ఖయానత్తు చేయడం జరగదు. బాబాకు ఇచ్చేయండి, బాబా, మీకు తెలుసు, దీనికి తెలుసు, నేను ఉపయోగించను. చిన్న పిల్లలకు కూడా మీరు నేర్పిస్తారు కదా, మట్టి తినద్దు అని నేర్పిస్తారు కదా! అయినా కానీ పిల్లలు మట్టి తింటే, వారికి మట్టి మంచిగా అనిపిస్తుంది అంటారు కదా, అప్పుడు మీరు ఏమి చేస్తారు? మళ్ళీ మళ్ళీ వారి చేతులను మట్టి నుండి విడిపిస్తారు కదా లేక తిననిస్తారా? విడిపిస్తారు కదా? అలాగే మీ మనసును కూడా విడిపించండి. మనసులోనే కదా వస్తుంది! మీ మనసుకు యజమానిగా అయ్యి దీనిని విడిపించండి. విధి సరిగ్గానే ఉంది కదా! చేస్తే సహజమైపోతుంది. ధైర్యాన్ని విడిచిపెట్టకండి. మీరు ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే వేయి అడుగుల బాబా సహయోగము మీకు ఉండనే ఉంటుంది. అనుభవం చేసి చూడండి. ధైర్యాన్ని కోల్పోకండి, నిరాశ చెందకండి. సర్వశక్తిమంతుని పిల్లలు, నిరాశ పడకండి. ధైర్యాన్ని కోల్పోకండి, దృఢ సంకల్పం చేయండి, సఫలత మీ జన్మ సిద్ధ అధికారము.
చాలా బాగా చేసారు. అచ్ఛా, ఇప్పుడు ఏమి చేయాలి? దీనిని వి.ఐ.పి గ్రూప్ అని అంటాము. చూడండి, మీకు టైటిల్ మంచిగా లభించింది. ఇప్పుడు వి.ఐ.పి కాదు, వి.వి.ఐ.పిగా అవ్వాలి, వి.ఐ.పి అయితే కామన్, కానీ వి.వి.వి.ఐ.పి. విశేష ఆత్మ, ఐ.పి. అచ్ఛా.
ఈరోజు మధుబన్ నివాసులకు ఛాన్స్ లభించింది. ఈ మధుబన్ నివాసులందరూ, వచ్చిన సోదరసోదరీలందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు, ఎందుకంటే మీ కారణంగా మధుబన్ నివాసులు కూడా కలుస్తారు ఎందుకంటే మీ గ్రూప్ చిన్నది. లేకపోతే వేలాదిమంది గ్రూప్ ఉంటుంది. ఒక నెల తర్వాత మీ సెంటర్ తరఫున రిజల్ట్‌ను వ్రాయండి. తర్వాత బహుమతిని తప్పకుండా ఇస్తాము. అచ్ఛా. అచ్ఛా – ఇప్పుడు ఏమి చేయాలి? (జోన్లవారీగా కలవాలి)
ఢిల్లీ జోన్:- ఢిల్లీ నివాసులకైతే సేవ అవకాశం చాలా బాగుంది ఎందుకంటే ఢిల్లీలో ఏ సేవలు అయితే జరుగుతాయో, అవి విశ్వంలో వ్యాపిస్తాయి. ఢిల్లీ ధ్వని విశ్వం వరకు చేరుతుంది. ఇప్పుడు ఢిల్లీ నుండి ఎంతమంది వచ్చారు? (50) ఢిల్లీలో ఎప్పుడైతే 50 ఇళ్ళు ఆశ్రమాలుగా మారుతాయో అప్పుడు ఎంత పేరు వస్తుంది! వాయుమండలం అయితే మారుతుంది కదా ఎందుకంటే ప్రతి ఇంటిలో ప్రతి ఆత్మ ప్రశాంతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనేందుకు ప్రయత్నమైతే చేస్తున్నారు కదా. ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు మరియు తీసుకున్నప్పుడు ఇంటిలో సుఖశాంతుల వైబ్రేషన్లు ఉంటాయి. ఆ ధ్వని వాయుమండలంలో వ్యాపిస్తుంది. అప్పుడు ఇల్లు కూడా ఆశ్రమంగా అవుతుంది మరియు వాయుమండలం కూడా వ్యాపిస్తుంది. డబల్ సేవ జరుగుతుంది. మరి ఏమి అవుతారు? ఢిల్లీ వారు నంబర్ వన్ అవుతారా లేక రెండవ నంబర్ అయినా ఫర్వాలేదా? మొదటి నంబర్ తీసుకోవాలా లేక రెండవ నంబరైనా ఫర్వాలేదా? (మొదటి నంబర్ తీసుకోవాలి) అచ్ఛా, అయితే అందరూ చప్పట్లు కొట్టండి. చాలా మంచి ధైర్యవంతులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క పదమా రెట్ల సహాయం ఉండనే ఉంటుంది. అచ్ఛా.
పంజాబ్-హర్యానా, హిమాచల్, జమ్ము కశ్మీర్ మరియు ఉత్తరాంచల్:- బాగుంది, పంజాబ్‌లో నదులు చాలా ఉన్నాయి. మరి నదుల పని ఏమిటి? నదులు అందరికీ శీతలతను ఇస్తాయి. మరి పరమాత్ముని పిల్లలైన మీరు పంజాబ్‌లో శీతలత, శాంతి వాయుమండలాన్ని వ్యాప్తి చేస్తారు. పంజాబ్‌ను పులి అని కూడా అంటారు. పంజాబ్ పులి, మరి పులి ఎవ్వరికీ భయపడదు, భయపెడుతుంది, భయపడదు అలాగే మీరు కూడా మాయను చూసి భయపడకండి. మాస్టర్ సర్వశక్తిమంతులై ఎదిరించండి, సరేనా! ఇంత శక్తి ఉందా పంజాబ్‌లో? చేస్తారా? ఉత్తరాంచల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అందరూ చేస్తారా? పిల్లల ధైర్యము తండ్రి సహయోగము. ఏమి వచ్చినా కానీ, నా బాబా అనగానే అంతా సమాప్తమైపోతుంది. మనస్ఫూర్తిగా చెప్పండి, కేవలం నోటితో కాదు, మనసుతో చెప్పినప్పుడు అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. అచ్ఛా.
ఆంధ్రప్రదేశ్:- (షుమారు 40 మంది ఉన్నారు) సదా స్వయాన్ని మేము విజయి రత్నాలము అని భావించండి, ఎందుకంటే పరమాత్మ తోడు ఉన్నట్లయితే, పరమాత్మ ఎవరికి తోడుగా ఉంటారో వారు సదా విజయులే. కావున సదా స్వయాన్ని పరమాత్మతో కలిసి ఉండే విజయి పాండవులుగా భావించండి. విజయము మీ కంఠ హారము, ఇదే సదా గుర్తుంచుకోండి. మెడలో విజయ మాల ఉంది. ఈ నిశ్చయము మరియు నషా ఉండాలి. సరేనా! ఇప్పుడు ఆంధ్ర నంబర్ తీసుకోండి. వారంటారు, మేము నంబర్‌వన్ అని, మీరు కూడా నంబర్‌వన్. అవ్వడమైతే వన్ అవ్వాలి, టూ అయ్యి ఏమి చేస్తారు? మీరు కూడా నంబర్‌వన్ అవ్వండి. విన్ అయితే వన్ వస్తారు. విన్ అవ్వడం వచ్చు కదా, అయితే విన్, వన్. అచ్ఛా.
ముంబయి మరియు మహారాష్ట్ర:- మహారాష్ట్ర అంటే అర్థము మహాన్, మహాన్ కదా మీరు! ఇప్పుడు బాబా స్మృతి మరియు సేవ ద్వారా స్వయాన్ని మహాన్‌గా చేసుకోండి, ఇతరులను కూడా మహాన్‌గా చేయండి. మహారాష్ట్ర అన్న పేరుకు తగ్గట్లుగా ఏదైనా మహాన్ కార్యాన్ని చేస్తారు కదా! మరి మహాన్‌గా అవ్వవలసిందే, మహాన్ కార్యాన్ని చేసి చూపించాల్సిందే. ఇంత పక్కాగా ఉన్నారా? పక్కా? మహాన్‌గా ఉండేవారు పక్కాగానే ఉంటారు. బాప్‌దాదాకు సంతోషంగా ఉంది, ప్రతి ఒక్కరూ ఎవరైతే వచ్చారో వారు ధైర్యవంతులు. గాబరా పడేవారు కాదు. అందుకే అభినందనలు, అభినందనలు, అభినందనలు.
కర్ణాటక:- కర్ణాటక వారి కోసం బాప్‌దాదా అంటారు, పేరు చూడండి – కర్ నాటక్, నాటకం చేయండి. మరి ఈ సృష్టిని కూడా నాటకం అంటారు కదా, అనంతమైన డ్రామా. ఇందులో కర్ణాటక వారు ఏ పాత్రను పోషిస్తారు? హీరో పాత్రను పోషిస్తారా? హీరో. అయితే ఇందుకోసం ఏమి చెయ్యవలసి ఉంటుంది? చాలా చిన్న విషయాన్ని చెయ్యవలసి ఉంటుంది, జీరోను గుర్తు చేయాలి అప్పుడు హీరోగా అయిపోతారు. సహజమే కదా. జీరో అంటే స్వయం ఆత్మ కూడా, జీరో అంటే బాబా కూడా, కనుక జీరోను గుర్తు చేయండి, హీరోగా అయ్యి పాత్రను పోషించండి. సరేనా. చాలా బాగుంది. తప్పక రండి, అభినందనలు.
తమిళనాడు:- చూడండి, పాండవులు కూడా ఐదు మంది, మీరు ఒకవేళ తక్కువమంది ఉన్నాగానీ ఏమీ ఫర్వాలేదు, పంచ పాండవులు ఐదు మందే అయినాగానీ విజయులుగా అయ్యారు. కావున మీరు వచ్చింది కొద్దిమందే అయినా కానీ మీరు విజయి రత్నాలు, సదా విజయిగా ఉంటారు, సంఖ్య తక్కువగా ఉంది అయినా ఫర్వాలేదు కానీ విజయులు, విజయులుగా ఉంటారు. విజయము యొక్క వరదానము మీ అందరికీ విశేషమైనది. సరేనా. విజయులుగా అవుతారు.
గుజరాత్:- బాప్‌దాదా మీ అందరి మస్తకంపై ఏమి చూస్తున్నారు? బాప్‌దాదా మీ మస్తకంలో మూడు బిందువుల తిలకాన్ని చూస్తున్నారు. ఆ మూడు బిందువులు, ఒకటి ఆత్మ బిందువు, మీరు బిందువు కదా. బాబా కూడా బిందువు, మరియు ఏదైతే డ్రామాలో జరిగిపోయిందో దానికి ఫుల్స్టాప్ పెట్టడం జరుగుతుంది, ఫుల్స్టాప్ కూడా బిందువే కదా. మరి మీ అందరి మస్తకంపై మూడు బిందువుల తిలకాన్ని చూస్తున్నాము. ఇప్పుడు రోజూ అమృతవేళ లేచి బాప్‌దాదాతో మిలనం చేసుకుని శక్తి తీసుకుని, ఆశీర్వాదాలు తీసుకుని స్వయానికి మూడు బిందువుల తిలకాన్ని పెట్టుకోండి. తిలకాన్ని మస్తకంలోనే పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే మస్తకం స్మృతి స్థానము. కావున మీరు స్మృతికి, మూడు బిందువుల తిలకాన్ని రోజూ పెట్టుకోండి. తిలకం పెట్టుకోవడం వచ్చు కదా. ఇప్పుడు ఈ తిలకాన్ని పెట్టుకోండి, అప్పుడు రోజంతా సహయోగము లభిస్తుంది. తిలకధారిగా అయితే కిరీటధారులుగా అవుతారు, సింహాసనాధికారులుగా కూడా అయిపోతారు. అచ్ఛా.
ఈస్టర్న్:- ఈస్ట్ (తూర్పు) నుండి ఏమి వస్తుంది? సూర్యుడు వస్తాడు. మరి మీరు ఈస్టర్న్ జోన్ తరఫు నుండి వచ్చారు అంటే వెళ్ళి ఏమి చేస్తారు? జ్ఞాన సూర్యుడు ఉదయించాడు, ఈ పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. ఎలా అయితే సూర్యుడు అందరికీ సకాశ్ను ఇస్తాడో, వెలుగు ఇస్తాడో అలాగే మీరు కూడా మాస్టర్ కదా! మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులు అయ్యారు, మరి మీరు ఏమి చేస్తారు? అందరికీ వెలుగును ఇవ్వండి, సకాశ్ను ఇవ్వండి. ఇది ఈస్టర్న్ జోన్ వారి కర్తవ్యం. సరేనా? చాలా మంచిది. అసలైతే ఈస్టర్న్ నుండే బ్రహ్మా బాబా వచ్చారు, లక్కీ. మీరైతే డబల్ లక్కీ అయ్యారు. స్థానము కూడా లక్కీ, ఆత్మలు కూడా లక్కీ. అచ్ఛా. చాలా మంచిది.
రాజస్థాన్:- పేరే రాజస్థాన్. మరి రాజస్థాన్‌లో రాజులు ఉంటారు కదా. ఇప్పుడైతే లేరు కానీ ఉండేవారు. మీరు కూడా రాజుగా అయి వెళ్తారు. రాజుగా అయ్యారా? స్వరాజ్యము. స్వరాజ్య తిలకము పెట్టుకున్నారు కదా. మేము రాజస్థాన్ యొక్క స్వరాజ్య అధికారులము అని సదా గుర్తుంచుకోండి. ఎవరైతే స్వ రాజ్య అధికారులుగా అవుతారో వారు విశ్వ రాజ్య అధికారులు అన్నది అండర్స్టుడ్. కావున స్వరాజ్యాన్ని ఎప్పుడూ ఢీలా చేయకండి, రాజంటే రాజే కదా. ఎప్పుడూ ఏ కర్మేంద్రియానికి వశం కాకూడదు. రాజుగా అయ్యి ఆర్డర్ చేయండి, రాజుగా అయ్యి పద్ధతిగా నడిపించండి. మరి రాజస్థాన్‌కు స్వరాజ్య అధికారులు అన్న వరదానము ఉంది. సరేనా? స్వరాజ్యము పక్కాగా ఉంది కదా? చూడండి, రాజస్థాన్ చాలా నియరెస్ట్ (సమీపంగా)గా ఉంది అలాగే డియరెస్ట్ (ప్రియమైనవారు) కూడా. మరి ఇలాగే స్వయాన్ని అనుభవం చేసుకోండి. అచ్ఛా.
యు.పి:- మూడు ఉన్నాయి, మూడు అంటే త్రిమూర్తి అన్న గాయనము ఉంది. ఒకటి మాస్టర్ బ్రహ్మా, మాస్టర్ విష్ణు, మాస్టర్ శంకర్, త్రిమూర్తి అయ్యారు. చాలా బాగుంది. చూడండి, పరమాత్మ కూడా త్రిమూర్తి శివుడు అని పిలువబడతాడు. మరి త్రిమూర్తులైన మీరు కూడా కమాల్ చేసి చూపించండి. బాప్‌దాదా ఎల్లప్పుడూ చిన్నవారిని తండ్రి సమానమైనవారు అంటారు. మీ సంఖ్య తక్కువ ఉంది కానీ బాబా సమానము. ఈసారి వచ్చినప్పుడు మీది ఎక్కువ సంగఠనను తయారు చేసి తీసుకురండి. తయారు చేస్తారు కదా! తమ సమానంగా తయారు చేసి తర్వాత పెద్ద సంగఠనలో బహుమతిని వచ్చి తీసుకోండి. అచ్ఛా.
మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్:- బాగుంది, మీరందరూ ఇండోర్ మరియు భోపాల్ ఇరువురూ ఎటువంటి అద్భుతాన్ని చేసి చూపించాలంటే అది ఎవ్వరూ ఇప్పటివరకు చేయనిదై ఉండాలి ఎందుకంటే ఇండోర్‌ను బ్రహ్మా బాబా తమ సంకల్పంతో స్థాపించారు, ఇండోర్ విశేషత ఏమిటంటే బ్రహ్మా బాబా దృష్టి ఇండోర్‌పై పడటం. మరి ఇండోర్వారు మరియు భోపాల్వారు మధ్యప్రదేశ్ వారే కదా. ఎటువంటి అద్భుతాన్ని చేయాలంటే, కనీసం ఒక్క అద్భుతాన్ని చేయండి, ఈజీ – ఎవరినైనా మైక్‌గా తయారు చేయండి, వారి మాట విని అనేకులు ప్రభావితం కావాలి. అనేకుల కళ్యాణానికి నిమిత్తంగా అవ్వాలి. ఎలా అయితే చూడండి, ఒక మైక్ ఎంత పని చేస్తుంది, ఎంతమంది వింటున్నారు. ఇటువంటి అథారిటీ మాటలు ఉండాలి, వారి మాటలు విని అనేకులు పరివర్తన అవ్వాలి, వారిని బాప్‌దాదా మైక్ అంటారు. కనీసం ఒక్క మైక్‌ను తయారు చేసి తీసుకురండి. సరేనా? కమాల్ చేయండి. కేవలం నా బాబా, నా సేవ, ఇది గుర్తుంచుకుంటే అన్ని పనులు జరిగిపోతాయి. అచ్ఛా.
శ్రీలంక, మలేషియా, యు.ఎస్.ఎ:- చూడండి, విదేశాల కానుకను కూడా చూసారు కదా. శ్రీలంకలో సేవ చాలా బాగా చేసారు. బాప్‌దాదా సమాచారాన్ని విన్నారు – ప్రకృతి యొక్క జలముతో సునామి వచ్చినప్పుడు శ్రీలంక వారు చాలా సహయోగము చేసారు, ఆధ్యాత్మికంగా కూడా మరియు వస్తువుల రూపంలో కూడా. ఎక్కడ ఆపదలు వచ్చాయో అక్కడ సేవాకేంద్రాలను తెరవడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారాన్ని విని బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇది కూడా మంచి ప్లాన్ ఆలోచిస్తున్నారు. శ్రీలంక పేరు విని రావణుడిని జయించాలన్న ఆలోచన వస్తుంది. మరి శ్రీలంకలో రావణుడి నామరూపాలు ఉండకూడదు, ఆ రావణుడు కాదు, 5 వికారాల రావణుడు. 5 వికారాలు నారిలో, 5 వికారాలు నరుడిలో, ఇద్దరిదీ కలిపి పది తలల రావణుడిని చూపిస్తారు. నిజంగా 10 తలలతో ఎవరైనా ఉంటే ఎలా నిద్రిస్తాడు, ఎలా తింటాడు, ఇది చెడును సూచిస్తుంది. లంక నివాసులు చాలా చక్కని ప్లాన్‌ను తయారు చేస్తున్నారు, పూర్తి బ్రాహ్మణ పరివారం మీకు సహయోగిగా ఉంటుంది, బాప్‌దాదా అయితే సహయోగిగా ఉండనే ఉన్నారు. ముందు బాప్‌దాదా, తర్వాత పూర్తి పరివారం కూడా ఈ సేవకు సహయోగిగా ఉంటారు. మంచి ఉన్నతిని చేస్తున్నారు. ఇందుకోసం అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
మలేషియాలో కూడా సేవ యొక్క ఉల్లాసం చాలా ఉంది. బాప్‌దాదా వద్దకైతే పూర్తి సమాచారం వస్తుంది. ఇప్పుడిప్పుడే స్మృతిని కూడా పంపారు కదా. మలేషియాలో సేవ యొక్క ఆసక్తి చాలా బాగుంది, సెంటర్ తర్వాత మరో సెంటర్‌ను తెరుస్తున్నారు, సఫలత కూడా లభిస్తూ ఉంది అందుకే మలేషియాలోని సర్వ బ్రాహ్మణ ఆత్మలకు, ఎవరైతే ప్రియస్మృతులను పంపారో, ఉత్తరాలు పంపారో, ఆ పిల్లలందరికీ పదమారెట్ల ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు. అచ్ఛా.
మధుబన్ నివాసులైన మీరందరూ తమ సోదరసోదరీలను చూసి చాలా సంతోషించారు కదా. సంతోషంగా ఉందా? మీరు మధుబన్కు అందాన్ని తీసుకువచ్చారు. పిల్లలు మధుబన్కు అందం అని బాప్‌దాదా అంటారు. చూడండి, మధుబన్వారు మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తారు. సేవ యొక్క ఛాన్స్ ఇచ్చారు అంటే ఎంత పుణ్యం జమ అయిపోయింది, అందుకే సంతోషిస్తున్నారు. అచ్ఛా. ఈనాటి ఈ మిలనం కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, అదే రిపీట్ అవుతుంది మరియు ప్రతి కల్పము రిపీట్ అవుతుంది.
నలువైపులా ఉన్న దేశ-విదేశాలలోని పిల్లల స్మృతులు బాప్‌దాదాకు అందాయి. ఫోన్ ద్వారా స్మృతులను పంపించారు, ఉత్తరాల ద్వారా స్మృతులను పంపించారు, హృదయములో స్మృతి చేసుకున్నారు, అన్నీ అందాయి. కనుక బాప్‌దాదా పిల్లలందరికీ భారత్ వారికైనా, విదేశాల వారికైనా, రిటర్న్‌లో ఆశీర్వాదాలను మరియు ప్రియస్మృతులను పదమాల రెట్లు ఇస్తున్నారు.
నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమ యొక్క అధికారి పిల్లలకు, నలువైపులా సర్వ ఖజానాలతో నిండుగా ఉన్న పిల్లలకు, నిర్విఘ్న, నిర్వికల్ప, నిర్వ్యర్థ సంకల్పాలు కల శ్రేష్ఠ ఆత్మలకు, దానితో పాటు స్వ పరివర్తన చేసుకునే మరియు చేయించే ఉల్లాస-ఉత్సాహాలతో ఎగురుతూ ఉండే పిల్లలకు, అలాగే బాప్‌దాదాకు తమ మనసు యొక్క సమాచారాన్ని సత్యముగా వినిపించే సత్యమైన మనసు కల పిల్లలకు విశేషముగా మనోభిరాముని రూపములో, తండ్రి రూపములో, శిక్షకుని రూపములో, సద్గురువు రూపములో పదమాల రెట్లు ప్రియస్మృతులు మరియు నమస్తే.
బి.కె గైడ్స్ మరియు సేవాధారులు:- బాప్‌దాదా సేవాధారి పిల్లలకు సేవకు అభినందనలు ఇస్తున్నారు. చాలా మంచి-మంచి ఆత్మలను తీసుకువచ్చారు, ధైర్యం ఉన్నవారిని తీసుకువచ్చారు, ధైర్యానికి ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించే ఆత్మలను తీసుకువచ్చారు, కనుక, ఎవరు ఎంతమందిని తీసుకువచ్చారో, వారికి పదమారెట్లు అభినందనలు. మంచిది. గోల్డెన్ ఛాన్స్‌ను కూడా తీసుకున్నారు. సేవకు ప్రత్యక్ష ఫలము లభించింది. అలాగే పూర్తి విశ్వానికి తండ్రి ప్రేమను, తండ్రి సందేశాన్ని అందించే కార్యాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు. చేయవలసిందే. నిమిత్తమైనది ఇందుకోసమే. సత్యమైన పండాలు (గైడ్స్) మీరు. ఎంత మంచి యాత్రను చేయించారు. బాప్‌దాదా పిల్లల సేవను చూసి సంతోషిస్తున్నారు. మరి చూసాము, బాగుంది, మహారథులు ఉన్నారు, సేవలో మహారథులై వచ్చారు. అచ్ఛా. టీచర్లకు కూడా మంచి ఛాన్స్ లభించింది. పాండవులకు మంచి ఛాన్స్ లభించింది.
దాదీలతో:- దాదీలను చూసి అందరూ సంతోషిస్తున్నారు కదా. దాదీలకు ప్రేమ లభించింది అంటే అందరికీ లభించినట్లే. మంచిది, నిమిత్తమైన మీ అందరినీ చూసి హర్షిస్తున్నారు.
మున్ని అక్కయ్యతో:- ఏ కార్యానికైతే నిమిత్తమయ్యారో దానిని మంచిగా నడిపిస్తున్నారు, నడిపిస్తూ ఉంటారు.
మీరందరూ కూడా నిమిత్తులు. అందరి దృష్టి ముందుగా మధుబన్ నివాసులపై పడుతుంది. మధుబన్‌లో నిమిత్తమవ్వడం అంటే లైట్ హౌస్‌గా అవ్వడం, లైట్ ఇవ్వడం.
నీలూ అక్కయ్యతో:- మంచిగా పాత్రను పోషిస్తున్నారు మరియు నిస్సంకల్పంగా ఉండి చేస్తున్నారు. బాప్‌దాదాకు మీ మనసులోని విషయాలు తెలుసు.
దాదీ రతన్మోహిని గారు జపాన్, హాంకాంగ్, మనీలా యొక్క సోదరసోదరీల స్మృతిని అందించారు, అక్కడ సేవ చేసి తిరిగి వచ్చారు:- సేవలో అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు ఇచ్చి కూడా వస్తారు మరియు ఆశీర్వాదాలు తీసుకుని కూడా వస్తారు. రిఫ్రెష్ అవ్వడమంటే హృదయంలో శక్తుల జ్వాల వెలుగుతుంది. అందరూ సంతోషంగా కూడా ఉంటారు మరియు మీ సేవకు ప్రత్యక్ష ఫలం మీకు కూడా లభిస్తుంది.
ముగ్గురు పెద్దన్నయ్యలతో:- సేవా ఫలం మీకు కూడా లభిస్తుంది. ముగ్గురూ కలిసి యజ్ఞం యొక్క అనేక కార్య వ్యవహారాలను సంభాళిస్తున్నారు, సంభాళిస్తూ ఉండండి, ముగ్గురూ కలిసి. ఒకరు చెబితే ఇంకొకరు సరే అనాలి. అంతే కదా! అందరూ కలిసి ఏదైనా కార్యాన్ని సఫలం చేస్తే బాప్‌దాదా సంతోషిస్తారు. చేస్తున్నారు, చేస్తూ ఉంటారు. అచ్ఛా.
(మధురైలో జరిగిన మెగా ప్రోగ్రామ్ సమాచారాన్ని బాప్‌దాదాకు వినిపించారు మరియు అందరి స్మృతిని బాబాకు అందించారు) మధురై మరియు తమిళనాడు యొక్క సోదరసోదరీలందరికీ కూడా చాలా-చాలా స్మృతిని ఇవ్వండి అని బాప్‌దాదా చెప్తున్నారు.
నిర్వైర్ అన్నయ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సేవ కోసం వెళ్ళడానికి అనుమతి తీసుకుంటున్నారు:- ఆస్ట్రేలియాకు కొంచెం బలం నింపండి. ఆస్ట్రేలియా నంబర్ వన్‌గా ఉండేది, ఇప్పుడు అవుతూ ఉంది, అయిపోతుంది. ఆత్మలు చాలా మంచి ధైర్యంతో ముందుకు వెళ్తున్నాయి, కానీ గుప్తంగా ఉన్నాయి. అచ్ఛా.
మధుబన్ నివాసులైన సమర్పిత సోదరసోదరీలందరితో అవ్యక్త బాప్‌దాదా యొక్క మిలనము: 4-09-05
మధుబన్ నివాసులైన పిల్లలను, బ్రాహ్మణులంతా ఏ దృష్టితో చూస్తారు? తెలుసు కదా! మధుబన్ నివాసులను అందరూ విశేషమైన దృష్టితో చూస్తారు. ఎలా అయితే స్థానము విశేషమైనదో, హెడ్‌క్వార్టర్ అంటాము కదా, అలాగే మధుబన్ నివాసులైన ప్రతి ఒక్కరినీ అంతే విశేషమైన దృష్టితో చూస్తారు. వీరు విశేష ఆత్మలు. ఈరోజైతే విశేషంగా సమర్పితమైన సోదరసోదరీలు కూర్చున్నారు. సమర్పణ అంటే తనువు, మనసు, వస్తువు ఏ రూపంలో ఉన్నాగానీ, సాధనాల రూపంలో కావచ్చు, ధనం రూపంలో కావచ్చు, సమర్పణ అంటే ఏది ఉన్నా అంతా బాబాకు అర్పితము. దానినే సమర్పణ అంటాము. సమర్పితులు అంటే వారిలో నేను అన్న భావన అంశమాత్రం కూడా ఉండకూడదు. పొరపాటున కూడా నేను అన్న భావన రాకూడదు. సమర్పితులు అంటేనే అర్థం, నాకు ఒక్క బాబా, బాబాతో పాటు దాదా ఉండనే ఉన్నారు. సమర్పితులు అంటే సాకార రూపంలో కర్మలలో బ్రహ్మా బాబా సమానంగా మరియు నిరాకారి శ్రేష్ఠ యోగ స్థితిలో నిరాకార శివ బాబా సమానంగా ఉండటము. మరి ఇలా మిమ్మల్ని మీరు భావిస్తున్నారా? హద్దు యొక్క నేను ఉండకూడదు, నాది ఉండకూడదు. స్థానము కూడా చూడండి, పాండవ భవన్ కావచ్చు, శాంతివన్ కావచ్చు, జ్ఞాన సరోవర్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, స్థానము కూడా బేహద్దులో లభించాయి. సంగఠన కూడా బేహద్దులో లభించింది. అలాగే బేహద్దు స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? బేహద్దు స్థితి ఉంటుంది అని అనేవారు, హద్దు యొక్క నేను-నాది లేదు అనేవారు చేతులెత్తండి. నేను నాది లేదా? అయితే మధుబన్ నివాసులు మెజారిటీ పాస్ అయినట్లే. మరి దాదీల ద్వారా పాస్ సర్టిఫికేట్ లభించిందా? అందరూ ఏమంటారు, నాలో నేను – నాది అన్న భావనలు లేవు అంటారా! మీరు (దాదీ) సర్టిఫికేట్ ఇచ్చారా? (లేదు, ఎవరైతే చేతులెత్తారో వారు వ్రాసి ఇస్తే అప్పుడు పక్కా అవుతుంది) అయితే బాబా సమానంగా అయిపోయారు కదా! చూడండి, మూడు సర్టిఫికేట్లు తీసుకోవాలి. ఒకటి, స్వయానికి సాక్షిగా అయ్యి సర్టిఫికేట్‌ను ఇవ్వాలి. చేయి ఎత్తితే సరిపోదు, చేయి అయితే అందరూ ఎత్తుతారు. ఏ ప్రశ్న అడిగినా చేతులెత్తుతారు. మనసు చేయి లేవాలి. ఒకటి, మీకు మీరు సాక్షిద్రష్టగా అయ్యి సర్టిఫికేట్‌ను ఇచ్చుకోవాలి. రెండు – ఏ సహచరులతో అయితే సేవను చేస్తున్నారో వారి నుండి సర్టిఫికేట్‌ను తీసుకోవాలి. మూడు, దాదీల నుండి తీసుకోవాలి. నాలుగు, బాబా నుండి కావాలి ఎందుకంటే బాబాకు అందరి మనసు గతి తెలుసు. నోటి గతి కాదు, మనసు గతిని చూస్తాము. మంచిది, చేతులెత్తడానికి ధైర్యమును ఉంచారు, ఈ ధైర్యాన్ని ఇలాగే ఉంచండి. మధుబన్ నివాసులు ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్‌ను తీసుకునేవారు అని ప్రత్యక్ష రూపంలో కనిపించాలి ఎందుకంటే మధుబన్ దాగదు. మధుబన్వారు సమీపంగా ఉంటారు, బాబా పాలన, విశేష ఆత్మల పాలన లభిస్తూ ఉంది.
ఇప్పుడు బాప్‌దాదా మధుబన్ నివాసుల నుండి ఒక విషయాన్ని కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరూ ఎవరైతే సేవకు నిమిత్తమయ్యారో, ఆ సేవ యొక్క వాయుమండలం ఎంత స్పష్టంగా కనిపించాలంటే, ఫరిశ్తాలు కర్మయోగులుగా అయ్యి కర్మ చేస్తున్నారు అనిపించాలి ఎందుకంటే మధుబన్‌లో ఏమి జరుగుతుంది, మధుబన్ వారు ఏమి చేస్తున్నారు అని అందరి దృష్టి మధుబన్ నివాసులపై ఉంటుంది. మీరు మధుబన్‌లో లేరు, విశ్వ స్టేజీపై ఉన్నారు. మరి స్టేజీపై స్వతహాగా అందరి దృష్టి ఉంటుంది. సేవలో మెజారిటీ వారి సర్టిఫికేట్ చాలా మంచిగా ఉంది. సమానంగా ఇప్పుడే అవ్వాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకోవాలి. బాబా వంటి నడవడిక, ముఖము ఉండాలి, అప్పుడే బాబా ప్రత్యక్షమవుతారు. మరి ఇప్పుడు మధుబన్ నివాసుల ప్రతి మాట, ప్రతి సంకల్పం... మాటలో కూడా సమానత రావాలి. కర్మలు, పరస్పర సంబంధ-సంపర్కములు, అన్నింటిలో సమానత. ఈ విశేష అటెన్షన్ ఇవ్వాలి. సాధారణంగా ఉన్నారు, సమానతను తీసుకురావాలి. సేవా బలం నడిపిస్తుంది, నాలుగు సబ్జెక్టులలోనూ స్వయాన్ని చూసుకోండి, తర్వాత మీకు సర్టిఫికేట్‌ను ఇచ్చుకోండి. అచ్ఛా. ఈరోజు విశేషంగా కలవడం జరిగింది కదా. బాబా అయితే మీ ఆశను పూర్తి చేసారు, ఇప్పుడు మీరు బాబా ఆశను పూర్తి చేయండి.
సమర్పణ అవ్వడము చిన్న విషయము కాదు. ఎవరైతే అన్ని సబ్జెక్టులలో బాబా సమానంగా ఉంటారో వారినే సమర్పితులు అనడం జరుగుతుంది. ఇకపోతే విశేషమైనవారే మీరు. మధుబన్‌లోని ప్రతి ఒక్కరినీ అందరూ ఎంతో గౌరవంతో చూస్తారు. మధుబన్వారు, మధుబన్వారు. మరైతే ఏదైనా అద్భుతం చేసి చూపించండి. పరస్పరంలో చిన్న-చిన్న సంగఠనల ప్రోగ్రామ్‌ను తయారు చేసి బాబా సమానంగా ఏ ఏ విషయాలలో ఉన్నాము, ఎందులో ఇంకా కొంత మిగిలి ఉంది, ఇది చెక్ చేసుకోండి. వాస్తవానికి మీ గురించి మీరు ఎంత లోతుగా చెక్ చేసుకోగలరో, అంత యథార్థంగా ఇతరులు చేయలేరు. ఇకపోతే అందరూ చాలా బాగా చేస్తున్నారు, ఏ లోటు లేదు. ఇది కూడా భాగ్యము. మీ భాగ్యము మిమ్మల్ని మధుబన్ నివాసిగా చేసింది. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటున్నారా లేక మధ్య-మధ్యలో కొంచెం కోపం వస్తుందా? మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకోండి. రియలైజ్ అంటే నేను ఎలా ఉన్నానో, నేను ఏమిటో అలాగే నన్ను నేను అర్థం చేసుకోవాలి. నేను ఆత్మను, ఇది సాధారణము, కానీ నడుస్తూ తిరుగుతూ ఆత్మ అభిమాని అనుభూతి ఉంటుందా? దీనిని రియలైజేషన్ అంటాము. సంస్కారాలు ఉన్నాయి, సంస్కారాల జ్ఞానము ఉంది, జ్ఞానం ఉంది, సంస్కారాలు సమాప్తమయ్యాయా, పరివర్తన అయ్యాయా లేక అవ్వలేదా? ఇది నాలో లేదు, ఇది సరిగ్గా ఉంది, ఇది సరిగ్గా లేదు అని మీ గురించి రియలైజ్ అవ్వాలి. ఇతరులు చెబితే రియలైజ్ అవ్వరు. కనుక మీకు మీరు రియలైజ్ అయ్యే పాఠాన్ని నేర్చుకోండి. ఎలా అయితే సాప్తాహిక కోర్సును చేస్తారు కదా, ఆత్మ, పరమాత్మ, యోగము, డ్రామా, అలాగే మీకు మీరు రియలైజ్ అవ్వండి. ఇప్పుడు రియలైజేషన్ అయ్యే సమయం. బాబా ఏదైతే చెప్పారో అది చేస్తున్నానా? సంబంధ సంపర్కాలలో కూడా రియలైజ్ అవ్వండి, శుభ భావన, శుభ కామన ఉన్నాయా? సరేనా? రియలైజేషన్ కోర్స్ మీకు మీరు చేయించుకోండి. ఇది వేరేవారు మీకు చేయించలేరు. అన్ని కోర్సులు చేసారు, ఇప్పుడు చివరి కోర్సు – రియలైజేషన్ కోర్సు. మిమ్మల్ని మీరు నడిపించకండి, నడుస్తుంది, అదే ఉంది. సమయం మోసగించకూడదు, మధుబన్ నివాసులు. కలిసి నడిచేవారు మీరు! మధ్యలో ఆగిపోయే వారు కాదు కదా! రియలైజేషన్ కోర్సు మీకు మీరు ఇచ్చుకోవడాన్ని ఆరంభించండి. ఒక్కొక్క విషయాన్ని రియలైజ్ అవ్వండి. అచ్ఛా. కలిసాము, ఇప్పుడు ఏమి చేయాలి?
దృష్టి తీసుకోవాలి అంటే మీ దృష్టిలో బాప్‌దాదాను సదా పెట్టుకోండి. ఊరికే అలా దృష్టిని తీసుకోకండి. దృష్టి తీసుకోవడము అంటే బాబాను ఇముడ్చుకోవడము. ఈ విధంగా దృష్టిని తీసుకోండి. అచ్ఛా!
ఓంశాంతి